Previous Page Next Page 
ఆంతస్తులూ అంతఃకరణలూ పేజి 24

 

    "ఏం కాదు. మా సమాజానికి."
    "ఏ సమాజం?"
    "మహిళా సమాజం."
    "నాకు నాటకం రాయడం రాదే?
    "పోనీ..... నాకోసం రాయండి!"
    "కవిత్వం రాసిస్తాను." చిలిపిగా సుధీర కళ్ళల్లోకి చూసి అన్నాడు.
    "ఎవడి క్కావాలి బాబూ ఆ అర్ధం కాని కవిత్వం! నాటకమే కావాలి."
    "నేను నాటక మెప్పుడూ వ్రాయలేదు."
    "ఇప్పుడు నేను చెప్తున్నాను. రాయండి!"
    "శాసించనని యిప్పుడేగా అన్నావు? ఇంతగా మాట తప్పేవాళ్ళను నేనెక్కడా చూడలేదు." ముసిముసిగా నవ్వుతూ అన్నాడు.
    "తప్పితే తప్పానులెండి! తల తీస్తారా?" కొంటెగా చూస్తూ అంది.
    "అమ్మయ్యో! నన్ను జైల్లో వెయ్యరూ!"
    "అసలు విషయం చెప్పండి! రెండు రోజుల్లో నాటకం తయారు కావాలి."
    "ఏ విషయం మీదుండాలి?"
    "నాకేం తెలుసు? మీ యిష్టం."
    "నిన్ను గురించి రాస్తాను."
    "నన్నోక్కతిని గురించే రాస్తారా?"
    "పోనీ, మనిద్దర్నీ గురించి రాస్తాను."
    ఇద్దరూ ఫక్కుమని నవ్వారు.
    "సుధీరా!"
    "ఊ...."
    "మీ యింట్లో తెలిస్తే?' భయంగా అన్నాడు.
    "తెలిస్తే?"
    "నిన్నేమో పై అంతస్తు గదిలో పెట్టి తాళం వేస్తారు! నన్నేమో ఆసలు యీ లోకంలో లేకుండా చేస్తారు!"
    "ఆరోజులు పోయాయి! మీకెందుకంత భయం? కంటికి రెప్పలా మిమ్మల్ని కాపాడేందుకు నేవుంటే."
    "ఏమో? నాకు భయంగానే వుంది."
    "ఇదెక్కడి పిరికితనం బాబూ! అందులోనూ -"
    "ప్రేమ విషయంలో! ప్రణయ దేవత ముందు జీవన పుష్పాన్నే అర్పించిన త్యాగధనులుండగా...."
    "ఈ కవి కుమారుడు గొంతెత్తి హాయిగా ప్రేమ గీతాన్ని అలాపించెందుకే యింత విముఖత చూపుతాడెం?"
    "నేను సర్వసంగ పరత్యాగిని కాను."
    "సంతోషం!"
    "ఇక నాటకం మొదలు పెడతాను...." లైటు వేసి నవ్వుతూ అన్నాడు.
    "వెళ్ళమంటే వెళ్తానుగా? యీ అడ్డ దోవ లెందుకు?" ముఖం తిప్పుకుని నిష్టూరంగా అంది.
    "ఇప్పటికే చాలా చీకటి పడింది. నా గదిలో నుండి వెళ్ళడం ఎవరన్నా చూస్తె....?"
    "ఏం చూస్తె?"
    "బాగుండదు. నిన్ను నలుగురూ నాలుగు మాటలనడం నాకిష్టం లేదు. కలకాలం నాదగ్గరే వుండే రోజులు వస్తాయిగా? ఆరోజు నేను వెళ్ళమన్న నువ్వు వెళ్ళవు!" రాగారంజితమైన సుధీర ముఖంలోకి ఆప్యాయంగా చూస్తూ అన్నాడు.
    సుధీర అవనత ముఖియై -- "మరి నాటకం రెండు రోజుల్లో యిచ్చేస్తారా? లేకుంటే మా ప్రెసిడెంటు నా ప్రాణం తీస్తుంది" అంది.
    "నేనుండగానే! అసంభవం!"
    ఇద్దరూ హాయిగా నవ్వారు.
    "నేవెళ్ళి రానా?' శేఖరం ముఖంలోకి చూస్తూ అంది.
    "మంచిది. కానీ రానక్కరలేదు."
    "నాటకం?"
    "నేతెచ్చిస్తాను."
    "మా యిల్లు తెలుసా?"
    "అదేం ప్రశ్న!"
    "తెలుసన్నమాట!"
    శేఖరం నవ్వాడు. సుధీర లేచి నిల్చుని శేఖరం ముఖంలోకి ఓ క్షణం చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది.
    కిటికీ దగ్గర నిల్చుని కారు వెళ్ళుతున్న వేపే చూస్తూ నిల్చున్నాడు శేఖరం. హృదయం తన్ను తానూ మరిచి ఆకాశంలోని పక్షిలా ఎగిరిపోయింది.

                                *    *    *    *
    అదొక మహా యజ్ఞం. కర్మ భూమియైన భారత దేశంలో అనాదిగా యజ్ఞాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇలాంటి యజ్ఞాలు యేరోజూ జరుగలేదు. ఎవ్వరూ కనీ విననట్టి మహాధ్వరం.
    చైనా ముష్కరులను తరిమి వేసేందుకు భారతీయులు చేస్తున్న మహా యజ్ఞం అది. యజ్ఞఫలం విజయకాంక్ష.
    ప్రతి భారతీయుడు ఆ యజ్ఞ నిర్వహణకు తన చేయూత నిస్తున్నాడు. హృదయమూ, శరీరమూ కూడా మాతృదేవి సేవకే అంకితం చేస్తున్నారు.
    భారతీయుల బలమూ సాహసమూ , త్యాగమూ యీనాటివా? ఓహ్! అవి భారత చరిత్ర నిండుకూ మొదటి పేజీ మొదలుకొని చివరి పేజీ వరకూ సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉన్నాయి.
    చైనీయులతో యుద్ధం చేసి పారద్రోలేందుకు నడుం బిగించారు దొంగలు. మందు కొచ్చిన డబ్బు రక్షణ నిదికిచ్చి అసువు లర్పించారు శిశువులు!తను కిచ్చిన ఆహార పదార్ధాలను జవాన్ల కు పంపారు వరద బాధితులు! విద్యార్ధులు పుస్తకాలకు బదులు తుపాకులిమ్మని హటం చేస్తున్నారు. స్త్రీ, పురుష విచక్షణ లేక రక్తదానం చేస్తున్నారు. సైనికులు ప్రాణత్యాగం చేస్తున్నారు. తల్లులు పుత్రదానం చేస్తున్నారు! ఓహ్! మనసు పులకరింతలతో పరవశం చెందుతుంది. త్యాగవాహిని ప్రజావాహినితో అంతర్లీనమై ప్రవహిస్తుందా?
    కలం చెక్కిలి మీద ఆన్చి అరమోడ్పు కన్నులతో దూరంగా చూస్తున్నాడు శేఖరం - ఆలోచిస్తూ . హృదయంలో భాతరంగాలు ఉవ్వేత్తుగా లేస్తున్నాయి. విద్యుత్తులాంటి శక్తి శరీరమంతటా ప్రవహించి హృదయాన్ని ఊపేసింది. 'అబ్బ! ఇవన్నీ మానవమాత్రుడు చేస్తున్న త్యాగాలేనా? అమ్మా!భారతీ!నువ్వు నిజంగా ధన్యవు! నీ చరిత్ర ధన్యము. నీకడుపున పుట్టిన మేము ధన్యులము. చాలు! ఈ అదృష్టం చాలు, తల్లీ!అన్యం నేను వాంచించను. కానీ ఈ మహా యజ్ఞానికి నేనేవిధంగా సహకరించగలను? కేవలం ప్రేక్షకుడుగా ఉండిపోయి తర్వాత నీ కన్నుల్లోకి ఎలా చూడగలను? నా శిరసు సిగ్గుతో అదోలోకాలకు క్రుంగి పోదూ?' శేఖరం హృదయం ఆవేదనతో, అసంతృప్తితో తల్లడిల్లిపోతుంది. సుధీర వ్రాయమన్న నాటకానికి ఈ అమజీవుల జీవితాన్నే కధా వస్తువుగా తీసుకుంటే? శేఖరం కళ్ళు తళుక్కున మెరిశాయి. హృదయం సంతోషంతో నాట్యం చేసింది. ద్విగుణీకృతమైన ఉత్సాహంతో కలం సాగించాడు. కలం ఆగకుండా సాగిపోతూనే ఉంది. అలసట, ఆకలి, నిద్ర శేఖరానికి భయపడి దూరంగా వెళ్ళిపోయాయి.
    సెకండ్లు, నిమిషాలు, గంటలు నిశ్శబ్దంగా కదిలిపోతున్నాయి.
    దూరంగా చర్చి గంటలు పది వరుసగా వినిపించాయి. శేఖరం కలం టేబిలు మీద పెట్టి తృప్తిగా తను వ్రాసిన కాగితం వేపు చూశాడు.
    మూడు గంటల్లో చిన్న నాటకం తయారయింది. తిరిగి చదువుకోసాగాడు. భారతీయులు కొనసాగిస్తున్న ఆ మహా యజ్ఞం విజయవంతమయ్యేందుకు పేదరాలైన తల్లి తన ఏకైక కుమారుణ్ణి దానం  చేయ సమకట్టింది. పట్టు బాలీసు పై ఒరిగి, ఇరవై సవర్లన బంగార మిచ్చి నందుకు తన పేరు పేపర్లో చూసుకుని మురిసి పోతున్న సెట్ జీ ఆ త్యాగామూర్తిని చూసి నిలువునా కంపించి పోయాడు. పుత్రదానం చేసేందుకు పుత్రుణ్ణి వెంటబెట్టుకుని వెళ్తున్న ఆమెకు నమస్కరించి పాదధూళి శిరసున అద్దుకుంటాడు. పట్టు బాలీసుల్లో దాచిన బంగారు కడ్డీలు తీసి సమర్పించుకుని తన ఉడుతాభక్తిని చాటుకుంటాడు. అప్పటి వరకూ  అతనికి శ్వాస పీల్చుకొనే కష్టమైంది. తన జీవితమే అసహ్యంగా తోచింది. అతని మానసిక సంఘర్షణ ను చాయా చిత్రం గూడా చూపలేనంతటి స్పష్టంగా, నిశదంగా అద్భుతంగా చూపాడు శేఖరం.
    నాటకం చదువుతూ మధ్యమధ్య కన్నీళ్ళు తుడుచుకుంటూనే ఉన్నాడు. చివరకు ఆ నాటకం తనేనా వ్రాసింది అన్నంత ఆశ్చర్యం గూడా కలిగింది.
    తేలికైన మనస్సుతో, హాయిగా నిట్టూర్చి కుర్చీ వెనక్కు వాలాడు. తలుపు నెట్టుకుని స్నేహితులిద్దరూ లోపలికి వచ్చారు.
    "జ్వరం వచ్చినవాడివి ఇంకా రాయడమేమిటోయ్ ! పడుకో కూడదూ?' మందలించాడు బి.ఏ. విద్యార్ధి వేణు.
    "నీకు తెలీదోయ్ వేణూ! ఆ తలలో పుట్టిన భావాలను రూపకల్పన చేయకుంటే నిజంగా జ్వరమొస్తుంది!" నవ్వుతూ అన్నాడు నిరుద్యోగి శేషగిరి.
    "మీ రిప్పుడోస్తున్నారేం?" శేఖరం అడిగాడు.
    "సినిమా కెళ్ళాం! ఇంతకూ ఏవన్నా తిన్నావా లేదా?"
    "ఊహూ...."
    "మరి? ప్రక్కనున్న టీ బంకు కెళ్ళి పాలు తీసుకు రానా?"
    "వద్దు, బిస్కెట్లున్నాయి. తిని నీళ్ళు త్రాగితే సరిపోతుంది."
    "నువ్వు చూస్తె గదిలో నుండి బయటకు అడుగుపెట్టినట్లే లేదు. గదిలోకి గులాబి పువ్వేలా వచ్చింది?" తన పరిశీలనా శక్తికి మురిసి పోతూ అన్నాడు శేషగిరి.
    "అదా....' నవ్వాడు శేఖరం.
    "ఏవిటో గ్రంధం జరిగినట్లే ఉందే! కొంప తీసి నీ ఊహా సుందరి గాని ప్రత్యక్షం కాలేదు గదా?" హేళనగా అన్నాడు వేణు.
    "అవును."
    "వ్వాట్!"
    ఇద్దరూ ఒకేసారి నోళ్ళు తెరిచారు.
    "సుధీరే!" శేషగిరి.
    "విద్యుల్లతే!" వేణు.
    "అవున్రా! సుధీరే! ఇక నోళ్ళు మూసుకోండి!" చిరుకోపంతో  అన్నాడు శేఖరం.
    "నిజం!" నమ్మలేక మళ్ళీ అడిగాడు వేణు.
    "ఒరే!నమ్మితే నమ్మండి!లేకపోతె మానేయ్! వెధవ ప్రశ్నలు వేసి నన్ను మాత్రం చంపకు." విసుక్కున్నాడు శేఖరం.
    "బాబ్బాబు! అలా విసుక్కుంటే ఎలారా? అమాంతం లక్షాధికారిణికి ప్రియుడివై పోయావు. నీతో ఇంకెన్ని పన్లుంటాయో! అయినా నిన్నెలా అభినందించాలో తెలీటం లేదు. రొట్టె విరిగి నేతిలో పడిందిరా!" అన్నాడు వేణు ఈర్ష్యతో మెలికలు తిరిగిన హృదయాన్ని దరహాసం వెనక  దాస్తూ.
    "ఛా! ఛా! నేతిలో ఏమిటి? అమృతంలో పడింది! ఇంతకూ ఏవిటి కధ? పెళ్ళి చేసుకుంటానందా? లేక....."
    "ఇక వాగకు." కుర్చీలో నుండి లేచి మంచం మీద పాడుకుంటూ విసుగ్గా అన్నాడు శేఖరం.
    "మళ్ళీ ఏవిటి రాస్తున్నావు? ప్రేమ కవిత్వమా? ప్రేయసికి అంకితం యిస్తావేమిటి? ఈసారి ఎవర్ని దృష్టిలో పెట్టుకుని రాస్తున్నావు బాబూ!' పక్క పరుచుకుంటూ అడిగాడు వేణు.
    "అంటే?' చిరాగ్గా అడిగాడు శేఖరం.
    "ఏ కవిని దృష్టిలో పెట్టుకున్నావు?"
    "శేఖరం జవాబు చెప్పకుండా పక్కకు తిరిగి పడుకున్నాడు. 'ఒట్టి కుళ్ళు మనుషులు!' రహస్యం చెప్పింది అతని హృదయం.
    శేఖరం చేసిన ప్రతి రచననూ వేణు అలా అనడం పరిపాటే! ఎవర్నో దృష్టి లో పెట్టుకున్నాననో ;లేకుంటే ఇలాంటి రచన ఎక్కడో చదివా ననో లేక స్పష్టంగా దేవులపల్లో, శివ శంకర శాస్త్రో నీ రచనల్లో తొంగి చూస్తున్నారనో- అంటాడు. శేఖరం ఏరోజూ వాదనకు దిగలేదు. ఇష్టం లేదు కూడా. అన్నమాట నిరూపించమని వాదనలోకి దిగితే వేణు పలాయానం చిత్తగించవలసిందే! వేణు అలా అన్నప్పుడల్లా శేఖరం నవ్వి ఊరక ఉండిపోయేవాడు.
    మానవ మనస్తత్వాలను చదవ లేనంతటి అశక్తుడు కాదు శేఖరం. మానవ బలహీనతలు తెలుసు గనకనే సహించి ఊరుకో గలుగుతున్నాడు. శేషగిరి, వేణూ కూడా మరేం మాట్లాడక దుప్పట్లు ముసుగు లాగారు. ఆ మర్నాడు సుధీరా వాళ్ళింటికి వెళ్ళే తియ్యని ఆలోచనలో పూర్తిగా మునిగిపోయాడు శేఖరం!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS