Previous Page Next Page 
ఇందుమతి పేజి 22


    "మీ హృదయమే ఒక అమృత భాండం. ఆ అమృతం నాకూ కొంచెం పంచి పెట్టరాదూ?"
    "నాలో నీది కాని దేమున్నది, ఇందూ?"
    మూడో నాటి సాయంకాలానికి దివాకరరావు గారు, భానుమతీ దేవి వచ్చారు. దివాకరరావు గారు ఇందుమతి ని పరీక్షించి, "మరేం భయం లేదని, దగ్గు ఎక్కువగా వస్తే గొంతు జీరపోయి నెత్తురు వచ్చి ఉండవచ్చు. ఎక్స్ రే తీసి చూస్తె ఎందుకైనా మంచిది. రేపే బయలుదేరి ఏలూరు వెళదాం. ఏమంటారు, మామగారూ?" అన్నారు.
    'అట్లాగే, నాయనా. మేము వచ్చి చేసేదేముంది కనక? చిన్నప్పటి నుంచీ నీ దగ్గిర పెరిగిన పిల్లే కదా? రాజశేఖర మూర్తి ని కూడా తీసుకు వెళ్ళు. పెద్దమ్మడు ఉండనే ఉంది కదా చెల్లెలి సపర్యలకు! తగిన మందులిచ్చి బాగు చేసి పంపు. ఇంటి డాక్టరు వు నువ్వుండగా నేను వేరే బాధపడవలసిన అవసరం ఏముంది? ఏమంటారు , బావగారూ?' అన్నారు వెంకటా చలపతి గారిని ఉద్దేశించి, అనంత కృష్ణ శర్మ గారు.
    'అట్లాగే కానివ్వండి. నాయనా, రాజు, నువ్వు కూడా వెళ్లి రా. మేము ఇటు నుంచి ఇంటికి వెళతాం. దివాకరరావు గారూ! కోడలి ఆరోగ్య బాధ్యత మీది" అన్నారు వెంకటా చలపతి గారు.
    నాటితో లెక్కకు మూడు రాత్రులు పూర్తీ అయ్యాయి. సాంఘిక మర్యాదల ప్రకారం ఇందుమతీ రాజశేఖరుల పునస్సందానం అయినట్లే. మరునాడు భోజనాలు అయిన తరవాత బయలుదేరి ఎవరి దారిని వారు వెళ్ళారు.
    మరునాడు దివాకరరావు గారు ఇందుమతి ని ఏలూరులో ఆసుపత్రి కి తీసుకు పోయి ఎక్స్ రే తీయించారు. నెత్తురు పరీక్ష చేయించారు. ఉమ్మి పరీక్ష చేయించారు. ఫలితాలు తెలిశాయి. ఎడమ వేపు శ్వాస కోశం కొంచెం చెడిందని నిపుణులు తేల్చారు. వ్యాధి ప్రారంభ దశ లో ఉన్నది కనక ఎక్కువ భయపడవలసిన అవసరం లేదనీ, తగిన మందులు వాడితే బాగు పడవచ్చు ననీ దివాకరరావు గారు రాజశేఖర మూర్తి ని ఆసుపత్రికి తీసుకుని పోయి నెమ్మదిగా చెప్పారు.
    క్షయ వ్యాధి అన్నంత లోనే ఎవరికైనా గుండెలు గుభేలు మంటాయి. రాజశేఖర మూర్తి ఆ వార్త విని ఉన్నవాడు ఉన్నట్లు కుంగి పోయాడు. ఆతనికి ఈ వ్యాధుల సంగతి తెలియదు. అతడేమో , అతని చదువేమో? తన తండ్రికి అంతకన్న తెలియదు. ఇక కర్తవ్య మేమిటని దివాకరరావు గారినే ప్రశ్నించాడు.
    "క్షయ అన్నది అంటువ్యాధి. తెలిసిన తరవాత మనం సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండటం మంచిది. వ్యాధి పూర్తిగా నిర్మూలమయ్యే వరకూ ఆమెతో దాంపత్య జీవితం ప్రారంభించటం ఆమెకూ, నీకూ కూడా మంచిది కాదు. అందుచేత ఇప్పుడామె ను కాపరానికి తీసుకు వెళ్ళే ఉద్దేశం మానుకోవటం మంచిది.
    "ఇక వ్యాధి నిర్మూలనానికి మదనపల్లి గాని, రాజమండ్రి గాని తీసుకువెళ్లి అక్కడ శానిటోరియం లో కొంతకాలం ఉంచటం ఉత్తమం. కాని, అది వ్యయ ప్రయాసలతో కూడిన పని. వ్యాధి ఇంకా ప్రారంభ దశలోనే ఉంది కనక ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంచి తగిన వైద్యం చేయించ వచ్చు. అనంతవరం లో ఇది కుదరదు. వీలైతే గుంటూరు లో తగిన వైద్యుడి చేత చేయించవచ్చు. లేకపోతె ఇక్కడే ఉంచితే నా శాయశక్తుల నే చేస్తాను. నీకు వీలైనప్పుడల్లా వచ్చి చూసి వెళుతూండవచ్చు" అని విపులంగా చెప్పారు దివాకరరావుగారు.
    "మీరెలా బాగుటుందంటే అలాగే చేద్దాం, అన్నగారూ. గుంటూరు తీసుకు వెళ్లి తెలిసీ తెలియని వైద్యాలు చేయించే కంటే, తెలిసిన వారు మీ దగ్గిరే ఉంచటం మంచిదని నా అభిప్రాయం. ఈ బాధ్యత మీ మీద పెట్టవలసి వచ్చినందుకు సిగ్గు పడుతున్నాను."
`    "అబ్బెబ్బే, అటువంటిదెం మనస్సులో పెట్టుకోకు. ఇందుమతి నాకు పెంపుడు కూతురు లాంటిది. ఆమెకు ఆరోగ్యం చేకూర్చటం నీకెంత ముఖ్యమో నాకూ అంతే ముఖ్యం. ఆమె నిక్కడే  ఉండనీ. నేను మామగారికి వ్రాస్తాను. ఆమెతో మాత్రం ఇవన్నీ చెప్పకు. నీకు యదార్ధ పరిస్థితి తెలియచెయ్యటం అవసరమని ఇంత విపులంగా చెప్పాను."
    రాజశేఖర మూర్తి వెంటనే ఇంటికి పోయి, లేని ధైర్యం తెచ్చి పెట్టుకుని ఇందుమతి తో, "ఇందూ జబ్బేమీ లేదట. మళ్ళీ బలహీనత ప్రవేశించి నట్లున్నది. ఒక మూడు నెలలు ఇక్కడే ఉండి శ్రద్దగా మందులు పుచ్చుకుంటే మంచిది. నీ ఆరోగ్యం బాగుపడగానే వచ్చి గుంటూరు తీసుకు వెళతాను. ఇప్పుడిక అనంతవరం వెళ్ళకు" అని చెప్పాడు.
    "ఎప్పుడూ ఉండే బలహీనత కు ఎన్నాళ్ళ ని మందులు పుచ్చుకుంటాం?"    
    "అవసరమైతే ఎన్నాళ్ళైనా పుచ్చు కోవాలసిందే. ఒక్కొక్కళ్ళ శరీర తత్త్వం అలాంటిది. ఏం చేస్తాం?"
    "మీ ఇష్టం" అన్నది ఇందుమతి అయిష్టం గానే.
    మరి రెండు రోజులు అక్కడే ఉండి గుంటూరు ప్రయాణమై నాడు రాజశేఖర మూర్తి. బయలుదేరేటప్పుడు ఆతని కన్నులలో నీరాగలేదు. ఇందుమతి ని తన హృదయానికి హత్తుకుని, "ఇందూ, ఉత్తరాలు వ్రాస్తూ ఉండు. వారాని కొకసారైనా నీ ఆరోగ్య పరిస్థితి తెలిస్తే కాని నాకు తోచదు. కాలేజీలు తెరిచిన వెంటనే ఎమ్.ఎ లో చేరదామనుకుంటున్నాను. అందుచేత మాటిమాటికీ రావటానికి వీలుపడదు. దసరా సెలవులకు తప్పకుండా వచ్చి చూస్తాను. అప్పటికి నీ ఆరోగ్యం పూర్తిగా కోలుకోవాలని నా ప్రార్ధన" అని వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళిపోయాడు.
    దారిలో విజయవాడ లో నారాయణరావు గారిని చూసి, పరిస్థితులు వివరించి గుంటూరు చేరేసరికి అక్కడ వెంకటా చలపతి గారు, మాణిక్యమ్మ గారు ఆందోళన మనస్కులై ఉన్నారు. వేంకటాచలపతి గారు తన వైవాహిక జీవితంలో వరసగా రెండు సారులు విధి వంచితులయినారు. తన కుమారుడి వైవాహిక జీవితం లో కూడా అడుగు లోనే హంస పాదన్నట్లు ఇంటువంటి విఘాతం జరగటంతో అయన మనస్సు వికలమాయి పోయింది. ఇక మాణిక్యమ్మ గారు సంగతి చెప్పనే అక్కరలేదు. రాజశేఖర మూర్తి ని చూసి, "నాయనా, ఏమైందిరా?' అని బావురుమన్నది. రాజశేఖర మూర్తి నెమ్మదిగా సర్ది చెప్ప చూశాడు. కాని, మాణిక్యమ్మ గారు ఆవులిస్తే పేగులు లెక్కపెట్టే తెలివితేటలూ కలది.
    "అవసరమైతే ఉన్న ఆ కాస్త భూమి తెగ నమ్ముకుని అయినా పిల్లను బాగు చేయించు కుందాం. సరి అయిన మందులూ, ఇంజక్షన్లూ వాడమని దివాకరరావు గారికి వ్రాయి, నాయనా" అన్నది.

                                  22
    బి.ఎ. పరీక్ష ఫలితాలు వచ్చాయి. రాజశేఖర మూర్తి మొదటి తరగతి లో కృతార్ధుడై నాడు. గణిత శాస్త్రం లో విశ్వవిద్యాలయం మొత్తం మీద అతనికి రెండో స్థానం లభించింది. సరస్వతి కూడా మొదటి తరగతి లో కృతార్ధు రాలైంది. అమెది మూడో స్థానం. మొదటి స్థానం విజయనగర వాస్తవ్యుడు విశ్వేశ్వరరావు అనే విద్యార్ధికి వచ్చింది. 'ఈ శుభ సమయం లో తన సంతోషం పంచు కోడానికి ఇందుమతి ఇక్కడ లేకపోయిందే' అని వాపోయాడు రాజశేఖర మూర్తి. ఆమె ఆరోగ్యాన్ని గురించిన దిగులు అతని గుండెలో గుండ్రాయి లా ఉండిపోయింది. తన జీవితం ఎల్లప్పుడూ ఒకే రీతిగా శుభా శుభ మిశ్రమంగా ఉన్నది. ఇది తన జాతక రీతి కాబోలు అనుకున్నాడు. వెంటనే ఇందుమతి కి ఉత్తరం వ్రాశాడు.
    "ప్రియతమా, ఇందూ!
    నీకొక సంతోష వార్త. బి.ఎ. పరీక్షా ఫలితాలు వచ్చాయని నీకు తెలిసే ఉంటుంది. నీ ప్రేమస్పదుడు విశ్వవిద్యాలయం మొత్తం మీద రెండో వాడుగా కృతార్ధుడైనాడు. 'ఈ సంతోష సమయంలో తియ్యని బహుమతు లివ్వటానికి నీ విక్కడ లేకపోయావే" అని వాపోతున్నాడు. అయితే అతని లలాట లిఖితం అంతే కాబోలు. అంతకన్న ముఖ్యమైన సంతోష సమయాల లోనే తప్పించు కున్నావు.
    నీ ఆరోగ్యం సరిగా ఉన్నదను కుంటాను. గుంటూరు వచ్చిన నాటి నుంచీ నీ జాబు కోసం ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాశాయి. ఇన్నాళ్ళూ సిగ్గేమో అని ఊరుకున్నాను. ఈ ఉత్తరానికి జవాబు రాకపోతే ఇక ఊరుకోను.    
    నీ ఆరోగ్యం కోసం తపస్సు చేస్తున్న--

                                                                                           నీ
                                                                                         రాజు."
    సహాధ్యాయిని సరస్వతి ని కలుసుకుని ఆమెకు అభినందనాలు తెలపా లనిపించింది. ఆనాటి సాయంకాలం నాలుగు గంటలవేళ బయలుదేరి ఆమె ఇంటికి వెళ్ళాడు. ఆమె ఇంటికి వెళ్ళడానికి ఇదే మొదటిసారి. ఆమె కమ్మవారి బిడ్డ. ఆమె తండ్రి కృష్ణయ్య చౌదరి గారు ఒక పేరు పడ్డ డాక్టరు. ఆయనకు గుంటూరు జిల్లాలో వంద ఎకరాల భూమి ఉన్నది. అయన కాంగ్రేసు వాది. రాజకీయాలలో తిరిగి కొంత ఆస్తి పోగొట్టుకున్నారు. గుంటూరు లో వారికొక పెద్ద ఇల్లు ఉన్నది. అక్కడే అయన వైద్యశాల నడుపుతున్నారు. బీదసాదల ఎడల అయన దయతో ప్రవర్తిస్తారు. ధనవంతుల నుండి ఎక్కువగా పుచ్చుకుంటారు. అయన దానశీలి అని ప్రఖ్యాతి. సరస్వతి అయన ఏకైక పుత్రిక. రాజశేఖర మూర్తి ఆ ఇంటిలో అడుగు పెట్టేసరికి కృష్ణయ్య చౌదరి గారు ముందు వరండా లో పడక కుర్చీలో కూర్చుని దినపత్రిక చదువు తున్నారు.
    రాజశేఖర మూర్తి వినయపూర్వకంగా, 'నమస్కార మండీ" అన్నాడు.
    ఆయన కళ్ళజోడు పైకి తొలగించి, "ఎవరండీ మీరు?" అన్నారు.
    "నా పేరు రాజశేఖర మూర్తి . సరస్వతి దేవి నా సహాధ్యాయిని."
    "రండి, రండి. మీరేనా రాజశేఖర మూర్తి ? అమ్మాయి మిమ్మల్ని గురించి గొప్పగా చెబుతూ ఉంటుంది లెండి."
    "సరస్వతీ గారు ఉన్నారండి?"
    "ఆ, ఆ, వస్తుంది. కూర్చోండి" అని లోపలికి పోయి సరస్వతి ని తోడ బెట్టుకుని వచ్చారు డాక్టరు గారు. సరస్వతి రాజశేఖర మూర్తి కి నమస్కారం చేసింది. అతడు నమస్కారం చేసి, "కంగ్రాచ్యులేషన్స్, సరస్వతీ దేవి. మీరు మొదటి తరగతి లో పాసవుతారని ఎప్పుడూ అనుకుంటూన్నదే . అయినా సంతోషం పట్టలేక నా అభినందనలు స్వయంగా తెలుపుకుందామని ఇలా వచ్చేశాను" అన్నాడు.
    "థాంక్స్ మూర్తి గారు. మొదట నేనూ మీకు అభినందనాలు తెలప వలిసింది. మీరు నాకన్న ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారు. యూనివర్సిటీ మొత్తం మీద రెండవ స్థానం తెచ్చుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఉదయమే మా నాన్నతో కూడా అన్నాను." అన్నది సరస్వతి.
    'అవునవును. అయన కేవరికో రెండవ స్థానం వస్తే నీకెందుకే అంత సంతోషం? అన్నాను. 'మా ఇద్దరిలో ఎవరికి వచ్చినా, ఒకటే నాన్నా!' అన్నది పిచ్చి పిల్ల" అన్నారు కృష్ణయ్య చౌదరి గారు.
    "ఈ స్థానాల కేమి లెండి. నాలుగైదు మార్కులు అటూ ఇటూ గా ఒక మాటు నా కెక్కువ వస్తే , ఒకమాటు ఆవిడికి ఎక్కువగా వస్తాయి. ఇంటరు  పరీక్ష లో నాకన్న ఆవిడకే ఎక్కువ వచ్చాయి. అవిడికీ నాకూ ఒకరి మీద ఒకరికి గౌరవమే కాని అసూయ లేదు" అన్నాడు రాజశేఖర మూర్తి.
    "అట్లాగే ఉండాలి లెండి. మీ ఇద్దర్నీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది" అన్నారు చౌదరి గారు.
    "ముందు కర్తవ్యమ్ ఏ మాలోచించారు?" అన్నది సరస్వతి.
    "ఏముందండీ? యూనివర్శీటీ మన కాళ్ళ దగ్గిరికే వచ్చింది కదా. ఒక పట్టు పట్టకుండా వదిలి పెడతామా? ఎమ్.ఎ అనిపించుకోవాలనే నా ఉద్దేశం. మీరేం చెయ్య బోతున్నారు?"
    "నాకూ చదవాలనే ఉంది, మూర్తి గారూ. మా నాన్నగారు మాత్రం ఏమిటేమిటో అంటారు. అయన ఉద్దేశాలు వేరు" అని గునిసింది సరస్వతి.
    "ఏముంది, మూర్తి గారూ? ఆడపిల్లలకు ఎంత చదివినా చివరికి పెళ్లి చేసుకుని బిడ్డలను కనటం తప్పదు కదా ? మరి వయస్సు మీరకుండా అమ్మాయికి వివాహం చెయ్యాలని నా ఉద్దేశం" అన్నారు చౌదరి గారు.
    రాజశేఖర మూర్తి కొంచెం సిగ్గు పడ్డాడు. రెండు సంవత్సరాల క్రితమే పెళ్లి చేసుకుని కూర్చున్న తనకు ఆడపిల్ల సరస్వతి కి పెళ్లి చెయ్యకుండా చదివించమని సలహా చెప్పగల అర్హత లేదు. అదే అన్నాడు. "కాని, డాక్టరు గారూ, సరస్వతీ దేవి మేధావి ని. ఆమె విద్యాభివృద్ది కి అడ్డంకులు పెడితే గణిత శాస్త్రాభివ్రుద్దికి లోటు చేసిన వారవుతారు. మగవాళ్ళు బాల్య వివాహాలు చేసుకున్నా పైకి చదువు కొదలుచుకున్నవాళ్ళు చదువు కుంటూనే ఉన్నారు. వివాహం విద్యా నాశనానికే అన్న అప ప్రధ అన్ని చోట్లా వర్తించదు. పెళ్లి చేసుకుని పై చదువులకు పోయే ఆడవాళ్ళు చాలా తక్కువ. సరస్వతీ దేవి వివాహం చేసుకో దలుచు కుంటే మా అందరికీ సంతోషమే. కాని ఆమె పైకి చదువు కుంటా నంటే అడ్డు పెట్టటం భావ్యం కాదనే నా మనవి."
    "బాగా చెప్పారు, కాని, మూర్తి గారు , పెళ్ళంటూ చేసిన తరవాత ఒక మన మాటేం చెల్లుతుంది? మనకు చదివించాలని ఉన్నా ఆ భర్త కాదు, కూడదు అనవచ్చు. అయన ఒప్పుకున్నా ఈవిడకే ఇబ్బందిగా ఉండవచ్చు."అన్నారు చౌదరి గారు.
    'అందుకే ఇప్పుడటువంటి వెం పెట్టుకోవద్దని చెపుతున్నది" అన్నది సరస్వతి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS