Previous Page Next Page 
ఆరాధన పేజి 22


    'మీకో సామెత గుర్తు చేస్తే బావుటుంది!' 'పిల్లి పాలు తాగుతూ-- నన్నెవరూ చూడటం లేదులే--' అనుకుంటుందట! పాపం! నలుగురూ చూస్తుండగానే.'
    అతని ముఖం బొగ్గులా నల్లగా మాడిపోయింది. అవ్యంగ్యోక్తి ఎంత మృదువుగా వుందో అంత వాడిగా గ్రుచ్చుకుండతనికి.
    'నేనంటే మీకేందుకో కోపం? ఎప్పుడూ తీయగా తిడుతూనే వుంటారు!' అవమానాన్ని కూడా తీయగా వుందని వర్ణించాడతడు నేర్పుగా.
    'మీ ఊహాగానం గొప్పదే! కానీ దానికి కొంచెం 'ఆత్మగౌరవం, నీతీ, నిజాయితీ లతో, రంగులు వేయండి. అపుడది నిజంగా తీయగానే వుంటుంది.' మృదుమధురంగా వినదించిందామె స్వరం. ఆ తరువాత అమెఅతని సమాధానం వినకుండానే తన గదిలోకి వెళ్ళిపోయింది. చంద్రం దెబ్బతిన్న పులిలా హుంకరించాడు లోలోన. పైకి మాత్రం నవ్వు ముఖంతో విలాసంగా సిగరెట్ పీల్చుతూ బయటికి వెళ్ళిపోయాడు.
    'అబ్బాయి గోరిపప్పులుడకడం లేదు. అనూరాధమ్మ గోరి ముందు!' అంటూ నవ్వుకున్నాడు జోగులు అతను పలాయనం చిత్తగించడం చూసి.
    ఆ వుదయాన వెళ్ళినవాడు రాత్రికి కూడా తిరిగి రాలేదు. అనూరాధ, అతని కోసం ఎవర్నీ నిరీక్షించవద్దని చెప్పింది.
    గేటు మూసి తాళం వేయించింది. అన్నపూర్ణమ్మ గారు కూడా అలాగే అన్నది--
    'మరీ హద్దు మీరి పోతుందమ్మా అతని ప్రవర్తన!'
    'నిజమే అక్కా! రాత్రి ఆ వాగుడు మూలాన నా చదువు పాడై పోయింది' అన్నాడు రాజు.
    'అమ్మా! బుద్ది లేనివాళ్ళని భయపెట్టి లొంగ దీయలెం! అలా అయితే మరింత గొడవ చేస్తారు. మర్యాదతోనే మృదువుగా నే సత్కరించి పంపించి వేద్దాం!' అన్నది అనూరాధ.
    'ఏమిటో ! తల్లీ! పాపం! ఆ డాక్టరేమో అలా అయిపోయే! అతని కోసం కళ్ళల్లోవత్తులు వేసుకుని కూర్చున్నారు శారదా, నువ్వూ! ఎలా జరుగుతుందో/ ఏమిటో? ఈ ఎముకల గూడు కన్నబిడ్డ మనసారా నవ్వడం చూస్తుందో లేదో!' ఆ మాతృహృదయాన వ్యధ అలలై పరుగులు పెట్టసాగింది.
    అనూరాధ మౌనం వహించింది.

                                 *    *    *    *
    చంద్రం లో వ్యసనాలెన్నో వున్నాయని గ్రహించింది అనూరాధ. మనుషులలో అంత మూర్కులుంటారని ఆమె ఏనాడూ ఊహించనే లేదు.
    ఆరోజున చంద్రం సుమారు యిరవై సంవత్సరాలున్న వో యువతిని వెంట బెట్టుకు వచ్చాడు. అనూరాధ చూసీ చూడనట్లు మౌనం వహించింది. అతడు భావ గర్భితంగా నవ్వాడు అనూరాధ వంక చూసి వెంట నున్న యివతికి కనుసైగ చేసి.
    'నమస్కారం అనూరాధాదేవీ! ఒక్క క్షణం మాకోసం మీ అమూల్యమైన సమయాన్నుంచి కేటాయించమని కోరుకుంటున్నాం!' అతి వినయంగా అర్ధించాడు. ఆ కంఠన దాగిన వెటకారం అమెకు స్పష్టంగా నే విన్పించుతూనే వుంది.
    వెంటనున్న యువతి 'లిప్ స్టిక్' అద్దుకున్న పెదవుల్ని అప్పుడప్పుడు తడుపుకుంటోంది నాలుకతో ఎర్రదనం కోసం. దిద్దుకున్న కనుబొమ్మల్ని అతి విలాసంగా కదిలించుతూ వయారా లోలికించుతోంది.
    'నా క్లాస్ మెట్! శ్రీలత! మిమ్మల్ని చూడాలని వచ్చింది!' అంటూ పరిచయం చేశాడు. ఆమె నమస్కరించబోయి ఆ పని తనకు చేత గాదన్నట్లు కరచాలనం కోసం చేయి జాచింది.
    అనూరాధ నమస్కరించి అన్నది మృదు స్వరంతో --
    మన ఆచారంలో మంచి వున్నా ఆచరించడానికి వెనుదీయడం మన ఆత్మ గౌరవానికే అప్రతిష్ట! శ్రీలత గారూ! మనది భారతదేశం! ఇంగ్లాండు కాదు. అని ముఖ్యంగా ముందు మన స్త్రీలు గుర్తించినపుడే ఈ వెర్రి వ్యామోహం తగ్గిపోతుంది.'
    తెలుగే అర్ధం కానట్టు చూసిందా యువతి. చంద్రం వంక చూసింది 'వాట్' అంటూ.
    'వీళ్ళ కుటుంబం అంతా అమెరికా లోనే వున్నారండీ! ఈ సంవత్సరమే వచ్చారు! అందుకే తెలుగు అంతగా తెలియదు!' అన్నాడు చంద్రం.
    'కూర్చోమ్మా! శ్రీలతా! చంద్రం గారు చెప్పింది విన్నాను. కానీ అది నిజమన్పించడం లేదెందుకనో , నీకు తెలుగు వచ్చు! కానీ మాట్లాడగూడదని అనుకున్నావు! అమెరికా గాదు, హాలెండ్ వెళ్ళు పోలెండు లో వుండు. మాతృభాష ని మరిచి పోవడం మనల్ని మనం అవమాన పరుచు కున్నట్లే!'
    శ్రీలత ముఖం తెల్లగా పాలిపోయింది చంద్రం ఆమె ఏం మాట్లాడుతున్నదీ విననట్లు ప్రక్కనే వున్న 'మగజైన్ ' లోని బొమ్మల్ని చూస్తుండి పోయాడు. కానీ అతడు విన్నాడని గ్రహించింది అనూరాధ.
    శ్రీలత 'ఆధునిక నాగరికత' అన్న ముసుగు లో మోసగింప బడుతోందని తెలుసుకుంది.
    చంద్రం ఎప్పటికో తలెత్తాడు. అనూరాధ శ్రీలత లు దేన్నీ గురించో చర్చించుకుంటున్నారు.
    శ్రీలత సంభాషణ లో 'చంద్రం ' తనను పెళ్లాడబోతున్నట్లు చెప్పింది . ఆ మాట వినగానే అనూరాధ సూటిగా చూసిందామె కనులలోకి....    
    'పై వేషం చూసి మోసపోతున్నావనుకుంటానే! మనస్సు నిర్మలంగా వుంటే మీ నిర్ణయం మంచిదే ! కానీ.... అర్దోక్తి లో ఆగిపోయింది.
    శ్రీలత కామే వుద్దేశ్యం పూర్తిగా బోధ పడలేదు. అందుకే ఏమిటి మీంటున్నది తిరిగి ప్రశ్నించింది.
    'అబద్దాలతోనే జీవించేవాళ్ళు కొందరుంటారు లతా! వాళ్ళను నమ్మి మనసున మల్లెలు పరుచుకో గూడదు.'
    శ్రీలత చంద్రం వైపు చూసింది. అతను బుద్ది మంతుడిలా పుస్తకం చదువుతూ కూర్చున్నాడు. శ్రీలత తండ్రి పెద్ద ఆస్తి పరుదవ్వడమే , చంద్రం ఆమెను వివాహ మాడడానికి మూల కారణం అని గ్రహించింది అనూరాధ.
    ఆ తరువాత చంద్రం మీ నాన్నగారు ఫోను చేస్తారు పద! ఆలస్యమైంది! అంటూ శ్రీలత ను తొందర జేసి తీసికొని వెళ్ళిపోయాడు. అతని అసలు రంగు బయట పడుతుందని ఆ విధంగా పలాయనం చిత్తగించాడని అర్ధమయ్యిందామెకు.
    మరో పది రోజుల వరకు ఏ విశేషమూ జరుగలేదు. చంద్రం రాత్రిళ్ళు కూడా ఒక్కొక్కనాడు యింటికి రావడం లేదు. శ్రీలత అపుడపుడు 'ఫోను' చేసి అతని గురించి కనుక్కుంటుండేది.
    ఆ సాయంత్రం వరండా లో నిల్చుని వుంది అనూరాధ.
    శ్రీలత నుదుట స్వేద బిందువులు మెరుస్తుండగా వచ్చింది.
    'అక్కా! చంద్రం వున్నారా?' అన్నది.
    అతడు నాలుగు రోజుల నుంచి యింటి పట్టునే వుండడం లేదని చెప్పిందామె. ఆమె ముఖాన విచారం, నీలి నీడల్ని పరచింది. ఏదో జరగరానిది జరిగిందని గ్రహించింది అనూరాధ. కూర్చోమని చెప్పింది.
    'చంద్రంతో ఏం పని యిపుడు?' అన్నది.
    'అయిదారు రోజుల క్రితం నాన్నగారితో చెప్పాను అయన నేనూ వివాహం చేసుకుంటామని. అంగీకరించారు నాన్నగారు. 'చెక్' మారలేదని చెప్పి నాన్నగారి దగ్గర పది వేలు పట్టుకుని వెళ్లారు. ఇంతవరకూ కంటికే కన్పించలేదు. 'చెక్ ' చెల్లదని తెలిసింది బాంక్ కి తీసికెళ్లి చూపించితే.'
    కానీ జరిగింది అదే గాదనీ యింకా జటిలమైన సమస్య ఏదో వున్నదని తోస్తోంది అనూరాధకు.
    అంతలో నౌకరు వో శుభలేఖ తెచ్చి అనూరాధ కందించి వెళ్ళిపోయాడు. ఎవరిదా అని విప్పిందామె. వధూవరుల పేరు చూడగానే ఆశ్చర్యపోయిందెంతగానో -----
    'శ్రీలతా! ఇదేమిటి?! మరి! చిరంజీవి చంద్రానికి, ఛి.ల.సౌ. వాణి బాలను' అని వ్రాశారు. నువ్వేమో అతడు నిన్నే పెళ్లాడ బోతున్నాడని చెప్పావు" అన్నది ఆశ్చర్యం నుంచి తేరుకుని.
    'అక్కా! ఏం చెప్పమంటావు?!' అనూరాధ ఒడిలో వాలిపోయిందామె. పెద్దగా రోదించసాగింది. ఆ మూర్కుడు అభం శుభం తెలియని ఆ అమాయకురాలిని మోసం చేశాడని తెలుసుకుంది. ఆ దుఃఖ వారిది నుంచి తేరుకున్న తర్వాత అడిగింది --
    'పువ్వులాంటి నీ జీవితాన్ని నాశనం చేయలేదు గదా! అతనికి డబ్బు తప్ప మరో దాని విలువ తెలియదు లతా!' అనుమానించిందామె.
    'లేదక్కా! అంత చనువు యివ్వలేదింకా నేనతనికి! నువ్వానాడు అతడిని గురించి 'మేకవన్నె పులి,' అని చెప్పినప్పటి నుంచి మెలకువ గానే వుండాలని నిశ్చయించు కున్నాను. కానీ...మనస్సున దాగిన మమతల్ని వో మూర్కుడికీ, అనర్హుడికి అర్పించినందుకు కెంతో బాధగా వుంది.'
    శ్రీలత కన్నులలో  గిర్రున నీరు తిరిగింది.
    ఆమె మోసగించ బడిందని తెలుసుకున్న అనూరాధ వ్యధకు, అంతులేకుండా పోయింది.
    'చూడమ్మా! లతా! పడవ మునగక ముందే మేల్కొన్నందుకు నాకెంతో ఆనందంగా వుంది. అతడు మానవత్వాన్ని మమకారాన్నీ మరిచిపోయిన మహా మూర్కుడు. అందుకే యింత నిర్దాక్షిణ్యంగా నీ మనస్సును ముక్కలు ముక్కలుగా ఖండించి మరీ పరిత్యజించి వెళ్ళిపోయాడు. మరి యిపుడు ఏం చేద్దామని నీ వుద్దేశ్యం?'
    'ఏం చేయగలనక్కా ఇంకా ఆ నరకం లోకి తొంగి చూడనా! ఉహూ! నా తరంగాదిక. ఎంత మందినిలా  మోసగించి ఎంత డబ్బు సంపాదించాడో?' వాపోయింది శ్రీలత.
    ఆ తరువాత కొంతసేపటి కామె సెలవు దీసికొని వెళ్ళిపోయింది భారమైన మనస్సుతో.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS