"ఈవిడ మైకంలో ఉంది. బ్రతుకుతుందనే ఆశ ఎక్కువ లేదు."
అందరి గుండెలు ఝల్లుమన్నాయి ఒక్కసారి. ముసలమ్మ చాలారోజులనించి జబ్బుగా ఉన్నా ఇంత తొందరలో పోతుందనుకోలేదు.
"ఎన్ని రోజులు ఆశ ఉంది అంటారు?" రామారావు గారు అడిగారు.
"ముసలివాళ్ళతో ఏమీ చెప్పలేము. కొన్ని గంట లలో పోవచ్చును ప్రాణం. లేదా ఒక రోజంతా ఉండ వచ్చును ఈ మైకంలో. కొంతమంది రెండుమూడు రోజులు మైకంలో ఉన్నవాళ్ళు ఉన్నారు." డాక్టరు గారు వివరించి, "నేను చేయవలిసింది ఇక్కడ ఏమీ లేదు" అంటూ వెళ్ళిపోయారు.
అందరు ఎక్కడి పనులు అక్కడ వదిలి వచ్చి ముసలమ్మ మంచంచుట్టూ చేరారు. రామారావు గారు, చారుమతి స్కూళ్ళకి సెలవుచీట్లు పంపారు.
ముసలమ్మ పరిస్థితి తెలిసి ఇరుగు పొరుగు కూడా వచ్చి చూడటం మొదలు పెట్టారు. వచ్చిన వాళ్ళంతా ముసలమ్మ మంచితనం పొగుడుతున్నారు. ఆవిడ పడిన కష్టాలు తలుచుకుని వగస్తున్నారు. శాంతమ్మని, పిల్లల్ని ఓదారుస్తున్నారు.
ఇంతలో ఛాందసుడైన ఒక వృద్దుడు వచ్చి పెద్దగా హాహాకారాలు చేశాడు. "అయ్యయ్యో! అంత బ్రతుకూ బ్రతికిన ముసలమ్మని మంచంమీద పడుకోబెట్టారా? కింద పడుకోబెట్టండి. మంచంమీద చస్తే పరలోకం పొందదు ఆవిడ."
"ఇంట్లో చనిపోతే నక్షత్రం మంచిది కాకపోతే ఇల్లు పాడుపెట్టాలి. వీథిలో పడుకోబెట్టండి. ఆవిడ ఎప్పుడు ప్రాణం వదులుతుందో తెలియదాయిరి" అన్నారు మరొకరు.
చుట్టూ మూగిన ఇరుగు పొరుగు ఈ రెండు సూచనలకి తల ఊపి మద్దతు ఇచ్చారు.
శాంతమ్మ నిస్సహాయంగా అల్లుడివేపు చూసింది. రామారావుగారు ఏమీ పాలుపోనట్లు నిలుచున్నారు.
"అయ్యా, మాస్టారూ, వీథిలో చాపవేసి ముసలా విడని పడుకోబెట్టండి. నలుగురం మేముకూడా సహాయం చేస్తాం" అన్నారు ఒకాయన.
వీథిలో చాప వేసి ముసలమ్మని పడుకోబెట్టారు. బెండులా ఎండిపోయి, బొమ్మలా తేలికగా ఉన్న ముసలమ్మని బయట పడుకోబెడుతూ, 'ఈవిణ్ణి మోయడానికి నలుగురెందుకు? నేను ఒక్కన్ని చాలు' అనుకున్నారు రామారావుగారు.
వీథిలో ముసలమ్మని పడుకోపెట్టడం పెద్ద ఇబ్బందే తెచ్చిపెట్టింది. వీథిలో వెళ్ళే ప్రతివాళ్ళూ ఒకసారి ముసలమ్మని తొంగి చూసి, కారణం అడిగి, సానుభూతి వాక్యాలు పలికేవారు. వచ్చేపోయే వాళ్ళతో చిన్న గుంపు చేరింది ఇంటిముందు.
"ఏమిటీ గొడవ? వీళ్ళందరికీ చెప్పలేక మన ప్రాణంపోతూంది. ఇంట్లోనే పడుకోబెడదాం, బావగారూ, ఏమైతే అదే అవుతుంది" అంది చారుమతి, రామారావు గారితో, బయటినించి ఇంట్లోకి విసుగ్గా వస్తూ,
"తీరా బయటికి తెచ్చిపెట్టాక మళ్ళీ ఇంట్లో పడుకోబెడితే బాగుండదమ్మా" అన్నారు రామారావు గారు.
చివరికి ఆయనే ఉపాయం ఆలోచించారు. మూడు పాత దుప్పట్లు తీసుకువెళ్ళి ఎందు రాటల సాయంతో ముసలమ్మ చుట్టూ తెరలు కట్టి, మరుగు ఏర్పరిచారు.
రేవతికి విశాఖపట్నం టెలిగ్రాం ఇచ్చారు.
చీకటి పడింది. రాత్రి అయింది. ముసలమ్మ ఇంకా ఇహలోకం వదలలేదు. అన్నపానాల మాట మరిచి ముసలమ్మ చుట్టూ చేరిన పెద్ద, చిన్న అలిసి పోయారు.
"మీరందరు ఎందుకమ్మా ఇక్కడ? కళ్ళు మూసుకు పోతున్నాయి. ఇంట్లోకి వెళ్ళి నిద్రపోండి" అంది శాంతమ్మ పిల్లల్ని చూస్తూ.
ముసలావిన్ని, తల్లిని విడిచి రావడానికి ఒకపక్క మనస్సు పీకుతున్నా, అలసట, నిద్ర ఇంకోవైపునించి తరుముతూ ఉంటే అందరూ మెల్లిగా లోపల చేరి తలో మూలా నిద్రకి తల వాల్చారు. శాంతమ్మ, భాను మతిమాత్రం ఒక హరికెన్ లాంతరు పెట్టుకుని, దుప్పట్లు కప్పుకుని వీథిలో ముసలమ్మకి కాపలా కూర్చున్నారు.
"భాను, మీ రిద్దరూ చలిలో ఎంతసేపు కూర్చుంటారు? మామ్మగారిని లోపల పడుకోబెడదాం, పదండి" అన్నారు రామారావుగారు, రాత్రి పదకొండు గంటలకి బయటికి వచ్చి.
అత్తగారు మౌనంగా ఉండటం చూసి, ఆయనే ముసలమ్మని సునాయాసంగా తీసుకువెళ్ళి నులక మంచంమీద పడుకోబెట్టారు.
రెండో రోజు తెల్లవారింది. ఇంకా ముసలమ్మ ఇహపరాల మధ్య వేళ్ళాడుతూ మైకంలోనే ఉంది.
"ఇవాళ ఈవిడ మంచం మీద చనిపోతే మన పరువు దక్కదు; ఆవిడికి పరలోకం దక్కదు. నిన్నంతా కూర్చున్న కష్టం అంతా ఫలితం లేకుండా పోతుంది. ఇవాళకూడా వీథిలో చాపమీద పడుకోబెట్టండి" అంది శాంతమ్మ, ఉదయం లేస్తూనే.
మళ్ళీ ముసలమ్మ స్థానం వీధిలోకి మారింది. చుట్టూ పరదా ఏర్పడింది.
ఇంట్లో చారుమతి కాఫీలు చేసి అందరికీ ఇచ్చింది. మధ్యాహ్నం వంట చేసింది. మనసు కష్ట పెట్టుకుంటూ, పిల్లల బలవంతంమీద కొద్దిగా ఎంగిలిపడింది శాంతమ్మ.
"ఇంకా అవ్వగారు పోలేదా?" అంటూ ఇరుగు పొరుగు మళ్ళీ వచ్చి చూసిపోయారు. డాక్టరు వచ్చి ముసలమ్మని చూసి వెళ్ళాడు.
మధ్యాహ్నం రేవతి, భర్త గోపాలరావు, పిల్లలు వచ్చారు. ఆ రోజు వాళ్ళు కూడా శాంతమ్మ, పిల్లలతో పాటు వీధిలోనే ముసలమ్మ పక్కన కూర్చున్నారు.
మరణిస్తారని తెలిశాక, ఆ మరణంకోసం నిరీక్షణ కూడా విసుగే.
"ఇన్నాళ్ళూ జబ్బులతో మంచంమీద సాధించినది కాక, చచ్చిపోతూకూడా సాధిస్తూంది మామ్మ" అంది భగవతి ఉండబట్టలేక.
"ఏమిటే ఆ మాటలు! నోరు మూసుకో" అంది రేవతి కసురుకుంటూ.
"అక్క జీతంలో సగంపైన మామ్మ మందులే మింగేశాయి" అంది తిరిగి భగవతి.
రేవతి భగవతి వీపుమీద ఒక్కటి అంటించి "నువ్వు ఇంట్లోకి వెళ్ళు!" అంది కోపంగా.
ఆ రోజూ గడిచింది. ముసలమ్మమాత్రం 'ఈలోకం వదలను. మీరింకా నాకు ఋణపడిఉన్నారు' అంటూ ఉండిపోయింది. రామారావుగారు తిరిగి ముందు రోజులాగే ముసలమ్మని లోపల పడుకోబెట్టారు.
ప్రయాణం చేసివచ్చిన రేవతి, భర్త, రెండురోజుల నించి సక్రమంగా ఆహార నిద్రలు లేని శాంతమ్మ ఇంటి వారు ఆ రాత్రి గాఢ నిద్రలో మునిగిపోయారు.
తన మొద్దునిద్రని తిట్టుకుంటూ పొద్దున్నే లేచిన శాంతమ్మ చల్లగా, కొయ్యలా ఉన్న అత్తగారిని చూసి హడిలిపోయింది. ఆవిడ పంతం పట్టినట్టు మంచంమీదే ప్రాణాలు వదిలింది.
ముసలమ్మకి తలకొరివి ఎవరు పెడతారనేది సమస్య అయిపోయింది. ఉన్న ఒక్క కొడుకుపైనా ఆశలన్నీ పెట్టుకుంటే, "నా దారి నాది" అంటూ అర్దాంతరంగా కన్ను మూశాడు సూర్యారావు. పోనీ, మనమడు ఆదుకుని తన పబ్బం గడుపుతాడని నిబ్బరంతో బ్రతికితే, శంకరం దేశాలు పట్టి పోయాడు. అందరూ ఉండి ఎవరూ లేనట్టు అయిపోయింది ముసలమ్మకి. శాంతమ్మ భర్తని, కొడుకుని తలుచుకుని ఏడ్చింది.
"మరణించాక ఏముంది? అంతా మట్టే! ఆ మట్టిని మట్టిలో కలపడానికి కొడుకైతేనేం మనమడు అయితేనేం! వీథిని పోయేవాడు అయితేనేం? అంతా ఒకటే!" అన్నారు రామారావుగారు.
తామే ముసలమ్మ అంత్యక్రియలు యథావిధిగా జరుపుతామని శాంతమ్మకి మాట ఇచ్చి ఊరడించారు.
రేవతి భర్త గోపాలరావు, భానుమతి భర్త రామారావు ముసలమ్మ అంత్యక్రియలు జరపటానికి వెళ్ళారు. కష్టాలలో కొడుకులలా ఆదుకునే అల్లుళ్ళు దొరకటం తన అదృష్టంగా భావించింది శాంతమ్మ.
* * *

ఇల్లంతా బావురుమంటూంది. ముసలమ్మ లేని వెలితి ఇంట్లో బాగా కనిపిస్తూంది. ఆవిడ ఆ ఇంటికి మూలస్తంభంలాంటిది. ఆవిడ పనేం చెయ్యలేకపోయినా, చివరి రోజులలో మంచంమీద నించి లేవలేకపోయినా, ఇంట్లో ఆవిడ ఉండటం ఒక నిండుగా ఉండేది. అందరికి పెద్దదిక్కు అనిపించేది. ఆవిడికి మనమడు అన్నా, మనమరాళ్ళు అన్నా ఎంతో అభిమానం. అందరిని ఆప్యాయంగా చేరదీసేది. కోడల్ని కూతురులా చూసుకునేది.
మధ్యాహ్నం నాలుగైంది. ఇంట్లో నిశ్శబ్ధాన్ని చీల్చుకుంటూ బయటినించి ఎవరిదో గొంతుక వినిపించింది.
"సూర్యారావుగారి ఇల్లు ఇదేనాండీ?"
భగవతి బయటికి వచ్చి చూసింది. ఎవరో ఇరవై సంవత్సరాల యువకుడు నిలబడిఉన్నాడు. చురుకైన కళ్ళు, ఉంగరాల జుత్తు, మంచి తెలివైన ముఖం.
"ఇదేనండీ. ఎవరు కావాలి?" అంది భగవతి.
"చారుమతి ఉన్నారా?" అన్నాడు అతను.
"ఆఁ, ఉంది" అంటూ లోపలికి వెళ్ళింది భగవతి. చారుమతికోసం ఎవరో యువకుడు వచ్చాడంటే ఇంట్లో అందరికీ ఆశ్చర్యంగా ఉంది. చారుమతికూడా కుతూహలంగా బయటికి వచ్చి చూసింది. అతని ముఖం ఎప్పుడూ చూసిన గుర్తు లేదు. అపరిచితుడు.
"నేనే చారుమతిని ఏం కావాలి మీకు?"
"నా పేరు గోపాల్. విజయనగరంనించి వచ్చాను" అన్నాడతను.
చారుమతి ఒక్క నిమిషం 'ఎవరా ఇతను?' అని ఆలోచించింది. వెంటనే డబ్బు పంపడం గుర్తు వచ్చింది.
"ఓహో, నువ్వా! రారా!" అంది చారుమతి దరహాసం చేస్తూ.
"ఎవరే అతను?" అంది రేవతి.
"ఇతను మనకి బాగా కావలసినవాడు. శారదత్తయ్య కొడుకు" అంది చారుమతి.
"ఓహో, గోపాలా?" అంది భానుమతి.
'ఎవరీ శారదత్తయ్య?' అని ఆశ్చర్యపోయారు రేవతి, మాలతి, భగవతి.
అందరికి నమస్కారాలు చేశాడు గోపాల్.
"నీకు మమ్మల్ని ఎవరినీ తెలీదు కదూ?" అంటూ చారుమతి అందరిని పరిచయం చేసింది.
"మా పెద్దక్క రేవతి విశాఖలో ఉంటుంది. ఈవిడ మా రెండో అక్క భానుమతి. మా ఇంట్లోనే ఉంటుంది. బావగారికి ఇక్కడే పని. ఇది మా చెల్లెలు మాలతి. ఎస్. ఎస్. ఎల్. సి. పాసైంది. హిందీ పరీక్షలకి, టైపు పరీక్షలకి కడుతూంది. ఇది భగవతి. మా ఆఖరి చెల్లెలు. అందరిలోకీ చిన్నది. ఎస్. ఎస్. ఎల్. సి. దాకా చదివింది" అంది అందరిని చేత్తో చూపిస్తూ.
గోపాల్ నవ్వుతూ, కుతూహలంగా చూస్తూ నిలుచున్నాడు.
"మరి నువ్వేం చేస్తున్నావో చెప్పావుకాదు" అంది రేవతి చనువుగా.
"నేను స్కూలు ఫైనల్ పరీక్ష పాసై కొన్నాళ్ళు విజయనగరం మిల్స్ లో పనిచేశాను. ఈ ఏడాది రైల్వే సర్వీస్ కమీషన్ పరీక్షలకి కట్టాను. ప్రస్తుతం రైల్వే ఉద్యోగంలో కాకినాడలో ఉన్నాను" అన్నాడు అతను.
"మా అమ్మని చూద్దువుగాని, రా" అంటూ చారుమతి వరండాలోకి తీసుకువెళ్ళింది గోపాల్ ని. వరండాలో చాప వేసుకుని పడుకుంది శాంతమ్మ.
"అమ్మా, ఎవరు వచ్చారో చూడు" అంది చారుమతి.
ఆవిడ ఇటు తిరిగి, నూతన వ్యక్తిని చూసి, లేచి కూర్చుంది.
"విజయనగరంలో శారదమ్మ అని నాన్నగారి చెల్లెలు ఉండేవారు, జ్ఞాపకం ఉందా? ఆవిడ కొడుకు గోపాల్." చారుమతి చెప్పింది.
"అలాగా, శారదమ్మకి కొడుకు ఉన్నాడని వినడమే కాని, ఎప్పుడూ చూడలేదు. ఎంతవాడి వయ్యావు! అమ్మ బాగుందా?" అంది శాంతమ్మ.
"ఆఁ, బాగుందండీ" అన్నాడు గోపాల్.
"నిలుచునే ఉన్నావు. కూర్చో, బాబూ....అమ్మా, చారూ! బల్ల ఏదైనా తెచ్చి పడేయ్, కూర్చుంటాడు" అంది శాంతమ్మ.
"బల్ల ఏమీ వద్దండీ" అంటూ శాంతమ్మ పక్కనే కూర్చున్నాడు అతను.
"అమ్మ ఎక్కడ ఉంది?" అంది శాంతమ్మ తిరిగి.
"ఇక్కడే ఉంది. నాకు రైల్వే పార్సెల్ ఆఫీసులో పని. స్టేషన్ దగ్గిరే ఇల్లు తీసుకున్నాను. అమ్మ, నేను అక్కడే ఉంటున్నాము."
