Previous Page Next Page 
పిల్లలతో ప్రేమయాత్ర పేజి 23

 

    'ఇప్పుడు మాత్రం అలాటి సంఘటనలు జరగటం లేదని గ్యారంటీ యేమిటి లే!' అన్నాడు కాంతారావు.
    'జరగవని గ్యారంటీ గా చెప్పగలను నేను. ఎందుకో తెలుసా? ఇప్పుడు హిందూ భక్తులకు దైవం మీద భక్తీ చచ్చిపోయి, డబ్బు మీద భక్తీ జాస్తి అవుతోంది. ఎవడికి వాడు యాత్రికుల దగ్గర ఎలా డబ్బులు గుంజుకోవాలో చూస్తారు తప్ప ఏదేముడు గోప్పయితే మనకేం ఒరిగింది లే అన్న మనస్తత్వం వారికి వచ్చేసింది. పూజారిగా ఉండదలచుకున్న వాడికి విష్ణు కంచిలో ఉంటేనేం , శివ కంచి లో ఉంటెనేం! రెండింట్లో ఉన్నవి రాతి విగ్రహాలే! అవి ఉలకవు, పలకవు. కనీసం కనికరమన్న చూపవు. యాత్రికుల కనికరం ఉంటె చాలు వాళ్ళకి' అన్నది కళ్యాణి.
    'ఈరోజుల్లో దేవుళ్ళ పార్టీలు పోయి రాజకీయ పార్టీలు , సినిమా పార్టీలు ప్రారంభమై ప్రజలు బుర్రలు బ్రద్దలు కొట్టు కుంటున్నారులే!' అన్నాడు కాంతారావు.
    విష్ణు కంచి లో వరదరాజ స్వామి ఆలయం విశిష్ట మైంది. ఎన్నో అడుగుల ఎత్తున విష్ణుమూర్తి విగ్రహాన్ని కర్పూర హారతి వెలుగులో చూసి చకితులయ్యారు భక్తులంతాను.
    ఆ ఆలయం చాలా పెద్దది. శివకంచి లో కంటే కూడా విష్ణు కంచి లోని దేవుళ్ళ సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. ముక్కోటి దేవతలూ అక్కడే వెలిసేరా అనిపిస్తోంది.
    అందులో పౌరాణిక గాధలకు సంబందించిన విగ్రహాలు చాలా ఉన్నాయ్.
    వాటిలో దుర్వాసముని విగ్రహం కూడా ఉంది. దాన్ని చూసి కళ్యాణి 'అడుగో మీ అన్నయ్య!' అంది మొగుణ్ణి మోచేత్తో పొడుస్తూ.
    'ఇంతమంది విగ్రహాలను ప్రతిష్టించేరు కాని, మీ చెల్లెలు విగ్రహాన్ని పెట్టటం మర్చిపోయే రెందుకనో!' అన్నాడు కాంతారావు.
    "ఎవరేమిటి మా చెల్లెలు?' కోరగా, వోరగా చూసింది కళ్యాణి.
    "శూర్పణఖ !' అంటూ ఫక్కున నవ్వేడు కాంతారావు.
    తామున్న ప్రదేశాన్ని కూడా మర్చిపోయి  కళ్యాణి మొగుడి చెవి మెలేసి , వెంటనే నాలుక కొరుక్కుని చుట్టూ చూసింది. 'వెంకట సుబ్బలక్ష్మీ టూరిస్టు సర్వీసు' భక్త బృందం బిలబిలమంటూ ఆలయం లోకి ప్రవేశిస్తుంటే 'అదుగో నండోయ్ మన ఫ్రెండ్స్ కూడా వచ్చేసేరు' అంటూ కిలకిల నవ్వింది కళ్యాణి.
    'ఇంకేం మనకి మీచేతి జోరు రుచి చూసే భాగ్యం తప్పిపోయింది.' అన్నాడు చెవిని సవరించుకుంటూ కాంతారావు.
    అక్కడున్న గుళ్ళన్నీ ఎంత చీకటి! ఉన్నాయంటే ఒక్కోప్పుడు పూజారి గర్భ గుడిలో నుండి వచ్చి హారతి పళ్ళెం కుంకుమ తీసుకుని బయటకు వచ్చేదాకా అక్కడ మనుషులున్న జాడే తెలియటం లేదు. 'పూర్ ఫెలోస్! ఎలా ఉండగలుగుతున్నారో ఈ గుహల్లో! ఇంకా ఆదిమానవుడి మనస్తత్వం పోలేదు భారతీయులకు, ఎంతసేపూ చీకటి గుహాల్లో రాళ్ళు రప్పల మధ్య పడి ఉందామనుకుంటారే తప్ప వెలుగులోకి రావాలంటే చచ్చే భయం వీరికి' అనుకుంది కళ్యాణి మనసులో. కాని ఆ మాట పైకి మాత్రం భర్తతో అనలేదు.    
    కోట్లాది ప్రజలు ఒక పుచ్చి నమ్మకంలో, ప్రగాడమైన విశ్వాసం లో పడి కొట్టుకు పోతుంటే తన హీనస్వరం ఎవరికి నచ్చ చెప్పగలదు? ఎవరిని మార్చగలదు? అందుకే తన నమ్మకాలను అప నమ్మకాలను అనుమానాలను, ఆవేదనలను అన్నిటినీ తనలోనే దాచుకుంటే అన్ని విధాల శ్రేయస్కరం అనిపించింది కళ్యాణి కి.
    ఒక్కొక్క స్తంభం మీద ఎన్నో పురాణ గాధలకు సంబంధించిన విగ్రహలుంటే వాటిని గూర్చి వివరించసాగెడు గైడు. చివరకు ఆ బాల గోపాలుడికి అద్భుతమైన అనుభూతి నిచ్చే బంగారు , వెండి బల్లుల దగ్గరకు వచ్చేరు. టూరిస్టు సర్వీసు తాలూకు 'గుండు భక్తులు' చకచకా అన్నీ చూసేసి బల్లుల దగ్గరకు వచ్చేరు. వాళ్ళంతా వాటిని ముట్టుకుని కల్ల కద్దుకుని పోతున్నారు. పైన దేవాలయం కప్పు మీద బల్లులు, కింద చెక్కతో చెయ్యబడిన చిన్న సైజు బ్రిడ్జి లాటి ఎత్తయిన ప్రదేశం. మెట్లెక్కి బల్లులను ముట్టుకుని అలాగే రెండో వైపుగా మెట్లు దిగి క్రిందికి పోవాలి.
    గుండ్లన్నీ దిగేదాకా కళ్యాణి ఆ దృశ్యాన్ని చూస్తూ నిలబడింది నోరు తెరచుకుని.
    కళ్యాణి కి బల్లులంటే చచ్చే భయం. అసహ్యం. ఈ సృష్టి లో కల్లా అతి జుగుప్సా కరమైన ప్రాణులేమయినా ఉన్నాయా అంటే అవి బల్లులే నని టకీమని జవాబిస్తుంది కళ్యాణి.
    బల్లులంటే ఆమెకు ఎంత భయమంటే హైస్కూల్లో చదువుకునే రోజుల్లో సైన్సు పుస్తకం లో జంతు శాస్త్ర విభాగం లోని ఒక పాఠం లోని బల్లి బొమ్మను చూస్తూనే వళ్ళు జలదరించి ఆ పేజీని వెంటనే తిప్పేది. 'బల్లి గోడ మీద, యింటి కప్పు మీద అతుక్కుని ఉంటుంది. కాని క్రింద పడదు. కారణమేమి?' అన్న ప్రశ్నకు జవాబును చదవనేలెదామే. ఆ ప్రశ్న తప్పకుండా పరీక్ష పేపర్లో వస్తుందని సైన్సు మాష్టారు పది సార్లు చెప్పినా, ససేమిరా ఆ పేజీ తెరిచి, బల్లి పాఠం చదవలేదు కళ్యాణి. మాష్టారు చెప్పినట్లే ఆ ప్రశ్న పరీక్ష లో వచ్చింది.దానికి  సమాధానం కళ్యాణి వ్రాయలేదు. పైగా ఆ ప్రశ్నను చూస్తూనే బల్లి గుర్తుకొచ్చి ఆ బల్లి తన శరీరం మీద ఆ క్షణంలో ప్రాకుతున్నట్లు గానే భావించి, నానా అవస్థలు పడి వో పది నిమిషాల టైమును వృధా చేసేసింది కూడా.
    కల్యాణి కి బల్లులంటే అసహ్యమని కాంతారావు కు తెలుసు. కాని, ఆ అసహ్యం కంటే పది రెట్లు భయం కూడా ఉన్నదన్న సంగతి మాత్రం అతనికి తెలియదు. అందువల్ల తమవంతు రాగానే 'ఇంక పద. త్వరగా వెళ్ళాలి మనం. ఇప్పటికే చాలా టైమయింది.' అంటూ కళ్యాణి ని తొందర పెట్టేడు.
    కళ్యాణి కదలలేదు. కొయ్య బొమ్మలా నిల్చుండి పోయింది.
    'కళ్యాణి ! పదా!' అన్నాడు కాంతారావు.
    'మీరు ముందు నడవండి.' అంది హీన స్వరంతో - ఎలాగో గొంతు పెగల్చుకుని .
    కాంతారావు ఆమె వంక చూడకుండా గబగబా ముందు నడిచి వెళ్ళి బల్లులను ముట్టుకుని వెనక్కి తిరిగి చూసేడు. పాలిపోయిన కళ్యాణి ముఖం చూస్తూనే ' అదేమిటి? అలా నిల్చున్నావ్?' అనడిగేడు ఆశ్చర్యంగా.
    'బ్....బ్.... బల్లి.... నాకు భయం. నేను ముట్టుకోను' కళ్ళ నీళ్ళోక్కటే తక్కువ కళ్యాణి కి.
    ఆమె ముఖం చూస్తుంటే కాంతారావు కి నవ్వాగలేదు.
    'వోసి పిచ్చిదానా! అవి మామూలు బల్లులు కాదుగా. బొమ్మలే! వాటిని ముట్టుకోవటానికి ఎందుకు భయం?' అన్నాడు విరగబడి నవ్వుతూ.
    అతని నవ్వుతో కొంత ధైర్యం కూడతీసుకుంది కాని అప్పటికీ వాటిని ముట్టుకునేందుకు సాహసించ లేక పోయింది కళ్యాణి    'అది కాదండీ!ఇంత పెద్ద సైజు లో చూస్తుంటే ఆ బొమ్మలు నిజం బల్లుల కంటే భయంకరంగా ఉన్నాయండి!' అంది బిక్క మొహం వేసి.
    'అహహ! ఏం నారీ మణిరా యీవిడ . ఝాన్సీ లక్ష్మీ , మల్లమాంబ, నాగమ్మ వగైరా వీర నారీ మణులుద్భవించిన భారత దేశంలో పుట్టిన స్త్రీ యేనా యీమె?  భర్త మీద కోపం వచ్చినప్పుడు భద్రకాళి లా , పిల్లల మీద కినుక వహిస్తే చిన్న సైజు సూర్యకాంతం లా మారే యీ మహిళా రత్నానికి బల్లులంటే భయంట! ఇక్కడున్న భక్త బృందాన్నంతా పిల్చి యిదే మాట చెప్పమంటావా పిల్లా?' అన్నాడు కాంతారావు.
    కళ్యాణి లో రోషం విజ్రుంభించింది 'ఏం, నేను ముట్టుకోలేననుకుంటున్నారా? పాపను మీరు తీసుకుని అవతల నిల్చోండి. ముట్టు కుంటాను.' అంటూ పాపని అతని కందించింది.
    కాంతారావు పిల్లలతో సహా మెట్లు దిగి అవతలకు వెళ్ళి నిల్చున్నాడు.
    కళ్యాణి దడదడ లాడుతున్న గుండెను చిక్క బట్టుకుని, పళ్ళు బిగపెట్టి , కళ్ళు మూసుకుని ఆ రెండు బల్లులనూ తాకి, మరుక్షణమే కెవ్వున కేకవేసి, ఒక్క అంగలో మెట్లన్నీ దాటుకుంటూ వచ్చి భర్త గుండె మీద వాలిపోయింది గజగజ వణుకుతూ.
    కాంతారావు పకపక నవ్వుతూ; ఆమె భుజం మీద చేరచేడు 'భేష్! భయపడ్డా, మొత్తానికి బల్లులనైతే ముట్టుకున్నావ్. నాక్కావలసిందదే!' అన్నాడు. కళ్యాణి కి తల తీసేసినంత పనయింది. కాని ఎలాగైనా తన బలహీనతను కప్పి పుచ్చుకోవాలనే ఉద్దేశ్యంతో 'మహా వీరాధి వీరుడైన ఆ నెపోలియన్ కీ కూడా ఎలుక లంటే భయంట. దానికే మంటారు? ఒక్కొక్క మనిషిలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఎంత నిబ్బరం గల మనిషి గుండె లో నైనా ఎక్కడో ఒకచోట దుర్భలమైన భాగం ఉండకపోదు.' అంది.
    కాంతారావు ఆమె మాటలను వినిపించుకునే స్థితిలో లేనే లేడు. పోర్లిపోర్లి వస్తున్న నవ్వును అపుకుంటూనే ఉన్నాడింకా.
    అది చూసేసరికి కళ్యాణి కి వళ్ళు మండి పోయింది. అందువల్ల అతని చేతిలో నుండి పాపను లాక్కుని విసవిస బయటకు నడవసాగింది.
    వాళ్ళు బయటకు వచ్చేసరికి 'గుండ్లన్నీ అక్కడున్న ఒక పెద్ద ఏనుగు దగ్గర నిల్చున్నారు. ఆ ఏనుగు భక్తులిచ్చిన కానుకలన్నీ సాదర ప్రణామం చేసి స్వీకరిస్తోంది.
    'ఆ ఏనుగు నేక్కుతావా?' వేళాకోళంగా అడిగేడు కాంతారావు.
    కళ్యాణి నవ్వు రేఖలను పెదవులు దాటి బయటకు రాకుండా దాచేసి కళ్ళల్లో మాత్రం కోప రేఖలు కురిపిస్తూ చూసింది భర్త వంక.
    అంతలోకి రిక్షావాడు వచ్చేడు వాళ్ళ దగ్గరికి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS