కెవ్వున అరిచింది మాలతి.
అర్ధమానవుడు అంతటితో ఆగలేదు. ఆమె రెండవ చెంపను అందుకోబోయినాడు. భయంతో పరుగుతీసి ఒక పొదలో దూరిపోయింది మాలతి.
అర్ధమానవుడు ఆమెను వెంటాడుతూపోయి పొదలో దూరాడు, ఆమెను అందుకున్నాడు. పొదలో అలజడి అధికాధికం అయిపోయింది. రవంతసేపు అయ్యాక ఎర్రగా కందిపోయిన ముఖంతో పొదలోంచి బయటపడింది మాలతి.
అతడికి పట్టూ విడుపూ తెలియవు. పట్టిన పట్టుని కొన సాగించటమే తెలుసు. అందునించి పంతం పట్టినా పాఠం చెప్పినా చాలా మెళుకువగా ఉండాలి అనుకుంది!
నేరుగా గుహలోకి పరుగు తీసింది.
చమరీ మృగాల చర్మంతో అమర్చిన శయ్యమీదకు వాలిపోయింది. అతడు ఆమెను వెన్నంటి సుడిగాలిలా లోనికి వచ్చాడు. ఒక చమరీ మృగం చర్మాన్ని తీసి తన శరీరం కన్పించకుండా నిండుగా కప్పుకుంది మాలతి.
అతడు చిత్రంగా అలా చూస్తూ నిలిచిపోయినాడు. శాంతుడు అయినాడన్నట్లుగా ముఖం ప్రశాంతమయింది.
౦ ౦ ౦
తన కనులముందు యోగి ప్రత్యక్షం కావటం కలకాదని యదార్ధమని గ్రహించాడు ఫిజో. పగలంతా మాలతి కోసం తిరిగి తిరిగి శరీరాన్ని వశీకరించుకున్న అలసట అంతా తేరిపోయింది. ఉదయ సంధ్యలో శీతల సమీరాలు ప్రాణవాయువుల్ని నింపుకుని సేదదీర్చుతున్నాయి.
చివాలున లేచి యోగి పాదాలను ఆశ్రయించినాడు ఫిజో వినయ సంపత్తి వల్లనే వీరుల పరాక్రమం వన్నె పెరుగుతుంది. "చిరంజీవ"అంటూ ఆశీర్వదించినాడు ముని.
అతని కంఠస్వరం చాలా గంభీరంగా ఉంది. ముఖకాంతి చాలా ఉజ్వలంగానూ ప్రశాంతంగానూ వుంది. జడలు బాగా పెరిగిపోయి క్రిందికి వ్రేలాడటమే కాకుండా నేల మీదికి జారాడుతున్నాయి. కాలి గోళ్ళు బాగా ముందుకు సాగి వొంకిలు తిరిగి నేలను తాకుతున్నాయి.
నాసికాగ్రహం చాల సూక్ష్మంగానూ, ఉన్నతంగానూ ఉంది. కనుబొమ్మలు దట్టంగా వున్నాయి. ఎత్తయిన నుదుటి మీద విభూతి రేకలున్నాయి. పొలం మధ్యలో అపుడే ఉదయించిన రవి బింబంలా ఎర్రని కుంకుమ అరుణారుణ కాంతులతో తరళాయితమవుతోంది.
మడ క్రిందినించి వెంట్రుకలు చాతిమీదుగా వాలి ఉదరభాగమంతా నిండి వున్నాయి. ఉదరం కృశించిపోయి నట్లుగా వెన్నుని తాకుతోంది.
అది బలహీనత కాని, ఆరోగ్య రాహిత్యం కాని కాదు. కేవలమూ యోగ సాధ్యంవల్ల అలా అయింది. వక్షస్సు ఉన్నతంగా ఉండటమే అందుకు సాక్ష్యం.
ఆరోగ్య విహీనతవల్ల కాని, దుర్భలతవల్లకాని ఉదరభాగం కృశిస్తే వక్షోభాగం ఉన్నతంగా ఉండటం సంపూర్ణ ఆరోగ్యానికి లక్షణం.
"నాయనా, చొరరాని చోటుకు వచ్చావు. తీరయాత్రలకు వచ్చి దారితప్పావా? లేక ఎవరయినా దుండగులు నిన్ను తీసుకువచ్చి ఇక్కడ విడిచిపోయినారా.
"ఎందుకిలా పడివున్నావు?" అని నేపాలీలో అడిగాడు యోగి.
తాను ఖాట్మండునించి వచ్చిన వ్యక్తి అని అతడు ఆకారణం వల్లనో, వేషధారణ వల్లనో లేక అంతుచిక్కని మరొక కారణం వల్లనో తెలుసుకోగలిగాడు. అతడే యోగి అన్ని భాషలు తెలిసిన వాడు అయి వుండాలి.
మాటలను ఉచ్చరించే పద్దతి చూస్తే అతడు సంస్కృత భాష బాగా తెలిసినవాడని అర్ధమవుతోంది.
"అయ్యా! నేను ఖట్మండూనించి వచ్చాను. అడవుల లోనూ కొండలమీద తిరిగి విశేషాలు సేకరించుకునే దేశవిదేశాల బృందాలకు మార్గదర్శిగా, గార్డ్ గా నేను పనిచేస్తూ ఉంటాను. ఆ పర్యాయం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాలనే ఉబలాటంతో ఈ ప్రాంతాలకు వచ్చాను.
అనూహ్యమయిన ఒక ప్రమాదం సంభవించి మిత్రులంతా చీలిపోవలసి వచ్చింది. బృందంలో మిగిలినవారు అందరూ తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోయినారు.
మా కెప్టెన్ కన్పించకుండా పోయినారు. నేను కెప్టెన్ గురించి అన్వేషిస్తూ ఇలా వచ్చాను. మీరేదయినా సాయం చేయగలిగితే ధన్యుడనవుతాను." అన్నాడు ఫిజో అతడు అంజలి ఘటించి అడిగాడు. కంఠ స్వరంలోని ప్రార్ధనా పూర్వకమయిన ధోరణిని గ్రహించి ప్రసన్నుడయినాడు యోగి.
"వారంతా ఢిల్లీకి వెళ్ళిపోతే నీవు మాత్రం ఇలా ఎందుకు తిరుగుతున్నావు? ఇది ఎంత ప్రమాదకరమయిన చోటు అనే సంగతి నీకు తెలుసా? ఇక్కడి శీత వాయువు చర్మాన్ని శిధిలం చేస్తుంది. ఈ కొండలు, లోయలు, శిఖరాలు అడవులు ఎక్కడికక్కడ దాటరానివిగా వుంటాయి. నీవు సరి అయిన దారిన పోయినా జనావాసాలను చేరుకుందుకు వారం రోజులు పడుతుంది. తగిన ఉపకరణలు లేకుండా ఏడెనిమిది రోజులు ఇలా పయనించాలంటే అది ప్రాణాంతకమయిన పని.
నీవు ఈ వృత్తిలో ఉన్నావు కాబట్టి నాకు తెలియకుండా ఉండదు కదా." అన్నాడు యోగి దయాపూరితమయిన కంఠస్వరాన.
ఫిజో తాను తిరిగి వెళ్ళలేను అనే విషయాన్ని ఒక్కసారి స్మరించి క్షణం సేపు విచలితుడయినాడు అతని నేత్రాలు సజలమయినాయనిపించింది.
వెంటనే అతని సహజ ప్రకృతి అయిన ధైర్యసాహసాలు క్రమ్ముకుని వచ్చినాయి.
"మా కెప్టెన్ బృందంలోని ఒక వ్యక్తిని రక్షించాలన్న ప్రయత్నంలో అత్యంత సాహసానికి పూనుకుంది. నేరుగావచ్చి ప్రమాదంలో తల దూర్చింది. అతనిని రక్షించగలిగింది. కాని తాను ప్రమాదంలో చిక్కుకుని మాకు దూరమయింది. ఈ స్థితిలో ఆమెను వొదిలేసి తిరిగి పోయేందుకు నాకు మనస్కరించలేదు. ఆమెకోసం అన్వేషించాలని ఇక్కడే ఉండిపోయాను.
