అక్కడున్న వాళ్ళందరూ 'ఎంతప్రేమో అని మురిసిపోయారు. కానీ తనకు మాత్రమే వినపడేలా...
"జాంగ్రీ మొత్తం మింగు. ఫ్రీగా వస్తే ఏదైనా తినే టైప్ కదా తమరు" అని అన్నాడు.
"మీరు మాత్రం ఏం తక్కువ" అంటూ తనూ మైసూర్ పాక్ అతని నోట్లో కుక్కింది.
ఉక్కిరి బిక్కిరై పొలమారితే....
"మంచి నీళ్ళందించవే ప్రనూ...." అని అరిచింది పెద్దమ్మ.
కోపం పీకల్దాకా వున్నా అందరిముందూ బావుండదని చచ్చినట్టు నీళ్ళగ్లాసు అందించింది.
"థాంక్స్" అన్నాడు గటగటా తాగి.
"తమరు మంచినీళ్ళు కూడా వదలరన్నమాట ఫ్రీగా వస్తే..." అనేసి కసి తీర్చుకుంది తను.
పెళ్ళి తంతు ముగిసి, అప్పగింతలయ్యాక అత్తవారింట్లో అడుగుపెట్టేటప్పుడు అమ్మలక్కలందరూ పేరు చెప్పి లోపలికి రమ్మని గొడవచేస్తే...
"కోతీ, నేనూ కలసి వచ్చాం" అని చెప్పనా అన్నాడు తన చెవిలో.
"కొండ ముచ్చూ నేనూ వచ్చామని చెప్తాను" అంది తను కసిగా.
"తిక్కమేళం" అన్నాడు కోపంగా.
"మిమ్మల్ని కట్టుకున్నాకే అలా అయ్యాను" అంది తను.
ఇలా పెళ్ళిచూపులప్పటినుండి మొదలైన తమ కొట్లాటలు రానురాను పెరుగుతున్నాయే తప్ప తరగడంలేదు.
ఫస్ట్ నైట్ పట్టుబట్టి క్యాన్సిల్ చేయించి సికింద్రాబాద్ తీసుకువచ్చేశాడు ప్రనూషని. తమ ఫ్లాట్లోనే జరుపుకుంటామని చెప్పాడు అందరికీ.
ఆ నిర్ణయం ప్రనూషకూ సంతోషాన్నే యిచ్చింది. ఎందుకంటే అందరిలో గొడవయితే తెలిసే అవకాశం ఉంది. తమింట్లో ఎంత గొడవైనా తెలిసే అవకాశం ఉండదు. మొదటిరోజే తేల్చాయాలనుకుంది.
శ్రీచరణ్ మనసులోనూ అదే ఆలోచన వుందని తెలియదు ప్రనూషకు రోజు.
గోడ గడియారం రెండు గంటలు కొట్టింది.
ఆలోచనల్లో నుంచి ఉలిక్కిపడింది ప్రనూష. తను ఈ రెండు గంటలపాటు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయిందా? ఈ పెళ్ళి, తమ మధ్య ఒప్పందం.....అన్నీ చిత్రంగా అనిపించాయి.
తొలి రాత్రి ముచ్చట జరగనే లేదు. ఒక్క క్షణం తల విదిల్చి లేచింది. నిద్ర రావడం లేదు. లేచి, గోడ మీదున్న చార్ట్ దగ్గరికి నడిచింది.
అప్పుడే అరవై రోజులు గడిచిపోయాయి. తమ పందానికి గడువు మూడు వందల అరవై ఐదు రోజులు....
అటూ, ఇటూ తిరుగుతోంది. నిద్ర రావడం లేదు.
శ్రీచరణ్ ఏం చేస్తున్నాడు?
హాయిగా గుర్రుపెట్టి నిద్రపోతున్నాడా? లేక తనలా ఆలోచిస్తున్నాడా? మెల్లిగా తలుపు తీసి హాలులోకి వచ్చి, శ్రీచరణ్ గదివైపు చూసింది.
సరిగ్గా అప్పుడే....
శ్రీచరణ్ గది గోడకు తగిలించి వున్న చార్ట్ దగ్గరికి నడిచాడు. అరవై ఒకటో గది దగ్గర అతని చూపు ఆగింది.
ఆ గదిలో అరవై ఒకటి అన్న నెంబర్ వుంది. చేతిలోని స్కెచ్ పెన్తో ఆ నెంబర్ ని యింటూ మార్క్ తో కొట్టేశాడు.
"యింకా మూడు వందల నాలుగు రోజులు అనుకున్నాడు. టైం చూసుకున్నాడు.
రెండు దాటింది.
అయినా నిద్ర రావడం లేదు.
ప్రనూష ఏం చేస్తోందో?
హాలులోకి వచ్చాడు శ్రీచరణ్ అదే సమయంలో ప్రనూష కూడా హాలులోకి వచ్చింది.
ఇద్దరి చూపులు కలుసుకున్నాయి.
సరిగ్గా అరవై ఒక్క రోజుల క్రితం.
ఎంత హడావిడి...
ఆరోజు గడిని అలంకరించి, అగరొత్తులు ముట్టించి, స్వీట్స్ తెచ్చి, పందిరిమంచం అలంకరించి.
ఓ పక్క బామ్మ.
మరో పక్క శర్మ కుటుంబం.... చేసిన హడావిడి నతా యింతా కాదు.
శోభనం రోజు తామిద్దరే వుండాలనీ, ప్రయివసీ కావాలని చెబితే...అన్ని అలంకరణలూ చేసి అందరూ వెళ్ళిపోయారు తామిద్దర్నీ తను స్పాట్లో ఒంటరిగా వదిలేసి.
"ఏంటి నిద్ర రావడం లేదా?" అడిగాడు శ్రీచరణ్.
"మరే..... నా మొగుడు గుర్తొచ్చి, ప్రేమ డ్రైనేజి కాలువలా పొంగి...." అంది ప్రనూష.
"ఛీ.... నీది డ్రైనేజీ కలువ ప్రేమ....యాక్.... అంతా కంపే...." అన్నాడు ముక్కు మూసుకుంటూ శ్రీచరణ్.
కోపంగా చూసింది ప్రనూష.
శ్రీచరణ్ ప్రనూషవైపే చూస్తున్నాడు. ఆరోజు తమ శోభనం రోజూ యిలానే....ఆ రోజు ఏం జరిగింది?
ఇద్దరికీ ఒకేసారి గుర్తొచ్చింది.
ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది.
అందరూ వెళ్ళిపోయారు.
కాదు, తమకు ప్రయివసీ అవసరమని పంపించారు.
శ్రీచరణ్ శోభనం గదిలో అటూ, ఇటూ తిరుగుతున్నాడు. పెళ్ళి అనే తంతు ఎలాగూ ముగిసింది.
యిప్పుడు శోభనం గండం గురించి బయటపడాలి.
'ఒరే శ్రీచరణూ....ఈ ఒక్కరోజు కమిటైతే.....జీవితాంతం రౌరవాది నరకాలు అనుభవిస్తావు. ఆలోచించుకో." అంతరాత్మ హెచ్చరిస్తోంది.
నిజమే... ఈ శోభనం నుంచి తప్పించుకోవాలి. ఆ తర్వాత ఈ తాళి బంధాన్ని విదిలించుకోవాలి. తనకు నచ్చిన అల్ట్రా మోడరన్ అమ్మాయిని పెళ్ళిచేసుకోవాలి...
"ఒకవేళ.....తన పెళ్ళాం తనని టెంప్ట్ చేస్తే....అసలే చలిగా వుంది. ఒంట్లో నరాలు స్వీట్ (తీయ)గా మూలుగుతున్నాయి.
'రేయ్ శ్రీచరణూ....స్టడీ...స్టడీ...." అని అంతరాత్మ హెచ్చరిస్తోంది.
ఓ ఐడియా వచ్చింది.
తను తాగినట్టు ఓవరాక్షన్ మొదలెడితే....తాగే వాళ్ళంటే అసహ్యమని చెప్పింది. ఈ రోజు అలా తప్పించుకోవచ్చు అనుకున్నాడు.
ఇంకా ఏమేం చేస్తే ప్రనూషకు కోపమొస్తుందో, ఓ లిస్ట్ ఆలోచించి పెట్టుకున్నాడు. రాగానే తన కాళ్ళకు దండం పెట్టమని చెప్పాలి. 'ఇగో దెబ్బతింటుంది.
"చీర విప్పేయ్" అనాలి. సిగ్గుతోపాటు కోపమూ వస్తుంది.
ఇంకా చాలాచాలా చేయాలి. అనుకున్నాడు.
ప్రనూష ఆలోచిస్తోంది.
తను ఏమాత్రం మెత్తగా వున్నా, తనని టెంప్ట్ చేసి, తనతో కమిటై పోతాడు. తర్వాత తనెంత నెత్తీ, నోరూ బాదుకున్నా లాభం ఉండదు...
ఏదో ఒకటి చేయాలి. తన కిష్టం లేని సంబంధాన్ని తెంచుకోవాలి. అదీ...అతనితోనే చేయించాలి.
ఏం చేయాలి?
శోభనం గదిలోకి వెళ్ళగానే తను సిగ్గు పడకూడదు. ధైర్యంగా వెళ్ళి మంచం మీద కూర్చోవాలి.
అతను లైట్ ఆర్పేస్తానంటే 'కుదర్దు....నాకు లైట్ లేకుండా నిద్రపట్టదు..." అని చెప్పాలి.
ఒకవేళ మీద చెయ్యేస్తే....? ఏం చేయాలి?
"సిగ్గు లేదూ....ఆడపిల్ల వంటి మీద చేయేస్తావా?" అని దులిపేయాలి అనుకుంది.
బుగ్గకు వున్న కాటుకను పెద్దగా చేసి బుగ్గనిండుగా రాసుకుంది.
శరీరాన్ని ప్యాక్ చేసినట్టు చీర కట్టుకుంది.
అవసరమైతే అతడ్ని బెదిరించడానికి పెన్ నైఫ్ బొడ్లో దోపుకుంది.
సరిగ్గా బ్యాడ్ టైం చూసుకుని....శోభనపు గదిలోకి అడుగుపెట్టింది.
బ్యాగ్రౌండ్ లో రెండు పులులు గర్జించినట్టు నేపథ్య సంగీతం వినిపించింది.
"ఛీ..." అని మొహం తిప్పుకున్నాడు శ్రీచరణ్.
"యాక్...." అని మొహం తిప్పుకుంది ప్రనూష.
"నేను 'యాక్ ని అయితే నువ్వు డోక్కు "వి" అన్నాడు శ్రీచరణ్ కచ్చగా.
"నేను ఛీ...అయితే, నువ్వు "ఛీ....ఛీ.." అంది ప్రనూష.
"ఎంత పొగరు, ఆడదానికింత పొగరు పనికిరాదు."
"ఎంత టెంపర్మెంటు....మగాడికింత టెంపర్మెంట్ పనికి రాదు."
"టెంపర్మెంటా? అంటే ఏమిటి చెప్మా..."
"జీడిపప్పు ఉప్మా..." అంది కసిగా ప్రనూష.
"ఓహో మీ వూళ్ళో జీడిపప్పు ఉప్మాని "టెంపర్మెంట్ అంటారా?
