"కబుర్లు యేమన్నా చెప్పు కల్యాణీ. ఎన్నో చెప్పాలంటూ రాస్తావు. తీరా వచ్చాక యేం చెప్పవు. ఈ ఆర్నెల్లలో విశేషాలేమిటి చెప్పు మరి...." ఆమె చెయ్యి చేతిలోకి తీసుకొని మృదువుగా నిమిరాడు.
"ఏం చెప్పను ఆనంద్! నీవు దూరంగా వున్నంతసేపూ యేదో చెప్పాలని ఆరాట పడతాను. నీవు వచ్చేసరికి నా మనసుతోపాటు నోరు మూగపోతుంది! ఇలా నీ వడిలో పడుకొంటే నా బాధలు, మనస్తాపాలు అన్నీ మరిచిపోతాను. ఎండలో నడిచి నడిచి అలసిన మనిషికి చల్లటి నీడ దొరికినంత తృప్తిగా వుంటుంది. దాహంతో గొంతు ఎండిపోయిన మనిషికి చల్లటి నీరు దొరికినట్లుంది. తృప్తితో నా మనసు నిండిపోతుంది. ఈ ఆనందం ఈ శాంతి యింకెక్కడా దొరకవు బావా? దొరక దొరక్కదొరికిన ఈ తృప్తిని మనసారా అనుభవించాలని వుంటుంది. ఇలా నీ వడిలోంచి కదలాలనిపించదు. ఎవరితో మాట్లాడాలనిపించదు. తిండి-నిద్ర యేది అక్కరలేదు యిలా నీ వడిలో పడుకుంటే ఆమె ఆవేశంగా అంటూ ఆనంద్ చుట్టూ చేతులు మరింత బిగించింది.
"నా పిచ్చికల్యాణి!" ఆమెని లేవదీసి గుండెలకి హత్తుకొన్నాడు ఆనందు ఆవేశంగా.
"బావా! బావా! నీవు నన్ను వదిలి వెళ్ళద్దు. నీవు లేకుండా నే నుండలేను. నన్ను తీసికెళ్ళిపో నీతో" బేలగా అంటూ ఆనందు గుండెలలో మొహాన దాచుకుంది కల్యాణి. కంటిలోంచి వచ్చే నీరు ఆనంద్ కి చూపడం ఇష్టంలేదు.
ఆనంద్ చిన్నగా నిట్టూర్చాడు. అనురాగంతో ఆమె జుత్తు నిమురుతూ "ఎందుకు కల్యాణీ, జరగవని తెలిసీ ప్రతిసారీ జరగని వాటికోసం బాధపడడం? లేనిపోని ఆశలతో నీవు, నేను-యెందుకు మనల్ని మనం మభ్యపెట్టుకోడం? నా దగ్గిరకి రావాలని నీకున్నా తీసికెళ్ళాలని నాకు వున్నా నీవు రాలేవు కల్యాణీ. నీవు రాలేవని నాకూ తెల్సు. తెలిసే మళ్ళీ ఆ ప్రసక్తి యెందుకు తెస్తావు? ఎందుకిలా కన్నీళ్ళు కార్చడం? ఈ కన్నీళ్ళే మనకు మిగిలేవని మనకు తెలుసు. వద్దు కళ్యాణీ, మనకు దొరికిన యీ కొద్ది సమయాన్నీ కన్నీళ్ళతో నింపవద్దు. అపురూపంగా దొరికే యీ క్షణాలని ఆనందంగా గడుపుదాం. ఆవేదనతో ఈ కొద్ది సమయాన్నీ వృధా పుచ్చకు. తరువాత మనకు మిగిలేది ఆవేదన, దుఃఖం, కన్నీళ్ళు యెడబాట్లేగా! ఈ రెండు రోజులుకూడా కన్నీళ్ళతోనే గడిపేద్దామా చెప్పు కల్యాణీ!" ఆనంద్ గొంతులో ఏదో అడ్డుపడినట్లు అయింది. కల్యాణి గుండెల్లో చప్పున మొహం దాచుకున్నాడు. చిన్న పిల్లాడిలా గుండెలలో మొహం దాచుకుని కన్నీళ్ళు పెట్టుకుంటున్న ఆనంద్ ని ఓదార్చడానికి కల్యాణికి యే మాటా కనపడలేదు. మౌనంగా ఆనంద్ జుత్తు సవరిస్తూ ఉండిపోయింది.
"కల్యాణి! ఏమిటో నీ దగ్గిరకి వచ్చేసరికి యింత మగవాడినీ పసిపాపనయిపోతాను నీ వడిలో ఈ ఆరడుగుల పొడుగు, ముఫ్ఫై ఐదేళ్ళ వయసు, చావుకి భయపడని, చావుకి తెగించి చేసే నా ఉద్యోగం, నా ధైర్యం, నా స్థయిర్యం, నా నిబ్బరం, నా ఆత్మవిశ్వాసం అన్నీ నీ దగ్గిరకి వచ్చేసరికి మంచులా కరిగిపోతాయి కల్యాణీ నీ మొహం చూస్తుంటే. నీ కళ్ళల్లో దైన్యం, బాధ చూస్తూకూడా యేం చెయ్యలేని నా అసమర్ధత నన్ను మరింత పిరికివాడిని చేస్తుంది. నేను వుండీ నీకేం చెయ్యలేక పోతున్నానని, నీ కష్టాలనీ, బాధలని చూస్తూకూడా వూరుకోవలసి వస్తుందన్న బాధ కన్నీళ్ళు తెప్పిస్తాయి కల్యాణీ! కల్యాణి నాది కాదు అన్న ఊహ నా మతి పోగొడ్తుంది. నీ దగ్గిరికి వచ్చేసరికి నేను నేనులా వుండలేను. నేనేం చెయ్యను చెప్పు. నీ సుఖం కోసం, నీవు సంతోషంగా ఉండడం కోసం నేనేం చెయ్యను కల్యాణీ!" బాధగా అన్నాడు ఆనంద్ కళ్ళలో చిమ్మిన నీరు, కల్యాణి పమిటచెంగుతో వత్తుకుంటూ.
కల్యాణి లాలనగా, బుజ్జగింపుగా ఆనంద్ మొహం నిమిరింది. "బాధపడకు బావా! నీవేం చేస్తావు! నా దురదృష్టానికి నా అదృష్టం యింతే అయితే దాన్ని నీవెలా మార్చగలవు? నీ దగ్గిరున్న హృదయం యిచ్చావు, ప్రేమ యిచ్చావు, అంతకంటే నీవేం యీయగలవు?"
"కల్యాణీ! మనం యెంత దురదృష్టవంతులం. అన్నీ వుండి కావాలనుకున్నది పొందలేక పోవడం యెంత దౌర్భాగ్యం! మనకు విధి ఎందుకలా యెదురు తిరిగింది.
'హుఁ విధిగాదు. ఈ వెధవ దేశంలో యీ మనుష్యులు, ఈ సంఘం. యీ కట్టుబాట్లు, ఈ చట్టాలు అన్నీ మనకు అడ్డుగా నిలుస్తున్నాయి. ఇదే ఏ విదేశమో అయితే కల్యాణీ ఆ ఊహే యెంత ఉత్తేజం కలిగిస్తుందో తెలుసా! కల్యాణీ, నీకే పిల్లలు లేకుండా వుండి వుంటే, ఈ చేతుల్లో ఎత్తుకుని అలా విమానంలా ఎగిరి ఏ విదేశమో తీసికెళ్ళి దింపేవాడిని. అప్పుడింక యీ వెధవ సంఘం, ఈ చట్టాలు, మీ అయన వీళ్ళంతా ఏం చేసి వుండేవారా అని ఆలోచిస్తూ వుంటాను అప్పుడప్పుడు. కానీ.....కానీ, అంత అదృష్టంలేదు యీ జన్మకి....."
"ఈ పిల్లలే లేకపోయుంటే ఇన్నాళ్ళు యిలా నీకు దూరంగా వుండేదాన్నా బావా! తల్లి హృదయంలో పిల్లలపట్ల యింత మమతని యెందుకు పెట్టాడో దేముడు. ఆడదాని కాళ్ళకి. యీ పిల్లలనే బంధం అడ్డులేకపోతే స్త్రీ విచ్చలవిడిగా తిరుగుతుందని కాబోలు దేముడు ఆడదాని హృదయాన్ని మాతృత్వపు మమతతో నింపాడు. ఎలాంటి ఆడదైనా, ఎంత హృదయం లేనిదయినా కన్నపిల్లలని దూరంచేసుకోలేదు బావా. ప్రేమకోసమయినా సరే, స్త్రీని యెంత అశుభంగా సృష్టించాడో చూడు. ఆ దేముడూ మగవాడేగా, ఒకొకసారి యేమనిపిస్తుందో తెలుసా? ఆ ఇద్దరు పిల్లలకి యింత విషం యిచ్చి, నీ దగ్గరికి రావాలని...." కల్యాణి మాట్లాడలేకపోయింది. ఏడుపు ముంచుకొచ్చింది.
