"ఓడలు బళ్లయినా బళ్ళు ఓడలయినా బలరామయ్య నీతో వియ్యమందుతాడన్నమాట కల్ల!"
నిండైన సాంబయ్య గుండెలు ఉప్పెననాటి సముద్రపు అలలలా లేచి విరిగి పడి కొట్టుకొన్నాయి.
"నువ్వు ఏది కల్లా, ఏది కలా అనుకుంటున్నావో, అదే నా యీ కళ్ళముందు జరగాలని ఇరవై రెండేళ్ళుగా గుండెల్లో పెట్టుకొని మగ్గిపోయాను-తెలుసా?"
కనకయ్య బిగిసిపోయి సాంబయ్య ముఖంలోకి చూశాడు. సాంబయ్య ముఖం జేవురించి వుంది. అతని కళ్ళు నివురూదిన నిప్పు కణికల్లా వున్నాయి. ఎంతటి మనో నిశ్చయం? ఏం పట్టుదల? అంతకుమించి అర్ధంచేసుకోలేక పోయాడు కనకయ్య.
"కనకయ్యా! ఇవ్వాళ మంచి రోజు, మాట్లాడోస్తావా?" ఆత్మవిశ్వాసం ప్రతిమాటలోనూ ధ్వనించింది.
"నేనా!" జావకారిపోయాడు కనకయ్య.
సాంబయ్య తనను ఇంత చిక్కుల్లో పెడ్తాడనీ, తన తెలివితేటల్ని, లౌక్యాన్నీ, కార్యదక్షతనూ తృటికాలంలో కొట్టేయగలడని ఎన్నడూ ఊహించలేదు. తనను పరీక్షకు పెట్టి, తన అసమర్ధతను తన ముఖాన్నే అంటించి, వీధిలో పడేయగల సామర్ధ్యం, తెలివి, పట్టుదల సాంబయ్యకున్నయ్యనేది తను ముఫ్ఫైఏళ్ళుగా గుర్తించలేకపోయాడు.
"నీవల్ల కాకపోతే చెప్పు, ఆ రవణమ్మనే మాట్టాడమంటాను."
"ఏ రవణమ్మా! బలరామయ్య పెత్తల్లి కూతురు రవణమ్మే?"
"ఆ, ఆ రవణమ్మే? అడపా దడపా వందా రెండూ అంటూ అప్పు పట్టుకు పోతుందిలే! ఆమే ఆ మధ్య ఈ విషయం కదిలించిందిలే!"
"ఎట్టెట్టా? ఏమంది రమణమ్మా?"
"సాంబయ్యన్నా! ఈ ఏడన్నా అబ్బాయికి పెళ్ళి చేస్తారా అంది!"
కనకయ్యకు అందులో ప్రత్యేకమైన అర్ధం ఏదీ గోచరించలేదు. "ఆ అడిగింది. అడిగితే?" అన్నాడు బుర్ర గోక్కుంటూ.
"అడిగట్లో సంబంధం పెట్టుకొని ఎక్కడెక్కడో వెతుకుతా వెందుకు? ఊళ్ళో సంబంధం. బలరామయ్యను కదిలించి చూడరాదా అంది." సాంబయ్య చుట్ట వెలిగించి గుప్పుగుప్పున పొగ వదుల్తూ "అదీ సంగతి!" అన్నాడు.
"మరి ఆ రవణమ్మనే అడిగి చూడమనలేకపోయావా?" ఆలోచనలో పడి అన్నాడు కనకయ్య.
"ఆ మాత్రం తెలియక కాదు నిన్ను పిల్చింది. రవణమ్మ, ఏమాత్ర్రమో బలరామయ్య అభిప్రాయాన్ని పసికట్టకపోతే ఆ మాట వచ్చి నాతో అనదు. ఆమె ఉద్దేశం ఇక నన్ను రంగంలోకి దిగమని!" గుప్పుగుప్పున చుట్టపొగ వదుల్తూ.
సాంబయ్య చెప్పిందంతా సబబుగానే కన్పించింది కనకయ్యకు. అయితే మనసులో ఓ అనుమానం కదిలింది. రవణమ్మ సాంబయ్య దగ్గిర తన పబ్బం గడుపుకోటానికి అలా చెప్పలేదుగదా? నిజంగా బలరామయ్య అభిప్రాయాన్ని తెలుసుకొనే దారం వదిలిందా?
"కనకయ్యా! నీచేత కాకపోతే చెప్పు, మరొకళ్ళని-----"
సాంబయ్య మాట పూర్తి కాకుండానే "ఇక నాకొదులు! నే చూసుకుంటా!" అన్నాడు కనకయ్య.
"ఇవ్వాళే మంచి రోజు." సాంబయ్య తిరిగి గుర్తు చేశాడు.
కనకయ్య ఈ విషయంలో తనేమీ తొందరపడలేదని మనస్సుకు సర్దిచెప్పుకొని లేచాడు.
కనకయ్య ఇంటికి వెళ్ళి, ఆదరాబాదరా రెండు మెతుకులు గొంతులో వేసుకొని, బలరామయ్య ఇంటికి బయలుదేరాడు. బలరామయ్య తండ్రి తాతలనాటి స్థితిగతులూ, ఈనాటి బలరామయ్య పరిస్థితీ, కనకయ్య స్మృతిపథం లోంచి తవ్వి తోడి మననం చేసుకోసాగాడు.
బలరామయ్య తండ్రి వీరభద్రయ్య గారు జిల్లా మొత్తం మీద పేరుమోసిన ధనిక స్వాముల్లో ఒకడు. వెనకటి రోజుల్లో ఇంగ్లీషుదొర జిల్లా కలెక్టరుగా వున్నప్పుడు ఆ ప్రాంతం వచ్చి వీరభద్రయ్య గారింట్లోనే మకాం చేశారు. ఊళ్ళో ఉన్న ముప్పాతిక కుటుంబాల వాళ్ళు వీరభద్రయ్యగారి ఉప్పూపులుసూ తిన్నవాళ్ళే. అంతా జమీందారీ పద్దతుల్లోనే నడిపించుకొన్నాడు ఆయన బ్రతికున్న రోజులన్నీ, ఆయనకు బలరామయ్య ఒక్కడే కొడుకు. కూతుర్ని చింతపల్లి జమీందారీ వంశంలో ఇచ్చారు. బలరామయ్య తండ్రి ఆస్తితోపాటు ఆస్తిపరులకుండే అహంకారాన్నీ, అభిజాత్యాన్నీ వారసత్వంగా పొందాడు. అయితే తండ్రిలోవున్న వితరణబుద్దీ, మర్యాదా, మన్ననా కొడుక్కి రాలేదు. ఉన్నదానికంటే హెచ్చులు చెప్పుకోవటం, గొప్పలకుపోయి తలకుమించిన పనులు చేయడం బలరామయ్యకు స్వతహా వచ్చిన గుణం. నలుగురు కొడుకుల్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని బస్తీకి పంపించి చదివించాడు. పెద్ద వాళ్ళిద్దర్నీ థర్డుఫారం చదువుకు మదనపల్లి, ఋషీవాలి పంపించాడు. అక్కడ తిండి సరిగాలేదని కూనూరుకు మార్పించాడు. వాళ్ళ చదువులకు వేలకువేలు తగలేశాడు. వాళ్ళు మొత్తం నాలుగేళ్ళకంటే ఎక్కువ చదవలేదు. చదివిన క్లాసు రెండేసిసార్లు చదివి ఫిఫ్త్ ఫారం అన్నా పాసవకుండానే ఇంటికి చేరారు. ఇంటి కొచ్చిం దగ్గర్నుంచీ సీమదొరల్లా ప్రవర్తించసాగారు. అందినంత వరకు డబ్బు జేబులో వేసుకొని, బెంగుళూరు, మద్రాసు, నెలలకొద్దీ తిరిగి, అప్పులు చేసి డబ్బుకోసం ఇంటికొచ్చే వాళ్ళు.
మూడోవాడు శ్రీనివాసరావుకు మాత్రం నాలుగు అక్షరం ముక్కలు అబ్బినై. స్కూలు ఫైనల్ పాసయి తండ్రి కోర్కెను నెరవేర్చాడు. పెద్దవాళ్ళిద్దరూ భాగాలు పంచమని తగాదా పడుతున్న రోజుల్లో, వాళ్ళిద్దరూ పెళ్ళిళ్ళు చేశాడు తండ్రి. పెళ్ళి చేస్తే పిచ్చి కుదుర్తుందేమోనని ఆశించిన బలరామయ్యకు అసలుకే మోసం వచ్చిందన్న సంగతి గ్రహించడానికి ఎక్కువకాలం పట్టలేదు. కట్నంగా వచ్చిన డబ్బు వాళ్ళ చేతులో పడేదాకా తండ్రిని నిలవనివ్వలేదు. ఆడపిల్లల పెళ్ళిళ్ళయేదాకా, ఆస్తిపంపకాలు చేయడనికి వీల్లేదనీ, అందుకు ఒప్పుకున్నా కొడుకులకు వాళ్ళ కట్నంతాలూకు డబ్బు ఇచ్చేశాడు. పెద్దవాడు భార్యనూ, పిల్లల్నీ తీసుకెళ్ళి పట్నంలోనే కాపురం పెట్టాడు. రెండోవాడు పెళ్ళాం పిల్లల్ని ఊళ్ళోనే తండ్రి మీద వదిలేసి అంతులేకుండా పోయాడు. తన పని తడిసిన అడసులా అవడం గ్రహించిన బలరామయ్య - మూడో కొడుకు, పెద్దకూతురు పెళ్ళిళ్ళు చేశాడు. మూడో వాడికి బాగానేవున్న సంబంధమే వచ్చింది. అవతల ఒక్కతే కూతురు. వాడి పని దాదాపు ఇల్లరికంలాంటి దయింది. వాడు పూర్తిగా అత్తవారింట్లోనే మకాం వేశాడు. మామగారి ప్రోద్భలంతో 'నా ఆస్తి నాకు పంచండి' అని మూడు నెలలకు ఒకసారి కబురు చేయడం మొదలుపెట్టాడు. ఓ రోజు మూడోవాడి మామగారే స్వయంగా వచ్చి, నలుగురు పెద్దల్ని చేర్చి గొడవ చేశాడు.
"ఈ ఇంట్లో ఎవరి కందినంతవరకు వాళ్ళు తినేస్తున్నారు. పెద్ద వాళ్ళిద్దరికీ ఇప్పటికి ఇచ్చింది వాళ్ళ ఆస్తి వాటాలో సగానికి పైగానే వుంటుంది. ఇంకా పెళ్ళికావాల్సినవాళ్ళు ఇద్దరు కూతుళ్ళున్నారు. ఇట్లా ఎవడి పంటికింద పడింది వాడు నమిలేస్తుంటే, చివరకు నా అల్లుడుకి మిగిలేదేమిటి? ఐదేళ్ళుగా వాడు నీదగ్గర ఎర్రని ఏగానీ ముట్టలేదు. వాడి వాటా తాలూకు, పంటా వగైరా ఎంతవుతుందో చూడు. కావాలంటే నీ కొడుకులూ, నువ్వూ కలిసే వుండండి. నా అల్లుడికి రావాల్సింది మాత్రం గీటుపెట్టించు." కుండ పగలేసినట్లు మాట్లాడాడు శ్రీనివాసరావు మామ.
వియ్యంకుడి సంగతి తెలిసిన బలరామయ్య కలవరపడ్డాడు. తనను కోర్టుకయినా ఈడ్చగల మనిషి. అతనితో తగాదాపడి తను నెగ్గలేడు. తన కొడుకు మామ చేతిలో కీలుబొమ్మ అయాడు. తను చేయగలిగిందేమీలేదు. వేసవి కాలం వెళ్ళాక అలాగే పంచుతానని వియ్యంకుడికి వాగ్ధానం చేశాడు.
ఆ సంవత్సరం వేసవిలో నాలుగో వాడికి, రెండో అమ్మాయికీ పెళ్ళిళ్ళు పెద్ద ఎత్తున చేశాడు. అందుకు బలరాయమ్మ తలకు మించిన అప్పులు చేశాడు. అప్పుల సంగతి మూసిపెట్టి పెళ్ళిళ్ళు ఆర్భాటంగానే జరిపించాడు. అప్పుడు తగిలిన దెబ్బ ఆయువు పట్టుమీద తగిలింది.
మూడోకొడుకుమామతో "ఇదిగో పంచుతా!" అంటూనే మూడేళ్ళు దాటేశాడు. ఆ వియ్యంకుడు పెద్ద కొడుకుని, రెండో వాడ్ని పురిగొల్పి తండ్రి మీదకు పంపాడు, ఇంకా పెళ్ళి పందిళ్ళు విప్పకముందే!
"ఇంతవరకూ నిండుగా వున్న సంసారం మనది. పంపిళ్ళు చేసుకొనే ముందే మూడోదాని పెళ్ళి చెయ్యండి. దాని పెళ్ళయిన మర్నాడు ఎవరిది వాళ్ళు విడగొట్టుకోండి" అన్నాడు బలరామయ్య.

