కాలేజీలో తను గడిపిన రోజులు ఆమె కళ్ళ ముందు మెదిలాయి. ఒక క్షణం కూడా వృధా పోనీయకుండా శ్రమించే తేనెటీగలా, తను గడిపిన రోజులను, ఇప్పటి నీరస వాతావరణంతో పోల్చుకుంది. కాలేజీ స్నేహితులు, చర్చల పోటీలు, ఆటలు, నాటకాలు, అన్నీ ఒక్కొక్కటే ఆమె ముందు వెక్కిరించాయి.
అయిదేళ్ళ వయస్సుతో కాన్వెంటులో చేరిన తను అప్పటినుంచి పదిహేడేళ్ళ దాకా (పెళ్ళయ్యేదాకా) ఒక్క క్షణం విరామం లేకుండా గడిపింది. ప్రతి ఆటలోనూ పాల్గొనటం, బహుమతి పొందటం మామూలయిపోయింది, మీరకు. చిన్నపిల్లప్పటినుండి నాటకాల్లో వేయటమంటే ఎంతో ఉత్సాహం ఆమెకు. నాటకాల్లో నాయిక పాత ధరించి, మొహానికి రంగు వేసుకొని, పెదవులకు రంగు పూసి, సహజ సౌందర్యాన్ని కృతకాలంకరణలతో మరింత పెంపొందించుకుని, స్నేహితుల ముందు నిలిచి,
"ఎలా ఉన్నావర్రా?" అని, వాళ్ళచేత 'చార్మింగ్' 'కిల్లింగ్' అన్న పొగడ్తలు వింటూ, గ్రీన్ రూం లో తిరుగుతున్న దృశ్యాన్ని తల్చుకుంది.
జూనియర్ ఇంటర్లో చదువుతున్నప్పుడు ఆఖర్లో నూర్జహాన్ నాటకం వేశారు. ఆరోజు అధ్యక్షత వహించినాయన మీర అభినయాన్ని, కళా కౌశల్యాన్ని మనసార పొగడి అభినందించారు. మొఘల్ దుస్తుల్లో అసమాన్య రూపవతిగా కనిపిస్తున్న మీర అందరి దృష్టిని ఆకర్షించింది. తన సాటిలేని సౌందర్యంతో మొఘల్ బాదుషాను బానిసగా చేసుకున్న, చక్రవర్తిని, నూర్జహాన్ పాత్రకు జీవం పోసింది మీర. ఆఖర్లో బహుమతి అందుకోవటానికి వెళ్ళినప్పుడు అధ్యక్షులు.
"అమ్మాయ్, కళామతల్లి నిన్ను వరించింది. అభినయం నీకు పుట్టుకతో అబ్బింది. దేవుడిచ్చిన ఈ వరాన్ని సార్ధకపరచుకో" అని ఆశీర్వదించి బహుమతి నిచ్చారు.
అఖిల ఇంటర్ కాలేజి చర్చల పోటీల్లో పాల్గొని వేల సంఖ్యలో నున్న విద్యార్ధి, విద్యార్ధినుల ముందు దైర్యంగా నిలబడి గంభీరంగా చర్చించి, బహుమతి పొందినప్పుడు అధ్యక్షుడు మీర వాద వైఖరిని ప్రశంసించి,
"నువ్వు 'లా' చదివితే మంచి ఫలితా ముండగలదని" సూచించారు. కాని, నటి అవ్వాలని కాని, లాయర్ అవ్వాలని కాని లేదు మీరకు. లేత మనసులో పాతుకుపోయిన ఆమె ఆకాంక్ష మళ్ళీ ఏ కొత్త ఆశలకూ చోటివ్వకుండా మనసునంతా ఆక్రమించుకుంది. పెళ్ళి నిశ్చయ మయినప్పుడే ఆమె ఆశలన్నీ కూలిపోయాయి. పల్లెకు వచ్చినప్పటినుండి ప్రతిభావంతమయిన ఆమె మనసుకు మబ్బు పట్టినట్టయింది. జీవితమంటేనే జుగుప్స ఏర్పడింది. యుద్ధమే లేక, రణవీరుని కత్తి, రక్తదాహంతో తహతహలాడినట్టు ఉందామె స్థితి.
పరీక్షాఫలితాలు తెలియగానే పాతస్మృతులు చెలరేగి ఆమె హృదయంలోని ఆకాంక్ష పడగలు విప్పింది. దుఃఖం పెల్లుబికి రాగా ఆ ఉత్తరాన్నలా చేతిలో ఉంచుకొనే వెక్కి వెక్కి ఏడవసాగింది.
"పెదనాన్న, శాము అందరూ తనకు పరాయివాళ్ళే. తను బ్రతికి ఉండి ఏం లాభం?" అనిపించింది.
నౌకరు బోరడు, అమ్మగారు ఉత్తరం చదివి ఏడవటం చూసి కంగారుగా వెంకమ్మగారి దగ్గరికి పరుగెత్తి సంగతి చెప్పాడు.
"అమ్మగోరు ఉత్తరం సదివి యేడుస్తుండారు. ఏం కబురొచ్చినాదో యేటో."
"అయ్యో శామన్న కూడా లేడే ఇంట్లో. వెంటనే వెళ్ళి పిలుచుకరా. చెరుకుతోట దగ్గరుంటాడు."
బోరడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెంకమ్మగారు డ్రాయింగు రూము తలుపు దగ్గర నుంచొని.
"ఎక్కడినుండి వచ్చిందమ్మాయ్ ఉత్తరం?"
మీర తలెత్తి చూసి "పెదనాన్న రాశాడు" అంది.
ఆమె మొహమంతా కన్నీరుతో తడిసిపోయింది. పెట్టుకున్న బొట్టు చెరిగి నీరు కారుతోంది. చెదిరిన జుత్తు బుగ్గలకు అంటుకుంది.
"ఏడుస్తున్నా వెందుకమ్మా? అందరూ కులాసాగా ఉన్నారుకదా?"
"ఊఁ"
"శుక్రవారప్పూట కన్నీరు పెట్టుకోరాదు. లే తల్లీ. లేచి మొహం కడుక్కుని బొట్టు పెట్టుకో ఏం జరిగిందోనని శామన్నకు కబురు చేశాను."
మీర చటుక్కున లేచి కూర్చుని, "ఆ నిజంగానా?" అంది.
"వూ! బోరడు వెళ్ళా డప్పుడే."
"ఛ! ఇక గాబరాపడుతూ వస్తారాయన."
"నాకేం తెలుసమ్మాయ్. ఉత్తరం చదివి ఏడుస్తున్నావని చెపితే, ఏం జరిగిందోనని కబురు చేశాను."
మీర లేచి మొహం కడుక్కుని బొట్టు పెట్టుకుంటుండగా శాము పెద్ద పెద్ద అంగలేసుకుంటూ లోపలి కొచ్చాడు.
"మీరా...... ఏం జరిగింది? ఎవరిది ఉత్తరం?"
మీర విషాదంగా నవ్వి "ఏం లేదండీ" అంది.
"అమ్మగారు ఉత్తరం చూసి ఏడుస్తున్నారని చెబితే చేస్తున్న పని వదిలి వచ్చాను" అతని కంఠంలో విసుగు, కోపం ధ్వనించాయి.
మీర తల వొంచుకొని నిలబడింది.
"ఏది ఉత్తరం" అంటూ చుట్టూ చూశాడు. కన్నీటితో తడిసి నేలమీద పడివున్న ఉత్తరం అతని కంట పడింది. శాము అటు చూడగానే మీర ముందుకువచ్చి "అందులో ఏం లేదు." అంటూ ఉత్తరం తీసుకోబోయింది. శాము తన బలమయిన చేతులతో ఆమెను దూరంగా నిలబెట్టి ఉత్తరం తీసుకొని ఆత్రుతతో చదివాడు. చదువుతూన్నట్టల్లా అతని కనుబొమలు ఆశ్చర్యంతో సంకుచితమై కళ్ళు ప్రశ్నార్ధకంగా ఆమెవేపు చూశాయి. ఏడుపుకు కారణ మేమిటన్న ప్రశ్న, అతని మొహములో గోచరించింది. మీర మాట్లాడకుండా మౌనంగా నుంచుంది.
"పరీక్షలో పాసైనందుకు అభినందనలు. కాని ఏడవదగిందేముందీ ఉత్తరంలో?"
మీర మౌనం, శాము సహనాన్ని రెచ్చకొట్టింది.
"ఏడుపు కేమి కారణం?" అన్నాడు గడుసుగా.
"ఏమిటో నాకు విసుగనిపించింది. దుఃఖ మొచ్చింది. ఏడ్చాను. అంతే."
శాము మరేమీ మాట్లాడకుండా ఉత్తరం క్రింద గిరవాటేసి, వచ్చినట్టే వెళ్ళిపోయాడు.
శాము వెళ్ళిపోయాక తన ప్రవర్తనకు సిగ్గు పడింది మీర. 'భోజనానికి వచ్సినప్పుడన్నా, ఆయన కోపం పోగొట్టాలి, ఎలాగా' అనుకోసాగింది.
మధ్యాహ్నం వెంకమ్మగారి చేత శాముకు చాలా ఇష్టమయిన, బర్ఫీ, బంగాళాదుంపల చిప్స్ చేయించింది. రెండు దాటినా శాము రాలేదు. మీరకు ఆకలొకవేపు, భర్త ఇంటికి రాలేదన్న చింత ఒకవేపు బాధించసాగింది, మాట్లాడకుండా వెళ్ళి పడుకుంది. అలాగే నిద్ర పట్టేసింది.
మళ్ళీ మెలకువ వచ్చేసరికి గంట నాలుగయింది. శాము ఇకా ఇంటికి రాలేనేలేదు. గాబరాతో గేటు దగ్గర నుంచుని ఎదురుచూడ సాగింది. కాస్సేపటికి దూరంలో కాళ్ళీడ్చుకుంటూ వస్తూన్న భర్త కనిపించాడు,
మీరని చూసి కూడా పలుకరించకుండా లోపలికి నడిచాడు శాము. మీర తనే పలుకరించింది.
"మధ్యాహ్నం భోజనానికి రాలేదేం?"
"ఏమిటో విసుగనిపించింది, రాలేదు."
"చాలా ఆకలయ్యుంటుంది. ఇపుడయినా భోజనానికి పదండి."
"నువ్వు భోంచేశావా?"
"లేదు."
ఉదయం, ఆమె అర్ధంలేని ఏడుపువల్ల కలిగిన కోపమంతా ఉదయం నుండి ఆమె భోజనం చేయకుండా ఉందన్న సంగతి వినగానే కరిగిపోయింది.
"నువ్వెందుకు భోజనం చేయకుండా ఉండిపోయావు మీరా."
"ఇప్పుడేం మునిగిపోలేదు గాని, తొందరగా రండి. నా కాకలేస్తోంది." అంటూ లోపలికి వెళ్ళింది. శాము ఆశ్చర్యంతో ఆమె వెళ్ళిన వేపే చూస్తూ. "ఈ ఆడవారి మనసు, అర్ధం చేసుకోలేం." అనుకున్నాడు.
ఏకంగా బోజనమూ, టిఫిన్ పూర్తిచేసి వచ్చే సరికి సాయంత్రం ఆయిదయింది. శాము తమలపాకుల పళ్ళెం ముందుంచుకుని కూర్చున్నాడు. మీర,
"అలా బయట తిరిగి వద్దామా?" అంది.
"ఏమిటి ఈరోజు అమ్మాయిగారికి చాలా హుషారు పుట్టుకొచ్చిందే?"
"వస్తే వచ్చింది కాజి, ఏ చీర కట్టుకోవాలో చెప్పండి."
"నిశ్చితార్ధంరోజున తెచ్చావే ఆ చీర....."
"ఓ. సరే అయిదు నిమిషాల్లో వచ్చేస్తాను."
"ఆడవారి ముస్తాబు, అయిదు నిమిషాలంటే రెండు గంటలు."
"కావాలంటే, టైము చూస్తూ కూర్చోండి."
మీర ముస్తాబయి వచ్చేసరికి శాము "పది నిముషాలయ్యాయి" అన్నాడు.
"ఈ షూస్ వేసుకోవడానికి రెండు నిముషాలు పట్టింది."
"నిన్ను మాటల్లో గెలవగలనా నేను?" అంటూ నవ్వాడు, శ్యాము.
* * *
రోజులు గడుస్తున్నకొద్ది, మీరకు తోచటమే కరువయింది. నవచైతన్యంతో నిండిన ఆమె జీవితం అక్కర్లేనంత విశ్రాంతికి అలవడలేక పోయింది. రోజూ గంటల తరబడి కూర్చొని, తను కాలేజీలో గడిపిన రోజులను, ఇప్పటి రోజులనూ పోల్చి చూసుకొనేది. అప్పటి రోజులు నిమిషాల్లా గడచి పోతే, ఇప్పటి రోజులు యుగాల్లా గడుస్తున్నాయి.
శాము ఉదయం ఎనిమిదింటికి బయటికి వెళ్ళడానికి ఉద్యుక్తుడై, తన లావుపాటి మొరటు చెప్పులను తొడుక్కుంటున్నాడు. మీర ఒక నిముషం తదేకంగా అటువేపే చూసింది. వెంటనే ఆమె మనసులో, గోపాలం అన్నయ్యవి మెరిసే బూట్లు మెదిలాయి.
"మీతో ఒక్కమాట చెప్పాలి."
"చెప్పూ."
"మీరు విన్నాక నవ్వకూడదు మరి."
"అలాగే."
"ఈ పల్లెలో నాకేం తోచటంలేదు."
"ఒక్క బీరువా పుస్తకాలు నాలుగయ్యాయి. కావాలంటే ఇంకా తెప్పిద్దాం. కుట్టుపని చేస్తూనే ఉన్నానాయే. ఇంకా ఏం కావాలి?"
"అది కాదండీ, ఈ పల్లెలో, పార్కా, రేడియోయా? సినిమానా, స్నేహితులా? ఏం ఉన్నాయని? అస్తమానం ఇంట్లో కూర్చోవటమే పని. విసుగేస్తోంది నాకు."
"వెంకూ రావటంలా, ఈ మధ్యా?"
"వస్తుందనుకోండి. కాని, తాను చెప్పేకబుర్లు నా కక్కర్లేనివి. నేను చెప్పేది తన కర్ధం కాదు. ఆ పదేళ్ళ పిల్లతో, నాకేం కాలక్షేప మవుతుంది? చెప్పండి?"
"అయితే, ఇక్కడి రైతు స్త్రీలతో కలసి పొలాని కొచ్చి కలుపు తీస్తా నంటావా?"
"చాల్లెండి ఎవరైనా వింటే నవ్విపోతారు. నేనా పనులన్నీ చేయగలిగితే, ఈ గొడవే లేకపోయేదసలు."
"ఇంతకూ ఏం చేయా లనుకుంటున్నావో చెపుదూ."
"మీరు నవ్వుతారు."
"లేదంటూంటే...."
"నామీద ఒట్టు."
"అలాగే చెప్పు."
"ఇక్కడి రైతు స్త్రీలకు, పిల్లలకు, చదువు చెపుదామని..."
శాము పక్కుమని నవ్వేశాడు. మీర బుంగ మూతి పెట్టి,
"నవ్వరాదని చెప్పానా ముందే?" అంది.
"నవ్వక ఏం చేయమంటావో చెప్పు?"
"నేను చెప్పినదాంట్లో నవ్వొచ్చే విషయమేముందని?"
"వారంతా, చేసే పనులు వదలిపెట్టి నీ శిష్యరికం అవలంభిస్తే వాళ్ళ కాపురాల గతేమిటో చెప్పు చూద్దాం."
"రోజూ సాయంత్రంపూట, ఓ అరగంట, అంతే. ఎలాగయినా చెప్పి చూడండి" అంది మీర వేడుకుంటున్న కంఠంతో.
"వాళ్ళు ఒప్పుకోక పోతే?"
"ఒప్పుకోకపోతే వద్దు."
"సరయితే" అంటూ వెళ్ళిపోయాడు, శాము. మధ్యాహ్నం ఇంటికి రాగానే, అడిగింది, మీర.
"చెప్పారా వాళ్ళతో?"
"సాయంత్రం ఇటువేపు రమ్మన్నాను. నువ్వే చెప్పు."
మధ్యాహ్నమంతా ఏవిధంగా బోధపరచి, ఆ పల్లెటూరి ఆడవాళ్ళను, చదువు నేర్చుకోవటానికి ఒప్పించగలనా అని ఆలోచిస్తూ గడిపింది, మీర. సాయంత్రం శాము ఇంటికి వచ్చాక, కొంతమంది రైతు స్త్రీలు వచ్చారు. మీర అందర్ని లోగిట్లో కూర్చోబెట్టింది.
