విస్మయంగా చూసింది సుకృతి.
"అదంతే సుకృతీ.....రైలుస్టేషన్ దాకా రిక్షా స్టేషను చేరుకున్నాక ట్రైను. ఆ తర్వాత విమానం యిలా ఒక్కో దశలో ఒక్కో అవసరం పద్దతీ వుంటాయి. ఇప్పుడు రమ్యశ్రీ తరచూ విమానాల్లో తిరుగుతుంది. కాబట్టి ఒకనాటి "రిక్షా" అయిన రమణతో అవసరం వుండదు. పెద్ద హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలూ వీళ్ళతోనే గడిచిపోతుంది. ఇప్పుడు రమణ రమ్యశ్రీ ముందు చేతులు కట్టుకుని నిలబడతాడు. కారణం రమ్యశ్రీ తలుచుకుంటే అతడికి యిండస్ట్రీలో స్థానం లేకుండా చేయగలడు కాబట్టి."
"ఇప్పుడేం కాబోతుంది?" అడిగింది సుకృతి రమణ దగ్గిర తన ప్రవర్తన గుర్తు తెచ్చుకుంటూ. "నిజానికి నాకు నటి కావాలన్న ఆలోచనే లేదాంటీ! ఏ రోజూ అలాంటి వ్యామోహం చూపించని నేను యిప్పుడు కేవలం డబ్బుకోసం...."
"నాకు తెలుసమ్మా" గదిలో గోడకి జారగిలబడి కూర్చున్న సుకృతిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది అలివేలు. "అందుకే బాధపడాల్సిన పని లేదంటున్నది.....ఇక డబ్బు విషయమంటావా.....ఓ అవకాశం అతను తీసుకున్నాడు. నీ అవసరం కోసం నువ్వు దానికి అంగీకరించావు."
"కానీ ఒక్కసారితో నా డబ్బు అవసరం తీరదుగా" సుకృతి భయంగా నేలచూపులు చూస్తూంటే వెంటనే జవాబు చెప్పలేకపోయింది అలివేలు. నిజమే..... రాజ్యం బ్రతికినంతకాలమూ డబ్బు కావాలి..... ఒకసారి పతనమైన సుకృతి మరోసారికి ఫర్వాలేదనుకుంటే ఆ డబ్బుని వ్యభిచారంతోనైనా సంపాదించాలి. లేదూ అంటే పతనాన్ని జీవితంగా మార్చుకుని నటిగా నిలదొక్కుకోవాలి. ఇదో వలయం ఏ మార్గంలో అయినా ఆధారం పతనమే.
"ఒక్క మంచిమనిషి తారసపడే అవకాశం లేదా?"
సుకృతి ఇండస్ట్రీకి సంబంధించే అడిగిన అతి క్లిష్టమైన ప్రశ్న అది ఏమని జవాబు చెప్పగలను? అంతా గంజాయివనమే అయినప్పుడు ఎక్కడో వున్న ఒక్క తులసిమొక్కను గుర్తించడమెలా? ఉన్నా ఆ తులసిమొక్క సాహచర్యం సుకృతిని ఉద్దరించగలదన్న గ్యారంటీ ఏమిటి?
"అందర్నీ తప్పుబట్టలేం సుకృతీ! కొందరు మంచివాళ్ళూ వున్నారు. సొసైటీలో కళ్ళముందు జరిగే అనర్ధాలకు స్పందించే మేధావివర్గం సినిమా యిండస్ట్రీలోనూ వుంటారు. అయితే జరుగుతున్న దానికి కుమిలిపోతారు తప్ప జోక్యం చేసుకోరు. అసలు తొంభైశాతం కాలుష్యమే అయితే వాళ్ళు మాత్రం ఏం చేయగలరని పొట్ట చేతబట్టుకుని మద్రాసులో అడుగుపెట్టిన రాజులాంటి వాళ్ళు ప్రొడ్యూసర్ మని రీలా వుంటూ చేసే ఖర్చులో కమీషన్లని కొట్టేస్తూ సొంత యిళ్ళని కట్టుకుని కొంతకాలానికి ప్రొడక్షను ఎగ్జిక్యూటివ్స్ స్థాయినుంచి నిర్మాత స్థాయికి ఎదిగిపోతారు. లంజల్ని తార్చి బ్రోకర్లుగా డబ్బు సంపాదించి సూరిలాంటి వాళ్ళు సినిమాలకి ఫైనాన్షియర్సుగా మారి సినీ రంగాన్ని శాసిస్తుంటారు. సినిమా గ్లామర్ లేదని భావించే అమ్మాయిలు హామీ యిచ్చిన ప్రతివాడిదగ్గర పడుకుని ఏ ఒక్కరో తారాస్థాయిని చేరుకుంటారు. అయితే కొత్తగా రంగంలోకి వచ్చే వాళ్ళకి నాశనమైన తొంభైశాతం పట్టదు. ఎదిగిన వ్యక్తులే కనిపిస్తారు. ఈజీమనీ గ్లామర్ కార్లు లగ్జరీ పాపులారిటీ ప్రలోభాలతో అలా పతనమైపోతూవుంటారు. ఇదో విషకూపం సుకృతీ! అందుకే మేధావులైనవాళ్ళు లజ్జతో కుంచించుకుపోతూ యిక్కడ కొనసాగటాన్ని జీవితంగా మార్చుకుంటే నిర్లజ్జని అర్హతగా మార్చుకున్న సుదర్శనరావులు, రాజులు, రమణలు యిక్కడ తమ చర్యల్ని సమర్ధించుకుంటూ బ్రతుకుతుంటారు."
"అమ్మకెలా వుంది?" వున్నట్టుండి అడిగింది సుకృతి. మనసులో పేరుకుపోతున్న గిల్టీనెస్ తల్లి సమక్షంలోకి వెళ్ళగలిగే ధైర్యాన్ని కుంచింపచేస్తూంది. "డాక్టర్లేమంటున్నారు?"
"మనం చేర్పించిన ప్రైవేటు నర్సింగ్ హోంలో సుకృతీ! పోయేదాకా పెట్టుబడి పెట్టమంటారు తప్ప డబ్బు రాబడి వున్నప్పుడు కాదు అని ఎలా అంటారు?"
అలివేలుని తప్పుబట్టలేదు సుకృతి. ఆశా నిరాశా వాదాల మధ్య అటూ ఇటూ వూగే అలివేలు చాలా నష్టపోయాకే యిలా మాట్లాడ్డం అలవాటు చేసుకుంది.
ఆ సాయంకాలమే ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా సుకృతికి తెలిసింది. సుకృతిది ఫోటోజనికే ఫేస్ కాదని నిర్ణయించారు డైరెక్టరు సుదర్శనరావ్. రమ్యశ్రీని కథానాయికగా ఎన్నుకున్నారు. అయితే ఏదైనా గాని సుకృతికి ఓ కేరెక్టరు యివ్వటానికి నిశ్చయించుకున్నారు. మరుసటిరోజునుంచే షూటింగ్....
సుకృతి జరిగినదానికి చింతించలేదు. మామూలుగా తీసుకుంది.
"మొత్తానికి రమణ సాధించాడు సుకృతీ!" అంది అలివేలు. "నిజానికి రమ్యశ్రీకన్నా ఒక్క రమ్యశ్రీ ఏమిటి? మన కథానాయికలందరు కన్నా నువ్వు అందగత్తెవి. అయినా హీరోయిన్ పాత్రకి రమ్యశ్రీని ఎన్నుకున్నారు. ఎందుకంటే రమణ నిన్ను స్టిల్సులో అందవికారంగా చూపించటానికి చాలా కృషి చేసి వుంటాడు కాబట్టి."
