Previous Page Next Page 
నీళ్ళు రాని కళ్ళు పేజి 22


                                         13
    మరో  ఆరు మాసాలు విచారణ జరిగింది స్నేహితుల వద్ద, బావ వద్ద దాదాపుగా వెయ్యి రూపాయలు అప్పు చేశారు. కేసు నుంచి బయట పడంగానే తీరుస్తానని అందరికీ వాగ్దానాలు చేశారు. లంచం పుచ్చుకున్నట్లు నేరం రుజువైందని కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ చర్యగా వారిని ఉద్యోగం నుండి బర్తరఫ్ చేశారు.
    నా ఆశా సౌధాలు అన్నీ కూలిపోయాయి. కలెక్టరు ఆఫీసులో ఉద్యోగం చేసి లంచాలు పుచ్చుకుని డిస్మిస్ అయిన శ్రావణ కుమార్ భార్యగా నేను చాలా మందికి తెలిసిపోయాను.
    ఉద్యోగి సమస్యలు వేరు, ఆ సమస్య లకు సానుభూతి ఉంటుంది. నిరుద్యోగి సమస్యలు నైరాస్యంతో కూడినటువంటివి. వాటికి సానుభూతి చాలా తక్కువ. సమస్యల పరిష్కారానికి తోడ్పడే కన్న అట్లా బాధపడక పొతే ఎక్కడయినా ఉద్యోగం చేయ్యరాదా అని కొంచెం తేలిక భావంతో మాట్లాడుతారు. ఉద్యోగం చేసుకుంటూ పదిమందిలో పేరు తెచ్చుకుంటూ గౌరవ ప్రదంగా జీవిస్తున్నాడని అందరూ అనుకున్న ఒక ఉద్యోగి బర్తరఫ్ అయ్యాడని తెలియగానే ఆ వ్యక్తీ యందు ఇదివరకు ఉన్న మంచి అభిప్రాయాలన్నీ మంచులా కరిగి మట్టిలో ఇంకిపోతాయి.
    ఈ పరిస్థితిలో వారు ప్రాణ త్యాగమైనా చేసుకుంతారేమోనని తల్లడిల్లిపోయాను. కాకినాడ వెళ్ళి వారిని తీసుకు వస్తానంటే రాధ వద్దన్నది. ఆఫీసులో అందరూ నన్ను కాకినాడ వెళ్ళమని ప్రోత్సహించారు. అతను అవమానంతో క్రుంగి పోయి ఉంటాడనీ, ఈ పరిస్థితిలో ఉదాసీనంగా ఉండటం మంచిది. కాదనీ నన్ను హెచ్చరించారు. నిరుద్యోగి అయినా ఉద్యోగం చేస్తున్నా డిస్మిసయినా మనస్తత్వం మారుతుంది గాని పవిత్ర బంధం మారిపోదు. భార్యాభర్తల మధ్య అనురాగం తప్పుకున్నా ఆత్మీయత కరువైనా బాంధవ్యం సమసిపోదు.
    ఎన్నో అలోచించి మధనపడి కాకినాడ వెళ్ళెను. వారు అక్కడ ఉంటున్నది తెలీక బస్సు దిగం గానే బావ ఇంటికి వెళ్లాను. బావ ఉన్నాడు. కుశల ప్రశ్నలయాక అన్నాడు.
    "కుమార్ ని గురించి చాలా దారుణం గానే చెప్పుకుంటున్నారు సుభాషిణి. కనబడ్డ చోటల్లా అప్పు చేశాడు. నాకూ మూడొందలు యివ్వాలి. నా డబ్బు ఇవ్వలేదని చెప్పటం కాదు. ఇక ఈ జీవితంలో కుమార్ బాగుపడడు. సరే అతని గదికి వెళదాం పద."
    ఇద్దరం బయల్దేరి వారున్న గదికి వెళ్ళాం. మేం వెళ్ళే సరికి మడత మంచం మీద పడుకుని సిగరెట్ కాలుస్తూ ఏమిటో ఆలోచిస్తున్నారు. మమ్మల్ని చూడం గానే లేచి కూర్చుని --
    "రా సుభా. ఎప్పుడొచ్చావ్ " అన్నారు. చెప్పాను. "అంతా విన్నాను. జరిగిందేదో జరిగిపోయింది. అదంతా ఒక పీడకలగా భావించి మర్చిపోండి. మనింటికి వెళ్లి పోదాం రండి" అన్నాను.
    నిర్లిప్తతగా నిట్టూర్చి గోళ్ళు కొరుక్కుంటూ కూర్చున్నారు.

 

                                     


    "నేను వెళ్లొస్తాను కుమార్. వస్తానమ్మా సుభా. ఆఫీసు కు టైమైంది" అని బావ వెళ్ళిపోయాడు. "నీకూ ఆఫీసుకు టైమయిందేమో వెళ్ళు సుభా, నాకు ఆఫీసు శని వదిలిపోయింది. ఆఫీసు ఉద్యోగం అంతా నమ్మక ద్రోహులు, స్కౌండ్రల్స్" అన్నారు.
    జరిగిపోయిన హోదాకూ సౌకర్యాలకూ ఈ జీవితం సమాధి లాంటిది , ఆ జ్ఞాపకాలు, అనుభూతి ఈ పరిస్థితిలో కాలి పోయిన కాగితాల నుసిలా మాడిపోయాయి. విరిగిన పాలను తోడూ వేసినా విరిగిన మనస్సును అతకటానికి ప్రయత్నించి కృతకృత్యులైనా అనుభవ యోగ్యం కావేమో!
    "జీవితంలో అన్నీ అనుభవించి ఈ స్థితికి వచ్చిన మిమ్మల్ని చూసి నేను చాలా బాధపడుతున్నాను. మీ ప్రేమనూ అనురాగాన్నీ అనుభవించని నేను మిమ్మల్ని అర్ధించి అడుగుతున్నాను. మీరు వచ్చేసేయ్యండి మనింటికి వెళ్ళిపోదాం."
    "నన్ను కూడా నీ పోషణ లోకి రమ్మన్నావా సుభా."
    "నేను మిమ్మల్ని పోషిస్తాననే ఓదార్పు మాటతో అడగటం లేదు. వీడిపోయిన మన కాపురం తిరిగి ఒకటి కావాలనే నా ఆకాంక్ష . మీ గతాన్నీ మీరు విస్మరించలేకపోయినా నేను మర్చి పోతాను. జీవితంలో నూత నాద్యాయాన్ని సృష్టించు కుందాం. అదే నా కోరిక."
    "వద్దు సుభా వద్దు, నీ అనురాగాన్నీ నీ ఆదరాన్నీ అనుభవించే యోగ్యత నాకు లేదు. అందుకు అనువైన అన్ని అవకాశాల్ని నేను ఎప్పుడో జారవిడుచుకున్నాను. నేను వచ్చి ఉన్నందువల్ల పాత మనస్తాపాలకు కొత్తవి చేర్చినట్లే అవుతుంది గాని ఆ మండు తెర విడిపోదు. నేను నిన్నోక్కదాన్నే మోసం చేశాను. సుభా, కాని ఈ సంఘం లోని మనుష్యులు నన్ను పూర్తిగా మోసం చేశారు. నువ్వు నా మీద కక్ష తీర్చుకుంటే నేనీ స్థితికి వచ్చేవాడి నే కాదేమో , నీ మంచితనం నన్ను భ్రష్టుడ్నీ చేసింది."
    ఆ ముఖంలో అనేక భావాలు చూశాను. "మీ బాధ నాకు తెల్సు. గతాన్ని తవ్వుకోవద్దు అన్నీ మర్చిపోండి. ప్రాధేయ పూర్వకంగా అడిగాను.
    "గతాన్ని మనం మర్చి పోటానికి  ప్రయత్నించినా ఈ సంఘం లోని పెద్ద మనుష్యులు మనముందే ఆ గతాన్ని తవ్వి కుప్పగా పోస్తారు. ఆ విధంగా మనదారికి అవరోధం కలిగిస్తారు. తవ్వి పోసిన అ కుప్పను చూస్తూ మనం ముందుకు సాగిపోలెం ' అన్నాడు.
    వారి అభిప్రాయం ఏమిటో చెప్పలేదు. మాట్లాడకుండా కూర్చున్నాను. అయిదు నిమిషాలు గడిచాక "వీలు చూసుకుని వస్తాను సుభా నువ్వు వెళ్ళు, ఎట్లాగూ మనింటికి రాక తప్పదు. ఆ వచ్చేది ఎప్పుడో చెప్పలేను."
    "ఏదైనా ప్రయివేటు కంపెనీ లో ఉద్యోగం దొరకదంటారా. నా మాట వినండి. మీకు ఉద్యోగం దొరక్క పోదు."
    "వుద్యోగం . ఈ కేసు నామీద ఎవరు ఎట్లా మోపారో నాకు తెల్సు సుభా. వాళ్ళ పని పట్టటమే నా ఉద్యోగం" కసిగా  అన్నాడు.
    "కార్పణ్యం మనిషి లోని మానవత్వాన్ని చంపుతుంది. మానవత్వం లేని మనిషి తండ్రి అయినా, భర్త అయినా ఎవరయినా వారు రాక్షసులే కాని మనుష్యులు కారు. వాళ్ళు త్రాచు పాములను మించిన విషం కలవారు, అలాంటి జీవితాన్ని మీరు కోరుకోవద్దు స్వామీ కోరుకోవద్దు. నేను భరించలేను." వారి పాదాల మీద తలవాల్చి బ్రతిమాలాను. వారి మనస్సు మారలేదు.
    "సుభా, నువ్వు ఏడ్చి బాధ పడినందువల్ల ప్రయోజనం లేదు. వెళ్ళిరా, ఒక్క మాట. నేను ఎప్పుడు వచ్చినా నువ్వు హర్షించి నాకు నీ నీడను ప్రసాదిస్తావు కదూ?"
    నావేపు తిరిగి చూడలేక కళ్ళు మూసుకుని తలవంచుకున్నారు.
    "నా మనస్సు, నా హృదయమూ మీరు ఏ పరిస్థితిలో ఉన్నా మిమ్మల్నే కోరుకుంటాయి." అశ్రునయనాలతో అన్నాను.
    "చివరకు మిగిలేది నీ ప్రేమానురాగాలు ఒక్కటే. కాని ఈ జీవితంలో అలాంటి గౌరవాన్నయినా నిలుపుకోగల ననే నమ్మకం నాకు లేదు సుభా. కాని ప్రయత్నిస్తాను. ఇక నువ్వు వెళ్లిరా" బరువుగా నిట్టుర్చారు.
    వారి మనస్సులో అగ్ని గుండం ప్రజ్వరిల్లుతూ మండుతున్నది. ఎవరి మీదనో కక్ష. కార్పణ్యం ఆ అగ్నికి అజ్యమే అయాయి. అందుకు తగిన పట్టుదలను సమిధలుగా ఒక పక్క కుప్ప పోశారు. ఆ అగ్ని గుండాన్ని చూస్తూ నిల్చోడమే గాని దానిని ఆర్పగల సామర్ధ్యం నాకు లేదు.
    ఆరోజునే నేనూ తిరిగి రాజమండ్రి వచ్చేశాను.
    ఒక నెల గడిచింది. ఆరోజు పది గంటలకు నేను ఆఫీసుకు వెళ్ళబోతుంటే వారొచ్చారు. మనిషి కాస్త తగ్గారు. ఆ ముఖంలో ఏదో ఒక దృడ సంకల్పం వున్నట్లుగా బాగా కనబడింది. చిన్నవాడు నా చెంగు పుచ్చుకుని "అమ్మా, బూచాబ్బాయ్" అని నా వెనక చేరాడు. పెద్దవాడు 'అమ్మా నన్నేనా" అన్నాడు. 'అవును బాబూ నాన్నగారే. అప్పుడే మార్చి పోయావురా" అన్నాను. కాకినాడ , రాజమండ్రి ల మధ్య ఆ తండ్రి ఈ పిల్లలకు కనిపించి సంవత్సరం దాటింది.
    "నువ్వు ఆఫీసుకు వెళ్ళు సుభా. ఇంక ఎక్కడికి వెళ్ళను. టైమైంది వెళ్ళిరా."  అన్నారు. నేను వెళ్ళిపోయాను. ఇంటికి వచ్చాక తెల్సింది చిన్నవాడు వారెంత సేపు పిల్చినా వెళ్ళలేదు. పెద్దవాడు మాత్రం వారి దగ్గరకు వెళ్ళాడు అని.
    దేవుడి లేని నా గుడికి నా దేవుడుతిరిగి వచ్చాడు. వారు వచ్చినప్పట్నుంచీ అక్కయ్య వంటింట్లో నే ఉంటున్నది. వీలయినంత వరకూ వారికి కనబడ కుండానే తప్పుకుని తిరుగుతున్నది.
    ఒకరోజున అన్నారు.
    "వదినా . నాకిప్పుడు కావలసింది స్త్రీ కాదు. డబ్బు, ఆ డబ్బు కావాలంటే ఏదన్నా ఉద్యోగం సంపాదించాలి. నన్ను చూసి భయపడి తప్పుకు తిరగక్కర్లేదు."
    ఆ మాటకి విస్తుపోయినా, కాస్త తెరుకున్నది అక్కయ్య. చిన్నవాడిని వారి వళ్ళో భయం లేకుండా కూర్చో పెట్టడానికి పదిహేను రోజులు పట్టింది.
    రోజూ ఉదయం నిద్ర లేవగానే కాలకృత్యాలు నెరవేర్చుకుని ఎనిమిది గంటల కల్లా వెళ్ళిపోయేవారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ వెళ్ళిపోయి రాత్రి ఎనిమిది గంటలకు వచ్చేవారు.   
    పెద్ద వాణ్ణి నెలకు పది రూపాయల జీతం కట్టి కాన్వెంటు లో చేర్పించాను. వాడు చదివేది ఒకటో క్లాసు. వారు ప్రభుత్వ సర్వీస్ నుండి డిస్మిస్ అయినా ఆ చెడ్డ రోజులు పోయి మంచిగా, మనిషిగా జీవిస్తారని ఆశించాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS