Previous Page Next Page 
ది సినీ స్టార్ పేజి 16


    సుకృతితో సుదర్శనరావు సీరియస్ గా చెబుతున్నాడు. "నువ్వు ఈ ఇంటిలో పనిపిల్లవి. హీరోయిన్ రమ్యశ్రీ డైలాగ్ చెప్పగానే సంతోషమమ్మా అనాలి. ఓ.కే?"
    తల పంకించిన సుకృతి మెట్లవేపున నడవబోతుంటే అప్పుడు జోక్యం చేసుకుంది రమ్యశ్రీ. అలా అని సూటిగా డైరెక్టర్ ని అడగలేదు. ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్టారుగా తన స్వాతిశయాన్ని ప్రదర్శిస్తూ అసిస్టెంట్ డైరెక్టర్ ని పిలిచి -
    "సినిమాలో ఆమె పాత్రేమిటో?" అడిగింది.
    "పనిపిల్ల"
    "అలాంటప్పుడు మేకప్ కాస్త డల్ చేయొచ్చుగా?"
    సుకృతి సినీరంగానికి చెందిన మరో కొత్త కోణాన్ని చూస్తూంది యిప్పుడు.
    "సారీ మేడమ్" చెప్పాడు అసిస్టెంట్ డైరెక్టర్. "మీరు గ్లామరస్ గా కనిపించడానికి కాస్త ఎక్కువ మేకప్ చేసుకోండి. అది తప్పుకాదు. కానీ సహజంగా వున్న అందాన్ని డల్ చేయమని మీరు అడగటం అన్యాయం."
    "యూ బ్రూట్"
    "ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్" హెచ్చరికలా అన్నాడు.
    "డైరెక్టర్ గారూ! ,ఈ అసిస్టెంట్ కి సభ్యత నేర్పండి. అంతవరకు నేను షాట్ లో నిలబడను."
    టాపిక్ మరెటో మళ్ళింది. అసిస్టెంట్ డైరెక్టర్ ప్రవర్తన వింతగానే వుందని అక్కడ అందరికీ తెలుసు. కానీ పాతికవేల రెమ్యూనరేషన్ తీసుకునే అసిస్టెంట్ డైరెక్టర్ కన్నా పదిహేను లక్షలు తీసుకునే హీరోయిన్ ముఖ్యం అందరికీ.
    "నువ్విలారా" అసిస్టెంట్ ని పిలిచాడు. సుదర్శనరావు ఆవేశంగా అసలు నీకు బుద్ధుందా? పెద్దా చిన్నా తేడా లేకుండా వాగేయటమేనా?"
    "సర్! అసలు నేను...."
    "షటప్! ముందు క్షమార్పణలు చెప్పు"
    "ఎందుకు?"
    "డైరెక్టర్ గా ఆదేశిస్తున్నాను."
    అక్కడ హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది అసలు నిర్మాతయినా ఆవేశంగా కలియబడేవాడే! కానీ మొత్తం డైరెక్షను డిపార్ట్ మెంట్ లో చాకులాంటివాడా యువకుడు.
    "ఓ.కే. సార్" తనకోసం కాక ఓ ప్రోజక్టు గౌరవం కోసం రాజీ పడుతున్నట్టుగా అన్నాడు అసిస్టెంట్ డైరెక్టర్- "సారీ మేడమ్! జరిగిన దానికి క్షమించండి."
    "ఇట్స్ ఓ.కె." అహం చల్లారిన ఆనందంతో గర్వంగా నవ్వినా రమ్యశ్రీ షాట్ లో నిలబడింది.
    ఆ తర్వాత రమ్యశ్రీ అసలు సమస్య అర్ధమైనట్టుగా మేకప్ మెన్ ని సుకృతి మొహంపై కొద్దిగా బ్లాక్ షేప్ వేయించాడు డైరెక్టరు. మనసు తేలికైంది రమ్యశ్రీకి. "ఓకె సర్! నేను రెడీ"
    ఎనిమిదీ పదకొండు ముహూర్తం...... ఇప్పుడు ఎనిమిదీ ఇరవై అయింది.
    "లైట్స్ ఆన్.....స్టార్ట్ కెమెరా......క్లేపిన్....ఏక్షన్" ఆర్డర్ లా అరిచాడు డైరెక్టర్.
    క్లేప్ కొట్టగానే రమ్యశ్రీ డైలాగ్ చెప్పింది. "నేను ఉన్నదాన్ననా నాకందరూ సమానమే గంగా! అందుకే నన్ను నేను యిష్టపడుతుంది.
    "సంతోషమమ్మా" జవాబుగా అంది సుకృతి.
    వెంటనే డైరెక్టరూ, హీరోయిన్ పత్రికా విలేఖర్ల సమావేశం సిద్దమౌతుంటే మూలకి వెళ్తూ ఆగిన సుకృతి ఓ లైట్ బోయ్ ని పిలిపించింది. "అతనెవరు?"
    "అతను అంటే ఇందాక రమ్యశ్రీతో గొడవపడ్డ అసిస్టెంట్ కారక్టర్ తనలాగే యిమడలేక యిముడుతున్న వ్యక్తిలా అనిపించినందుకా లేక ఆ గంజాయి వనంలో తనకు ఆసరా కాబోయిన తులసిమొక్కే పెంచాడో తెలుసుకోవాలన్న ఉత్సుకతను ఆపుకోలేకపోయింది.
    "పేరు శివ అమ్మగారూ! అసిస్టెంట్ డైరెక్టర్....." రహస్యంగా అన్నాడు. "శివగారెంత తెలివైనవాడూ అంటే అతనితో మాట్లాడటం డైరెక్టర్ గారు కూడా కంగారుపడుతుంటారు."
    ఒక మనిషి మీద గౌరవం ఏర్పడాలీ అంటే రోజుల తరబడి వ్యక్తి నిజాయితీని గమనించాల్సిన అవసరం లేదు. ఓ చిన్న సంజ్ఞ చాలు!
    అందుకే సుకృతి తన ముందునుంచి వెళుతున్న శివని పలకరించకుండా వుండలేకపోయింది.
    "థేంక్స్."
    "దేనికి?" అడిగాడు శివ.
    "నా మూలంగా మీరు మాట పడ్డందుకు"
    "నేను మాట పడటానికి సిద్దపడింది మీకోసం కాదు. లక్షలు చేసి తీస్తున్న ప్రాజెక్టు కోసం."
    పాతికేళ్ళ వయసు దాటని శివలో గర్వంలేదు. ఇంకా చెక్కు చెదరని నిబ్బరం. తన ఆలోచనే కరెక్టని తెలిసిన ఆత్మస్థయిర్యం గల వాడిలో సహజంగా కనిపించే విశ్వాసం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS