
'అయితే యూనివర్శీటీ లో కలుసుకుందాం, సరస్వతీ దేవి' అని లేచాడు రాజశేఖర మూర్తి.
"అన్నట్లు , ఇందుమతి ఇక్కడనే ఉన్నదా?" అన్నది సరస్వతి. రాజశేఖర మూర్తి హృదయంతరం లో ఏదో కలుక్కుమన్నది. అతని వదనం భిన్నమయింది.
"లేదండి . ఆమె ఏలూరు లో ఉన్నది. ఆరోగ్యం సరిగా లేదు. కొన్నాళ్ళు అక్కగారి దగ్గిర ఉండి మందు పుచ్చుకుంటుంది."
"అలాగా, పాపం, ఏం జబ్బు?"
"ఏమీ లేదండి, బలహీనత."
"నే నడిగానని వ్రాయండి."
"అలాగే. వస్తాను." అని వెళ్ళిపోయాడు రాజశేఖర మూర్తి.
"విశ్వవిద్యాలయ పు కళాశాల లు గుంటూరు లో అద్దెకు పుచ్చుకున్న భవనాలలో ప్రారంభించారు. రాజశేఖర మూర్తి ఎమ్.ఎ లో చేరాడు. సరస్వతి కూడా చేరింది. బి.ఎ. లో ప్రప్రధమంగా ఉత్తీర్ణుడైన విశ్వేశ్వర రావూ చేరాడు. కాశీ విధ్వవిద్యాలయం లో బి.ఎ పాసయి ఎమ్.ఎ చదవటానికి ఆంధ్రకు తిరిగి వచ్చిన యజ్ఞేశ్వర శాస్త్రి చేరాడు. తెనాలి హైస్కూలు లో ఉద్యోగం చేస్తూ ఎమ్.ఎ. చదవాలన్న కోరికతో రెండు సంవత్సరాలు సెలవు పెట్టి వచ్చిన మర్కేండేయ శర్మ గారూ చేరారు.
బి.ఎ. పాసయి వచ్చిన వారికీ ఆనర్సు మొదటి సంవత్సరం పాసయి పైకి వచ్చిన వారికీ కలిసే క్లాసులు జరిగేవి. అందరికీ కలిపి ఒక్కటే పరీక్ష. ఆనర్సు లో చేరిన వారందరూ తెలివి గలవారనీ, బి.ఎ. పాసయి వచ్చిన వారందరూ తెలివి తక్కువ వారనీ అనాదిగా ఒక అప ప్రధ ఉన్నది, క్లాసు లో చేరిన కొత్తలో ఆనర్సు విద్యార్ధులందరూ కొత్తగా చేరిన వారి నందరినీ ఆ విధంగానే చూసేవారు. ఆ అపప్రధ ఎలాగైనా పోగొట్టాలని నిశ్చయించుకున్నారు బి.ఎ. పాసయి వచ్చిన విద్యార్ధులు.
రాజశేఖర మూర్తి స్కాలరు షిప్పు కోసం అర్జీ పెట్టాడు. విశ్వేశ్వర రావు కూడా పెట్టాడు. బి.ఎ పరీక్ష లో లభించిన స్థానాలను బట్టి విశ్వేశ్వర రావుకు మొదటి స్కాలరు షిప్పు , రాజశేఖర మూర్తికి రెండవ స్కాలరు షిప్పు ఇచ్చారు. స్కాలరు షిప్పు డబ్బు కాలేజీ జీతాలకే సరిపోతుంది. కొనవలసిన పుస్తకాలన్నీ ఖరీదైనవి. అందులో కొన్ని వెంకటరత్నం గారి దగ్గిర ఉన్నాయి. కొన్ని లేవు. లేనివి లైబ్రరీ నుండి తెచ్చుకుని గడుపు కోవచును లేమ్మననుకున్నాడు రాజశేఖర మూర్తి. ఒక్క పుస్తకం కొనలేదు. యజ్ఞేశ్వర శాస్త్రికి స్నేహం ఎక్కువయింది. వారు ముగ్గురూ ఒకచోట చేరి చదువుకుంటూ ఉండేవారు. ఆవిధంగా స్నేహితుల పుస్తకాలు ఉపయోగించు కోడానికి కొంత అవకాశం లభించింది.
23
శ్రావణ మాసం లో శారద కు పెళ్లి అయింది. వరుడు కామేశ్వరరావు బి.కాం పాసయి ప్రస్తుతం నిరుద్యోగి గా ఉన్నాడు. తండ్రి గారి కరిణీకం ఉన్నది. కాని అతనికి గ్రామం లో ఉండి కరిణీకం చెయ్యడం ఇష్టం లేదు. ఎక్కడైనా గుమస్తా పని దొరుకుతుందే మోనని ప్రయత్నిస్తున్నాడట. పెళ్ళికి వెంకటాచలపతి గారు, రాజశేఖర మూర్తి, వెళ్లి వచ్చారు. ఇందుమతి ఆరోగ్యం సరిగా లేని కారణం వల్ల ఆమెను తీసుకు రాలేదు.
ఇందుమతి వద్ద నుండి వారానికో పది రోజులకో ఒకమారు ఉత్తరం వస్తున్నది. ప్రతి దానిలోనూ మందు పుచ్చుకుంటున్నానని, క్షేమంగా ఉన్నాననీ వ్రాస్తుండేది. మూడు నెలలయింది. మార్పేమైనా ఉన్నదో లేదో తెలియదు. రాజశేఖర మూర్తి దసరా పరీక్షలు అయిన వెంటనే బయలిదేరి ఏలూరు వెళ్ళాడు. దివాకరరావు గారు పవరు పేట స్టేషను కు వచ్చి తోడల్లుడ్ని తీసుకు వెళ్లారు.
ఇందుమతి కొంచెం చిక్కినట్లు అనిపించింది. బావగారు ప్రతి రోజూ కోడి గుడ్డు తినమన్నారట. ఆమె తినలేక పోయిందిట. చాలా విధాల ప్రయత్నించారుట. ఆమె డోకి పోసిందిట. ఒక లాభం లేదని వదిలి పెట్టారట. మందులు మాత్రం పుచ్చు కుంటున్నదిట. దగ్గు లేదు కాని అప్పుడప్పుడు జలుబు, జ్వరము, తలనెప్పి వస్తున్నాయిట.
"ఇక ఏమి కర్తవ్యం?" అన్నాడు రాజశేఖర మూర్తి.
"దగ్గు రావటం లేదు కదా, అది కొంత సుగుణం. ఈ మూడు నెలల్లో మళ్ళీ నెత్తురు కనిపించలేదు. మిగతా పరిస్థితిలో ఎక్కువ మార్పు లేని మాట నిజమే. శరీరం బాగు పడాలంటే మందులకు తోడు, వాటికి తగిన ఆహారం కూడా పడాలి. గుడ్డు తినవమ్మా అంటే తినదు. అందుచేత పూర్తిగా మందుల మీదే ఆధారపడవలసి వస్తున్నది. ఈ మధ్య కొత్త మందులేవో వచ్చాయి. అవి కూడా ప్రయత్నించి చూస్తాను" అన్నారు దివాకరరావు గారు.
"అన్నగారూ, నాకీ విషయాలేమీ బాగా తెలియవు. నోటి మందుల కంటే ఇంజక్షను లైతే బాగా వంట పడతాయేమో."
"అవీ ప్రయత్నిస్తాను."
"మీరేమీ అనుకోకపోతే మందులకు, ఇంజక్షను లకు అయ్యే డబ్బు నేను పంపిస్తాను."
"చాలు, చాలు. నువ్వు సంపాదన పరుడివయిన తరవాత పంపుదువు గాని. ఈ లోపల నీ భార్యకు మందు లిచ్చినంత మాత్రాన నేనేం దివాలా తియ్యనులే."
"మీ సహాయానికి కృతజ్ఞుణ్ణి, అన్నగారూ. ఎలోపతీ మందులన్నీ ఖరీదైనవి. ఉన్నా లేకపోయినా ఈ ఖర్చు భరించ వలసిన బాధ్యత మాది. అవసరమైతే ఉన్న భూమి కాస్తా తెగనమ్మి ఖర్చు పెట్టదలుచుకున్నాం. కనక మందుల వాడకం లో వెనకాడ వద్దని ప్రార్ధన."
"అబ్బెబ్బే! నీవలాంటి అనుమానాలెం పెట్టుకోకు. విధి లేక శానిటోరియమ్ పంపించ వలసి వస్తే అది ఎలాగా తప్పదు. అయినా నువ్వంత భయపడవలాసిన పరిస్థితి కాదు, తమ్ముడూ. నేను ఉన్నానుగా , నువ్వు ధైర్యంగా ఉండు" అన్నారు దివాకరరావు గారు.
మరి నాలుగు రోజులు అక్కడే ఉండి ఇందుమతి కి ధైర్యం చెప్పి పెద్ద పండుగులకు గుంటూరు వెళ్ళాడు రాజశేఖర మూర్తి. పెద్ద పండుగులు మూడు రోజులు తాను కూడా మాణిక్యమ్మ గారి పక్కన కూర్చుని త్రిపుర సుందరీ పూజ చేశాడు. అతని మనస్సులో ఉన్నది ఒక్కటే కోర్కె-- ఇందుమతి కి సంపూర్ణ స్వాస్థ్యం చేకూరాలి.
కాలెజీలు తెరిచారు. చదువులు మళ్ళీ ప్రారంభ మయ్యాయి. సెప్టెంబరు పరీక్షలలో రాజశేఖర మూర్తి ప్రప్రధముడు గా వచ్చాడు. ఆనర్సు వారందరికీ కన్నెర్ర అయింది. విశ్వేశ్వర రావు ముఖం మాడ్చు కున్నాడు. సరస్వతి కి అతడంటే గౌరవం ఎక్కువయింది. మార్కండేయ శర్మ కు, యజ్ఞేశ్వర శాస్త్రి కి తమ స్నేహితుడి మీద ఎనలేని గురి కలిగింది. ఆనాటి నుండీ వారిద్దరికీ అతడు నేత అయినాడు. వారి కిప్పుడు రాజశేఖర మూర్తి చెప్పింది వేదం.
శారదను పెళ్ళిచేసుకున్న ముహూర్తం బలమో ఏమో కాని కామేశ్వరరావు కు ఆంధ్రా బాంకులో ఉద్యోగం అయింది. కార్తీక మాసం లో కార్యం చేసుకుని శారదను తీసుకుని పోయి విజయవాడ లో కాపరం పెట్టాడు. రాజశేఖర మూర్తికి అనిపించింది : 'ఎంత అదృష్ట వంతులా దంపతులు! నిన్నగాక మొన్న పెళ్లి! ఈనాడు కాపరం. తన పెళ్లి అయి రెండున్నర సంవత్సరాలైంది. దాంపత్య సుఖం అన్నది ఎరగను. ఓహో, విధాతా, ఎందుకయ్యా ఇంత పక్షపాతం?" అనుకున్నాడు.
క్రిస్ మస్ సెలవులకు మళ్లీ ఏలూరు వెళ్ళాడు రాజశేఖర మూర్తి . ఇందుమతి ఇంకొంచెం చిక్కినట్లు కనిపించింది. ఇప్పుడు దగ్గు కూడా అప్పుడప్పుడు వస్తున్నదట. మధ్యాహ్నం ప్రతిరోజూ ఒళ్ళు కొంచెం వేడెక్కుతుంది. తలనెప్పి. ఈ మధ్యనే మళ్ళీ ఎక్స్ రే తీసి చూశారట. పరిస్థితి కొంచెం క్షీణించినట్లు ఉన్నది.
"ఇచ్చిన మందులన్నీ ఏమవుతున్నాయో బూడిద లో పోసిన పన్నీరు లాగ. నా చేతి వాసి మంచిది కాదో, లేక ఈ మందులే ఆమె శరీరానికి పడటం లేదో నాకేమీ అర్ధం కావటం లేదు, తమ్ముడూ' అని వాపోయారు దివాకరరావు గారు.
"పోనీ, ఇంకెవరి కైనా చూపించక పోయారా?"
"సివిలు సర్జేనుకు కూడా చూపించాను. అయన సలహా ప్రకారమే మందులు వాడుతున్నాను. శానిటోరియం లో పెడితే మంచిదంటాడాయన. ఈ వ్యాధికి ఆరోగ్యకరమైన గాలి కూడా ముఖ్యం.
"గుంటూరు లో కృష్ణయ్య చౌదరి గారని పేరు పడ్డ డాక్టరు ఉన్నారు. ఇటువంటి వ్యాధులకు విశేషించి వైద్యం చేస్తారట. ఆయనతో సంప్రదించమంటారా?"
"అలాగే కానీ."
"మీరోకమారు గుంటూరు వచ్చి ఆయనతో విపులంగా మాట్లాడితే బాగుంతుందే మో?"
'అలాగే వస్తాను. రేపే వెళదాం, పద."
మరునాడు ఇద్దరూ బయలుదేరి గుంటూరు వెళ్ళారు. ఆ సాయంకాలమే నాలుగు గంటల వేళ దివాకరరావు గారిని చౌదరి గారి ఇంటికి తీసుకుని వెళ్ళాడు రాజశేఖర మూర్తి. వరండా లో సరస్వతి కూర్చుని చదువు కుంటున్నది.
"నమస్కారం, సరస్వతీ దేవి" అన్నాడు రాజశేఖర మూర్తి.
"నమస్కారం . రండి" అని ఇద్దరికీ కుర్చీలు చూపించింది సరస్వతి.
రాజు: వీరు డాక్టరు దివాకరరావు గారు, ఏలూరు, నా తోడల్లుడు. ఈమె సరస్వతీ దేవి , నా సహాధ్యాయిని.
సర: నమస్కారం.
దివా: నమస్కారం.
రాజు: నాన్నగారు ఉన్నారా?
సర: ఉన్నారు. ఏమిటి విశేషం?
రాజు: ఇందుమతి విషయం నాన్నగారితో సంప్రదించాలని.
సర: ఏం? ఆమె ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదా?
రాజు: లేదండి. నాన్నగారు ఇలాంటి విషయాలలో ప్రతిభావంతు లని విన్నాను.
సర: అయ్యయ్యో! నాతో ఇన్నాళ్ళూ చెప్పారు కారెం? బలహీనత అంటే ఏమో అనుకున్నాను.
లోనికి పోయి రెండు నిమిషాలలో కృష్ణయ్య చౌదరి గారిని వెంట బెట్టుకుని వచ్చింది సరస్వతి. పరిచయాలైన మీదట పరిస్థితి విపులంగా చెప్పారు దివాకరరావు గారు. "చూద్దాం . తీసుకు రండి" అన్నారు చౌదరి గారు.
దివాకరరావు గారు, రాజశేఖర మూర్తి మళ్ళీ ఏలూరు పోయి ఇందుమతి ని తీసుకు వచ్చారు. భానుమతీ దేవి కూడా వచ్చింది.
కృష్ణయ్య చౌదరి గారి వైద్యశాల లో దీర్ఘ రోగుల ప్రత్యెక వైద్యం కోసం కొన్ని గదులు, మంచాలు కూడా ఉన్నాయి. అందులో ఒక చిన్న గది ఇందుమతి కోసం కేటాయించి ఇచ్చారు డాక్టరు గారు.
"మూర్తి గారూ, మీరు మా అమ్మాయికి ముఖ్య స్నేహితులు. మీ ఆర్ధిక పరిస్థితి కూడా నాకు తెలుసు. అమ్మాయి చెప్పింది. గదికి అద్దె కింత నేనేమీ పుచ్చుకొను. వైద్యానికి మాత్రం మీకు తోచింది మీరిద్దురు గాని వీలు చూసుకుని."
"కృతజ్ఞుణ్ణి , డాక్టరు గారూ. మందుల వాడకం లో మాత్రం వెనకాడవద్దు. ఉన్నదేదో తెగనమ్మి మీ ఋణం తీర్చు కుంటాము" అన్నాడు రాజశేఖర మూర్తి. అతని కళ్ళలో నీరు తిరిగింది. "సరస్వతీ దేవీ, నీకూ నాకూ ఏమిటి సంబంధం? ఏనాటి దీ ఋణాను బంధం?" అనుకున్నాడు.
ఇందుమతి ని వైద్యశాల లో చేర్చి ఇంటికి వచ్చారు. అక్కడ ఎవ్వరూ తోడూ ఉండడానికి వీలు కాదు. ఆహారం రెండు పూటల ఇంటి నుండి తీసుకుని పోయి, పెట్టాలి. ఒక పూట వెంకటా చలపతి గారు, ఒక పూట రాజశేఖర మూర్తి వంతులు వేసుకున్నారు. రెండు రోజులు ఉండి దివాకరరావు గారూ, భానుమతీ దేవీ ఏలూరు కు ప్రయాణమై నారు. వెళ్ళేటప్పుడు భానుమతీ దేవి వలవలా ఏడ్చింది. దివాకరరావు గారు ఆమెను ఓదార్చలేక సతమత మయ్యారు.
కృష్ణయ్య చౌదరి గారు పెద్ద సహాయమే చేశారు. వైద్యానికి, ఆహారానికి మాత్రం ఖర్చు తక్కువా? ప్రతి రోజూ పాలూ, పళ్ళూ పెట్టాలి. గుడ్లు తినకపోతే పోనిమ్మన్నారు డాక్టరు గారు. డానికి బదులు గా కూడా మాత్రలే వాడాలి. మందులు, ఇంజక్షను లు అన్నీ ఖరీదైనవి. వెంకటా చలపతి గారి ఆదాయం లో ఇంత ఖర్చు సాధ్యం కాదు. తాను కూడా చదువు మాని ఏదైనా ఉద్యోగం చూసుకుంటే బాగుంటుందేమో ననుకున్నాడు రాజశేఖర మూర్తి.
"వద్దు, నాయనా, "నువ్వు చదువు మానుకోవద్దు. మీ తాతగారి భూమి మీద ఆదాయం అంతంత గానే ఉన్నది. అక్కడ దాని ఆజా పజా కనుక్కునే దిక్కు లేదు. ఇప్పుడు భూమికి ధరలు బాగా పెరిగాయట.అది కాస్తా అమ్మేసి ప్రస్తుతానికి గడుపు కుందాం. మధ్యలో చదువు ఆపి ఏ చిన్న ఉద్యోగమో చూసుకునే కంటే ఉన్నది అమ్ముకునో, అవసరమైతే అప్పులు చేసుకునో ప్రస్తుతానికి గడుపుకోటం మంచిది. కష్టాలు కలకాలం ఉండవు. ఈ విపత్తు గడిచి బయట పడితే తరవాత నీకు తగిన ఉద్యోగం దొరక్క పోదు. ఆ తరవాత అప్పులు తీర్చుకోలేకనూ పోవు" అన్నది మాణిక్యమ్మ గారు.
ఆమె వాదన బాగున్నట్టే తోచింది. వెంకటాచలపతి గారు వెంటనే గోవాడ వెళ్లి అక్కడ మాణిక్యమ్మ గారి పేర ఉన్న పది ఎకరాల భూమిబేరం పెట్టారు. కొనబోతే కొరివి, అమ్మబోతే అడివి అంటారు. ఇన్నాళ్ళూ ఆ భూమి మీద వచ్చే ఫలసాయాన్ని పోసుకు తింటున్న జ్ఞాతులు సరి అయిన బేరం రానిచ్చారు కారు. వచ్చినంతే చాలునని చివరికి తెగ తెంపులు చేసుకుని బయట బడ్డారు వెంకటా చలపతి గారు. పది ఎకరాల భూమికి రెండు వేల రూపాయలు మాత్రం వచ్చాయి. అది తీసుకుని వచ్చి బాంకు లో వేశారు.
ఇందుమతి ని ఆసుపత్రి లో చేర్చిన వార్త తెలిసి అనంత వరం నుంచి అనంత కృష్ణ శర్మ గారు అన్నపూర్ణమ్మ గారు గుంటూరు వచ్చి చూసి వెళ్ళారు. బందరు నుండి కేశవరావు గారు, విజయవాడ నుండి నారాయణ రావు గారు వచ్చి వెళ్ళారు. వీరన్న పేట నుండి సుబ్బారావు గారు, సుభద్రమ్మ గారు వచ్చి వెళ్ళారు. ఎవరు వచ్చి మాత్రం చేసేదేమీ ఉన్నది?
ఈ వాతావరణం లో రాజశేఖర మూర్తి చదువు మీద మనస్సు కేంద్రీకరించలేకపోతున్నాడు. సంవత్సరాంతంలో ఏడాది పరీక్ష లయ్యాయి. వేసవి సెలవులిచ్చారు.
ఇందుమతి ని కృష్ణయ్య చౌదరి గారి వైద్యశాల లో చేర్చి మూడు నెలలైంది. ఇప్పుడు దగ్గు కొంచెం వెనక పట్టినట్టు ఉన్నది. కాని, మిగతా లక్షణా లలాగే ఉన్నాయి. గుంటూరు లో వేసవి విపరీతం. ఈ ఎండగాడ్పు లలో దీర్ఘ రోగులకు మందు వంట పట్టటం కష్టం. కనక ఈ వేసవి మూడు నెలలు ఏదైనా కొంచెం చల్లని ప్రదేశానికి తీసుకుని పోయి వానలు తోలకరించిన తరవాత మళ్ళీ తీసుకుని రమ్మని చెప్పారు డాక్టరు గారు. ఈలోపుగా తానిచ్చిన మందులు మాత్రం శ్రద్దగా వాడి, మంచి ఆహారం పెట్టమన్నారు.
ఆంధ్రదేశం లో చల్లని ప్రదేశం ఎక్కడ? ఉదక మండలం వంటి ప్రదేశాలకు తీసుకుని పోవటం సామాన్యులకు సాధ్యం కాదు కదా? పల్లెటూళ్ళ లో కొంచెం చెట్లూ, చేమలూ చెరువులూ ఉంటాయి కనక అక్కడ పట్టణాలలో కంటే కొంచెం మెరుగు. గుంటూరు కంటే అనంతవరం చల్లనే. కనక ఈ మూడు నెలలూ అక్కడే ఉంచటం మంచిదని నిశ్చయించి అనంత కృష్ణ శర్మ గారికి ఉత్తరం వ్రాశారు వెంకటా చలపతి గారు . అయన వచ్చి ఇందుమతి ని అనంతవరం తీసుకు వెళ్ళారు. వెళ్ళేటప్పుడు కావలసిన మందులూ, మాకులూ ఇచ్చి పంపాడు రాజశేఖర మూర్తి.
