Previous Page Next Page 
మనిషి - మిథ్య పేజి 22


    "అన్నయ్యవాళ్ళు అనుకోవచ్చు, నేను భగ్నప్రేమికుడ్ని అని. కానీ, నాకు ప్రేమలూ, హృదయాలూ పైన నమ్మకం లేదు. నే నెవర్నీ ప్రేమించలేదు.
    "వసుంధర కథ పెళ్ళిచూపుల్తోనే ముగిస్తే నేను ఆవిడ గురించి మీకు చెప్పేవాడినే కాదు. వసుందర చాలా చిత్రమైన మనిషి. ఆవిడపైన నాకిప్పటికీ గౌరవ ముంది. ఉంటుంది" అన్నాడు వాసు.
    "అసలేం జరిగిందేవిటీ?" అడగాడు పతి.
    "అన్నయ్యకి రాసిన ఉత్తరం పోస్టుచేసి నా రూమ్ కొచ్చి నడుం వాల్చాను. అంతలోనే నిద్ర పట్టేసింది. మళ్ళా మెలుకువ వచ్చేసరికి వీధి తరుపు ఎవరో తడుతున్న శబ్ధమైంది. గభాలున లేచి వెళ్ళి తలుపు తీశ్ను. గుమ్మం దగ్గర తల వంచుకు నిలబడింది.
    "ఆవిడని చూస్తూ ఏంచెయ్యాలో తోచింది కాదు. ఆవిడే అడిగింది.
    "లోపలికి రావచ్చా" అని. రమ్మన్నాను. కుర్చీలో ఉన్న బట్టల్ని మంచంమీద వేశాను. ఆవిడ కూర్చుంది. గబగబా గోడనున్న ఫ్లాస్కు తీశాను. దురదృష్టం కొద్దీ అందులో కాఫీ నిండుకుంది. బలే సిగ్గనిపించింది నాకు.
    "మరేం ఫర్వాలేదులెండి. నే నిక్కడికి వచ్చింది ఒక ముఖ్యైన విషయం చెప్పటానికి."
    'చెప్పండి' అన్నాను మంచంమీద కూర్చుంటూ.
    "మీకు నన్ను పెళ్ళి చేసుకోవాలని ఉందా?"
    నిజం చెప్పద్దూ-ఆవిడ తెగువతనానికి ఆశ్చర్యపోయాను. ఏమి చెప్పాలో తోచిందికాదు.
    'చెప్పండి' మళ్ళా నిగ్గదీసి అడిగింది.
    తప్పదన్నట్టు, చెప్పటానికి గొంతు సవరించుకున్నాను.
    'ప్లీజ్ ..... యీ పెళ్ళికి మీ రొప్పుకో వద్దు' అన్నదామె తన మొహాన్ని చేతుల్తో కప్పుకుంటూ.
    ఇది ఇంకా చిత్ర మనిపించింది. నా మనసులోని మాట చెపితే కాస్త కుదుటపడుతుందేమోనని.
    'నాకు మిమ్మల్ని చేసుకోవాలని లేదు. ఆమాటే అన్నయ్యకి రాసేను. కాబట్టి మీరు నిశ్చింతగా ఉండచ్చు.'
    'నన్ను నమ్మమంటారా?' అని అడిగింది.
    'చెప్పేది నేను' అన్నాను.
    ఆవిడ కళ్ళు తుడుచుకుంది.
    "థాంక్స్ .... ఈ విషయం మా నాన్నతో చెప్పండి...... బావంటే ఆయనకు సరిపడదు, చదువు కునే కుర్రవాళ్ళు అల్లరిగా తిరుగుతరానే సామాన్య విషయాన్ని ఆయన కొండంతగా చేసి బావమీద మండిపడిపోతున్నారు. బావతో కాని పెళ్ళి నాకొద్దు. ఆడపిల్ల తెగించి యిలా చెప్పడం సాహసమే అవుగాక, అంతమాత్రం చేత యిష్టం లేని పెళ్ళితో నరకాన్ని కోరుకోలేనుగా. వొస్తానండి. సెలవు" అని చెప్పి వెళ్ళిపోయిందామె. వాళ్ళ నాన్నగార్కి మా అన్నయ్యే రాస్తారనే ఉద్దేశ్యంతో నేను మళ్ళా వాళ్ళింటికి వెళ్ళలేదు.

 

                                  
    "ఇది జరిగిన నెల రోజులకి ఏలూర్లో ఉద్యోగం ఊడిపోయింది. ఇంటి కొచ్చేశాను. అంతే తర్వాత అప్పుడు కనిపించిన వసుంధర మళ్ళీ యీ లాంచీలో కనిపించింది. ఇదీ వసుంధర కథ" అని ముగించేడు వాసు.
    మళ్ళా పుస్తకం చదవడంలో మునిగిపోయేడు.
    పతి వాసుని చూస్తో.
    "గమ్మత్తుగా ఉంది కథ" అన్నాడు.
    "అంటే ఇది కధే నంటావా?" అన్నాడు ప్రసాదం దిగులుగా.
    "మరి కథ అంటూనే ప్రారంభించాడుగా."
    అప్పటికి వాసులో చలనం లేదు.
    ప్రసాదం ఇరకాటంలో పడ్డాడు. అతనికీ సంఘటన చాలా బాగుంది. అయితే ఇది కథో కాదో తెలీడం లేదు. 'ఇది కథ కాకపోతే ఎంత బావుండును?' అని గూడా అనుకున్నాడు. వెంటనే అతని బుర్రలో ఓ ఆలోచన మెరిసింది. ఈ దెబ్బతో వాసు నిజం కక్కుతాడని తలచి అన్నాడు.
    "ఇది నిజంగా కథే అయితే, ఉత్త పుణ్యానికి పరాయి ఆడపిల్ల మీద యివన్నీ కల్పించి ఎవరు చెపుతాడు పతీ" అన్నాడు వాసు వైపు ఓ కన్ను వేసి.
    అప్పటికీ వాసులో మార్పు రానేలేదు.
    లాంచీ బెజవాడ దాటి చాలా దూరం వచ్చేసింది. మెరకలు తగలకుండా లాంచీని బహు చాక చక్యంగా నడుపుతున్నారు.
    "అమరావతి ఇంకెంత దూరమో?" అన్నాడు ప్రసాదం.
    ఎవరూ చెప్పలేదు.
    "అక్కడ అమరలింగేశ్వరుడి విగ్రహం కన్నుల పండువుగా ఉంటుందిట. నది ప్రక్కనే దేవాలయంట. అమరావతి బౌద్ధ శిల్పకళా చాతుర్యానికి పెట్టినది పేరుత. మావయ్య వాళ్ళు చెప్తూంటారు." అన్నాడు ప్రసాదం.
    ఈ మాటూ తతిమా యిద్దరి మిత్రుల్లోనూ ఎవరూ నోరు విప్పలేదు.
    ప్రసాదానికి యీ నిశ్శబ్దం నచ్చలేదు. దిగులుగా ఉంది. నిరుత్సాహ పడిపోతున్నాడు. అతని అవస్థ గమనించి,
    "పాట పాడవా" అన్నాడు పతి నవ్వుతో.
    "నువ్వా! పాటా!"
    "ఏం పాడకూడదా?"
    "ఇంతకుముందు నువ్వెప్పుడు పాడలేదుగదా?"
    "ఆ అవసరం రాలేదు కాబట్టి"
    "సరే... పాడు.... వింటాం" అన్నాడు ప్రసాదం.
    పతి పాట మొదలుపెట్టాడు.
    -ఎవక జన్మములోన
    యెవరిమో వంటి
    సిగ్గొచ్చి నవ్వింది
    పిలక నా ఎంకి
    ముందు మనకే జన్మ
    ముందోలే యంటి
    తెల్ల తెలబోయింది
    పిల్ల నా యెంకి
    ఎన్నాళ్ళు మనకోలె
    ఈ సుకములంటి
    కంట నీరెట్టింది
    జంట నా యెంకి
    ఆ వాతావరణంలో, ఆ లాంచి చేసే శబ్దంలో నది మధ్య ఈ ఎంకి పాట అద్భుతంగా సాగింది. పతి ఇంత చక్కగా పాదతాడనే సత్యం మిత్రుల కధే మొదటిసారిగా తెలియడం.
    పుస్తకం చదువుతున్న వాసు సైతం, చదువు ఆపి పాటని శ్రద్దగా విన్నాడు. ప్రసాదం సంగతి సరేసరి. ఆశ్చర్యంతో ముందు నోట మాట రాలేదు. పాటంతా అయిన తర్వాత 'అయ బాబోయి' అన్నాడు.
    "చాలా చక్కగా పాడావుపతీ" అన్నాడు వాసు.
    "నే పాడటం కాదుగాని- ఆ పాటలో కావలసి నంత వేదాంతం ఉంది. మనిషి జీవిస్తూ ఇప్పటి సుఖం గురించి సంతోషిస్తాడు, ఈ సుఖం శాశ్వతం కాదని తెలీగా కంట నీరుపెడతాడు, మళ్ళా ముందు జన్మ గురించి ఆలోచిస్తూంటాడు. ఈ జీవితసత్యాన్ని చాలా అందంగా, రాశాడు కవి. నాకీ పాటంటే చాలా ఇష్టం." అన్నాడు పతి.
    -నిమిషానికో మెరక తగలడం వల్ల లాంచీ వేగం తగ్గింది. అమరావతిలో లైట్లు లీలగా కనిపిస్తున్నాయి.
    "దగ్గర పడ్డాం" అన్నాడు పతి.
    "ఈ రోజు గొప్ప వండరై పోయాను. ఒకటి వాసు కథ, రెండు పతి పాట. జన్మలో మరిచిపోలేని రోజిది" అన్నాడు ప్రసాదం.
    వాసు మెల్లిగా నవ్వి వూరుకున్నాడు.
    -అమరావతిలో కాలు పెట్టేసరికి బాగా చీకటి పడింది. ధర్మ పత్రంలో ఒక గది తీసుకున్నారు. సత్రపువాళ్ళు ఇచ్చిన చాపలు నేలమీద పరుచుకున్నారు. వెంట తెచ్చుకున్న 'టిఫిన్' తిని ఫ్లాస్కులో కాఫీ తాగారు.
    పక్క గదిలో 'ఆడవాసన' తగిలింది. వచ్చిందెవరో గ్రహించగలిగారు పతీ, ప్రసాదం.
    దాదాపు పది గంటలకి అందరికీ నిద్రలుపట్టాయి.
    -తలుపు శబ్దమైంది. ప్రసాదానికి మెలుకువ వచ్చింది. లేచి తలుపు తీద్దామనుకున్నాడు గాని, తన పక్కనే పడుకున్న పతి అతని ప్రయత్నాన్ని వారించాడు. చేత్తో ప్రసాదం భుజం నొక్కుతో చెవిలో 'పిచ్చి వేషాలు వేయక, అంతా చూస్తుండు' అన్నాడు.
    ప్రసాదం గట్టిగా కళ్ళు మూసుకున్నాడు, నిద్ర పోతున్నట్టు నటించాడు.
    మరొకసారి తలుపు శబ్దమైంది.
    వాసు లేచాడు.. లైటువేసి తలుపు తీశాడు-తనెదుట వసుంధర నిలబడి ఉంది.
    "మీరా" అన్నాడు వాసు.
    "మా నేస్తురాలింటికి వచ్చాను, ఇద్దరం కలిసి అమరావతి చూడటానికి వచ్చాము. రేపు మా వూరు వెళ్ళిపోతాను." అన్నది వసుంధర.
    ప్రసాదం ఒక కన్నుతో ఇద్దర్నీ గమనిస్తున్నాడు జాగ్రత్తగా.
    "మీతో ఎన్నో మాటాడాలని ఉంది." అన్నది వసుంధర కాలిగోటితో నేలనురాస్తూ.
    "ఆనాడూ - ఇలాగే తలుపుతట్టి నా సమస్యని చెప్పుకున్నాను గదూ" మళ్ళీ ఆమే అన్నది వాసు మొహంలోకి చూస్తూ.
    ఇద్దరూ గుమ్మం దగ్గరే నిలబడి పోయారు గదిలోకి రమ్మని వాసుగానీ, రావచ్చునా అని వసుంధరగానీ అనలేదు. గుమ్మానికి అవతల వసుంధరా ఇవతల వాసుదేవరావూను.
    "అన్నట్టు మీ పెళ్ళి మీ బావగారితోనే జరిగిందా?" అన్నాడు వాసు.
    అవునన్నట్టు తలూపింది. వెంటనే ఆమె అడిగింది.....
    "మీ పెళ్ళి?"
    "లేదు. నేనింకా పెళ్ళిచేసుకోలేదు."
    "ఎందుచేత?"
    "ఇష్టం లేక."
    ఆమె ఒక్కక్షణం ఆలోచించి-
    "దానిక్కారణం నేను కాదుగదా?" అన్నది.
    "నాకే ఇష్టం లేదు. వంటరిగా జీవితం గడపాలని నా అభిప్రాయం."
    ఆమె మరేమీ మాటాడకుండానే నించుంది.
    "మీ నిద్ర పాడుచేస్తున్నా కాబోలు" అన్నాడు వాసు తలుపు రెక్కని ఒక చేత్తో పట్టుకుని.
    "దైవ నిర్ణయం చాలా తమాషాగా ఉంటుంది. వస్తాను. సెలవు" అనేసి వెళ్ళిపోయిందామె.
    వాసు తలుపు గడియవేసి లోపలికొచ్చేడు. లైట్ ఆఫ్ చేయ బోతూండగా.
    "కథలు చెప్పడం నీకు చాతకాదు" అన్నాడుపతి.
    "వసుంధరకి నువ్వింకా గుర్తున్నానంటే గొప్ప చిత్రంగానే ఉంది" అన్నాడు ప్రసాదం.
    వాసు ఎవరికీ జవాబు చెప్పకుండా, లైట్ ఆర్పినడుం వాల్చాడు నిద్రపోయేందుకు.
    ఉదయం కృష్ణానదిలో స్నాన మాచరించి, దైవ దర్శనం ముగించారు. తర్వాత అక్కడున్న పురాతన కట్టడాలని చూడటానికి వెళ్ళేరు.
    బౌద్ధ శిల్పకళల తాలూకు మ్యూజియం వాళ్ళని ఆకర్షించింది. ఆ నాటి శిల్పకళా వైభవాణ్ణి సూచించే చిత్రపఠాలూ, ఊహా చిత్రాలూ వాళ్ళని ఆశ్చర్య చకితులను చేశాయి.
    ఆ చోటికి లిల్లీతోపాటు వసుంధరా వచ్చింది. కాని ఆమె వాసుతో ఒక్క మాట గూడా మాటాడ లేదు. లిల్లీ వసుంధరకి అనేక విషయాలు చెప్పి, మధ్యమధ్య నవ్విస్తూంది.
    మళ్ళీ ఆదివారం సాయంత్రం అక్కడ్నుంచి బయలుదేరే లాంచీమీద తిరుగు ప్రయాణం చేశారు.
    
                                                             *    *    *

    గోదావరి అవతల వడ్డున భద్రాచలం, ఇవతల వడ్డున 'గుమ్మూరు' అనే చిన్న ఊరు ఉన్నాయి. బస్సులు గుమ్మూర్లో ఆగిపోతాయి. క్షేత్రానికి వెళ్ళవలసినవారు, గోదావరిని పడవలపైన దాటి వెళ్ళాలి.
    శారదా వాళ్ళు భద్రాచలం చేరుకునే సరికి బాగా సాయింత్రం మయ్యింది. అక్కడున్న పత్రం లోనే ఒక గది తీసుకుని ఆ రాత్రి గడిపేరు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS