కాలం యెవ్వరి కోసమూ ఆగదు.
ముందుకు సాగిపోవటమే దాని ధర్మం ఈ మధ్యలో యెన్నో మార్పులు జరిగిపోతున్నాయి.
వాసుకి రెండువందల జీతం మీద వుద్యోగం వేయించారు కృష్ణమూర్తిగారు. మాలకి కూడా చిన్న కంపెనీలో వుద్యోగం దొరికింది. జీతం అరవై పది రోజులు గడిచినాయి: అంతే, మాల వుద్యోగంలో చేరి. అప్పుడే వుద్యోగం కాస్తా వుద్వాసనై పోయింది. ఆ పది రోజులకీ డబ్బు లెక్కచూసి చేతిలోపెట్టి మరీ ఇంటికి పంపించారు.
ఇంటికి వస్తూనే ఆ డబ్బు టేబుల్ మీద విసిరికొట్టి చాపమీద బోర్ల పడిపోయింది. నేల గట్టిగా నొక్కుకుపోతూంటే చెయ్యిచాచి దాపులోనే వున్న దిండు లాక్కుని ముఖం క్రింద పెట్టుకుంది. ఆ దిండు తనది కాదు. వాసు బాబుది.
వాసు పక్కబట్టలు గాని చివరికి చాపగానీ లేకుండా పడుకోగలడు. తలకింద యేదన్నా యెత్తు లేకుండా మాత్రం పడుకోలేడు. ప్రతి రోజూ చిన్న పీట తలక్రింద పెట్టుకుని నిద్ర పోయె వాసుని చూడలేకపోయేది మాల. దిండు కొనటానికి నాలుగు రూపాయలు లేక తన చిరిగిన చీరె మడిచి చిన్న దిండుగా తయారు చేసింది.
గ్రైప్వాటర్ ప్రచారం చేస్తూ రోజుకూలి రెండు రూపాయలు సంపాదించింది మాల. మొదటిరోజు సంపాదనతో ఆ దిండుకి ఓ గలీబు తీసుకువచ్చింది.
ఆ గలీబు మూలలకి కాస్త యంబ్రాయిడరీ చేసివుంది.
చవకబారు గుడ్డమీద యంబ్రాయిడరీ కుట్టు నవ్వుకుంది మాల.
రోజూ అలవాటు ప్రకారం తలకింద గట్టిగా వొత్తుకుపోకుండా మెత్తగా హాయిగా యేదో వున్నదని పరధ్యాసగా వున్న వాసు కాస్త ఆలస్యంగా గుర్తించి తీసి చూశాడు. గలీబు డాబుగా కన్పిస్తోంది. దిండు ఇటూ అటూ తిప్పి చూశాడు.
"మాలా దీనికోసం యెంత ఖర్చు చేశావ్?" కోపంగా అన్నాడు.
"రూపాయిన్నర" తల వంచి చెప్పింది మాల.
"రూపాయిన్నరకి దిండూ కవరూ యెలా వచ్చిందబ్బా" మరోసారి పరీక్షిస్తూంటే గలీబులో దాక్కున్న చుక్కల చీరె వాసుని పల్కరించింది. చాలా నవ్వు వచ్చింది వాసుకి.
మాల దగ్గర సామాన్యంగా చాలా గంభీరంగా వుండే వాసు నవ్వుతూ అన్నాడు.
"యెంతో కష్టపడి తెచ్చిన డబ్బు, విలువ తెలుసుకోకపోతే యెలా" అంటూ "ఈ చిన్న అవసరం కోసం అంత ఖర్చు చెయ్యకూడదు."
కళ్ళు మూసుకున్న వాసు కళ్ళల్లో మెదిలాడు మాలకి!
ఇలాంటి యెన్నో విషయాలు గుర్తువస్తున్నాయి ఇంక ఉద్యోగం పోయిందని తెలిస్తే మహా ఆవేదనపడతాడు. అందుకే ఈ వుద్యోగం యెలాగైనాసరే నిలుపుకోవాలని తను ఎంతో సహనంగా వూరుకుంది. అందరూ యెన్ని పిచ్చి వేషాలు వేసినా, కొంటెగా మాట్లాడినా తల వంచింది,
ఇది అలుసుగా గుర్తించి అందరూ మరీ బరితెగించారు
"హెడ్ క్లర్కు నేడో రేపో టైర్ కావలసిన వాడు తనని పమిట పట్టుకు లాగాడు." కోపం వచ్చి కళ్ళెర్రచేసి చూసింది.
"అబ్బే.... నేను......నాకేం తెలియదు. నేనెందుకు లాగుతాను టేబులుకి మే ...మేకు లాగింది. అంటూ అప్పటివరకూ చదువుతున్న "రతిప్రియ" మాగజయిన్ ముఖానికి అడ్డం పెట్టుకున్నాడు.
ఆ దృశ్యాన్ని తొంగి తొంగి చూస్తున్న కాకిమూక లాంటి మిగతావాళ్ళు "అమ్మయ్యో వస్తోంది రోయ్' అనుకుంటూ కుర్చీలూ బెంచీలూ దొర్లించుకుంటూ వాటి క్రింద పడబోయి నానా హైరానా పడి యెవరిచోటికి వాళ్ళు చేరుకున్నారు.
తను సీరియస్ గా వెళ్ళి తన సీట్లో కూర్చుంది,
"ఈ రాత్రితో మన హెడ్ పని గోవింద."
రౌడీల్లో కెల్లా పెద్ద రౌడీ వాసుబాబున్నాడు చేతిలో"
"కిల్లీకొట్టు వెంకటేశున్నాడు."
వుండీ వుండీ వీరభద్రం రా అని చచ్చాడు.
అయినా ఇందరెందుకూ ఆ వాసుగాడికే ఓ డజనుమంది పిల్లలని కనెయ్యకూడదూ."
"తప్పు తప్పు. ముగ్గురి తర్వాత ఆపరేషను చేయించుకుంటే మన "అంధ" గవర్నమెంటు ట్రాన్సిష్టరిస్తుంది.
"కాదు పాతిక మందినికంటే అదేదో దేశంలో బోలెడంత డబ్బిచ్చి "కుంతీదేవి" అని బిరుదు ప్రదానం చేస్తుంది.
ఇలా రకరకాలుగా అక్కడి సహవుద్యోగులు పరిహసిస్తుంటే తన రక్తం సలసలా మరిగిపోయింది.
అందుబాటులో యేది ఉన్నా దానితో వాళ్ళ బుర్రలు రామకీర్తన పాడాలన్పించింది.
వీళ్ళా చదువుకున్నవాళ్ళు? కాదు గాడిదలు! రాక్షసులు. మేకవన్నెపులులు .... అనుకుంటూ తనలో తనే ఆవేశంతో వూగిపోయింది. ఇంతలో ఒకడు జడరిబ్బన్ లాగాడు పెద్దవీరుడి ఫోజులో ఇంక తన ఆవేశం ఆపుకోలేక పోయింది.
రివ్వున లేచింది పమిటచుట్టి దోపింది రిబ్బను లాగినవాడి కుర్చీ దగ్గరకి వెళ్ళింది. అప్పటివరకూ "బీరాలు" పల్కుతూ ఫోజులు కొడుతున్న పురుషసింహం వంక ఒక్కసారి వురిమిచూసింది. వాడి క్రాపు లంకించుకుంది.
పైకీ క్రిందకీ గుంజి గుంజి కుర్చీకేసి కొట్టింది. అంతే మిగతా అందరూ వాడిని గాలికి వదిలి బైటకు పారిపోయారు.
లేడీ టైపిస్టులు ముగ్గురు ఆఫీసరు దగ్గరకి పరుగుతీశారు. ఆఫీసరు "పనిచేసిన డబ్బుకోసం మళ్ళీ ఆ ఆఫీసు చాయలకి కూడా రాకుండా డబ్బు చేతిలో పెట్టి దన్నం పెట్టాడు. "వెళ్ళిరా తల్లీ అంటూ"
ఇలా చెయ్యడం తప్పు అని తనకి తెలుసు.
ఇలా చేయడంవల్ల వాసుకి మరీ చెడ్డ పేరు వస్తుందనీ తెలుసు! కాని యేం చెయ్యాలి! వాళ్ళమాటలు యెనిమిది రోజులు సహించింది.
"మరేం ఫర్వాలేదు. మనం యేమన్నా చచ్చినట్టు పడివుంటుంది అని రెండు రోజులుగా మరీ రెచ్చిపోయారు. తోటి ఆడపిల్లలైనా తనకి సానుభూతి చూపిస్తే ఇలా చేసి వుండేదికాదు. కాస్త అంటే కాస్త అయినా సానుభూతి లభించిన నాడు మానవుడు దానవుడుగా మారడు మారలేడు.
చుట్టూవున్న వాళ్ళు తనని రెచ్చగొట్టారు.
"అలా అందరూ యేకమై రెచ్చగొట్టినా కాస్త ఓర్మి వహించి నిలవగలిగితే ఆపైన మన జోలికి రాదు మాలా .... మనలాంటి వాళ్ళకి చాలా సహనం అవసరం. ఇది మర్చిపోవద్దు" అంటూ యెన్నో పాఠాలు నూరిపోశాడు వాసు. ఆడపిల్లని అత్తవారింటికి పంపినట్లు యెన్నెన్నో చెప్పి పంపించాడు ఆఫీసులో చేరేటప్పుడు ఏం చెయ్యాలి. కాలదన్నుకు వచ్చేసింది. "ఏం చెయ్యను. నేనేం చెయ్యను ఇలా చెయ్యాలని నాకు లేదు" తనకి తను వందోసారి సంజాయిషీ ఇచ్చుకుంది.
వాసు ఇంట్లోకి వస్తున్నట్లు చెప్పుల చప్పుడు తెలుస్తోంది.
మాల గుండె వేగంగా కొట్టుకుంటోంది.
"ఇంకాస్సేపటిలో వచ్చే తుఫాన్ని యెలా తట్టుకోవటం?"
ఇద్దరి జీతాల్లోనూ పొదుపుగా ఖర్చుచేసుకుని మిగతాది దాచి అలా పెంచి ఓ మంచి కుర్రాడిని చూసి మాలకి పెళ్ళి చేసి ఆపైన ఆపైన....తన సంగతి ఆలోచించుకోవాలన్న వాసు ఆలోచన మాలకి తెలుసు.
ఇవన్నీ గొంతెమ్మ కోర్కెలనీ తెలుసు. తనని గౌరవంగా బ్రతికే యే అబ్బాయి పెళ్ళిచేసుకుంటాడు? చేసుకోడు. అందుకే నా కాళ్ళమీద నేను నిల్చేశక్తి తెచ్చుకుంటే పెళ్ళి కాకున్నా మరేం ఫర్వాలేదు. వీలైనంత తొందరలో వాసుకి దూరంగా వెళ్ళిపోవాలి. నా మూలకంగా అతనికి సుఖం లేకుండా పోతోంది. అనుకుంటూ యెన్నో విధాల ఆలోచిస్తూనే వుంది మాల.
వాసు లోపలికి వస్తూనే లైటువేసి
"మాలా, అదేమిటి.... లైటు లేకుండా చీకటిలో పడుకున్నావేం" అంటూనే "నిద్రపోతున్నావా! ఉత్తరాలేమయినా వచ్చాయా!"
మాల అసలు ఉత్తరాలు వచ్చాయో లేదో చూడనే లేదు.

తలుపు దగ్గరే పడివున్న కవరు అందుకుని విప్పి చూస్తూ.
ఓ విశ్వం. చాలా పెద్ద వుత్తరం రాశాడులా వుంది."అంటూ బట్టలు మార్చుకుని "తలనొప్పిగా వుందా! కాఫీ తాగకపోయావూ నాకూ ఈ రోజు తల దిమ్ముగా వుంది కాస్త. కాఫీ పెట్టమ్మా ఇద్దరం తాగుదాము" అంటూ కవరు చించబోతూ టేబుల్ పైన పెట్టి బయట యెవరో పిలవ టంతో వెళ్ళిపోయాడు. అయిదు నిముషాల్లో తిరిగి వచ్చాడు.
అంత బాధపడుతున్నా వాసు తల "దిమ్ము" అవగానే మాల వెంటనే లేచి "టీ" తయారు చేసి తెచ్చి యిచ్చింది.
కప్పు అందుకుంటూ అన్నాడు. "మరి నీకు?"
"తాగాను"
"ఎప్పుడు?
"......."
"లేదూ?"
"వున్నది" అన్నట్లు తల వూపింది మాల.
"మరి తాగేసెయ్యి ఈసారి జీతంలో ఓ ఫ్లాస్కు తెస్తానుండు. చల్లారిపోతుంది తాగేసేయ్ తల్లీ" తల్లెమ్మా అంటో వాసు పిలుస్తుంటే తండ్రి గుర్తువచ్చాడు మాలకి. తల్లీ....తల్లెమ్మా అంటూ పిల్చేవాడుఆయన కళ్ళనీళ్ళు వత్తుకుంటూ మరొకప్పు తెచ్చుకుంది.
ఈ వాసుబాబు లేకపోతే నే నేమయి పోయే దాన్ని? ఈ ప్రశ్న మాల మెదడులో సందడి చేస్తూనే వుంది.
టీ తాగుతున్న వాసు టేబిలు మీద డబ్బు చూశాడు.
"ఈ డబ్బెక్కడిది, మాలా నువ్వు పెట్టావా?" నోట్లు లెక్కపెడుతూ అడిగాడు.
యేం జవాబిస్తే ఎలా వుంటుందో ఆలోచిస్తోంది.
"చెప్పు యెక్కడిది?"
ఇంక లాభంలేదు. చెప్పేస్తాను. అంతా చెప్పేస్తాను, "అనుకుని ఒక్క అక్షరం కూడా దాచకుండా చెప్పేసింది. అసలు వాసు ఒక్కడి దగ్గరే తన బాధ వెళ్ళబోసుకోగలదు. అందుకే చెప్పేసింది.
వాసు వూపిరి బిగపట్టి విన్నాడు, అప్పటికే అతని ముఖం జేవురించింది. గుప్పెళ్ళు బిగుసుకున్నాయి. కళ్ళు యెర్రగా జ్యోతుల్లాగా మండుతూంటే "నిన్ను అలా అన్న వెధవని చూపించు. చూపించు మాలా." అంటూ ఆవేశంగా కుర్చీ వెనక్కి నెట్టి లేచాడు.
మాల వెక్కి వెక్కి యేడుస్తూ అంది,
"నేను దొంగని.....పాపిని.....మొద్దుని వీర భద్రాన్ని పొట్టనపెట్టుకున్నాను. మీకు శనిలా దాపరించాను. అందుకే నేను యెక్కడ కాలు పెట్టినా మాడి మసి అయిపోతుంది."
"మాలా" టేబుల్ గుద్డుతూ అన్నాడు. అతని చెయ్యి యెర్రగా కందిపోయింది.
"యెవరో బుద్ధిలేని వాళ్ళు అంటే నువ్వెందుకు బాధపడాలి. ఆ వెధవలని నా యెదురుగా వచ్చి అనమను. యేం చేస్తానో తెలుస్తుంది." ఇటూ అటూ పచార్లు చేస్తూ ఆవేశాన్ని ఆపుకుంటున్నాడు.
మాల యేడుస్తూనే వుంది.
"యేడవకు. నేను భరించలేను. చేతకాని వాళ్ళు యేడుస్తారు. కాని నువ్వు కాదమ్మా! వుద్యోగం పోతే పోయిందిలే. నా జీతాన్నే సర్దుకుందాం! మళ్ళీ ప్రయత్నిస్తున్న వుద్యోగం గనుక వస్తే అయిదు వందలు జీతం వస్తుంది. తెలుసా?
వాసు యెంత చెప్తున్నా మాల విచారం తగ్గలేదు.
"ఎన్ని రోజులని మీమీద భారం మోపను?"
"చెల్లెలివైతే వుండవూ....మా అమ్మవయితే వుండవూ! పరాయి వాడినవి యెందుకు అనుక్షణం గుర్తు చేసుకుంటావు....వద్దమ్మా..."
"అనుకోను మిమ్మల్ని పరాయివాడని ఎలా అనుకుంటాను? కాని నేనూ యేదో కాస్త సంపాదించే మార్గం చెప్పండి. మీరు చెప్పినట్లు ఇంక బైటకి వెళ్ళను."
"సరే అలాగే! వదినలాగా యేదో ఒకటి కుటీర పరిశ్రమ మొదలు పెట్టు. ఆవిడ యెంతో నిగ్రహంగా చేస్తోంది. పిల్లలనిద్దరిని స్కూల్లో చేర్పించింది. ఆ ఇల్లు వదిలేసి చిన్న గదిలో కాలక్షేపం చేస్తోంది. ఆ వ్యాపారానికి పెట్టుబడి క్కూడా నా సహాయాన్ని తీసుకోలేదు. ఇంట్లోని విలువైన సామాన్లన్నీ అమ్మిపారేసింది. రాబడి ప్రస్తుతం తక్కువే అయినా చాలా అభివృద్ధి చేసుకోవచ్చు. ఏమిటో వదినలో చాలా చిత్రమయిన మార్పు వచ్చింది."
వదిన గుర్తురావటంతో వాసుకి బాధ కల్గింది. ఆ బాధలోనూ ఒక విధమైన సంతృప్తి దాని లోనే యేదో వెలితి.
"అన్నయ్య సంగతి యేం తెలియ లేదు గదూ!"
"లేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడో మరి. వుద్యోగం పోయేసరికి వైదేహి బైటకి గెంటేసింది. యెక్కడికి వెళ్ళాడో యెలా వున్నాడో ఆ భగవంతుడు ఆ ఇద్దర్నీ తిరిగి ఎప్పటికీ కలుపుతాడో."
బాధగా తల నొక్కుకుంటూ ఇటూ అటూ పచార్లు చేస్తూ విశ్వం ఉత్తరం గుర్తుకొచ్చి చేతిలోకి తీసుకున్నాడు.
ప్రియమిత్రమా.
నేను అక్కడికి వచ్చేస్తున్నాను. ఎందుకో తెలుసా "ముక్త" ని తెచ్చుకునేందుకు. బ్రహ్మ చర్యాశ్రమంలో విసిగి వేశారాను భాయ్. యేం కోపం వస్తూంది. నీకు.
ఈ వెధవకి పెళ్ళికూడానా అనుకుంటున్నావా!
మా ప్రేమాయణం చాలాదూరం వచ్చింది. నువ్వు అడ్డు పెట్టినా లాభంలేదు. "ప్రేమించుట పిల్లలవంతు. దీవించుట పెద్దలవంతు" పళ్ళు నూరుతున్నావు. నీకు తెలుసు నా విషయాలు ఏ ఒక్కటీ దాచకుండా మాలకి తెలియజేశాను. 'ఆమోదం' తెలియజేసింది. ఇంక నువ్వు నువ్వు.
"రే...వాసూ" విశ్వం వాకిలి దగ్గిర నిలబడి రెండు చేతులూ చాచాడు. వాసు ఒక్కక్షణం విస్తుపోయాడు. "అప్పుడే వచ్చేశావా.
అన్నీ మర్చిపోయి అమాంతం కౌగలించుకున్నారు మిత్రులిద్దరూ.
మాల కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది. విశ్వం. విశ్వం మనిషి యెలా వుంటాడో కూడా తెలియ కుండా ఆరాధిస్తున్నది. చామనఛాయలో కాస్త పొట్టిగా అన్పిస్తాడు వాసుపక్క నిల్చుంటే చిన్నకళ్ళు సూటిగా చూస్తూ వుంటాయి. ఖరీదైన సూటూ, నిగనిగలాడే నల్లబూటూ చూసిన వెంటనే యే భావమూ యేర్పరచుకోవటానికి వీలులేని రూపం. మిత్రుడి భుజం మీదుగా మాలని చూస్తున్నాడు పరీక్షగా. ఈ అమ్మాయే అయివుంటుంది. అవును ఈమె అన్నది అతని మనస్సు. కొత్త అన్పించటం లేదు మాలకి. అతన్ని చూస్తుంటే యెక్కడో యెరుగుతున్నట్లు దగ్గర వాడిలాగ అన్పిస్తుంది. కాని కాస్త భయం వేసింది. ఇంక వాసుబాబు యేంచేస్తాడో అని.
"ఇదిగో మాల..." అంటూ మిత్రుడికి పరిచయం చేశాడు.
"నమస్తే" ఒకర్ని ఒకరు చూసుకున్నారు.
స్నేహితుడు వచ్చినందుకు సంతోషం. మాల తనకి తెలియకుండా ఇలా చేసినందుకు బాధా అతన్ని ఆవేదన పరుస్తున్నాయి. విశ్వం ప్రశాంతంగా ముందు గదిలో గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. వాసుకి టైము దొరికింది మాలతో.
