"పూజాపీఠం వద్ద - ఏ తరతరాల ఔన్నత్య శిఖరమో - అక్కడ పూజ చేసి, ఆ పాద పద్మాలవద్ద కుంకుమతో, స్వహస్తంతో మావయ్య సుమంగళీత్వాన్ని నా కిచ్చేడు.
"ఇక మీరున్నారు. లోపల ఏం ఘర్షణ జరిగిన ఫలితమో నాకు తెలియదు. ఈ కుంకుమను మాత్రం తుడిచివెయ్యకు, బాబయ్యా."
ఎప్పుడు వచ్చిందో పార్వతమ్మ తెలియనే తెలియదు. దిగమ్రింగిన దుఃఖం పొర్లి పొరలి నట్లే, బావురుమంది; చెంగు క్రుక్కుకుంటూనే.
"ఏళ్ళు కాల్చిన కట్టె నాది. అందులో జీవం లేదు. ఈనాడు తల్లి వేరు ప్రాణం ఉందంది. ఆ ప్రాణం కోరుకొనేది సంఘం దృష్టిలో విషమమే. అసభ్యమే. అనౌచిత్యంగా, విడ్డూరంగా ఉంటుంది. ఉంది కూడాను.
"దీనితో మీ ప్రతిష్ఠలకు, గౌరవాలకు మలినం అంటి, పదచ్యుతి అయిపోతామన్న భయం, భయంకర దావాగ్నే రవులుకుంటే ఒక్కటే మార్గం ఉంది. దాన్ని తూచా తప్పకుండా నేను పాటిస్తానని, అమ్మ పాదాలు పట్టుకుని ప్రమాణం చేస్తాను. ఏ సృష్టి రహస్యాన్ని తెలుసుకొనే శక్తి నాకిచ్చిందో దాన్ని నాలోనే ఇముడ్చుకుని, కట్టెను ఈడుస్తాకాలం తీరేవరకూ. కనీసం..." ఇక మాట్లాడ లేనట్లే చేతుల్లో ముఖం దాచుకుంది. దిగమ్రింగుకునే ఆవేదనే.
"ఏమిటమ్మా, అది?' అని తను అడగలేడు. ఆ చూపులుమాత్రం ఒళ్లంతా క్రమ్ముకున్నాయి. పార్వతమ్మ నోరు తెరిచింది. అంతా వింటున్న అవధానికి దద్దరిల్లినట్లే ఫెళఫెళలు వినిపించేయి. తన తల్లి, ఆ అంబే ఆవేశంలో మాట్లాడుతూందా? ఆ శివశక్తే తన చరిత్ర చెప్పుతూందా? ఏది సృష్టికి మూలమో అదే నించుని ఇదే సృష్టి ప్రారంభం, ఆది దంపతుల కలయిక అని ఉద్ఘాటిస్తూందా? 'ఏమిటిది, అమ్మా! అగ్నిపర్వతం బ్రద్దలై మానవ పాప పంకిలాన్ని కడగడానికే బయలుదేరిందా?'
"అది మీ చేతుల్లో ఉంది".
రెండు చేతులూ అవ్యక్తంగానే చాచి, ఇందులోనా అన్న ఆశ్చర్యం ఆవురించినట్లు దశరథం బొమ్మ అయ్యేడు.
"అవును అతన్ని మావగారికి దత్తత ఇవ్వండి. దీనివల్ల మీరు నాకు మహోపకారం చేసినవారే అవుతారు. ఒక్కటి ఇందులో ఈ గతం లేదు. ప్రస్తుతం ఉందని మరువకండి.
"మీరే వెతకండి. సంబంధం. మీ ఉన్నతికి తగ్గ మర్యాదగల ధనికపు వంశమే చూడండి. వివాహం నేనే చేయిస్తా. ఆయన ఎదురుగా ఉన్నన్నాళ్ళూ దాసిగా, తల్లిగా, మంత్రిగా ఉండి, మిగిలిన కర్మలోని మాతృత్వం నిలబెట్టు కుంటా.
"కనీసం ఇదైనా చెయ్యండి."
బొట బొటా కన్నీళ్లు కార్చాడు దశరథం. ఒక స్త్రీ హృదయంలో బడబాగ్ని చవి చూసి నట్లయ్యింది. ఈ విన్న విషయంలో శాంత తనకోసం కూడా త్యాగం చేస్తూందన్న పరవశత్వం ముమ్మరంలోనే, అవధాని వస్తూనే -
"బాబూ! నే చెప్పలేని, విడతియ్యలేని సమస్య శాంతే పరిష్కరించింది. నేనూ దేహీ అనే ప్రాధేయపడుతున్నా" అనేసి చేతులు పట్టుకున్నాడు.
"మరిదీ!" అంది పార్వతమ్మ మాతృత్వం; అందులో ఆక్రోశమే ఉంది.
"అన్నగారూ, ఇంత గౌరవానికి అనర్హుణ్ణి. పైగా ఈ ఆశయం నెరవేరితే నేను ధన్యున్నే అవుతా" అన్నాడు, మధ్య రుగ్ధపుస్వరం మేళవిస్తూంటే.
ఒక్క అంగలోనే శాంత అడుగువేసి దశరథం పాదాలకు వందనం చేసింది. బరువుగా, వేడిగా పడ్డ కన్నీళ్ళు పాదపూజ చేసేయి.
తెల్లవారేసరికే శంకరయ్య, భార్య తిరుపతి యాత్ర ముగించుకుని అవధాను లింటి ముందర ఆగేరు. 'ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు' అన్న ఆనందంలో ప్రీతి నెరపుకున్నారు, మిత్రులిద్దరున్నూ.
మాటల మధ్యనే రామచంద్రయ్యగారి కొడుకుతో ప్రయాణం, అందులో విషయాలు చెప్పేడు శంకరయ్య. విని యథాలాపంగానే తీసుకున్నారు అది.
శాంతను చూడగానే, ఎవరన్న ప్రశ్న ప్రస్ఫుటంగా శంకరయ్యలో కన్పడితే "మా అమ్మాయి" అనేసి "క్షః" అన్నాడు దశరథం.
విడిన మల్లెలా శాంత కళ్ళు మెరిసిపోయేయి.
* * *
15

"సత్యాదేవిగారి యిల్లు ఇదేనా?" వీధి గుమ్మం దగ్గర రిక్షాలోంచే ప్రశ్న.
హడావిడిగా, పనిమనిషి చెప్పిన కబురు విని, పరుగెత్తుకుంటూనే వచ్చింది సత్య తల్లి సీతమ్మ. రిక్షాలో ఉన్న స్త్రీని ఎప్పుడూ చూడలేదు. పైగా వినిన చరిత్రల్లో ఈవిడ రూపం వర్ణింపబడలేదు. ఎవరో తెలియని సందిగ్ధత.
"అవునమ్మా! లోపలికి రండి." అతిథి మర్యాదన్నట్లు.
వెనుక చిన్న తోలుపెట్టెలో సామాను. డబ్బులిచ్చి లోపలికే వచ్చింది. ఆవిడకు తనెవ్వరో అంతు చిక్కనట్లే గుబులుగా ఉంటే "నన్ను మీరెప్పుడూ చూడలేదు. ఆఖరుకు సత్యకూడా చూడలేదు. అయినా మీ ఇల్లు వెతుక్కుంటూనే వచ్చేను" అంటూ ఆగింది.
"కూర్చోండి."
"నేను రాజుకు సవతితల్లిని. పేరు రుక్మిణి."
తెల్లబోయింది సీతమ్మ. ఈవిడా! ఎవరిని అయితే సర్వం చుట్టుకుని పరిభ్రమణంలో విరక్తి చెందేయో ఆవిడే. స్వయంగా, తమ యింటికి రావడంతో సంబాళించుకోలేకపోయింది.
"ఎంతో సంతోషం. నేను సత్య తల్లిని. అమ్మాయి ఇప్పుడే బజారుకు వెళ్ళింది. వచ్చేస్తుంది" అంది. అయినా చూపులు, సహజం గానే ఆపాదమస్తకం పరీక్షించేయి. లక్షల కధికారి భార్య. తన ఉద్దేశ్యం బంగారు తొడుగే ఉంటుందని.
సన్నటి అంచుతో నలభై, అరవైల మధ్య చీర. అదేరకపు తెల్లటి చోళీ. మెడలో త్రాడుకు గుచ్చి నల్లపూసలతాడు. పసుపుబొందు పుస్తె లది. చేతికి రెండంటే రెండే మిరియపుగాజులు ఉన్నాయి. చెవులకుమాత్రం రవ్వలు కావన్న పేలవమైన నకిలీ దుద్దులు. ఆశ్చర్యం కళ్ళతోటే ప్రకటించింది.
చిన్నగా చిరునవ్వు నవ్వుతూనే రుక్మిణి "బహుశః మీ ఊహకు చాలా చిన్న స్థాయిలో ఉండి ఉంటాను. కాని ఒక్క సత్యం ఉంది. నేను బీదవాళ్ళ పిల్లగానే వాళ్ళింట్లో కాలు పెట్టే. అది అల్లాగే ఉండడం, ఉంచుకోవడం నాకు సరదా" అనేసింది.
ఇక ముఖంమీద నీళ్ళు పొయ్యవలసిన తపనయ్యింది సీతమ్మకు. తప్పిదం చేసినట్లే సిగ్గుపడి తల వంచుకుంది.
"తప్పుగా భావించకండి" అనేసింది రుక్మిణి.
"అబ్బే!" అంటూనే లోపలికి వెళ్ళి కాఫీ తెచ్చి ఇచ్చింది. రుక్మిణికి ఒక్కటే సంశయంకలిగింది. ఈ నాటకంలో ఈవిడ పాత్ర ఏమిటి? ఎంతవరకూ తెలుసు? ఏది ఎల్లా ఉన్నా తను సత్యతో మాట్లాడ్డానికే వచ్చింది. ఎదురుచూపుల్లోనే ఉండిపోయింది.
"అమ్మా, అమ్మా, కవురు" అనే మాల పరుగెత్తుకునే వచ్చి, సావిట్లో క్రొత్త వ్యక్తి ఉండడంతో ఠక్కున ఆగిపోయి, నిలబడింది.
ఆనాటి రాత్రినుండి మాల జీవితంలో కొత్త మొగ్గు తొడిగింది. వెనుకటివన్నీ మరిచి పోయి, సామాన్య స్త్రీలాగే జీవితం, శ్రమించి గడపాలనే నిశ్చయం చేసుకుంది. అది రాజు సాహచర్యంవల్ల అన్నా, లేక సత్య వగైరాల అంతస్థు అవలంబనం అనినా - నిర్ణయింప బడింది; కట్టుదిట్టంగానే జరిగింది. ఒకళ్ళిద్దరిండ్లలో అ ఆ లు నేర్పుతూంది. నలుగురి బసలకు హోటలునుండి క్యారేజీ తెస్తూంది. తీరుబడి ఉన్నప్పుడు మాత్రం సత్య తల్లి దగ్గర పనులు నేర్చుకునేది.
"ఎంత మారిపోయేవు నువ్వు!" అనేవాడు చిలిపిగా రాయు.
గతంలోని ఎత్తిపొడుపు లేకుండానే "మీరంతా కలిసేకదూ మార్చేరు" అని వినయంతో అనేది. ఆ వినయం చూస్తేనే సీతమ్మకు ముద్దు కలిగింది దానిమీద. రాజు అన్వేషకుల్లో మాలకూడా ఓ పత్తేదారే అయ్యిందనాలి.
"నించుండి పోయేవు. కూర్చో, మాలా."
కొత్తావిడను ఓ సారి చూచి, కనుబొమలు ముడుచుకుంది మాల కూర్చుంటూ అంతు చిక్కలేదు.
"రుక్మిణమ్మగారు."
"రాజు మారుటి తల్లా!" అనే "నమస్కారం" అంది మాల.
"మాకు ఆత్మీయురాలు. చిలిపిగా అల్లరి చెయ్యడం సరదా. పేరు కాంచనమాల. వట్టి..." ఇక నవ్వేసింది సీతమ్మ.
"నాకు సిగ్గేస్తోంది." బుంగలా మూతి ముడుస్తూ అంది మాల.
రుక్మిణీ నవ్వేసింది. "ఎంతవరకూ చదువుకున్నావమ్మా?"
చెప్పింది మాల. ఇప్పుడు తను చేస్తున్నదీ విశదం చేసింది. "ఇదంతా మా అమ్మ చలువ" అన్న కృతజ్ఞత ప్రకటించితే సీతమ్మ బంగారు మలామా అయ్యింది.
"ఏమిటమ్మా, అంత పరుగెత్తుకుంటూనే వచ్చేవు?"
ఓసారి సంశయం కలిగింది మాలకు. "శాస్త్రి టెలిగ్రాం ఇచ్చేడు" అంది.
ఎవరా శాస్త్రి, ఏమా కథ? అన్న బొమ్మల చిత్రం. తనకు, మాల జీవితం తెలుసు కనుక, అడక్కుండానే "ఏమని?" అంది సీతమ్మ.
"దేవుడు తిరుపతిలో తనింట్లో ఉన్నాడని."
"రాజా!" సీతమ్మ ఆశ్చర్యం ప్రకటించింది. ఒక్కసారి ఎగిరి గంతేసినట్లు రుక్మిణి లేచి, తమాయించుకుని, చూస్తూనే ఊరుకుంది. కాని మనస్సులో ఈ పిల్ల రాజును దేవుడంటుందేమిటి అన్న తికమక కలిగింది. రాజు కాలేజీ జీవితంలో ఒక్క సత్య కాకుండా మాల కూడా హితురాలు అయితే ఇంకా ఎంత మంది ఉన్నారో? అది తనకు తెలియదు. పైగా తను బెజవాడ రావడం కూడా అతి విచిత్ర పరిస్థితుల్లో రూపొందింది. ఎంతగా తను తన స్థానంలో నిలబడినా, అందులో కుమిలింపు సవతి అవడంవల్ల, ఆ ఇంట్లో ఉండడంతో పాత స్మృతులన్నీ చెలరేగి ఉక్కిరిబిక్కిరి చేసేయి.
కనీసం తన భర్త అయినా అర్ధం చేసుకుంటాడనుకుంది. కాని రోజు రోజుకూ దిగజారి, తనేవిధంగా అయినా పిపాస తీర్చుకోవడానికి తయారవ్వాలన్న ఆశ తప్ప వేరొకటి కన్పించ లేదు. దాని ఆయత్తతే తన్ను గంగ వెర్రు లెత్తించింది. ఉండబట్టలేక సుభద్రమ్మ అత్తయ్యతో చెప్పుకుని ఏడ్చింది.
"వీడి రోగం కుదురుస్తాను. కొన్నాళ్ళు సత్యదగ్గర ఉండిరా" అనే తన్ను తరిమి పంపింది. అప్పుడే తనలో రాజు విషయం క్రమ్మింది. కనీసం ఆ పూర్వపు భావన ఎల్లా ఉన్నా, ఈ క్షణంలో ఇంటి కళ్ళేలు అతని చేతుల్లో పెట్టెయ్యడం ఉత్తమం అన్నట్లు తోచింది. నిన్న ఆ దంపతుల మాటల్లో రాజు ఆరాలు ఎక్కువగా సత్యే తీస్తూందన్న వార్త అమృతమే అయి వచ్చేసింది. దీని పర్యవసానం ఎల్లా ఉన్నా తను తల ఒగ్గి తీరాలి. దానికి సన్నద్ధం అయి వచ్చి తలుపు తట్టింది.
"రావు వెళ్తానంటున్నాడు. మధు వెళ్ళి ప్రయోజనం లేదురా అంటాడు. ఇల్లా ఉంది వాళ్ళ వాదన. సత్యతో చెపితే మంచిదని పరుగెత్తుకు వచ్చే."
రుక్మిణి మనస్సు ఊగింది. తను తిరుపతి వెళ్ళడం సమంజసంగా లేదు. పైగా తను బలవంతంగా రాజును తీసుకువచ్చినా, ఆశయం నెరవేరదు. రాజు రాజుగానే ఇంటికి రావాలి. అదే కావాలి. వస్తాడా, రాడా అన్న బెరుకు ఉండనే ఉంది.
