"నాకు డబ్బు కావాలి ఆంటీ.....ఏ పాత్రయి తేనేం?"
భావుకంగా నవ్వింది అలివేలు. "ఇప్పుడిప్పుడే నాకో కొత్త విషయం అర్ధమౌతుంది సుకృతీ! డబ్బు వుండటంకన్నా డబ్బు వుందన్న ఆలోచన మనిషికి చాలా ధైర్యాన్నిస్తుంది."
ఆ రాత్రి సుకృతికి చాలాసేపటిదాకా నిద్రపట్టలేదు.
నేలపై తుంగచాపమీద పడుకుని ఆలోచిస్తూ గడిపింది అర్ధరాత్రి దాకా.
"ఏ తెల్లవారు జామునో మాగన్నుగా నిద్రపడుతున్నా చెంపలపై మెత్తని స్పర్శకి ఉలిక్కిపడి నిద్రలేచింది గాని ఎవరూ లేరు. సమీపంలో ఆమెను అలాంటి భ్రాంతికి గురిచేసింది ఆమెకు తెలియకుండా చెంపలపై జారిన ఆమె కన్నీళ్ళు.
* * * *
ఉదయం ఎనిమిదిగంటల సమయం.
పాహినీ స్టూడియోలోని రెండో ఫ్లోర్ జనంతో సందడిగా వుంది.
మరో పది నిమిషాలలో కొత్త సినిమా ప్రారంభం జరుగుతున్న సూచనగా ఫ్లోర్ లో ఓ మూల పురోహితులు వేదోక్తంగా పూజలు చేస్తుంటే కొబ్బరికాయ కొట్టి ప్రముఖుల్ని ఆహ్వానించడంలో నిమగ్నమయ్యాడు డైరెక్టరు సుదర్శనరావు.
స్టూడియో ముఖద్వారంనుంచీ ఆర్చిస్ పై ప్రయుక్త మూవీస్ ప్రొడక్షన్ నెంబరు త్రీ ప్ర్రారంభం అని రాయబడిన సిల్కుక్లాత్ వరుసలు అదో భారీ చిత్రమన్న సత్యానికి నిదర్శనంగా నిలిచాయి.
ఫ్లోర్ లో ఖరీధైన ఇంటి సెట్టు మధ్యగా కూర్చున్న ప్రముఖ నటి రమ్యశ్రీ పత్రికా విలేఖర్లతో ఉత్సాహంగా జోక్స్ విసురుతూంది.
దూరంగా ఓ మూల గాడ్రెజ్ చైర్ లో కూర్చున్న సుకృతి ఇదేం గమనించలేదు. అప్పటికి పది నిమిషాలక్రితమే ఆమె మేకప్ చేసుకుంది. కాస్ట్యూమ్స్ గా పల్లెటూరి అమ్మాయిలా పావడా వోణీ వేసుకోమన్నారు. తప్ప తన పాత్రేమిటో చెప్పలేదు. అలివేలు కూడా ఆమెకు తోడుగా రాలేదు. రాకపోవటానికి కారణం ఒక్కటే. తన గురించి అంతా తెలిసిన సినిమా మనుషులు తన మూలంగా సుకృతినీ తక్కువగా అంచనా వేస్తారు.
ముహూర్తం షాట్ కెమెరా స్విచ్చాన్ చేయటానికి ముఖ్య అతిధిగా రప్పించబడిన నారాయణ శెట్టి ఫ్లోర్ లో అడుగు పెడుతూనే స్కర్ట్ వేసుకున్న రమ్యశ్రీని చూశాడు. సినిమా రంగానికి డబ్బు సాయం చేసే పెద్ద ఫైనాన్సర్ రావడంతో రమ్యశ్రీ లేచి "నమస్తే" అంది ఒద్దికగా నిలబడి.
"నీది మొత్తం కనిపిస్తూంది రమ్యా" అన్నాడు శెట్టి జోకులా. శెట్టిగారి డబ్బుతో షెడ్యూల్ ప్రారంభించిన నిర్మాతతో సహా అంతా ఘోల్లుమని నవ్వేశారు.
"మోకాటిదాకా అడ్డంవుంటే మొత్తం అంతా కనిపిస్తుందంటా రేమిటి శెట్టిగారూ!" రమ్యశ్రీ కూడా హుషారుగా రెస్పాన్సిచ్చేసింది. "మీకు వయసుడిగి చూపు మందగించినట్టుంది."
"మొన్న అర్దరాత్రి లైటేసి మరీ చెక్ చేశావుగా" శెట్టి కౌంటర్ వేశాడు.
"ఏమిటీ?" అడిగారెవరో.
"ఇంకేమిటీ.....అదే.....నా వయసింకా ఉడిగిపోలేదని రమ్యకి తెలియజెప్పిన జమ్మలహట్."
మరోసారి నవ్వులు, కేరింతలు.
వాంతి కాబోతుంటే సుకృతి వేగంగా చీకటిలోకి నడిచింది తను వున్న ప్రపంచమేమిటో మరింత స్పష్టంగా అర్ధమైపోతుంటే కడుపు నులిమేస్తున్నంత బాధగా వుంది.
"రైట్ సర్..... ముహూర్తానికి టైమైంది" సుదర్శనరావు చెప్పడంతో అప్పటికే సిద్దం చేసి వుంచిన షాట్ లో లైట్సు వెలిగాయి. "రమ్యా కమాన్..... నీ డైలాగ్ గుర్తుందిగా...."
"ఓ కే సర్."
రమ్య మెట్లపై నిలబడింది.
"ఆ అమ్మాయెక్కడ?" సుకృతికోసం అరిచాడు సుదర్శనరావ్. అదే అతడిలోని ప్రత్యేకత. ఓ రాత్రి గడిపినా అసలు పరిచయమే లేనట్టు ప్రవర్తిస్తాడు సెట్ లో.
అప్పుడు చూశారు సుకృతిని అక్కడున్నవాళ్ళు. అంతసేపూ చీకటిలో ఓ మూల నక్కివుండకపోతే ఆమె గురించి అంతా చర్చించుకునే వాళ్ళు కానీ యిప్పుడే ముందుకొచ్చింది.
అది రూపం కాదు! హిమకరాలతో దేవుడు వెన్నెల్లో ముంచి నేల పైకి పంపిన పారిజాతం! అధరాలు యింకా ఆలకించని అరణ్య గీతాన్ని గుర్తుచేస్తుంటే, మంచు మైదానంలో పురివిప్పిన మయూరిలా ఆమె నడిచి వచ్చింది.
అందరి కొరడా చూపులూ ఆందోళనని నింపుతుంటే సుదర్శనరావు ముందుకొచ్చి నిలబడింది.
"యస్సార్"
అప్పటికే నారాయణశెట్టి నిర్మాత చెవులు కొరికేస్తున్నాడు. రాజ్యం కూతురని తెలియడంతో - "తల్లిని మించిన అందమమ్మా! మరాపిల్లనే హీరోయిన్ని చేయక దీన్నెందుకు పెట్టారు?" అన్నాడు రహస్యంగా. అది కాస్తా రమ్యశ్రీకి వినిపించడం సుకృతి దురదృష్టం.