Previous Page Next Page 
ఎలమావి తోట! పేజి 22


    మోహన్ని విదిలించి కొట్టింది స్వప్న.
    వాళ్ళు దౌర్జన్యంగా ఆమెని స్కూటర్ ఎక్కించాలని చూశారు.
    సరిగ్గా అప్పుడే ఆఫీసు నుంచి తిరిగొస్తున్న రవిని చూసి స్వప్న సహాయం కోసం అర్ధించింది.
    ఖరీదైన లొకాలిటీ- మసక వెలుతురు మాయమై చిరుచీకట్లు కమ్ముకునే వేళ. అంచేత జనం ఎవరూలేరు.
    రవి కత్తిలా దూసుకెళ్ళి మోహన్ని చెడామడా కొట్టేడు. ఫ్రెండ్స్ కూడా జత అయితే వాళ్ళకీ వడ్డించేడు అంతలో దూరంగా కారొస్తున్న శబ్దాన్ని, వెలుతుర్ని గమనించి వాళ్ళు పరారయ్యారు. స్వప్న సంతోషించింది.
    రవి అడిగిన ప్రశ్నకి 'అతని పేరు మోహన్! మా క్లాస్ మేట్ కాదు, కానీ ఒకే కాలేజీలో ఒకే సంవత్సరం చేరి మూడేళ్ళు డిగ్రీ చదివేం! అతనూ ఫైనలియర్ రాశాడు మొన్న!" అంది సమాధానంగా "మీకు తెలుసా" అంది స్వప్న మళ్ళీ.
    రవి సమాధానం యివ్వకుండా నడుస్తున్నాడు.
    "దయచేసి యీ విషయం తెలియనీకండి! తెలిస్తే అమ్మమ్మ వాండిపడుతుంది. రేపు మిమ్మల్ని పిక్ నిక్ వెళ్ళనివ్వదు. పైగా అతని ఆచూకీ కోసం యత్నిస్తుంది-పోలీస్ రిపోర్టు యిస్తానంటుంది!" అంది స్వప్న మెల్లిగా.
    "అలాగేలెండి! అమ్మమ్మగారికి తెలియచెప్పే అవసరం ఏముంది. పైగా నేను ఆవిడని రోజూ చూసే అవకాశం ఎక్కడ? ప్రతి ఆదివారం పిలిపించి రెండు నిముషాలు మాట్లాడి పంపేస్తుంది! అంతే! ఇంతకీ మీరు పిక్నిక్ వెళ్ళేదెక్కడికి?"
    "గజపతి నగరం"
    "ఆ వూరికా?" తనలోని ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ అడిగేడు రవి.
    "అవును!"
    "ఆ వూరికెందుకు?" కుతూహలాన్ని అణిచేసి అడిగేడు.
    "అదేమిటి? అది మా వూరు!"
    రవి సమాధానం యివ్వలేదు.
    "రవిగారూ! యిక్కడి పల్లెలే అందంగా ఉంటాయి. ఫ్యాక్టరీ పొగగొట్టాల కల్మషం, బస్సుల, లారీల, కార్ల దుమ్ములు పడని యిల్లు, సూర్యరశ్మిసోకే స్వచ్చమైన నీరు, మంచి పాలూ పెరుగు, కల్తీలేని నెయ్యి, తాజా కూరగాయలూ, చల్లని గాలీ, చక్కని వాతావరణం పల్లెటూరి జీవితం ఎంత బావుంటుందని?" ఏదో లోకంలో వూహించుకుంటూ స్వప్న చెప్పేసరికి ఫక్కున నవ్వాడు రవి.
    "ఏం నవ్వుతారు?"
    "నవ్వక...మీరన్న ఆ పల్లెటూళ్ళు వందేళ్ళనాటివి. ఈనాడు ప్రతిపల్లెకూడా పొల్యూట్ అయిపోయింది. మీరన్న అచ్చమైన తెలుగు జీవితం యీనాడక్కడ లేదు. నాగరికత బాగా ప్రాకిపోయింది!"
    "ఊహూఁ నేన్నమ్మను అయినా ఆ పంటకాలువలు, గలగలాపారే నీళ్ళూ, కొబ్బరిచెట్లూ బోదెలవెంట నడుస్తూ ఉంటే మృదువుగా తివాచీలావుండే పచ్చిక, అందమైన వాతావరణం, ఆహ్లాదకరమైన గాలి, ఆరోగ్యకరమైన తిండీ-పల్లె జీవితం ఎంతో బావుంటుంది!"
    "మీరు డిబేట్ లో పాల్గొన్నారా?"
    "ఏం?" కుతూహలంగా అడిగింది.
    "ఇన్ని వరాల్లాంటి వసతులున్న పల్లెజీవనం అక్కడే ఉంటుంది కాబట్టి. కవుల కల్పనలో డిబేట్ ఉపన్యాసాల్లో తప్ప ఆ పల్లెశోభ మరెక్కడా చూళ్ళేదు!"
    "ఏమైనా అది మావూరు మా ఫ్రెండ్సంతా వెళ్ళాలని పట్టుబట్టారు-నేనూవెళ్ళక చాలా ఏళ్ళయింది. అమ్మమ్మ నెలాగయినా ఒప్పించి వెళ్ళాలి."
    "దట్సాల్ రైట్! వెళ్ళిరండి! అన్నాడు నిట్టూరుస్తూ.
    "థాంక్యూ వన్సెగైన్!" అని వెళ్ళిపోయింది చకచకా.
    ఆమెవెళ్ళిన కొద్దిసేపటికే గేటుదాటి లోపలికి రాబోతున్న రవి బాల్కనీలో నుంచున్న అమ్మమ్మగారిని చూసి తలవంచుకుని బుద్దిమంతుడిలా తన విడిదికి వెళ్ళేడు.
    అతను రాగానే "అన్నయ్యా! నీకు జాబువచ్చింది!" అంటూ ఉత్తరం అందించింది స్వాతి. రవి ఉత్తరం అందుకున్నాడు.
    "ఇంత ఆలస్యం అయిందేమన్నాయ్?" అడిగింది స్వాతి.
    "క్వార్టర్ ఎండింగ్ కదమ్మా! అందుకని ఎకౌంట్స్ తయారు చేయటంలో ఆలస్యమైంది?" అని ఉత్తరం చదవకుండానే టేబిల్ పై పెట్టి బాత్ రూం వేపు నడిచాడు. అతను తిరిగి వచ్చేసైర్కి ఆయా తెచ్చిన టిఫిన్ ప్లేట్లలో సర్ది, ఫ్లాస్కు కాఫీకప్పులు ఉంచి, నీళ్ళు తెచ్చి కుర్చీలో కూర్చుంది టేబుల్ పై చేతులు ఆన్చి....మరో నిమిషానికి వచ్చాడు రవి.
    
                                    16
    
    తన పడకగదిలో మంచంమీద హాయిగా బాసింపట్టువేసుకుని కూర్చుని  భాగవతం చదువుతోంది కృష్ణవేణమ్మగారు. ఇంటిగొడవలు రావామెకి. ఏం చూసుకున్నా చూసుకోవాలన్నా భూములపై వచ్చే అయివేజు, యింటిఖర్చుఅంతే! అప్పుడప్పుడు యిల్లంతా తిరిగి ఏది ఎట్లావుందో చూసుకోవటం, నెలకోసారి బీరువాలో నగలన్నీ ఉన్నాయో లేవో అని తన తృప్తికోసం చూసుకోవటం అంతే!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS