Previous Page Next Page 
ఆంతస్తులూ అంతఃకరణలూ పేజి 23

                           

                                  14
    కారు ఆగిన శబ్దం విని మగతగా కళ్ళు మూసుకుని పడుకోనున్న శేఖరం బరువుగా కళ్ళెత్తి వారగా వేసి ఉన్న తలుపు వేపు చూశాడు. మరుక్షణం లోనే కళ్ళు పెద్దవి చేసి - "మీరా!" అన్నాడు లేచి కూర్చుంటూ.
    "నేనే! మీ స్నేహితులెక్కడ?' చుట్టూ కలయజూస్తూ అడిగింది సుధీర.
    "షికారుకెళ్ళారు. ఏం? మళ్ళీ ఏం చేశారు?" అన్నాడు.
    "వాళ్ళెం చెయ్యలేదు. చేసిందల్లా మీరే!" ముని పంటితో పెదవి నొక్కి అంది.
    "నేనా?" పాలిపోయిన ముఖంతో అడిగాడు .
    "ఆహా!"
    "ఏం చేశానూ?" బలహీనంగా అడిగాడు.
    "మీకు తెలీదా?"
    "ఉన్నా--"
    "ఉత్తరం రాయలేదా?"
    "ఎవరికి?"
    "ఎవరికో రాస్తే నేనెందుకోస్తాను? నాకే!"
    శేఖరం చిత్తరువులా గుడ్లప్పగించి చూస్తుండి పోయాడు ఓ క్షణం. నెమ్మదిగా తేరుకుని--
    "అలా కూర్చోండి! అసలు విషయమేమిటో విశదంగా చెప్పండి! నా కసలు ఒంట్లో బాగాలేదు కూడా" అని నిస్సహాయంగా అన్నాడు.
    "ఆ విషయం ముఖమే చెప్తుందనుకోండి! యింతకూ ఒంట్లో బాగు లేకపోవడానికి కారణం?"
    కుర్చీలో కూర్చుని చెక్కిట చెయ్యి చేర్చి అంది.
    "జ్వరం."
    "జ్వరమే! ఎలా నమ్మడం?"
    శేఖరానికి ఏడుపొచ్చినంత పనయింది." నమ్మమని నేను చెప్పలేను" అన్నాడు ముఖం ముడుచుకుని గోడ కభిముఖుడై.
    "అయితే నిన్న కొండమీదకు రాకపోవాదానికి కూడా ఒంట్లో బాగాలేకపోవడమేనా కారణం?"
    "ఊ...."
    "ఇప్పుడెలా వుంది?"
    "కొంచెం తగ్గింది."
    "మీ కోసం అక్కడ ఎంతసేపు పడిగాపులు కాచానో?"
    "ఎందుకో?' తల తిప్పకుండానే ప్రశ్నించాడు.
    "అదే....ఉత్తరం విషయమేమిటో కనుక్కుందామని " అని పైట చెరుగు నోటి కడ్డు పెట్టుకుంది.
    "నేనే ఉత్తరమూ మీకు వ్రాయలేదు." చివాల్న తలతిప్పి సుధీర ముఖంలోకి చూసి అన్నాడు. కోపంతో శేఖరం ముఖం ఎర్రబడింది. అవమానంతో కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. సిగరెట్టు స్పర్శ నెరుగని ఎర్రని పెదిమలు కొద్దిగా చలించాయి.
    "అంత కోప మెందుకండి! వ్రాయలేడంటున్నారుగా? ఆ విషయం యిక పోనీండి!" అంది నవ్వుతూ.
    "ఉత్తరంలో ఎముందేమిటి?" అన్నాడు కొంచెం శాంతించి కుతూహలంగా.
    "ఏముంటుంది? ఒకమ్మాయి కి అబ్బాయి వ్రాసిన ఉత్తరం లో ఏముంటుందో మీకు నేను చెప్పల్నా?' అంది కనురెప్పలు వాల్చి.
    అందమైన ఆమె కనురెప్పల తీరును తిలకిస్తూ పరవశం చెందిన కవికుమారుడు పరాకు చిత్తగించి -- "ఏముందేమిటి?" అంటూ మొదటి ప్రశ్ననే వల్లే వేశాడు.
    "ఆమాత్రం ఊహాశక్తి మీకు లేదంటే నేను నమ్మను." అంది నవ్వి.
    నవ్వినప్పుడు సొట్టలు పడ్డ తెల్లని సున్నని చెంపల వేపు చూస్తూ - 'కలకాలం తనకా సౌందర్యాన్ని వీక్షించే భాగ్యం కలిగితే ఎంత బాగుండును!' అనే సరికొత్త ఊహతో తెలిపోసాగాడు శేఖరం.
    "ఊహ జగత్తు లోనే కలకాలం కాపరం చేస్తారేమిటి?' అంది సుధీర అతని అర్దనిమిలిత నేత్రాల వేపు చూస్తూ ఫక్కున నవ్వి.
    విప్పరిత నేత్రాలతో సుధీర ముఖంలోకి చూస్తూ - "ఏం? తప్పా! అందమైన ఆ లోకాన్ని వదిలి రాబుద్ది పుట్టదు" అన్నాడు.
    "వాస్తవికతకు అంత దూరమైతే ఎలాగ?'
    "ఏం?"
    "తర్వాత బాధపడాల్సోస్తుందేమో?"
    "ఎందుకు?"
    "మీ ఊహ జగత్తుకూ యీ లోకానికి ఎలాంటి సంబంధమూ లేదని."
    "ఊహు...." తల అడ్డంగా తిప్పాడు.
    "లేదా?"
    "అక్కడే మీరు తప్పటడుగు వేశారు. తాము కన్న కలలన్నీ నిజం కావాలనే వాళ్ళు చాలా మందే వుంటారు. కాదనను. ఆ ఊహ జగత్తు లోని స్వప్న సౌదాలు ఎలాంటి సంబంధమూ లేదని తెలిసిన రోజు విపరీతమైన బాధ సంభవించడమే కాదు!పిచ్చివాళ్ళు కూడా కావడం కద్దు. అలాంటి వాళ్ళు ఊహలకు, కలలకూ దూరంగా వుండాలి. కానీ నా విషయం వేరు." అన్నాడు చిన్నగా నవ్వి.
    "అయితే మీ ఊహ జగత్తు నే ఆధారంగా చేసుకుని మీరు వ్రాసే కవిత్వం ప్రయోజనమేమిటి? అది నిజం కావాలని మీ రసలు కోరుకోరా?"అంది కళ్ళు తిప్పుతూ.
    "నిజమయితే అంతకన్నా సంతోషకరమైన విషయం ఏముంటుంది? మా జీవిత పరమార్ధమే అది, కానీ అవి నిజం కాలేదని పిచ్చి వాళ్ళమయ్యే అంతటి బలహీనులమూ, అవివేకులమూ కాదు. ఒక్కో రచయితకూ, కవికీ తాము సృష్టించుకొన్న ఊహ లోకాలే అత్యుత్తమమైనవిగా కనిపిస్తాయి. తమ ఊహా జగత్తుకూ యీ లోకానికీ పోలిక లుండేటట్లు చెయ్యాలని ప్రయత్నిస్తూనే వుంటారు. మానవుడు చెయ్యవలసినది ప్రయత్నమే. జయాపజయాలు దైవాదీనాలు. అందుకు బాధపడి ప్రయోజన మేముంది?"
    "అయితే సామాన్యులు ఊహల జోలికి పోరాదన్నమాట?" అంది కళ్ళు చిట్లించి.
    "అలా గన్నానా?"
    "మరి అర్ధమేమిటో?"
    "మానసికంగా బలంగా వున్న రోజు ఎన్ని కలలైనా కనవచ్చు. ఊహా లోకంలో ఎంత కాలమైనా విహరించవచ్చు. కానీ కఠినమైన యీ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్దంగా వుండాలి. నీ ఊహ లోకంలో నువ్వు రాజువే కావచ్చు. కానీ ఇక్కడ సేవకుదివే. దాన్నీ దీన్నీ సమన్వయపరచుకునే పాటి హృదయదార్ధ్యం ఉన్న రోజే కలలు కను! అంతేగాని అక్కడ రాజునై, ఇక్కడ సేవకుడ్న య్యానని క్రుంగి పోయేటట్లయితే ఊహాల జోలికే పోవద్దు."
    "బాగుంది!"
    "లేకుంటే జీవితం దుర్భరం కాదూ! జీవితాన్ని నరకప్రాయంచేసే అలాంటి ఊహాల జోలికి పోకపోవడమే మంచిది."
    "కలలు నిజం చేసుకోవాలని ప్రయత్నిస్తేనో?"
    "మరీ మంచిది. ప్రయత్నించి విజయం పొందితే అంతకన్నా కావలసిం దేముంది? అలాంటి వాళ్ళ విషయం మన కక్కర్లేదు."
    "ప్రయత్నమే చేయ్యనివాళ్ళ నేమనాలి?"
    "చేతకాని వాళ్ళు."
    "ఎందుకలా ఉండాలి?'
    "బహుశా పరాజయం పొందుతామని భయమేమో?"
    "ఊహు....' తల ఆడిస్తూ శేఖరం ముఖంలోకి చూసింది సుధీర.
    శేఖరం కళ్ళు దించుకుని కాసేపు ఏదో అలోచించి - "ఆ ఉత్తరం విషయం తెలుసుకొనేందుకా ఇంత దూరం...." అన్నాడు.
    "వ్రాయలేదన్నారుగా? పోనీండి! అందులో విషయం కూడా నిజం కాదంటారా?' మధ్య లోనే అందుకుని అంది.
    శేఖరం హృదయం ఆశ్చర్యంతో మూగపోయింది. గుడ్లప్పగించి సుధీర కేసిచూస్తూ ఉండిపోయాడు.
    "అడిగిందానికి జవాబు చెప్పక ఆలా చూస్తారేం?"
    "ఏం జవాబు చెప్పను?" అన్నాడు నెమ్మదిగా మంచం మీద నుండి లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి నిల్చుని.
    "జవాబు లేని ప్రశ్న లుంటాయి గాబోలు!"
    "ఎందుకుండవు? ఒక్కోసారి ఉంటాయి."
    "అవుననో, కాదనో చెప్పచ్చుగా?" రెట్టించింది.
    శేఖరం కళ్ళల్లో చివ్వున నీళ్ళు తిరిగాయి. గుండెలు గుబగుబ లాడాయి. హృదయంలోని బాధంతా గొంతులోనే కొట్టుకలాడింది. ఏం చెప్పగలడు తను?' నా ఆరాధ్య దైవానివి నీ' వని చెప్పగలిగేపాటి ధైర్యముందా తనకు? ధైర్యం చేసి చెప్పినా తనకు మిగిలేది అవమానమూ, అవహేళనా, ఆవేదనా, అవును. అంతకు తప్ప మరేఫలితమూ లేదు. కానీ హృదయాన్నే ఎలాగ వంచించడం? ఎన్నాళ్ళని అలా మోసపుచ్చగలడు? తన పాటికి తన్ను పోనీక ఈ అగ్ని పరీక్ష ఏమిటి?
    'అంత ఆలోచనేమిటో?' వాలుగంట చూస్తూ అంది.    
    "తప్పకుండా జవాబు చెప్పాలా?' వెనక్కు తిరిగి అడిగాడు.
    "అవును, చెప్పాలి."
    "ఎందుకు? తెలుసుకుని ఏం చేస్తారు?"
    "అది జవాబు మీద ఆధారపడి ఉంటుంది."
    "తప్పే చేసి ఉన్నట్లయితే?"
    "శిక్షిస్తాము!"
    "శిక్షా స్వరూపం తెలుసుకోవచ్చా?"
    "సంకెళ్ళు!"
    "గొప్పవాళ్ళు ఏమైనా చెయ్యగలరు." సుధీర కళ్ళలోకి చూస్తూ అన్నాడు.
    "అది వేరే విషయం. మాట మార్చకండి!"
    "చేసిన తప్పు ఒప్పుకుని శిక్ష ననుభవించడం మంచిదేమో? నా వల్ల పొరపాటు జరిగి పోయింది. ఆకాశంలో చందమామవని తెలుసు. అయినా ....ప్చ్! హృదయం మన మాట వినదు. ఆ విషయం మీకు నేను చెప్పినా అర్ధం కాదు ." వ్యధిత కంఠం తో అన్నాడు.
    సుధీర తల వంచుకుని వింటుంది.

                               *    *    *    *
    "ఆకాశంలోని చందమామ నందుకొని స్వంతం చేసుకోవాలన్న అభిప్రాయం నాకే రోజూ లేదు. కానీ వెన్నెల వెదజల్లుతున్న ఆ సౌందర్యమూర్తి ఎదుటే కలకాలం నిలిచి పోవాలనిపిస్తుంది. అది న్యాయమో, అన్యాయమో నాకే తెలీదు. అది తప్పే అయితే క్షమించమని కోరుకుంటున్నాను. క్షమించరాని తప్పే అయితే శిక్ష అనుభవించేందుకు సిద్దంగా ఉన్నాను." నేల చూపులు చూస్తూ గద్గద కంఠంతో అన్నాడు.
    "నేరం ఒప్పుకున్నారు గనక పారితోషకం ఇవ్వాలనుకుంటున్నాను."
    ఆమె ఎర్రని  పెదమల మీద దరహాసం చిరునాట్యం చేసింది. నల్లని కన్నుల్లోని కాంతి మరీ దేదీప్యమానంగా వెలుగుతుంది.
    "ఏమిటీ?' అనుమాన దృక్కులను ఆమె మీద బరసి అన్నాడు.
    "మీ హృదయేశ్వరి పాణిగ్రహణం!"
    "ఆ!" శేఖరం హృదయం విలవిల్లాడి పోయింది. ఇదొక రకమైన పరిహాసమా? తనెందుకు నిజం బయటపెట్టాడు? వట్టి మూర్ఖుడు! అవును.
    "అంత ఆశ్చర్యపోతారేం?"
    "అసంభవాలు సంభవాలవుతాయా?"
    "ఎందుక్కావు?' సుధీర నల్లని కాటుక కళ్ళు విరగబడి నవ్వుతున్నాయి.
    "పరిహాసాలాడేందుకు నేనే దొరికానా?" చివాలున తల తిప్పుకొని బాధగా అన్నాడు.
    సుధీర హృదయం కలుక్కుమంది. మెల్లగా కుర్చీలో నుండి లేచి శేఖరం దగ్గరగా వచ్చి  "అయితే నా మాట నమ్మరా?' అంది.
    "వద్దు. నన్నిలా ఏడిపించడం మీకు ధర్మం కాదు" అన్నాడు కన్నీళ్ళు కుక్కుకుంటూ , కిటికీ ఊచలను పట్టుకుని దూరంగా చూస్తూ.
    "భగవాన్! యింకేలా చెప్పను?' అస్పష్టంగా గొణుక్కుంటూ కుర్చీలో కూలబడింది సుధీర.
    కాసేపటికి ఏదో నిశ్చయానికి వచ్చినట్లు తల తిప్పి చూశాడు శేఖరం. దోసిట్లో ముఖం దాచుకుని మెల్లగా రోదిస్తుంది సుధీర. శేఖరం ముఖంలో బాధా వీచికలు అలలుగా లేచాయి. హృదయం బరువుగా విశ్వసించింది. ఈ అమ్మాయి అభిజాత్యం, అభిమానం, అహంకారం అన్నీ ఏమయ్యాయి?
    చిన్న పిల్లలా ఈరోజు కళ్ళల్లో నీళ్ళు పెట్టుకోవడం.... అయినా తనెలా చూడగలుగుతున్నాడు? ఇంత కఠినంగా తనే రోజూ ఉండలేదే? కిటికీ దగ్గరి నుండి మెల్లగా వచ్చి కుర్చీ వెనక నిల్చుని , సుధీర శిరసు మృదువుగా చేత్తో నిమురుతూ "సుధీరా!" అన్నాడు.
    సుధీర దోసిట్లో నుండి ముఖం తీసుకుని, తల పైకెత్తి శేఖరం ముఖంలోకి చూసింది.
    "మనముందు భయంకరమైన సమస్యలు ఎన్ని వున్నాయో గమనించావా?" అన్నాడు విచారంగా నవ్వుతూ.
    "పిరికివాళ్ళకు అన్నీ సమస్యలే!" కఠినంగా అంది.
    శేఖరం చూపులు ప్రక్కకు త్రిప్పుకుని-- "అవును, నేను పిరికివాడ్నే!" అన్నాడు మలినమైన ముఖంతో.
    "దయచేసి నాకా పిరికి పాఠాలు నేర్పకండి!' సుధీర గొంతు నిశ్చలంగా, నిర్భయంగా ఉంది.
    ఈ ధైర్యశాలిని ప్రక్కన తనుంటే తనలోని పిరికితనం భయపడి పారిపోతుందేమో! మెల్లగా తనలో తనే నవ్వుకున్నాడు శేఖరం.
    "మీరో సాయం చేసిపెట్టాలి!"
    "ఏవిటి?' మంచం మీద సుధీర కెదురుగా కూర్చుంటూ అడిగాడు.
    "చేస్తారా?"
    "శాసించడమే గానీ, యాచించడం కూడదు!" ప్రపుల్ల వదనంతో అన్నాడు.
    'అలాగేం? కానీ మిమ్మల్ని శాసిస్తానని ఏ రోజూ అనుకోకండి!" క్రీగంట చూస్తూ నవ్వి అంది.
    "అదే నా కానందం యిచ్చేటట్లయితే?"
    సుధీర తల తిప్పుకుని వచ్చే నవ్వునంతా మింగి - " మాకో నాటకం వ్రాసివ్వాలి" అంది.
    "మాకంటే? మహారాణిగారికా?"
    "అప్పుడే మహారాణి నెలా అయ్యాను?"
    "రాకుమారికే అనుకో!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS