కళ్యాణి మృదువుగా అతని పాదాలను వట్టుతోంది తల వంచుకుని.
అప్పటి ఆమె ఆకారం చూసేసరికి నవ్వొచ్చింది కాంతారావు కి. 'తెలుగు సినిమా పతివ్రతా లా ఏమిటా వేషాలు? ఇంకా చాల్లేరా! నాకు నిద్ర వస్తోంది.' అంటూ కుడి చెయ్యి చాచేడు ఆమె కోసం.
కళ్యాణి కదలలేదు. తల వంచుకుని అలాగే అతని పాదాల నుండి కాళ్ళ వరకు ప్రేమగా నిమరసాగింది మౌనంగా.
"ఏమిటివ్వాళ మొగుడి మీద అంత భక్తీ పుట్టుకొచ్చింది అమ్మాయి గారికి!' అన్నాడు.
కళ్యాణి వోసారి కాంతారావు వంక తలెత్తి చూసింది. కాని యేమీ మాట్లాడలేదు.
ఆమె అతని వంక చూసింది ఒక్క క్షణం మాత్రమే! కాని ఆ క్షణ కాలంలోనే ఆమె చూపు అతని రెటీనా ను దూసుకు పోయి, హృదయం లోతులను దాటుకుంటూ ఏదో ఒక అపూర్వమైన అతనిలోని ఆత్మ తాలుకూ అలౌకికమైన భాగాలను స్పృశించి అతనిని పరవశింప చేసింది.
పెళ్ళి కాక ముందు కూడా కాంతారావు ను ఆమెలో విపరీతంగా ఆకర్షింప జేసింది కళ్యాణి కళ్ళే! ఆమె కళ్ళలో అందం, ఆకర్షణ మాత్రమే కాక, మాటల కందని మరేదో మహత్తరమైన సౌందర్యం ఉంది. ఆ కళ్ళు ఒక సమయంలో పసిపాప కళ్ళలా అమాయకంగా కనపడతాయ్. మరుక్షణం లోనే 'ఎక్స్ రే' లాగా ఎదుటి మనిషి అంతర్యపు లోతుల్లోకి నిశితంగా దూసుకు పోగలవు. ఒక సమయంలో శృంగారాలను చిలికించే ఆ కళ్ళు మరో సమయంలో తపస్వీని నేత్రాలలా ఏవో అలౌకికా నందాల అన్వేషిస్తున్నట్టు వెలిగిపోతాయ్. మరో సమయంలో అమాయకత్వమో, సిగ్గో, ప్రేమో , ముభావమో వైరాగ్యమో , విరహమో ఏదో తెలియని విచిత్రమైన భావం కదలదు తుంటుంది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు అతని వంక చూసిన కళ్ళల్లో 'అదే' భావం ఉంది.
అ సమయంలో కళ్యాణి తనకంత దూరంగా, తనకంటే దూరంగా తనకంటే భిన్నమైన వ్యక్తిగా ఉండటం సహించలేక పోయేడు కాంతారావు. ఆమె శరీరాన్ని , మనసునీ, ఆత్మనీ అన్నిటినీ తనలో లీనం చేసుకుని, ఆమె తానుగా , తానె ఆమెగా మారిపోవాలని పించిందతనికి.
'కళ్యాణి ! ఇలారా! ఒక్కసారి నా గుండెల మీద తలానించి పడుకో! నేనీ దూరాన్ని భరించలేను.' అన్నాడు జీరవోయిన కంఠంతో కాంతారావు. అలా అంటూ ఆమె ఒళ్ళో ఉన్న తన పాదాలను యివతలకు లాక్కున్నాడు.
కళ్యాణి ఆ పాదాలను తన రెండు చేతుల తోనూ పట్టుకుని గుండెకు అనించుకుంది. తరువాత కాసేపు వెర్రిగా వాటిని ముద్దు పెట్టుకుంది. 'ఊ హు, తీయకండి. ఈ పాదాల నిక్కడే ఉండనివ్వండి. నాకిక్కడ నుండి కదల బుద్ది కావటం లేదు.' అన్నది.
కాంతారావు ఏదో మాట్లాడ బోయెడు. కాని ఏదో విపరీతమైన ఉద్వేగం వల్ల అతని కంఠం పెగిలి రాలేదు.
కళ్యాణి అంది. 'ఇలా మీ పాదాల దగ్గర కూర్చుంటే నా మనసుకు ఎంత శాంతిగా ఉందొ తెలుసా? నేను భగవంతుడిని నమ్మనని మీకు నామీద కోపం. కాని నిజానికి మిమ్మల్ని మించిన భగవంతుడు నాకేవ్వరున్నారు? ఆ గుళ్ళల్లో పొందలేని మనాశ్శాంతి ని మీ హృదయం మీద వాలి నపుడు పొంద గలుగుతున్నాను.
ఏ దేవుని పాదాల స్పర్శ కూడా యివ్వని అలౌకికానందాన్ని మీ పాద స్పర్శ నాకు లభింపజేస్తోంది. ఇలా మాట్లాడుతుంటే మీకు 'సిల్లీ' గా అనిపిస్తోందా? ఔను మీకలాగే అనిపించవచ్చు . దైవం ఎక్కడో లేడు మనుషుల్లోనే ఉన్నాడు. భార్య దైవాన్ని భార్తలోనే చూసుకుంటుంది. తల్లిగా తన పిల్లలలో చూసుకుంటుంది. చిన్నతనం లో తల్లి దండ్రులలో దైవాన్ని చూసుకుంటుంది. ఎక్కడ స్వార్ధానికి అహానికి అతీతమైన అనుబంధం ఉందొ అక్కడే దేవుడుంటాడు ఈ క్షణంలో మీకంటే అధికంగా ప్రేమించే వ్యక్తీ నాకెవ్వరూ లేరు. అందుకే మీ పాదాల దగ్గర కూర్చోవాలనీ , మీ భక్తురాలిగా మీలో లీనమై పోవాలనీ నాకనిపోస్తోంది." అంటూ కళ్ళనీళ్ళు కార్చసాగింది కళ్యాణి కాంతారావు చటుక్కున లేచి కూర్చుని కళ్యాణి ని తన ఒడిలోకి తీసుకున్నాడు. 'పిచ్చి కళ్యాణి! ఎందుకలా ఏడుస్తావ్? నీ మనసు నాకర్ధమయింది. మనిద్దరం ఒకరికొకరం ఎంతగా ప్రేమించుకుంటున్నామో , ఒకరికి మరొకరి అవసరం ఎంత ఉన్నదో యీ ప్రయాణం లో నాకర్ధమయింది కళ్యాణి ! ఇంట్లో ఉన్నన్నాళ్ళూ మామూలు భార్యాభర్తల్లా మెలుగుతున్న మనలోని ప్రేమ నివురు గప్పిన నిప్పులాగా ఉండిపోయింది. ఇలా బయటి ప్తపంచం లోకి వచ్చి , వ్యక్తులుగా ఒకరినొకరం పరిశీలించుకుంటుంటే మన మధ్య గల అనుబంధం 'ఎంత గాడమైందో ఎంత పవిత్రమైనదో మనకి తెలిసి వస్తోంది. ఏడవకు కళ్యాణి! ఏడవకు. సరీగ్గా నా మనసులో నేనేమనుకుంటున్నానో అదే భావాన్ని మాటల రూపంలో వెల్లడించేవు నువ్వు' అంటూ ఆమెను గాడంగా తన హృదయానికి హత్తుకున్నాడు.
ఆ సమయంలో వారిరువురి ఆత్మలు శరీరకాకర్షణల కతీతమైన అనుబంధంతో ఒకదాని కొకటి పెనవైచుకు పోయినాయ్.
* * * *
ఉదయం ఆరు గంటలకు లేచి, ఆదరా బాదరా కాలకృత్యాలన్నీ తీర్చుకుని ఏడు గంటలకు రెడీగా ఉందామను కుంటుండగానే రిక్షా అతను వచ్చి గుమ్మాని కెదురుగా నిల్చున్నాడు. అతనిని కాసేపు ఆగమని క్రిందికి వెళ్ళి అదే హోటలు లో టిఫిను , కాఫీ తాగేరు. అక్కడ పదినిమిషాలలో పూర్తవవలసిన పనికి పిల్లల హంగామా మూలంగా అరగంట పట్టింది.
మెత్తగా ఖరీదుగా ఉన్న ఆ సోఫాల మీద కుదురుగా కూర్చోమంటే బాబిగాడు కూర్చొనే లేదు. సోఫాలు పెద్దవిగా ఉండటం వల్ల కూర్చున్నప్పుడు క్రిందికి సగభాగం వ్రేలాడుతున్న కాళ్ళు నొప్పులు పుట్టటం వల్ల వాడు సోఫా మీదనే కాళ్ళు పెట్టుకుని కూర్చుంటానని అంటాడు. వో పక్క వాడి వాదన సమంజసమే నని తెలిసినా, సోఫా మీద బూట్ల కాళ్ళతో కూర్చుంటే చుట్టూ ఉన్న మిగతా వాళ్ళంతా తమ అనాగరికత ను చూసి ఎక్కడ అసహ్యించుకుంటారో నని కళ్యాణి భయం. అందువల్ల సరీగ్గా కూర్చోమని బాబిగాడిని నాయనా భయానా నచ్చచెప్పి జూసి, వాడు మాట వినక పోయేసరికి ఆ కోపాన్ని పైకి కక్కలేక, లోపలికి మ్రింగలేక ఉక్కిరిబిక్కిరయ్యింది కళ్యాణి.
చివరకు వీళ్ళు ఫలహారాలు ముగించుకుని ఎయిర్ కండిషన్లు 'డీలక్సు రెస్టారెంటు' లో నుండి బయట పడేసరికి కళ్యాణి కి , కాంతారావు కి ముచ్చెమటలు పోసినాయ్. పిల్లలు తిని మూతి కడుక్కోవటం వల్ల ముఖంలోని క్రింది భాగం నల్లగా పై భాగం పౌడరు పూతతో తెల్లగా ఉండేసరికి వాళ్ళ అవతారాలు చూస్తూనే కళ్యాణికి తిక్కరేగింది. వాళ్ళను మళ్ళీ రూముకు తీసుకు వెళ్ళి పౌడరు రాసి వస్తానంటే కాంతారావు వద్దని వారించేడు.
ఆ పై భాగం కూడా నీచేతి రుమాలుతో తుడిచెయ్యి దాంతో నీ పిల్లలు సహజ సౌందర్యం బయట పడుతుంది. అంతేకాని యిప్పుడు కనుక వాళ్ళను మళ్ళీ ముస్తాబు చెయ్యటం ప్రారంభించేవంటే మరో అరగంట పట్టవచ్చు. ఇప్పటికే రిక్షా వాడికి ఎడురుచూసీ చూసీ విసుగు పుట్టి ఉండవచ్చు.' అన్నాడు.
కళ్యాణి మాట్లాడకుండా అట్లాగే నడిచింది పిల్లలను వెంట బెట్టుకుని. అంతా రిక్షాలో కూర్చున్నారు.
ఇద్దరు పిల్లలతో రిక్షాలో యిరుకుగా కూర్చోవటం ఆ దంపతులకు బాధనిపించకపోయినా బాబిగాడిని మాత్రం మహా చిరాకు పరిచింది. 'నాన్నా! ఈ రిచ్చా బాగా లేదు. టాక్సీ లో పోదాం' అన్నాడు.
మొగుణ్ణి దేప్పటానికి మంచి సమయం దొరికిందనుకుని కళ్యాణి 'చూసేరా! చిన్న పిల్లాడి కున్నపాటి బుర్రన్నా లేకపోయింది మీకు' అన్నది.
'బోడి సలహాలు నవ్వునూ పోవోయ్. ఆ సంగతి నాకూ తెలుసులే! టాక్సీ లో నైతే ఐదు నిమిషాల్లో తీసుకు పోతాడు. రిక్షాలో అయితే మెల్లగా వెళ్తూ ఊరంతా సావకాశంగా చూడవచ్చు.' అన్నాడు తనని తాను సమర్చిందుకుంటూ.
వెంటనే రిక్షా వాడు అందుకుని 'ఔను బాబూ! మీరన్నది కరెక్ట్. మిమ్మల్ని ఊరంతా తిప్పి చూపిస్తున్నాను. అన్నట్టు అమ్మగారు మరి పట్టు చీరేమయినా కొనుక్కుంటారా? కావాలంటే బట్టలు షాపు ల్లోకి కూడా తీసుకుపోతాను. ఇంతదూరం పచ్చి, కంచి పట్టు చీర కొనుక్కోకపోతే ఎలా బాబూ?" అన్నాడు.
కళ్యాణి భర్త వంక ఆశగా చూసింది. 'నాకో పట్టు చీర కొని పెట్టరూ?' అన్నట్లు.
'అలాగే - కొనిపెడ్తాలే!' అన్నట్లు తలూపేడు కాంతారావు.
దాంతో కళ్యాణి మనసు తాము ముందు దర్శించ బోయే దేవుళ్ళ కన్న అ తరువాత కొనబోయే కంచి పట్టు చీరని గురించే కలలు కనసాగింది.
'మా కాంతం చాలా మంచివాడు. నేనే మడిగినా కాదనడు" అనుకుంది గర్వంగా.
ముందు రిక్షా 'శివ కంచి లో ఆగింది. అక్కడ అమ్మవారి గుడి, పరమేశ్వరుని ఆలయం ముఖ్యంగా చూడదగినవి. అన్నిటి కన్న శివ కంచి లోని ప్రత్యేకత యేమంటే ఆ దేవాలయ ప్రాంగణం లో నున్న ఒక మామిడి చెట్టు వయస్సు రెండు వేల సంవత్సరాల పైగా ఉందిట. అలా అని ఆ చెట్టు మీద అరవం లో వ్రాసి కూడా ఉంది.
'అది వ్రాసి ఎన్ని వేల సంవత్సరాలయిందో !' అన్నది కళ్యాణి . కాంతారావు పకపక నవ్వేడు.
ఆలయం చాలా విశాలంగా, ఎత్తుగా ఉంది. అసలు దైవాన్ని దర్శించ బోయే ముందు మరెన్నో దేవుళ్ళు ఎదురైనారు. ఒక్కొక్క గుళ్ళో ను ఒక పూజారి నిల్చుని రిక్షా భక్తులకు హారతి యిచ్చి పైసల కోసం పళ్ళెం జాపుతున్నాడు. ఆ పూజారులలో చాలామంది అరవ వాళ్ళే. అయినా తెలుగు వాళ్ళు కూడా తక్కువ మందేమీ లేరు.
అందులో ఒకాయన వీళ్ళను చూస్తూనే తెలుగు వాళ్ళని గ్రహించి 'మీదే ఊరండీ?' అనడిగాడు. కాంతారావు చెప్పేడు.
ఆ పూజారి ముఖంలో ఏదో దీనత్వం ఉన్నట్లు కనిపించి, తనకు తెలియకుండానే తన కాళ్ళు బంధించి వేయగా, ఆగి 'మీదే ఊరండీ? మీరు తెలుగు వాళ్ళలా ఉన్నారు.' అన్నాడు.
"మాది కాకినాడ. ఎన్నో సంవత్సరాల క్రితం మా నాన్నగారు యిక్కడకు వచ్చి యీ గుళ్ళో పూజారిగా ఉన్నారు. అయన పోయిన తరువాత నేను కూడా యిక్కడే చేరాను. తెలుగు దేశం చూసి ఎన్నాళ్ళయిందో! మన తెలుగు వాళ్ళేవరయినా వస్తే మనసారా తెలుగులో మాట్లాడి మంచి, చెడ్డా అడగాలని పిస్తుందండి!' అన్నాడు.
ఎందుకో అతని మాటలు వింటుంటే కళ్యాణి, కాంతారావు ల గుండెలు కలుక్కుమన్నాయ్ ఎక్కడున్నా, ఏం చేస్తున్నా మానవుడు జననిని, జన్మ భూమిని మర్చి పోలేదు గదా! అనిపించింది.
ఇతని లాటి మనుషులు చాలామంది ఉన్నారు. ఒక రాష్ట్రం వాడు మరో రాష్ట్రానికి , ఒక దేశం వాడు మరో దేశానికి పొట్ట కూటి కోసమో, వ్యాపారరీత్యానో ఎందుకో ఒకందుకు పోతారు. అక్కడే స్థిరపడి పోయి పూర్తిగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. కాని అప్పుడప్పుడు ఏ కొందరు వ్యక్తులో తారసపడి నప్పుడు, ఏ సంఘటనో జరిగినపుడు, మనసు గతం లోకి పరుగిడుతుంది. పాత వాసనలు మనిషి నుక్కిరి బిక్కిరి చేస్తాయ్. జ్ఞాపకాలు కన్నీళ్ళను కురిపిస్తాయ్! వెంటనే తమాయించుకుని మరల మామూలు జీవితాన్ని ప్రారంభిస్తారు.
కళ్యాణి కాంతారావు తిరిగి వస్తుంటే కొంతసేపటి వరకు, దీనంగా, ఆకలిగా ఆత్రంగా ఉన్న ఆ పూజారి కళ్ళు రెండూ వారిని వెన్నంటి వస్తున్నట్లే అనిపించింది.
తరువాత విష్ణు కంచికి తీసుకుపోయింది రిక్షా. శివ కంచి కంటే చాలా పెద్దది విష్ణు కంచి.
'శివుడు, విష్ణువు ఒకే ఊళ్ళో కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నారంటే ఒకప్పుడు శైవులు, వైష్ణవులు అనబడేవాళ్ళు బుర్రలు ఎన్ని బ్రద్దలయి ఉంటాయో ఊహించుకోవచ్చు.' అన్నది కళ్యాణి.
