Previous Page Next Page 
బాంధవ్య బంధితులు పేజి 22


    ఇక వెనక్కి తిరిగివెళ్ళే ప్రయాణానికి సద్దటంలో మునిగిఉన్న అనూరాధ వెనకనించి వచ్చి రెండు బుజాలు పట్టుకు వెనక్కి తిప్పి, "గుడ్ న్యూస్!" అన్నాడు శ్రీనివాస్. అతని చేతిలో పేపరు చూసి "రిజల్స్టు వచ్చాయా?" అంది.
    "ఏం అంత తేలికగా అడిగావు? పాసవుతావని తెలుసేమిటి?"
    "ఇంతవరకు తెలియదు. ఇప్పుడు మీ ముఖం చూడగానే అయ్యాయని తెలిసింది!"
    "ఊఁ...."
    "ఊఁ.....పదండి మీదే ఆలస్యం!"
    "అంతా రెడీయా?"
    "ఆఁ, మీరుతప్ప."
    "నాదెంతసేపు?" రాధకు అభినందనాలతోపాటు బుగ్గమీద బుల్లి ముద్దు ఇచ్చి మరీ లోపలికి వెళ్ళాడు.
    వైజాగ్ వచ్చేసరికి శ్రీనివాస్ కు హౌస్ సర్జను పదవిలో చేరేందుకు ఆర్డర్స్ వచ్చి ఉన్నాయి. శ్రీనివాస్ కు తిరిగి డాక్టరు కాబోతూంటే అవ్యక్తమయిన, వర్ణించవీలుకాని రకరకాల భావాలు మనస్సులో మెదిలాయి. డాక్టర్లు, రోగులు, నర్సులు మొదలయినవారి వాతావరణంలో అడుగు పెడుతూంటే విచిత్రాను భూతి కలిగింది. తనది కాని దేదో తను స్వంతం చేసుకుంటున్న భావం మెదిలింది. తను దానికి ఎంత దూరమవాలనుకున్నాడో అంత దగ్గిర అవుతున్నాడు.        
    శ్రీనివాస్, అనూరాధ చిన్న మేడలో వారి తొలికాపరం ప్రారంభించారు. ఇంటికంతటికీ సందడి తెచ్చే కూతురు ఇంట్లోంచి వెళ్ళేటప్పటికి ఇల్లంతా చిన్నబోయింది. శ్రీలక్ష్మికి తోచకుండాపోయింది. దానితో కొడుక్కి పెళ్ళి చెయ్యాలన్న ఆత్రత హెచ్చింది.
    లలిత కాలేజీలో డిమాన్ స్ట్రేటర్ గా చేరింది కొద్దిరోజులు చదువు వెనక్కి పెట్టదలిచి. హనీమూన్ నించి వచ్చిన అనూరాధను చూడగానే లలితను ఏదో ఆశ్చర్యం ఆవరించింది. ఒక్కనెలరోజులలో అనూరాధలో ఎంతో మార్పు కనిపిస్తూంది. కళ్ళల్లో సంతోషపు మెరుపు తళుక్కుమంటూంది. మెడలో నల్లపూసలు, పక్కన బంగారపుతాడు కొత్త అందంతో హుందాగా కనికిపిస్తున్నాయి. మునుపెన్నడు లేని పెద్దతనం కనిపిస్తున్నది. అనూరాధ ఎంతో సంతోషంగా ఉందని అడగకుండానే తెలియజెబుతూంది.
    శ్రీనివాస్ ఇంటికి వచ్చేటప్పటికి బాగా ఆలస్యమయింది మధ్యాహ్నం. అప్పటిదాకా అనూరాధ అతనికోసం వేచి ఉంది. ఇంటికి వచ్చి బట్టలు మార్చుకుని టేబుల్ ముందుకు వచ్చి, "ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవేం, అనూ? నాకోసం వేచి ఉండద్దని చెప్పలా? చేసే పనులకు కొంచెం బుర్ర ఉపయోగించాలి. ఇలా అయితే నీ ఆరోగ్యం చెడుతుంది కూడా."
    "అయిందా చివాట్లెయ్యడం? అయినా నాకు బుర్ర ఉపయోగించటం చేతకాదన్న సంగతి ఇవాళ తెలిసిందా?"
    "ఊఁ... అయినా చెప్పినమాట విననివాళ్ళను చివాట్లతోనే లొంగదియ్యాలి" అంటూ బుజం చుట్టు చేతులు వెయ్యబోయాడు. అవి తప్పించుకుని అతని భుజాల మీద తన రెండు చేతులు వేసి బలంగా కిందికి నొక్కి కూర్చునేటట్లు చేస్తూ, అన్నం వడ్డించిన ప్లేటు ముందుకు తోసింది. ఆమెవంక చురచుర చూసి ప్లేటు ముందుకు లాక్కున్నాడు ఆకలి, ఆకలిగా.
    "ఈ పనులన్ని చేసుకోకపోతేవంటమనిషిని పెట్టుకోకూడదూ?"
    "నా వంట నచ్చకపోతే సూటిగా చెప్పకూడదూ, ఈ ఆపేక్ష అంతా ఒలకబొయ్యకపోతే?" అంది చురచురా చూస్తూ.
    "నీ మొహం, వంట నచ్చకకాదు, నీకు శ్రమ ఎందుకనిగాని." నవ్వాడు చిలిపిగా.
    "నాకేం శ్రమ లేదు. ఇప్పటికే ఏమీ తోచక చస్తూంటే, ఈ పనికూడా లేకపోతే పిచ్చెక్కుతుంది."
    "చేతినిండా పని కావాలా? సలహా ఇవ్వనా?" కొంటెగా చూస్తూ అన్నాడు.
    "చెప్పండి."
    "ఓ జూనియర్ ని ఉద్ధరిస్తే సరి! వద్దనుకున్నా కావలసినంత కాలక్షేపం!" నవ్వాడు.
    "మీకు, మీ సలహాకు ఓ నమస్కారం. ఏం డాక్టర్లు బాబు! బర్త్ కంట్రోల్ అని అఘోరిస్తూ ఉంటే మీరీ సలహా ఇస్తారు."
    "పోనీ ఈ సలహా నచ్చకపోతే ప్రాక్టీసు మొదలుపెట్టు, ఎలాగూ లా చదివావుగా."
    "మీరిచ్చే సలహాలు నాకు నచ్చవుగాని, నాకు తోచింది నన్ను చెయ్యనివ్వండి" అంది వక్కపొడి అందిస్తూ. వక్కపొడితోబాటు ఆమెనుకూడా దగ్గిరికి తీసుకుంటూ, "నీ ఇష్టానికి ఎప్పుడూ అడ్డు లేదు" అన్నాడు బుగ్గల మీద స్పృశిస్తూ.
    ఆరునెలలు గడిచిపోయాయి. మధ్య మధ్య శ్రీనివాస్ లో అర్ధంకాని మార్పు గమనిస్తూనే ఉంది అనూరాధ. దానికి కారణం ఏమిటో తెలియక పోయినా, అడిగి తెలుసుకోవాలన్న కుతూహలం చంపుకోలేకపోయింది. కాని ప్రయోజనం పొందలేకపోయింది. హాస్పిటల్ లో సీరియస్ కేస్ ఏది చూడవలసి వచ్చినా, ఆరోజు అతని మనస్సు పరిపరివిధాల ఆలోచించకుండ ఉండలేకపోతూంది. ప్రమాదంగా ఉన్న పేషంటును గురించి రాత్రి అంతా నిద్రలేకుండా గడిపిన రాత్రులు కలవరపెట్టాయి అనూరాధకు. అతనిలోని మార్పు ఏ విధంగా అర్ధంచేసుకోవాలో తెలియలేదు. తను తలపెట్టిన కార్యం సఫలం చెయ్యమని మనసారా దైవాన్ని ప్రార్దించింది.
    అనూరాధ ఆంతర్యం, కృష్ణమూర్తిగారి శృతిమించిక పర్యవేక్షణ, పరిశీలన మధ్యమధ్య విసుగు కలిగించినా మనస్సుకు పట్టించుకోకుండా మెదలసాగాడు.

                                     27

    నువ్వు లలితను కలుసుకుని ఎన్నాళ్ళయింది?" అనూరాధని అడిగాడు
    శ్రీనివాస్ భోజనం చేస్తూ.        
    "ఏం? ఓ వారం అవుతూందనుకుంటాను."
    "వీలయితే ఇవాళ సాయంత్రం ఒకసారి కలుసుకునిరా. వాళ్ళ అమ్మ గారిని హాస్పిటల్లో జాయిన్ చేశారు."
    "హాస్పిటల్ లోనా?...ఎప్పుడూ? మళ్ళీ ఒంట్లో బాగాలేదా?"
    "లేదు. ఈసారి ఎప్పుడూ కంటే బలహీనంగా ఉన్నారు. ఇంట్లో కంటే హాస్పిటల్ లో ఎక్కువ జాగ్రత్త తీసుకోవచ్చని చేర్పించాం."
    "ఎలా ఉంది ఆవిడికి? మీ ఉద్దేశం ఏమిటి? నాకు నిజం చెప్పండి."
    "ఏమో! తగ్గిపోవచ్చనుకుంటాను. కాని ఆవిడికి లలితను గురించి పెద్ద దిగులు. దానితోనే ఈ గుండెజబ్బు ఎక్కువవుతూందనుకుంటాను."
    ఇంక మాట్లాడేందుకు ఏమీ తోచలేదు. అసలే రెండురోజులనుండి భోజనం సహించని అనూరాధకు ఈ వార్త విన్నాక అసలు తిన బుద్ధి పుట్టలేదు. అది చూచి, "ఏమిటా తినడం? అసలు నాదే పొరపాటు. నీకు భోజనం ముందు ఈ విషయం చెప్పకుండా ఉండవలసింది" అన్నాడు తప్ప మరొక కారణాన్ని ఊహించలేకపోయాడు.
    "అన్నట్లు నేను సాయంత్రం హాస్పిటల్ కు వెళ్ళాలి. రాత్రి డ్యూటీ ఉంది. ఇక్కడ భోజనం చెయ్యను" అంటూ ఏవో కబుర్లు చెప్పసాగాడు.
    "ఊఁ" అంటూన్నా పరధ్యాన్నంగా ఉన్న రాధను గమనించి, "కొంచెం సేపు రెస్టు తీసుకో" అంటూ ఆమెను వెంటబెట్టుకుని పైకి వెళ్ళాడు.
    సాయంత్రం అనూరాధను లలిత ఇంటిలో దింపి హాస్పిటల్ కు వెళ్ళాడు శ్రీనివాస్.
    లలితకు కొంచెం ధైర్యం చెప్పి సాయంత్రం బాగా పొద్దు పోయాక ఇంటికి వచ్చింది రాధ. ఆ రాత్రి ఇక భోజనం చెయ్య బుద్ధికాక గ్లాసుడు పాలు తాగి ఓ పుస్తకం పట్టుకుని కూర్చుంది. ఆ పూట ఎందుకో మనస్సులో ఏవో అర్ధంకాని భావాలు చుట్టుముట్టాయి. ఎంత ప్రయత్నించినా పుస్తకంమీద లగ్నంకాని మనస్సులో ఆలోచనలు బహుమార్గాలలో పయనించసాగాయి. వాలు కుర్చీలో పడుకుని కళ్ళు మూసుకో ప్రయత్నించింది.
    అసలే అమావాస్య. ఆకాశమంతా నల్లటి మబ్బులు దట్టంగా అలుముకున్నాయి. ఆలోచనలకు అడ్డు తగులుతూ ఒంటరితనాన్ని గుర్తించచేస్తున్నాయి మధ్య మధ్య ఉరుములతో కూడిన మెరుపులు.
    హాస్పిటల్ సద్దు మణిగింది. చిన్నలైట్లు మసగ్గా వెలుగుతున్నాయి. వార్డులలో రోగులు ఇబ్బందిగా పొర్లేవారు, ఒంటరితనాన్ని అనుభవించలేనివారు, వ్యాధులతో బాధపడేవారు అనేకులున్నారు. అక్కడక్కడ నర్సుల గుసగుసలు అంతగా నిశ్శబ్ధాన్ని భంగపరచలేకపోయాయి.    
    డాక్టర్ శ్రీనివాస్ తన రూమ్ నుండి బయటికి వచ్చి, స్పెషల్ వార్డులోని రోగులను ఒకరిద్దరిని చూచి, ఛార్టు మీద ఏదో రాసి పక్క గదివైపు వెళ్ళాడు. అతనితోకూడా ఉన్న నర్సు ఆ గదితలుపు మెల్లిగా తోసింది. సన్నని బెడ్ లాంప్ వెలుగులో లలిత తల్లిముఖం అస్పష్టంగా కనుపించింది. "సాయంత్రమంతా బాగా బాధపడ్డారు. ఇప్పుడే నిద్ర పట్టినట్లుంది." నర్సు చెప్పిన మాటలు విని మౌనంగా తల ఊగించాడు. ఛార్టు చదివి బయటికి వచ్చి, "జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి ఈ పేషంటును. ఏమాత్రం మార్పు కనిపించినా వెంటనే తెలియజెప్పు" అని తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు.
    ఆలోచనలు అంతులేకుండా సాగిపోయాయి. తిరిగి ఏదో సంచలనం మొదలయింది. తను కాదనుకున్న పని మానలేడు. తను చెయ్యాలనుకున్న పని చెయ్యలేడు. ఏ మూల దాక్కుందో ఈ దౌర్భల్యం? తెల్లవారి లేచినది మొదలు రాత్రి పడుకునేదాకా రోగులు, వ్యాధులు, బాధలు తప్ప నవ్వు ముఖాలు కనిపించేది లేదు గదా! ఏముంది సుఖం ఈ వృత్తిలో? బాగుపడ్డ ఒకడి నోటంట చల్లనివార్త విన్న సంతృప్తి తీరకుండానే చేతకాక చంపాడన్న వార్తకూడా వినవలసివస్తుంది. దొంగసర్టిఫికెట్లు, పోటీప్రాక్టీసులు!... ఎందుకు చెయ్యాలి తృప్తిలేని ఉద్యోగం?
    ఎప్పుడు మూతపడ్డాయో కళ్ళు......తెరిచేటప్పటికి, "డాక్టర్, ఎనిమిదవ నెంబర్ పేషంటు పరిస్థితి బాగాలేదు" అంటూ హడావిడిగా లేపుతూంది నర్సు. "వాట్?" అంటూ లేచి నుంచున్నాడు. నిద్రమత్తంతా క్షణంలో వదిలిపోయింది. టేబుల్ మీద పెట్టిన స్టెతస్కోప్ తీసుకుని, ఒక్క అడుగులో ఎనిమిదవ నెంబర్ రూమ్ లో పడ్డాడు.
    బెడ్ మీద లలితతల్లి అన్నపూర్ణ అమితమయిన బాధ అనుభవిస్తూంది. గుండెలమీద చెయ్యి వేసుకుని గిలగిలలాడిపోతూంది. ఆమెను చూడగానే అతని మనస్సు ఒక్క క్షణం చలించింది. ఒక్కసారి తల విదుల్చుకుని, కర్తవ్యం గుర్తుకు తెచ్చుకుని పరీక్షించడంలో మునిగిపోయాడు. నాడి చూచి బ్లడ్ ప్రెషర్ చూడటానికి కఫ్ చేతికి కడుతూ ఇంజక్షన్ ఆర్డర్ చేశాడు. నర్సు బయటికి పరిగెత్తింది హడావిడిగా. బ్లడ్ ప్రెషర్ చూస్తూ స్టెతస్కోప్ చేతిమీద ఉంచి ముందు బల్బు నొక్కుతూండగానేం శ్రీనివాస్ నుదుట చెమటలు పోశాయి. ముఖం వివర్ణమయింది. అతను ఆమెవంక చూస్తూండగానే ఆమె ముఖం వేలాడేసింది, బాధతో బిగపట్టిన గుప్పిడి మరింత బిగుసుకుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS