Previous Page Next Page 
ప్రియా.....ప్రియతమా పేజి 23


    అయితే రోజు విడిచి రోజు నాకు జీడిపప్పు టెంపర్మెంట్ చేసిపెట్టు అన్నాడు శ్రీచరణ్ ఆమెను ఆటపట్టిస్తూ.
    మొహం తిప్పుకుంది ప్రనూష.
    నేను తక్కువ తిన్నానా? అన్నట్టు తనూ మొహం తిప్పుకున్నాడు శ్రీచరణ్.
    గోడ గడియారం పన్నెండు గంటలు కొట్టింది.
    ఇద్దరూ నిద్రపోవడం లేదు.
    "ఒకవేళ నేను నిద్రపోతే, నా అందం చూసి టెంప్టయి, ఎటూ పెళ్ళయింది కదా... అని....నా నోరునొక్కి....కమిటైతే...ఆ ఆలోచన రాగానే ప్రనూష..ఓరకంటితో శ్రీచరణ్ ని చూసింది.
    అదే సమయంలో శ్రీచరణ్ ప్రనూషవైపు చూసి.
    "అదేంటి నన్ను అలా ఆడపులిలా తినేసేలా చూస్తుంది. ఎర్రగా, బుర్రగా వున్నాను, పోతే పోయిందిలే....ఓసారి టెంప్ట్ చేసి  వదిలేస్తే....జీవితాంతం సాధించొచ్చు....అని ఫ్లాన్ చేయడం లేదుకదా...' అనుకున్నాడు.
    "ఎందుకైనా మంచిది....నా సేఫ్టీలో నేనుండాలి...." అని ప్రనూష నిర్ణయించుకుంది.
    "ఫ్రంట్ కేర్ అదే ముందు జాగ్రత్త బెస్ట్" అనుకున్నాడు శ్రీచరణ్.
    "హ్హి...హ్హి....హ్హి...." అంటూ నవ్వింది ప్రనూష.
    చుట్టూ చూసింది. లోపల్నుంచి బోల్టు పెట్టి వుంది. పారిపోవడానికి కూడా అవకాశం లేదు. అయినా ఎలా పారిపోగలదు.
    అరవడానికి కూడా వీల్లేదు. తను అరిస్తే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి..."మరేదో ప్రాబ్లెం" అనుకుని ముసి ముసి నవ్వులు నవ్వి...."అమ్మాయి కొత్త....బెదరగొట్టుకు బాబూ" అనిపోతారు....
    దీనికి మార్గమొక్కటే....అనుకుంది.
    శ్రీచరణ్ ప్రనూష తనవైపు తిరిగి నవ్వడం గమనించి, తనూ సేమ్ రియాక్షన్ తో 'హ్హి హ్హి హ్హి' అని దవడలు నొప్పెట్టేవరకూ నవ్వి...'దొంగముం....ఇంకా ఎంతసేపు నవ్వాలో..." అనుకున్నాడు.
    ప్రనూష లేచింది.
    'కొంపదీసి దగ్గరికి వచ్చి సిగ్గూ, ఎగ్గూ లేకుండా చీరవిప్పి, తన మీద పడిపోదుకదా..." అనుకుని..... తన లుంగీని గట్టిగా పట్టుకున్నాడు శ్రీచరణ్.
    అదేంటి లుంగీ పట్టుకున్నాడు. లుంగీ విప్పేసి తన దగ్గరికి వచ్చి... రేప్ గానీ చేయడు కదా...హమ్మో...అనుకుంది ప్రనూష.
    ఇద్దరూ పిల్లీ, ఎలుకలు కాకుండా, పిల్లి పిల్లిలా అయిపోయేరు.
    ప్రనూష ఓ నిర్ణయానికి  వచ్చి కాస్త ధైర్యం చిక్కబట్టుకోవడానికి టీపాయ్ మీద వున్న పాలు గడగడ తాగేసింది.
    "కక్కుర్తి పనికాకపోతే....పావు లీటర్ పాలు ఒక్కతే తాగాలా?" అనుకొని, కోపంగా టీపాయ్ మీద వున్న స్వీట్లు నాలుగైదు లాగించాడు శ్రీచరణ్.
    'ఛీ....ఛీ....స్వీట్లమొహం ఎన్నడూచూసి ఎరగనట్టు..." అనుకుంది అసహ్యంగా మొహంపెట్టి ప్రనూష.
    ప్రనూష మెల్లిగా బాత్రూంలో నుంచి బయటకు వచ్చింది. అటాచ్డ్ బాత్రూం అది.
    శ్రీచరణ్ ప్రనూషవైపే చూస్తున్నాడు.
    మళ్ళీ 'హి....హి.....హి....' అని నవ్వింది.
    'నాకు మొహమాటానికి కూడా నవ్వే ఓపిక లేదు" అన్నాడు గుర్రుగా.
    ప్రనూషకు కోపం వచ్చినా, అవసరం తనది కాబట్టి సర్దుకుపోయింది.
    "సారీ అండీ....రాకూడని ప్రాబ్లెం వచ్చింది." అంది తలదించుకొని...
    "ఏంటి ఎయిడ్స్ కానీ వచ్చిందా?" అడిగాడు శ్రీచరణ్ వెంటనే.
    "ఛీ.... ఛీ...." అంది వెంటనే.
    "మరేమిటి చెప్మా..." అని సీలింగ్ ఫ్యాన్ వంక చూస్తూ ఆలోచిస్తూ  వుండిపోయాడు.
    అతనిది నిజం అమాయకత్వమో, తనని ఆటపట్టించడానికి చేస్తున్నాడో అర్ధం కాలేదు.
    ఏమైతేనేం....తను సేఫ్ గా వుండాలంటే, ఈ నాటకం రక్తి కట్టించేలా నటించాలి.
    'అయామ్ వెరీ సారీ అండీ.
    "ఇందాకే ఓ సారీ చెప్పావు..." అన్నాడు గుర్రుగా శ్రీచరణ్.
    "అదే మూడ్రోజుల ప్రాబ్లెం డేట్ మార్చిపోయా..." అంది.
    "మూడ్రోజుల ప్రాబ్లెం అంటే ఏంటి చెప్మా...?" మళ్ళీ సీలింగ్ ఫ్యాన్ వంక చూస్తూ అన్నాడు శ్రీచరణ్.
    ఆ సీలింగ్ ఫ్యాన్ కు వున్న రెక్కలు విప్పదీసి శ్రీచరణ్ తలమీద బాదాలన్న కోరికను అతి కష్టమ్మీద నిగ్రహించుకొని. గబగబా బ్రీఫ్ కేస్ దగ్గరికి వెళ్ళి అందులో నుంచి "కేర్స్ ఫ్రీ" తీసి, శ్రీచరణ్ కు చూపింది చెప్పింది...
    "ఈ ప్రాబ్లెం..." అని.
    "ఒహోహో..హో ఆ...హా...హా..." అంటూ నవ్వి..."ఇదీ...బోల్డు యాడ్స్ లో చూసాను. నేనింకా మొన్నటిదాకా, వీటితో మొహం తుడుచుకుంటారేమో...! మూతి తుడుచుకుంటారేమో...అనుకున్నాను...." అన్నాడు శ్రీచరణ్.
    తలగోడకేసి బాదుకోవాలన్న కోరికను అతి బలవంతంగా అణుచుకొని మంచంమ్మీద దిండు తీసుకొని నేలమీద వేసుకుని పడుకుంది ఓరకంటితో శ్రీచరణ్ ని గమనిస్తూ...ప్రనూష.
    "హయ్యమ్మ ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందని. దాని కేర్ ఫ్రీ ప్రాబ్లెం....నా సమస్యకు పరిష్కారమై చచ్చింది. అనుకున్నాడు శ్రీచరణ్ హాయిగా నిట్టూరుస్తూ!
    మధ్యమధ్య ప్రనూష కళ్ళు తెరిచి, శ్రీచరణ్ ని చూస్తూ వుంది.
    శ్రీచరణ్ కూడా అదేపని చేస్తున్నాడు.
    అలా ఆ విధంగా ఆ తొలిరాత్రి గడిచిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS