Previous Page Next Page 
నరుడా ఏమి నీ కోరిక పేజి 23


    
    "గురూ....ఎవరో కొట్టారు" అన్నాడు వెనక్కి తిరిగి చూసి సత్తిపండు.


    "కళ్ళజోడు పెట్టుకు చూడు...." అంటూ సత్తిపండు జేబులో కళ్ళజోడు తీసి సత్తిపండు చెవులకు తగిలించాడు.


    "గురూ....నీ ఒంటి మీద చొక్కా లేదు.బనినే వుంది" అన్నాడు సత్తిపండు.


    "సంతోషం....నీ ఒంటి మీద అది కూడా లేదు. అయినా ఇలాంటి దిక్కుమాలిన సలహా ఇచ్చింది నువ్వు. ఈసారి మంచి సలహాలిస్తే మక్కిలిరగదిస్తా........" అన్నాడు శ్రీచంద్ర.


    "ఏంటో గురూ.....కొత్త కొత్త బూతులోచ్చేస్తున్నాయ్ నాకు" అన్నాడు సత్తిపండు.


    "అదేంటోరా....నా జీవితమే మారిపోతుందని నా సెవెన్త్ సెన్స్ చెబుతుంది."


    "అదేంటి గురూ.....అందరూ సిక్స్ త్ సెన్స్ అంటారు.....నువ్వేంటి....."


    "మనకో సెన్స్ ఎక్కువుంది. అదే సెవెన్త్ సెన్స్" అన్నాడు ఆకాశంలోకి చూస్తూ శ్రీచంద్ర.


    అదే సమయంలో ఆకాశంలో నుంచి శ్రీచంద్ర వైపు చూస్తున్నారు ఆసక్తిగా బ్రహ్మ, యమధర్మరాజు , నారదుడు.....


    తధాస్తు దేవతలు "తధాస్తు" అనడానికి సిద్దంగా వున్నారు.


    "ఆ మనిషి నవ్వుతూ, నవ్విస్తూ విండు నూరేళ్ళు బ్రతుకుతాడు, పుర్ణాయుష్కుడు......." చెప్పాడు బ్రహ్మ శ్రీచంద్ర వైపు చూసి.


    తధాస్తు దేవతలు "తధాస్తు" అన్నారు.


    యమధర్మరాజు తధాస్తు దేవతల వంక కోపంగా చూసి.....


    "ఆ మానవుడ్ని చిటికెలో నా పాశం చేత మరణించేలా చేస్తా......అతని ప్రాణములు హరిస్తా....." అంటూ తన పాశాన్ని చేతిలోకి తీసుకున్నాడు.


    ఒక్కసారిగా నడుస్తోన్న శ్రీచంద్ర ఆకాశం వంక చూసి ఉలిక్కిపడ్డాడు.


    ఆకాశం మేఘామృతమైంది.


    అప్పటివరకూ వెలుతురుతో నిండిన నగరం ఒక్కసారిగా చీకటి మాయమైంది. హటాత్తుగా వచ్చిన ఈ మార్పు చూసి ప్రజలు ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు.


    శ్రీచంద్రలో చిన్న ఉలికిపాటు అసంకల్పితంగా.


    తధాస్తు దేవతలు యముడి వంక, బ్రహ్మ వంక చూస్తున్నారు. ముక్కోటి దేవతలు స్థాణువుయ్యారు.


    నారదుడు నిశ్శబ్దంగా ఉండిపోయాడు.


    యముని మొహం ఎరుపు రంగు పులుముకున్నట్లు వుంది. ఓ చేతిలో గద, మరోచేతిలో కాలనాగులా యమపాశం.


    "బ్రహ్మదేవా! ఇదిగో ఈ క్షణమే మన మధ్య అంతర్యుద్దం ఆరంభమైనది. నువ్వు పూర్ణాయూష్కుడని చెప్పిన ఆ యువకుడ్ని అల్పాయుష్కుడి చేసి తీసుకుని వస్తాను. ఇదే నా శపథం, గంభీరంగా అని అక్కడ్నుంచి మాయమయ్యాడు.


    బ్రహ్మదేవుడు విసురుగా అక్కడనుంచి తన లోకానికి బయలుదేరాడు.


    నారదుడు "నారాయణ....నారాయణ" అంటూ అచ్చట నుండి నిష్క్రమించాడు.

 

                                                            * * *


    "ఏంటి గురూ.....వాతావరణమేమిటి ఒక్కసారిగా హటాత్తుగా ఇలా మారిపోయింది. కొంపదీసి బాబాయ్ తిట్లు తిట్టడం మాని బుద్దిగా ఇంట్లో భగవద్గీత చదువుకుంటున్నాడా?" అడిగాడు సత్తిపండు శ్రీచంద్రని.


    "అంత సీన్ లేదులేరా! కానీ, ఎందుకో ఏమిటో నామనసులో ఏదో చిన్న కదలిక. చిన్న గగుర్పాటు కలిగింది" అన్నాడు శ్రీచంద్ర ఏదో ఆలోచిస్తూ.


    "అదేంటి గురూ! కొంపదీసి గనేరియా కాదు కదా?" అడిగాడు.


    శ్రీచంద్ర సత్తిపండు వైపు శాంతంగా చూసి "పోట్టిలాగు! నువెంట్రా నాకెప్పుడు అర్ధం కావు. గగుర్పాటుకు గానేరియాకు తేడా తెలియకపోతే బ్రతుకుతావురా. అయినా ఇలా నీ అనుమానాలతో, వెధవ క్వచ్చన్లతో నన్నెందుకు చంపుకు తింటావు" అడిగాడు.


    "అదేంటి గురూ! ఎప్పుడూ నిప్పుల్లో పడ్డ ఉప్పులా ఎగిరెగిరి పడ్తావు. ఇప్పుడింత కామ్ అయిపోయావు. బాలేదు గురూ.....నువ్వు చిటపటలాడితేనే బావుంటుంది నువ్వు ఆముదం తగినట్టు మొహం పెడితేనే బావుంటుంది" అన్నాడు సత్తిపండు.


    "అదేంటి గురూ! ఒక్కసారిగా కొంపదీసి గౌతమబుద్దుడివి అవ్వలేదుగా. నీలో ఈ శాంతం, ఈ ఆలోచన....నాకు భయమేస్తున్నది గురూ" అన్నాడు అమాయకమైన ఎక్స్ ప్రేషనిస్తూ సత్తిపండు.


    "ఏం లేదురా పండు, నీ పెళ్ళి మాధురీ ధిక్షిత్ తో చెయ్యాలా? మమతా కులకర్ణితోనా? అని ఆలోచిస్తున్నాను."


    "నిజమా గురూ? నిదేంత మంచి మనసు? వాళ్ళు ఒప్పుకుంటారంటావా?


    మాధురీ అయితే బెటర్. మమతా కులకర్ణి ఫైర్ లా ఎప్పుడూ మండుతూ వుంటుంది. నాకొద్దు గురూ."


    "పోనీ సుస్మిత."


    "కట్నం ఏమాత్రం ఇస్తారు గురూ?"


    ఒక్క క్షణం సత్తిపండు మొహంలోకి చూసాడు శ్రీచంద్ర.


    సత్తిపండు తనని అట పట్టించడం లేదు. పైగా తను చెప్పిన మాటలు నిజమేనని నమ్మేశాడు.


    తన తలను ఏ రెయిలింగ్ కేసో గుడ్డుకొవాలన్నా కోరిక బలంగా కలిగింది శ్రీచంద్రకు.

 

            
                                                        * * *


    త్రిలోకం ఇంటికొచ్చేసరికి తడిసి ముద్దయ్యాడు.


    టాంక్ బండ్ దగ్గర రాత్రి ఏడు దాటుతుండగా ఉలిక్కిపడ్డాడు త్రిలోకం. తన గెటప్ చూసుకుని ఆశ్చర్యపోయాడు. ఈలోగా మొక్కజొన్న పొత్తులు అమ్మే శాల్తీ ఒకడొచ్చి "బాబుగోరు....నా బట్టలు ఇచ్చేసి నా డబ్బులిప్పిస్తే నేను వెళ్తా" అన్నాడు.


    "నా డబ్బులేంటి? నీ బట్టలేంటి?" ఆశ్చర్యంగా అడిగాడు త్రిలోకం.


    "అదేంటి బాబుగోరు! మీరేకదా ఓ లుంగీ, బనియన్, రుమాలు కావాలని అడిగారు. పైగా ఓ గంట సేపు నేను మొక్కజొన్న పొత్తులు అమ్ముతాను. నీకు వంద రుపాయాలిస్తానని చెప్పారుగా" మరింత ఆశ్చర్యంగా చెప్పాడు.


    "ఓహో! నీకలా చెప్పానా?" అని వెంటనే మరోసారి తన బట్టలు వంక చూసుకుని "చీ....చీ.... ఈ గేటప్పేమిటి?" అనుకున్నాడు. ఎదుటి శాల్తీ చేతిలో తన బట్టలు ఉన్నాయి."


    గబగబా తన బట్టలు తీసుకున్నాడు. కిక్కురుమనకుండా అతనికి వందరుపయాలిచ్చాడు.


    "ఓహో....నేను గంటసేపు పొత్తులు అమ్ముకునేవాడిలా నటించానా?" అని మనసులో అనుకున్నాడు.

 

                                                        * * *


    ఇంట్లోకి వస్తూనే "సమీరా.....అమ్మాయి సమీరా" అని పిలిచాడు. అప్పటికే తండ్రి మీద కోపంగా వుంది. టాంక్ బండ్ దగ్గర మొక్కజొన్న పొత్తులు అమ్మే గెటప్ లో కనిపించినందుకు.  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS