"కానీ తల్లీ! ఏవిటో చెప్పు."
"యుద్దమేలా ఉంది?"
"ఆ మాటకేనా? బావనడిగితే చెప్పేవాడుగా?"
"నువ్వు చెప్తే ఏం? అరిగి పోతావా? ఎలా ఉంది?"
"హోరాహోరీ గా జరుగుతూనే ఉంది."
"మన కెక్కువ నష్టమా?"
"యుద్దమన్నాక నష్టం లేకుండా ఎలా ఉంటుంది?"
"మీ అన్నయ్య ప్రంటుకు వెళ్ళినట్లు అత్తయ్యకు తెలుసా?" కుంపటి మీద కాగుతున్న నీళ్ళ వేపు చూస్తూ అంది మీనాక్షి.
"నీకెలా తెలుసు?' అంది ఆశ్చర్యంగా సుధీర.
"నువ్వు చెప్పనంత మాత్రాన తెలీదు గాబోలు!"
"బావ చెప్పాడు కాబోలు! అమ్మ కీ విషయం చెప్పలేదు."
"ఎందుకని?"
"ఎందుకనేమిటి? ఏడుస్తూ ఉంటుందని!"
"ఏడవడమెందుకో?' అంది మీనాక్షి కనుకొలకుల్లో నుండి చూస్తూ.
"బాగుంది! ఎంతయినా తల్లి కదా? అందులోనూ నాన్న పోయి ఇంకా ఆరునెలలు కూడా కాలేదాయే." తడికళ్ళతో అంది సుధీర.
'అంత ప్రమాదమంటావా?' కళ్ళల్లోని భావాలు సుధీర చదువుతుందేమోనని కళ్ళు క్రిందకు వాల్చి , కంఠంలోని మార్పును అతి ప్రయత్నం మీద తెలీయనీయకుండా అంది మీనాక్షి.
"చెప్పలేము. ఏమైనా కావచ్చు." సుధీర గొంతు సన్నగా వణికింది. కళ్ళల్లో నీళ్ళు తొణికిసలాడాయి.
మీనాక్షి ప్రక్కకు తిరిగింది విసనకర్ర తీసుకునే నెపంతో.
ఇద్దరూ ఒకరికొకరు తెలియకుండా కళ్ళు తుడుచుకున్నారు.
కుంపటి మీద నీళ్ళు తేళ్ళుతున్నాయి.
మీనాక్షి హృదయం గూడా అలాగే ఉంది. "ఉత్తరాలు రావడం లేదా?" అంది తలతిప్పకుండానే.
"లేదు.... అమ్మకీ విషయం చెప్పకు."
"అది కాదు, సుధీ..."
"ఊ...."
"రేపాకవేళ... ఆహా... అలా కాకూడదనే అందరమూ భగవంతుణ్ణి ప్రార్దిస్తాము..." మీనాక్షి- గొంతు గద్గదమైంది. ఇక మాట్లాడలేక కుంపటి మీద నుండి నీళ్ళు దించి కాఫీ పొడి వేసింది.
"ఏవిటో చెప్పు."
"అత్తయ్య నిన్ను నిలబెట్టి సంజాయిషీ చెప్పమంటే ఏం చెప్తావు?' అంది తలెత్తకుండానే సన్నగా కంపిస్తున్న గొంతుతో.
"అదా నీభయం ! అప్పటికి చూసుకుందాం లే" అంది సుధీర విచారంగా నవ్వుతూ.
మీనాక్షి కాఫీ కలిపి సుధీర ముందు పెట్టింది. ఎర్రబడిన మీనాక్షి ముఖంలోకి చూస్తూ కాఫీ త్రాగసాగింది సుధీర.
సుధీర తన్ను పరిశీలించి చూస్తుందన్న విషయం తెలుసుకున్న మీనాక్షి చప్పున ముఖం తిప్పుకుంది.
"ఆ! ఇక వెళ్ళచ్చా, రాణీగారూ!" కాఫీ గ్లాసు క్రింద పెడుతూ అంది సుధీర.
"అబ్బా! ఏవిటో ఆ తొందర! అడగాలనుకున్న విషయం అడగనే లేదు' అంది మీనాక్షి మాములుగా నవ్వెందుకు ప్రయత్నిస్తూ.
"ఏవిటి?"
"అన్నయ్యను చేసుకోనన్నావా?' అంది తల తిప్పి సుధీర కళ్ళల్లోకి చూస్తూ.
సుధీర ఔనన్నట్లుగా తల తిప్పింది.
"ఎందుకని?"
"కారణాలు చెప్పాలంటే బోలెడు టైం కావాలి! ఇంకోసారి వచ్చినప్పుడు చెప్తాలే" అంది లేవడానికి ప్రయత్నిస్తూ.
"కూర్చో! కూర్చో! నేనీరోజు తెలుసుకోవాలనుకుంటున్నాను." అంది సుధీర భుజం మీద చెయ్యి వేసి బలవంతంగా కూర్చో బెడ్తూ.
"నీతో పెద్ద చిక్కే వచ్చిపడింది!"
"త్వరగా చెప్పేసెయ్! త్వరగా వెళుదువు గానీ."
"ఏం చెప్పను!" మీనాక్షి ముఖంలో కి చూసి నవ్వి అంది.
"అన్నయ్యతో ఏం చెప్పావు?"
"నేనేం చెప్పలేదు. బావే తెలుసుకున్నాడు." అంది సుధీర కనురెప్పలు టపటపలాడించి.
"అన్నయ్య కేమన్నా దివ్యజ్ఞానముందేమో గానీ నాకు లేదు' అంది మీనాక్షి వచ్చే నవ్వాపు కుంటూ.
"దివ్యజ్ఞానమెందుకు ? స్త్రీ హృదయం చదవగలిగేపాటి జ్ఞానముంటే చాలు!" ఫకాలున నవ్వి అంది సుధీర.
"అదీ లేదనుకుందాం."
"నేను నమ్మను" అంది సుధీర తల విలాసంగా తిప్పుతూ.
"సర్లే! ఇంతకూ ఏవిటి కధ?"
"అయితే ఓ కధంటూ ఉందని తెలుసన్నమాట!"
"ఆ విషయం నీ ముఖమే చెప్తుంది! ఇంతకూ ఎవరా అదృష్టవంతుడు?" కుతూహలంగా చూస్తూ అడిగింది.
"ఇదిగో మీనాక్షీ! నీకెందుకంత క్యూరియాసిటీ? ఒకరోజు అందరి ముందుకూ తీసుకొచ్చి చూపిస్తాను. ఆరోజు వరకూ కాస్త ఓపిక పట్టు" అంది సుధీర.
"ఎవర్ని?"
"బాగుంది! దారిని పోయే దానయ్యననుకో!"
"దారినపోయే దానయ్యను తీసుకొస్తే ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారేమిటి?"
"అది నా స్వవిషయం. పెళ్ళి చేసుకునేది నేను గానీ మావాళ్ళు కాదుగా?'
'అయితే మటుకు?"
"ఇంకేం ప్రశ్నలు వెయ్యకు. సుధీర అంటే నీకింకా బాగా అర్ధమైనట్లు లేదు.' అంది.
మీనాక్షి రెప్పలు వాల్చకుండా ఓ నిమిషం సుధీర ముఖంలోకి చూసి కళ్ళు దించుకుని , "నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి , సుధీ!" అంది.
సుధీర ఫక్కున నవ్వి మీనాక్షి చెంపలు నిమిరి వెళ్ళిపోయింది.
సుధీర వెళ్ళిన వేపే చూస్తూ నిల్చుంది మీనాక్షి. హృదయం బరువుగా - ఎన్నడూ లేనంత బరువుగా ఉంది.
ఎందుకో? అదే మీనాక్షి కర్ధం కాలేదు. గోడ కానుకొని ఆలోచిస్తూ నిల్చుంది. ప్రశాంతంగా ప్రవహిస్తున్న తన హృదయ సరోవరంలో ఈరోజు ఈ అలజడి ఎందుకు కలిగింది? సుధీర అదృష్టాన్ని చూసేనా? అవును. సుధీర అదృష్టవంతురాలు. అందమూ, ఐశ్వర్యము, చదువూ అన్నీ ఉన్నాయి. అన్నిటి కన్నా ఎక్కువైంది.... జీవితంలో బహు తక్కువ మందికి లభించేది ప్రేమించిన వాణ్ణి పెళ్ళి చేసుకోవడం. అవును, సుధీర ప్రేమించిన వాణ్ణి పెళ్ళి చేసుకుంటుంది.
సుధీర అదృష్టవంతురాలు. ఆ విషయం అందరూ ఒప్పుకుంటారు.
అయితే తన హృదయం ఎందుకిలా ఆవేదనతో మెలికలు తిరిగి పోతుంది? సుధీర అదృష్టానికి, ఈ హృదయ భారానికి సంబంధమేమిటి? తనకా అదృష్టం లేదనా? పుట్టుక తోనే దారిద్ర్యంతో - ఓ మోస్తరు అందంతో - చదువుకు దూరమైన తను- ప్చ్! తను కన్న కలల్లో ఒక్కటీ నిజం కాలేదు. భగవంతుడు ఇంత పక్షపాతం ఎందుకు చూపుతాడు? తనేం పాపం చేసింది?
ఉహు....తనిలా ఆలోచించకూడదు. ఆ రోజులు పోయాయి. ఒకరోజు తన కలలన్నీ కల్ల లైనందుకు ప్రపంచం మీదే పగ తీర్చుకోవాలనుకుంది. మనసు, మమతనూ, మధురిమనూ, లాలిత్యాన్ని మరిచిపోయి మోటుగా, బండగా తయారయి విషాన్ని గ్రక్కిన రోజులు తన జీవితంలో పీడకలలాంటివి. మరుగుపడిన మానవతను మేల్కొల్పి తన జీవితానికో అర్ధాన్ని, చూపెట్టిన విశాలకూ, అన్నయ్య కూ తానెంతో ఋణపడి ఉంది. తను ఏడుస్తుందని అందరూ ఏడ్వాలా? తన అదృష్టమే అందరికీ రావాలా? వద్దు.... అందరూ హాయిగా ఉండనీ.... అందరూ నవ్వనీ.... తనోక్కటే ఏడ్చినా ఫర్వాలేదు...సుధీర ఆకాశంలో పక్షిలా హాయిగా నవ్వుతూ.
"మీనాక్షి ! వంటయిందా?' ఆన్న భానుమూర్తి పిలుపుతో మీనాక్షి ఈ లోకంలో పడింది.
* * * *
పాట కచ్చేరీ వల్ల మహిళా సమాజానికి దగ్గర దగ్గర రెండు వేల రూపాయల దాకా వచ్చింది. ఇంకా ఎక్కువ డబ్బు సేకరించాలని సుధీర కోరిక. సమాజం తరపున నాటక మోకటి వేస్తె మరికొంత డబ్బు రాకపోదన్న సుధీర అభిప్రాయాన్ని విలాసినీ దేవి బలపరిచింది.
మంచి నాటక మొకటి ఎన్నిక చేసే బాధ్యత కూడా సుధీర మీదే పడింది. రెండు మూడు రోజుల పాటు నాటకాలు కొన్ని చదివింది సుధీర. కాని ఒక్కటీ నచ్చలేదు. ప్రస్తుత పరిస్థితుల కనుగుణంగా ఒక్కటీ లేదు. దేశభక్తిని ప్రజల్లో పెంపొందింపజేయగల ఉద్రేకపూరితమైన రచన ఆమె కొక్కటీ దొరకలేదు. ఏం చేయాలో తోచక రెండు మూడు రోజులు పాటు ఆలోచిస్తూ ఉండిపోయింది.
"డ్రామా సెలక్టు చేశావా సుధీరా?" అంది విలాసినీ దెవిఆ తర్వాత రోజు.
"ఇంకా లేదు. సరయినది ఒక్కటీ దొరకలేదు." అంది కొంచెం నిరుత్సాహంగా.
"పోనీ, కధా వస్తువు వేదయినా చెప్పు. నేనే ఓ నాటకం వ్రాస్తాను" అంది విలాసినీ దేవి.
సుధీరకు నవ్వు వచ్చింది. నవ్వితే బాగుండదని బలవంతంగా నవ్వు ఆపుకుని- "కధలు చెప్పడం నాకు రాదండీ!" అంది.
"అసలు విలాసినీదేవి తత్వమే ఒక రకం. కీర్తి కాంక్ష జాస్తి. నలుగురికీ తను తెలియాలి. అసలా ఉద్దేశ్యంతోనే మహిళా మండలిలో అడుగు పెట్టింది. మంత్రులూ, నాయకులూ పెద్ద పెద్ద హోదాలో ఉన్న ఉద్యోగుల చేతా ఉపన్యాసాలిప్పించేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తుంది. ఆరోజు మటుకు కార్యక్రమమంతా తనమీదే వేసుకుంటుంది. తక్కిన సమయాల్లో మటుకు తప్పించుకు తిరుగు తుంది.
విలాసినిదేవి వయసు సుమారు నలభై ఉండవచ్చు. నల్లగా, పొడుగ్గా , సన్నగా ఉంటుంది. కళ్ళద్దాల్లో నుండి తీక్షణంగా చూసే కళ్ళు ఆమె కుశాగ్రబుద్దిని చాటుతుంటాయి. పాడు గాటి ముక్కు, సన్నని చంపలూ, సన్నని పెదిమలు, కోలా ముఖం - ఇవన్నీ నలుపులో గూడా అందం ఉంది సుమా!' అని చెప్తాయి. నల్లని నొక్కుల జుట్టులో రెండే రెండు నెరసిన వెంట్రుకలు వెండి తీగల్లా మెరుస్తుంటాయి.
దారిద్ర్యంలో హోరాహోరీ పోట్లాడి పైకి వచ్చింది విలాసినీ దేవి. సెకండరీ గ్రేడ్ టీచరుగా ఉంటున్న ఆమె ఏం.ఎ.బి.ఇడి అయి ప్రస్తుతం కాలేజీ లో లెక్చరర్ గా ఉంటుంది.
అలంకరణ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది. ఒక్కోరోజు అలంకరణ ఒక మోతాదు ఎక్కువగానే ఉంటుంది. కొంతమంది ఆ విషయంలో చాటుగా నవ్వుకోవడం కూడా కద్దు. పాపం ఈరోజుకూ విలాసినీ దేవి తన కన్నెచెర విదిపించుకోను అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంది. జనవాక్యంలో ఎంతవరకూ నిజముందో తెలీదు గానీ, ఆమెను గురించి కొంచెం చిత్రంగానే చెప్పుకుంటారు అందరూ. చాలామందిని వలలో వేసుకోనేందుకే ప్రయత్నించిందనీ, కానీ ఆ టిక్కులూ టక్కులూ ఏమీ ప్రయోజనం లేకుండా పోయాయనీ అంటుంటారు. 'సరిగ్గా నెల క్రితం సబ్ కలెక్టరు ను మహిళా మండలికి పిలిపించి ఉపన్యాస మిప్పించడం లోని అంతర్యం తమకు తెలీనిదా ఏవిటి?" అంటూ చెవులు కొరుక్కున్నారు చాలామంది!
"ఏవిటి సుధీరా? నేను నాటకం రాయలేననే అంటావా?' అంది ఆలోచించడం మాని కాసేపటికి విలాసినీ దేవి.
"ఎందుకు రాయలేరు? కొంచెం ప్రయత్నం కావాలి.
"ఎన్నో భావాలు కలుగుతాయి. కానీ కాగితం మీద పెట్టలేక పోతున్నాను. ప్రయత్న లోపమని చెప్పేందుకు వీల్లేదు." విచారంగా అంది.
సుధీర దానికేమీ జవాబు చెప్పలేదు.
"నా గురించి నీ అభిప్రాయమేమిటి?' అంది హటాత్తుగా విలాసినీదేవి.
అలాంటి ప్రశ్న వస్తుందని ఏరోజూ ఊహించని సుధీర ముందు కొంచెం ఆశ్చర్యపోయి, తేరుకుని నెమ్మదిగా విలాసినీ దేవి ముఖంలోకి చూసింది.
"మాట్లాడవేం?"
"ఏమిటి?"
"నా గురించి అందరి కున్న అభిప్రాయమే నీకూ ఉందా?"
"లేదు." తలవంచుకుని మెల్లగా అంది సుధీర.
"నేను పెళ్ళి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నానని అందరికీ కుళ్ళు!"
"ఎందుకూ?"
"నేను సుఖపడతానేమో అని భయం!"
"వాళ్ళూ సుఖ పడేందుకు ప్రయత్నం చెయ్యొచ్చుగా?"
"ప్రయత్నం చేసి ఓడిపోయిన వాళ్ళు, ప్రయత్నం చేసే ధైర్యమే లేని వాళ్ళు, స్వతహాగా ఇతరులు బాగుపడితే చూడలేని వాళ్ళు! ఓ! ఎన్ని రకాలో!" నవ్వింది విలాసిని దేవి.
"అవును"
"మనసులో ఒకటి, పైకి ఒకటి పెట్టుకొని నటించడం నాకు రాదు, సుధీరా! ఏదో గొప్పతనం రావాలని పైకి మటుకు పెళ్ళి వద్దని మనసులో కుళ్ళికుళ్ళి పోయేవాళ్ళు చాలామంది నాకు తెలుసు. ఎందుకలా నటించాలో నా కర్ధం కాదు. అన్యాయమూ, అవినీతికరమూ అయిన పని మనమేం చెయ్యడం లేదుగా? పొతే నేనే పెళ్ళి కొడుకు కోసం అన్వేషణ సాగిస్తున్నానని అందరూ నవ్వుతారు. ఏం చెయ్యను? నలుగురూ పోయే దారిలో పోయే పాటి అదృష్టం నాకు లేదు. వెనకా ముందూ ఎవ్వరూ లేరు. ముప్పయి దాటాక కూడా పెళ్ళేమిటి? అని నా ముఖానే అడిగారు కొంతమంది. పెళ్ళి కేవలం దేహవాంఛను తీర్చుకోవడం కోసమే కాదు , అత్మీయులూ, ఆదరణా, జీవితాంతం వరకూ తోడూ, నీడా, సంసారమూ, పిల్లలూ- ఇవన్నీ పెళ్ళి వల్లే లభిస్తాయనీ వాళ్ళకు తెలీదు. ఏవిటో.... వాళ్ళ ఆలోచనా విధానమే మనసును గాయపరుస్తుంది." విచారంగా అంది.
"నిజమే ...బాహ్య జీవితంలోనే నాగరికత తొంగి చూస్తుంది గానీ హృదయాల్లో నాగరికత బొత్తుగా లేదు." పెదవి విరిచి అంది సుధీర.
"బాగా చెప్పావు ,సరే! ఇక వెళ్దాం. నువ్వూ ఓ నాటకం సిద్దంగా ఉంచుకో. పూర్తిగా నా మీద ఆధారపడకు.'
'అలాగేలెండి!
ఇంటికి వెళ్ళేందుకు ఇద్దరూ లేచారు.
