"అత్తయ్య ! అత్తయ్య !' కోడలి అరుపులకు అత్తగారు తొందరగా వచ్చారు.
"ఏం తల్లీ?"
"ఇప్పుడే భరించలేని బాధ అన్నారు. ఇప్పుడే నవ్వుతున్నారు. నాకు భయంగా వుంది." ఆమె లేచి అతని తల దిండు పైకి చేర్చింది.
"ఏమిట్రా నాయనా?' ఆత్రంగా వచ్చి ఆమె అతని శరీరము పట్టి చూచింది.
"ఏం లేదమ్మా, తనూర్కేనే భయపడింది. ఏదో గుర్తుకొచ్చి నవ్వాను." తన నవ్వు ఎంత ప్రమాదము కలిగిస్తుందో తెలిసిపోయింది. ఈ విషయము తండ్రి వరకు చేరితే పిచ్చి ఆస్పత్రి నుండి పెద్ద డాక్టరు వస్తాడు.
'ఆకలిగా ఉందమ్మా?"
"అలా చెప్పు. కడుపులో ఏం లేదు. అందుకే పైత్యము చేసింది. నువ్వు కూర్చో నేను జావ తెస్తాను." కోడల్ని కూర్చోబెట్టి వెళ్ళిందామె.
"ఆరూ! ఒక్క సిగరెట్టూ"
"ఒద్దండి. అంతగా కావల్సితే , జావ త్రాగాక కాలుద్దురు గాని." అతనికి చెబుతుండగానే, సరస్వతమ్మ అక్క కోడలు దిగింది. వెనుక అత్తగారు, పిల్లలున్నారు. అరుణ వారికి యేదురేగి ఆహ్వానించింది. ఆమె చేతిలో వున్న చంటి వాడిని అందుకున్నది.
"ఆనంద్ కు బావుండలేదా అరుణా?' ముసలావిడ అడిగింది.
"రెండు రోజుల నుండి జ్వరమత్తయ్యా." అత్తా కోడండ్లు ఆనంద్ ను పరామర్శించారు.
ఆప్తుల రాక సరస్వతమ్మ కెంతో తృప్తి నిచ్చింది. అక్కగారిని కౌగలించుకుంది. వారిద్దరిని చూస్తుంటే లక్ష్మీ సరస్వతులు సార్ధకనామధేయులనిపించింది. వారి రాకవల్ల ఇంటిలో కాస్త సందడి హెచ్చింది. తాత్కాలికంగా తన విచారాన్ని మరిచిపోయాడు ఆనంద్. అరుణ మాత్రం విచారంగా తిరగసాగింది.
"ఆరూ! అంత ముభావంగా వున్నావేం?" పెద్దమ్మగారు ఏమన్నారేం?"
"వారెం అనలేదు. పిల్లలు గలవారేవ్వరోచ్చినా నాకేదో భయంగా వుంటుంది. ఏక్షణములో నన్ను ఏమంటారో , వారి పిల్లలను ఇస్తామంటారో నని."
"పిచ్చిదానవు. యెవరి పిల్లలు వారికి తీపి సుమా."
"అంతకంటే తీయనైనది. ప్రపంచము లో విలువైనది మన దగ్గరుంది. డబ్బు ఈ డబ్బు విలువైనదే. దానికి తోడు సమస్యలు సృష్టిస్తుంది కూడాను. మన పక్కింటి క్లర్క్ వున్నాడు. అతనికి పిల్లలు లేరన్న బాధ ఒకటే ఉంది. మనలాంటి బాధలు లేవు."
"నిజమే అరుణా, డబ్బు కొన్నిసార్లు మనిషిలోని మానవత్వాన్ని కూడా మరిపింపచేస్తుంది." ఆనంద్ నిదురపోయాక వంటింట్లోకి వెళ్ళింది. ఇద్దరత్తగార్లు మడితో వంట చేస్తున్నారు.
"వంటమనిషిని పెట్టుకోరాదే సరస్వతీ?"
"అబ్బాయీ, ఆయనా యెన్నో సార్లు అంటారు. కొందరు డబ్బు కోసము చూచామని కూడా యెత్తి పొడిచారు. వంటమనిషి కి పని చెప్పి నేనేం చేయాలక్కా? పనిమనిషి సత్తి పై పనులు చేస్తాడు. అరుణ కూడా ఆడంబరాలకు పోయి కూర్చునే పిల్ల కాదు."
"అది నిజమేలే , పని లేకుంటే తోచవద్దూ? మా ఇంట్లో యెంతమంది వున్నా సరిపోరు, మరీ మాటా మంచి లేకుండా వుండాలంటే కష్టమే. మా రెండో మనుమడిని ఓ నెల రోజుల పాటు వుంచుకో. ఇంట్లో ఎన్ని వున్నా పిల్లలున్నట్టు ఉంటుందా?"
నేను అడగాలను కుంటున్నాను. కోడలుంచడానికి కిష్ట పడుతుందో లేదోనని ఊరకున్నానే."
"నువ్వు పరాయి దానవుటే. ఏదో నాల్గునాళ్ళ ముచ్చట.' అరుణ మౌనంగా విన్నది. నాల్గు రోజులకు వారు వెళ్లి పోయేనాడు పిల్లాడిని వదిలి వెళ్ళారు. సరస్వతమ్మ చాలా సంతోషించింది.
.jpg)
ఆనంద్ ఆఫీసుకు వెళ్ళి వస్తున్నా, నిర్లిప్తంగా వుంటున్నాడు. గంటల తరబడి బాల్కని లో కూర్చుని ఆకాశాని కేసి చూస్తాడు. అతని స్థితి గమనించటానికి పైకి ఎవరు వెళ్తారు. పిల్లవాడి సంరక్షణ లో పడి కొడుకు నంతగా గమనించటము లేదు సరస్వతమ్మ. అరుణకు భర్త మూగ వేదన యెందుకో అర్ధం కాలేదు. అత్తగారు పిల్లాడికి అన్నము పెడుతూ పెరట్లో ఉండగా, త్వరగా మేడ ఎక్కింది చాలా రోజుల తరువాత వచ్చింది. ఆయాసం వచ్చింది. గది బయటే దమ్ము తీసుకుని లోపలికి వెళ్ళింది. ఆఫీసు దుస్తులు మర్చనే లేదు. కనీసము టై కూడా వదులు చేసుకోలేదు. బూట్లు బయటికి వచ్చేలా కాళ్ళు పెట్టి మంచానికి అడ్డంగా పడుకున్నాడు. గది అంతా అడవి లా ఉంది. సిగరెట్టూ పీకలు చూస్తె ఆదరిపోయి అతను కళ్ళు మూసుకున్నాడు. అరుణకు తనపై తనకే యెక్కడ లేని కోపము వచ్చింది. తనలాంటి వారికి చావు తొందరగా యెందుకు రాదో అనుకుని గదిలో అడుగు పెట్టింది. అలికిడికి అతను కళ్ళు విప్పాడు.

"నువ్వా? పైకి యెందుకు వచ్చావు? అమ్మ చూడలేదూ?"
"మీకు, మీ అమ్మకే హృదయముంది మేమంతా రాళ్ళము." వత్తి పలికింది.
"ఆరూ! ఆ మాటేవరన్నారు?' లేచి కూర్చున్నాడు.
"వేరే అనాలా? మీ బాదే ఏమిటో చెప్పరు. మీలో మీరే ఇలా దిగులు పడితే నా ఉనికికి అర్ధం లేదు. నిజంగా నేనెందుకు బ్రతికానా అనిపిస్తుంది. మీకు కావాల్సిన సుఖాలను అందివ్వలేక పోయినా, మీ కష్టాలలో భాగము పంచుకో లేనా?' ఆమె కళ్ళల్లో నీరు నిండింది.
నా బాధ చెప్పుకునేదైతే కదా....అరుణా నన్ను అపార్ధం చేసుకోకు. నాకేం కష్టాలు లేవు. నువ్వు సుఖాలు ఇవ్వలేవని కినుక కాదు.
"మరేమిటి?"
"ఏమిటని చెప్పేది? నాకే అర్ధం కావు. అంతలోనే కన్నీరా?' ఆమెను దగ్గరగా తీసుకుని కన్నీరు వత్తాడు.
"బలహీనత వల్ల యేవో ఆలోచనలు వస్తాయి. అంతే. "నవ్వాడు." నా గది చూడు నీ రాకకై యెలా వేచి యున్నదో! యేది టై విప్పు.' ఆమె దృష్టి మరో దిక్కుకు మరలించాలనే ఆ మాట అన్నాడు. ఆమె వెంటనే అతని టై విప్పింది. బూట్లూ, డ్రస్సు తీసింది. గదంతా శుభ్రంగా చేస్తుండగా క్రింద నుండి సరస్వతమ్మ కేకలు వినిపించాయి.
"మీరు పిలిచామని చెప్పండి. మీరు క్రిందికి రాకపోతే నాకేదో, మతి పోయినట్టయి వచ్చేశాను.' ఆనంద్ మెట్ల దగ్గరకు వెళ్ళాడు.
"అరుణ గది తుడుస్తుందమ్మా గదంతా చెత్త గా ఉంటేను నేను పిలిచాను."
"సత్తితో బాగు చేయించవద్దా? ఈ మెట్లు అసలు బాగుండలేదు."
"సత్తి కేం తెలుసు అమ్మా! ఇప్పుడు బాగానే ఉందిగా?' ఆవిడ ఏదో గొణుక్కుంటూ వెళ్ళిందక్కడి నుండి, అతను తిరిగి వచ్చాడు.
"ఆరూ! సినిమా కెళ్దామా?"
"మీరు తీసు కెళ్ళాలే గాని యెందుకు రాను?" ప్రసన్నంగా చూచింది.
"నిజంగా నీ చేతిలో ఏదో మంత్రమున్నది ఆరూ, అడవి లాంటి గది యెంత నీటుగా తయారయిందో చూడు."
"బావుంది అతిశయోక్తి." అతను లాల్చీ పైజమా వేసుకుని ఆమె వెంట దిగి వచ్చాడు. ఈ మధ్యే అరుణ వంగి లేవడము కష్ట మవుతుందని భోజనాల బల్ల కొన్నారు. అతను తండ్రి ని పిలిచాడు. ఇరువురికి వడ్డించింది. వారి భోజనాలు కాగానే ఆడవారు భోజనము చేశారు. అరుణ చీర మాత్రమూ మార్చుకుంది. అత్తగారి కళ్ళలోని ప్రశ్నకు జవాబు చెప్పింది.
"సినిమా కన్నారత్తయ్యా ." తలవంచి చెప్పింది.
"నేను రానా యేమిటి?"
"హిందీ అనుకుంటాను."
"ఏమండీ! హిందీ సినిమా చూడక చాలా రోజులు అయిందన్నారు కదా" ఆమె భర్త వంక చూచింది. అరుణకు నవ్వు, జాలి కలిగాయి. ఆమె అభిప్రాయము తనకు తెలుసు. మమాగారు రక్షణ రాగా సినిమా కెళ్ళి వచ్చారు. ఉదయము లేవక మునుపే రంగారావు అన్న కుమారుడు దిగాడు. వనపర్తి నుండి. అతనికి కావాల్సిన మర్యాదలు అయ్యాయి. అతనేందుకో సరస్వతమ్మ ను తప్పించుకు తిరుగుతూ , ఆమెతో పుల్ల విరిచినట్టే మాట్లాడ సాగెడు.
సాయంత్రము సరస్వతమ్మ ఎవరింటికో పేరంటానికి వెళ్ళింది. మొగవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. పిల్లవాడిని ఆడిస్తూ కూర్చుంది అరుణ.
"ఏమమ్మా మరదలా. పిల్లలంటే అంత ప్రీతా." నవ్వుతూ అడిగాడు అతను.
"ఏం ప్రశ్న రా రాము? పిల్లలంటే ఇష్టము లేనిదేవరికి?" రంగారావు కలుగాజేసుకున్నాడు.
"ఇష్టముందని ఎవరిని పడితే వారినే తెచ్చుకుంటారా , బాబాయ్? మన వంశీకులంతా చచ్చిపోయారా?"
"అదేం అప్రాచ్యపు మాటరా? మన వంశీకీలు చచ్చిపోయారని ఎవరన్నారు?"
"వేరే అనాలా? ఎవరినో వల్లకాట్లో రామయ్య ను తెచ్చి పెంచు కోవటమేమిటి?' రాము ఆవేశంగా అడిగాడు.
"వల్లకాట్లో రామయ్య ఎవరన్నయ్యా? అసలు మేము ఎవరిని పెంచుకొందే?"
