"అంత అందమైన అమ్మాయిని బాగాలేదనడానికి గుడ్డి వాడినా ఏం?" నవ్వుతూ బాత్ రూమ్ వైపు వెళ్ళాడు.
రాత్రి యెనిమిది గంటలకు రంగారావు తండ్రి గార్కి సీరియస్ గా వుందని టెలిగ్రాం వచ్చింది. వారు జగ్గయ్య పేట కు అరవై మైళ్ళున్న పల్లెటూరి లో వుంటారు. మరురోజే అందరూ ప్రయాణమై వెళ్ళారు. అక్కడ ముసలాయన ఉబ్బసంతో బాధపడుతున్నారు. రంగారావు గారు మందులు యిప్పించి, నాల్గు రోజులుండమని భార్యను, కొడుకుని ఊరిలో ఉంచేసి వచ్చేశాడు. నాల్గు రోజులల్లా పదిహేను రోజులుండి ముసలాయనను తీసుకొని వచ్చేశారు. తన కోసము రేఖ ఉత్తరం వచ్చిందేమో నని ఆత్రంగా బల్లలన్నీ వెతికాడు. అతని పేరా వున్నది చింపి చదివేటంత సంకుచిత స్వభావులు కారు రంగారావు. ఉత్తరము కనిపించలేదు.
ఆరోజు రేఖసంగతి తల్లితో చెప్పి వెళ్లి పిలుచుకు రావాలనుకున్నాడు. నెమ్మదిగా తల్లి వున్న చోటుకు చేరాడు. తాతగారు పడక కుర్చీ లో వ్రాలి యున్నారు. తల్లి క్రింద కూర్చుని మాట్లాడు కుంటున్నారు.
"మనూరి లో తక్కెళ్ళ వారి ఆడబడుచు కూతురుందే చక్కని చుక్క . యాభై వేలు కట్నం యిస్తామన్నారు; నాకే యిష్టం లేక పోయింది. ఆ పిల్ల తాత వంటల బ్రాహ్మడుగా పనిచేశారట. సంప్రదాయము లేని కుటుంబము." ముసలాయన అంటున్నాడు. వంట చేసినంత మాత్రాన పరువు పోయినట్టేనా? మండిపోయింది ఆనంద్ కు.
"ఇక్కడ చాలా మంది ఇస్తామన్నారు. మీ కొడుక్కు సంప్రదాయం విషయం లో పట్టింపాయే. కాంతారావుది మొదటి నుండి కలిగిన కుటుంబం. లక్ష రూపాయల కట్న మిస్తామంటున్నారు."
"లక్ష రూపాయల కట్నమా" ఉలిక్కి పడ్డాడు. ఆనంద్.
"ఒక్కడు. ఆ మాత్రము ఇవ్వక పొతే ఎలా?' స్పష్టంగా తెలిసిపోయింది తన పెళ్లి అని. వెంటనే కోపము కూడా వచ్చింది. తన అభిప్రాయము అడగరా ఏం?"
"తాంబూలాలు పుచ్చుకుందామని చెప్పి పంపారు. వాళ్ళు సంవత్సరము నుండి అడిగితె, ఆపుతూ వచ్చాము. వాడు చూచాడు."
"నా కళ్ళ ముందీ పెళ్ళి అయితే సంతోషమే తల్లీ" చూపించి అందంగా ఉందా అని సాధారణంగా అడిగారు. తనూ జవాబు చెప్పాడు. అంతమాత్రాన తన యిష్టము తెలిపినట్టేనా? తను జాప్యము చేస్తున్నాడు.
"ఏమిట్రా ఆనందా! పాతకాలపు పెళ్ళి కొడుకులా చాటుగా వినటము రా" పిలిచాడు తాత, వచ్చి అతని కెదురుగా కూర్చున్నాడు. లభించిన అవకాశము వృధా కానీయవద్దు అని సంకల్పించాడు.
"నేను పాతకాలపు పెళ్ళి కొడుకునేం కాదు తాతయ్యా. నాకు నచ్చిన అమ్మాయిని నేను చూచుకోగలను."
"యెంత నంగనాచివిరా. చూచి వరించి చూచుకోగలనంటావేమిటి?' అదో పెద్ద విట్టు అయినట్టు అయన నవ్వసాగేడు. సరస్వతమ్మ లేచి వెళ్ళింది, ఆనంద్ కు చికాకు వేసింది. కాసేపుండి తనూ వెళ్ళాడు తల్లి ఉన్న చోటికి.
"తోచటము లేదా నాయనా?"
"అది కాదమ్మా నిజంగా నా పెళ్ళి విషయాలు మాట్లాడుతున్నారా?'
"అదేం మాటరా? అబద్దము దేనికి, రేపు పంచమి నాడు లగ్న పత్రిక పెట్టుకుంటున్నాము."
"నా ఇష్టముతో పని లేదా?' ఆవిడ వింతగా చూచింది.
"లేదని ఎవరన్నారు?"
"వేరే అనాలా? నాకు మాట మాత్రమైనా చెప్పారా?"
"మరి మీ నాన్న వెంబడి వెళ్ళి అమ్మాయిని చూచి రాలేదట్రా?"
"నాకు పెళ్ళి చూపులని చెప్పారా ఏం?"
"అదా? సరిగ్గా చూడకపోతే మరోసారి చూడు."
'అది కాదమ్మా? నాకిష్టము లేదు."
"యెందుకు? అమ్మాయి బావుండలేదా?"
"నేను గుడ్డ్డి వాడిని కాదు."
"మరి కట్నము ఇంకా కావాలా?"
"అంత ఆశ ప[పోతును కాను. ప్రపంచములో కట్నము, సంప్రదాయము . అందము తప్ప మరేం లేదా?"
"ఇంకేమిటో చెప్పరా? వెర్రి వేషాలు వద్దు. నాన్నగారు నీ మీది నమ్మకముతో పది మందిలో మాటిచ్చారు. అనేసి వెళ్ళిపోయింది. వెంటనే ఉత్తరము వ్రాశాడు రేఖకు. తను రావడానికి ఆలస్యము కావచ్చని, క్షేమము తెలుపమని. బి.ఎ పరీక్ష రాసి ఇంట్లో కూర్చున్న శర్మ దగ్గర కెళ్ళాడు. తన పెళ్ళి వివరాలు చెప్పి, ఏప్ విధానము చూపమాన్నాడు.
"ఏంరా? లక్ష రూపాయలు తేరగా వస్తుంటే ఏం జబ్బురా? నాకేవడు ఇవ్వడు కదా? హాయిగా వ్యాపారము చేసుకునేవాడిని."
"అయితే పద వాళ్ళకు నిన్ను పరిచయము చేస్తాను. ఆ అమ్మాయిని చేసుకుందువు."
నీకున్న హన్గులేవి ? అందగాడినా అంటే అదేం లేదు. చేసేది బడి పంతులు ఉద్యోగము రేపు ఇంట్లో కుచేల సంతానమునాకు జేష్టుడను."
"అయితే యేమయింది? ఆ అమ్మాయి అంత డబ్బు తెస్తుంది కదా?"
"ఆ అమ్మాయి తల్లితండ్రులు నీలాంటి విశాల హృదయులు కారురా. అబ్బాయి బుద్ది మంతుడు, డబ్బు లేకపోతేనేం మాకుందిగా అనుకోరు. ఒరేయ్....డబ్బున్న వాడికే యిస్తారురా."
"నా మాట వినవేంరా. నేను మద్రాసు లో ఓ అమ్మాయిని ప్రేమించానురా."
"చెప్పవేం? అయితే నీ విలువ మరో పాతిక పెరుగుతుంది."
"వెధవా నాల్గు వాయిస్తాను. నేను తమాషాకు చెప్పటము లేదు."
"ఒరేయ్ నేను తమషా కనటము లేదురా. కాస్త అందంగా ఉండి, నాలుగు డబ్బులు చేతిలో ఉంటె ప్రేమ దానంతట అదే పుట్టుక వస్తుందిరా. మా మేనమామ కేరళ వెళ్ళాడు. వారి జుట్టును మోహించి, పొడుగాటి జుట్టు గల ఓ అమ్మాయిని ప్రేమించానన్నాడు. మా అమ్మమ్మ చాలా తెలివైంది, ఆ జుట్టుతో ఉరి వేసుకుంటావట్రా అని అడిగింది. వెంటనే అటు నుండి ట్రాన్స్ ఫర్ చేయించారు. డిల్లీ లో ఓ పంజాబీ అమ్మాయి రంగు చూచి మోసపోయాడు...."
"చాలురా , బాబూ, చాలు.' చెవులు మూసుకున్నాడు.
.jpg)
"పూర్తిగా విను మరి. పంజాబీ అమ్మాయితో పెళ్ళి కాకుంటే సన్యాసము పుచ్చుకుంటానని గడ్డము పెంచాడు. పాతిక వేలు కట్నమనగానే అన్నీ మరిచి వివాహము చేసుకుని హాయిగా ఉన్నాడురా."
"అతను ప్రేమ ఉట్టిదే అయువుంటుంది. నేను ప్రేమించిన అమ్మాయిని చూడలేదు, అనాధ, పాపమూ ఎవరూ లేరు.
"ఇంకా మంచిదే. తగవు కేవరూ రారు. ప్రేమించిన ప్రతివారిని పెళ్ళాడాలని యెక్కడ వున్నది. పిచ్చి వేషాలు మాని నాన్నగారు కుదిర్చిన పెళ్ళి చేసుకో." నిరాశగా తిరిగి వచ్చాడు. దానికి తోడూ రేఖ దగ్గర నుండి యే వార్త లేదు. విసిగి ఇంటాయనకు వ్రాశాడు.
ఆనంద్ ప్రమేయము లేకుండానే రంగారావు గారు తాంబూలాలు పుచ్చుకున్నారు. లక్ష రూపాయలు , అత్తగారి హుందా అతణ్ణి లొంగదీసింది. రేఖ గాలి కెగిరే పువ్వు వంటిది. ఏటన్నా యెగరని ఆమెను తన స్మ్రుతి పదము నుండి తొలగించాలని యెంతో ప్రయత్నమూ చేశాడు. యౌవన మధువును అందించిన కన్యను మరవటము సాధ్యమా? తనయితే ఉత్తరము వ్రాశాడు. తన తప్పేం లేదు. గర్విష్టి అమ్మాయి ఏం నిర్ణయించుకుందోనని మనసుకు నచ్చ జెప్పుకున్నాడు. అతను రేఖను చేసుకున్నందువలన కలిగే నష్టాలు, అరుణను చేసుకున్నందు వల్ల కలిగే లాభాలు తూచాడు. ధనము వైపే మ్రొగ్గింది మనసు.
పరీక్షా ఫలితాలు తెలిశాయి. తండ్రి వెంట మద్రాసు వెళ్ళాడు. ఒకసారి రేఖను చూడాలని అతని మనసు పీకింది. ఆమె ప్రశ్నలకు తన వద్ద జవాబు లేదు. తను కార్యవాది కావాలి . తన జీవితమంతా శ్రమించినా లక్ష రూపాయలు కూడబెట్టలేడు. ద్వైదీభావాలతో సతమత మవుతుండగానే తండ్రి అడిగాడు.
"ఇల్లు పూర్తిగా ఖాళీ చేయలేదన్నావుగా?"
"ఫరవాలేదు . వాళ్ళుండరిప్పుడు పాత మంచము, బల్ల మాత్రమే ఉన్నాయి." అప్రయత్నము గా అబద్దము ఆడినాడు. హోటల్లో తండ్రి విశ్రమించాక , నెమ్మదిగా టాక్సీ చేసుకుని వెంకటాపురము కాలనీ చేరాడు. కొన్నిసార్లు తమాషాకి అబద్దమాడినా , అది నిజమై కూర్చుంటుంది. అతనుండే ఇల్లే కాక ఇంటి వారిల్లు కూడా తాళం వేసి ఉంది. ప్రక్కవారిని అడగాలను కున్నాడు. అతను ఏమి చేస్తాడో, వినడానికి తను సిద్దంగా లేడు. కాసేపు అక్కడే తచ్చాడి వెనక్కు తిరిగి వచ్చాడు. అతని స్మృతులు కూడా పాతబడి పోయాయి. రేఖకు తను తిండి, బట్ట ఇచ్చాడు. ప్రతిగా ఆమె సుఖాన్ని యిచ్చింది. అలా సరిపెట్టుకున్నాడు.
మామగారి పరపతి వల్ల వేంకటరత్నము గారి ప్రయత్నమూ వల్ల ఆనంద్ కు ఉద్యోగమూ దొరికింది. అతని కంటే ముందు పాసయిన వారలాగే ఉన్నారు. ఆనంద్ గర్వంగా నవ్వుకున్నాడు. అప్పుడప్పుడు రేఖతో గడిపిన మధుర క్షణాలు మాత్రమూ గుర్తుకు వచ్చేవి. అతనికేం తెలుసు . జీవితమూ లో ఆ సుఖమే తనకు శాశ్వతమైనదని.
అరుణతో వివాహము అయింది. వివాహ మంటపము లో అతనికి రేఖ ప్రత్యక్ష మైనట్టు అనుభూతి కలిగింది. చేతిలో సూత్రము పట్టుకుని వెనకకు తిరిగి చూచాడు. 'ఇది అన్యాయము ఆనంద్" అంటూ రేఖ అరుస్తుందేమో అనుకున్నాడు. "ఫోటో తీస్తున్నాము గాని కట్టేయ్యరా మంగళ సూత్రము" స్నేహితులు వేళాకోళము చేశారు. కళ్ళు మూసుకుని ముందుకు వంగాడు.
"అమ్మాయి కంటపడగానే అంత పరవశత్వము దేనికయ్యా! కళ్ళు విప్పి మంగల్యము కట్టు. ప్రక్క వారికి ముడి వేసేవు." మారుటి వదిన హస్యమాడింది. ముడి వేస్తుండగానే నలు మూలల నుండి అక్షింతలు పడ్డాయి. ఎవరో తన పైకి రాళ్ళు విసురుతున్నట్టు అనిపించింది. తంతు త్వరగా ముగించమని బ్రహ్మడితో అన్నాడు. అతను గట్టిగా మంత్రాలు చదువ సాగెడు.
"ఒక్క కొడుకని బాగా గారాబము చేశారులా వుంది. పెళ్ళిలో కూడా నిలుకడ లేదు" ఎవరో ముత్తైదువ మాట. తన హృదయము ఎలా ఉడుకుతుందో వారికేం తెలుసు? వివాహము కాగానే అందరూ భోజనాల గొడవలో ఉంటె అతను తలనొప్పి అంటూ పడక చేరినాడు. రెండు గంటలు కాక పూర్వమే నూతన వధువు అరుణ అతని క్షేమార్తి అయి, రావటము అతనిని ఎంతో కలవర పరిచింది. స్త్రీలు ఎంత పరదీనలో అర్ధం అయింది. ఇదివరకే ఒకరికి అన్యాయమయింది. తన మూలంగా మరో స్త్రీ అన్యాయము కారాదని తలచాడు. తనలోని భావాలను అదిమి పెట్టి , అతి ప్రేమగా ఆమెను పలుకరించాడు. ఆమెతో జీవితములో సుఖాలన్నీ పంచుకోవాలను కున్నాడు. కాని విధి అక్కడా దెబ్బతీసింది. అరుణ కడుపు నొప్పి రోగిష్టి. అతనికిప్పుడే అర్ధమవుతుంది లక్ష రూపాయలు సంపాదించటము తేలికే గాని, తనకు కావలసిన సుఖము కొనుక్కోవడం తేలిక కాదని. ఒకోసారి అందరి పైనా కోపము వస్తుంది. వెంటనే విచక్షణ మేల్కొంటుంది. తన జీవితమిలా కావటానికి ఎవరూ కారకులు కారు. తనే, తనే. అతని మనసు హెచ్చరించింది. ముందు యేమిటన్నది ఆలోచించక రేఖతో చనువు పెంచుకోవడము మొదటి పొరపాటు. ఆమె తండ్రికి మాటిచ్చి మరచి పోవడము రెండవ పొరపాటు. లక్ష రూపాయలకు లొంగి నిజము చెప్పక పోవడము పెద్ద పొరపాటు. ఒకరు చేసిన తప్పుకు యెంత మంది శిక్షించబడతారో , అమాయకురాలయిన రేఖ.....సురేఖ వేశ్యా!....భగవాన్ భరించలేను.......
"మీరు చాలా మొహమాటానికి పోతారు. భరించలేనంత నొప్పి ఉంటె తలకు అమృతాంజనం వ్రాయి చుకోరూ?" నిష్టూరంగా వచ్చి అతని దగ్గర కూర్చుంది అరుణ.
'అరుణా! నా బాధ వ్యక్తము చేయలేను-- ఎవరికీ చెప్పలేను." అరాతముగా మంచములో కదిలాడు.
"నన్నయితే అంటారు సంతోషముతో రోగము నివారణ చేసుకోవాలని, మీరు? ఒక్కరోజుకే దిగులు పడుతున్నారు.' అతని తల తన తొడపై ఉంచుకొని వ్రాయసాగింది. అతని కేమో పిచ్చిగా వుంది.
"అరుణా! విసిగిస్తున్నానని నన్ను తిట్టవెందుకు?"
"ఈ అయిదు సంవత్సరాల నుండి రోజూ మిమ్ము విసిగిస్తున్నాను. యెన్నిసార్లు తిట్టారు?" అడుగుతూనే మందు వ్రాసింది. నొప్పి లేదు. తల భగ్గుమంది. అతనికి అంత బాధలోనూ తన మొహమాటానికి నవ్వు వచ్చింది. నిర్భయంగా నిజము చెప్పేవారికే నిష్టూరాలు, కష్టాలు అంటారు చిన్న అబద్దము ఫలితము గుండెల్లో ఆరని మంట. తలనొప్పి కాదు. నా గుండెలు బ్రద్దలవుతున్నాయని చెప్పక పోవడముతో నుడురంతా మండుతుంది. తన అసమర్ధతకు నవ్వుకున్నాడు. అరుణ భయంగా చూచింది.
