Previous Page Next Page 
నరుడా ఏమి నీ కోరిక పేజి 22

 

    "అనినచో......మీరే గొప్ప అని నేను ఒప్పుకోనవలయునా? నా ఆధిక్యతను కాదనగలరా?" సూటిగా అడిగాడు యమధర్మరాజు.


    ఇద్దరి మధ్యా వాద వివాదములు వేడి రగులుకుంది. వీరి వాదం తారాస్థాయికి చేరుకుంది.


    అదే సమయంలో నారదుడు ప్రవేశించాడు.


    "నారాయణ....నారాయణ....నారాయణ...."


    "రా నారదా.....సమయమునకు వచ్చితిరి.....ఆసనము అలంకరింపుడు......" అంటూ ఆసనాన్ని చూపించాడు.


    "కుమారా.....క్షేమమా?" బ్రహ్మదేవుడు పలకరించాడు.


    "లోక క్షేమమే నా క్షేమం.....నా క్షేమమే లోక కల్యాణం. అవును గానీ.....నేనేమైనా అనువుగాని సమయాన వచ్చి యుంటినా?" అడిగాడు ఇద్దరి వంకా మార్చి మార్చి చూస్తూ.


    బ్రహ్మ, యమధర్మరాజు ఒకరి వంక మరికరు కోపంగా చూసుకుంటున్నారు.


    "నారదా......నీ తండ్రిగారిల అభిజాత్యం పెరుగుచున్నది. ఆ అభిజాత్యంతో మా గొప్పతనం అంగికరించలేకున్నారు....." అన్నాడు యమధర్మరాజు.


    "నారాయణ......నారాయణ......" నీ నామం విన్నంతనే మా లోకవాసులు భయకంపితులు అవుతారు. ప్రాణములు వదులుతారు. యమపాశం అనిన అందరికి భయం మెండు. మీ గొప్పతనం సర్వలోక విదితమే....." నారదుడు బ్రహ్మదేవుడి వైపు చూస్తూ అన్నాడు.


    "కుమారా......" అసహనంగా పిలిచేడు బ్రహ్మదేవుడు.


    "ముల్లోకాల్లో మీరు అలంకారం.....క్షణం తీరిక లేక, కనీసం మాతృమూర్తి గురించి కూడా ఆలోచించక, నిరంతరం సృష్టి యజ్ఞంలో మీరెంతో శ్రమిస్తున్నారు. మిరోక్క ఘడియ విశ్రమించిన , ప్రపంచమే స్తంభించును. మీ లలాట లిఖితమనిన అందరికి భయం. భక్తీ, గౌరవం.....లోక విదితమైన మీ గొప్పతనం నేను కీర్తించవలయునా...." అన్నాడు యమధర్మరాజు వంక చూస్తూ నారదుడు.


    "నారదా...." యమధర్మరాజు పిలిచాడు.


    "సమవర్తి.....ఎంతటి గాంభీర్యం....ఏమి తేజస్సు....మహిష వాహనంలో మీరు వెళుతుంటే చూచుటకు ఎన్ని కన్నులు కావలయునో కదా....." అన్నాడు.


    యమధర్మరాజు చేయి మీసం మీదికి మళ్ళింది.


    "కుమారా......" బ్రహ్మదేవుడి పిలుపు.


    "పితృదేవా"


    "నారదా....." యమధర్మరాజు హుకరింపు.


    "సమవర్తి...."


    "కుమారా"


    "నారదా"


    "కుమారా"


    "నారదా"


    "నారాయణ.....నారాయణ" అంటూ చెవులు మూసుకున్నాడు నారదుడు.


    "నారదా.....వాదములెందుకు? మీరు మేధావులు ....ఎన్నో సమస్యలను పరిష్కరించగలరు. మా ఇద్దరిలో ఎవరు అధికులో చెప్పుము. పక్షపాతం వలదు సుమా...." అన్నాడు.


    నారదుడు ఇద్దరి వైపు చూసాడు.


    "అదిగో .....అలాంటి చూపులే వద్దు నారదా.....చెప్పుము" యమధర్మరాజు తొందర చేసాడు.


    "కరవమన్నచో కప్పకు కోపము, విడవమని అన్నచో పాముకు కోపము.....భలే సంకట స్థితిలో నెట్టివేసితిరి.....అయినా ఆలోచించగా.....ఆలోచించగా.....ఇద్దరూ అధికులే.....అని తేలుచున్నది" అన్నాడు నారదుడు.

 

    "కప్పదాటు పరిష్కారం వద్దు నారదా....." యమధర్మరాజు అన్నాడు.


    "అవును కుమారా.....నేనే సృష్టి కారకుడను......నేను తలరాత రాయకుండా ఏ ప్రాణి వూపిరిపోసుకోదు. చెప్పుము.....నేను అధికుడనని."


    ఇద్దరి వంకా చూసాడు నారదుడు.


    "నాకు చక్కని పరిష్కారం ఒకటి గోచరించుచున్నది......అది యిరువురికి ఆమోద యోగ్యమైనచో......అయిననూ.....నాకేం ....అసలే తంపులమారి....కలహాల మారి.....అని నాకు పేర్లు.....ఎందుకులెమ్ము" అంటూ మెల్లగా అక్కడ్నుంచి జారుకోబోయాడు నారదుడు.


    "నారదా....అదేమీ కుదరదు....పరిష్కారమేదో చెప్పే వెళ్ళవలయును." అన్నాడు యమధర్మరాజు.


    నారదుడు బ్రహ్మదేవుడి వైపు చూసాడు.


    చెప్పమన్నట్టు చూసాడు బ్రహ్మదేవుడు.


    "ఏమున్నది.....మా తండ్రిగారు సృష్టించిన ఓ ప్రాణిని పరీక్షించుడు......" తేలిగ్గా చెప్పాడు నారదుడు.


    "అదేటుల?" యమధర్మరాజు సందేహం వచ్చింది.


    "మా తండ్రి గారు రాసిన తలరాత, ఆయుర్దాయం.....వీటికి తిరుగు లేదు. అలాంటి ఎవరైనా ఓ ప్రాణిని మీరు పరిక్షించవలయును. మా తండ్రిగారు ఇచ్చిన ఆయుర్దాయం కన్నా ముందు , మీరు ఆ ప్రాణిని మీ పాశం చేత కొని తేవలయును. అటులైన అది మీ గెలుపు. అటుల కాకుండా మా తండ్రి గారు లిఖిన్చినట్టు అతడు పూర్ణాయుష్కుడైతే అది మా తండ్రి గారి గెలుపు. యిది నా సలహా మాత్రమే సుమీ....అయిననూ నాకెందుకు....." అంటూ జారుకోబోయాడు.


    "ఆగాగు నారదా.....లేస్సయిన పరిష్కారం సుచించినావు.....మీ తండ్రిగారి ఆయువు రాతని , తలకిందులుగా చేసి, నా గొప్పతనాన్ని నిరూపించుకొనేదను.....నేనే గోప్పయని ముల్లోకాదిపతుల అనునట్టు చేయుదును....." అన్నాడు యమధర్మరాజు.


    బ్రహ్మదేవుడు కోపంగా యమధర్మరాజు వంక చూసి.....


    "నేను సృష్టించిన ప్రాణి....నా బ్రహ్మరాతను అనుసరించే ప్రవర్తిస్తాడు. నేను విధించిన ఆయుర్దాయమే అతని సరైన ఆయుష్షు. ఎటువంటి స్థితిలోనూ నువ్వా ప్రాణి ప్రాణములు హరింపలేవు....." అన్నాడు.


    "అటులనా......అదియును చూద్దాం....ఇంతకీ ఆ ప్రాణి ఎవరో....." అన్నాడు యమధర్మరాజు.


    బ్రహ్మదేవుడు తలవంచి, కిందకి చూసాడు. యమధర్మరాజు కూడా అటువైపు దృష్టిని సారించాడు.

 

                                                           * * *


    శ్రీచంద్ర పరుగెడుతున్నాడు.


    "గురూ.....ఇంక పరుగెత్తడం నా వల్ల కాదు కానీ నేనాగిపోతాను.....నువ్వెళ్ళు" అన్నాడు వగరుస్తూ సత్తిపండు.


    "ఒరే పండు.....నువ్వు ఆగిపోయావనుకో....మా మామయ్యా నిన్ను హిప్నటైజ్ చేయకుండానే మెంటలేక్కిస్తాడు , ఆయనందులో స్పెషలిస్ట్--- అయినా ఒరే పోట్టిలాగు.....నిన్ను ఏదో ఓ రోజు పీక పిసికి చంపి, సెంట్రల్ జైలుకు వెళ్లి హాయిగా జీవితాంతం, ఫుడ్ బాధ లేకుండా బ్రతికేస్తాన్రా.....అనవసరంగా దిక్కుమాలిన సలహాలిస్తావు" పరుగెత్తడం ఆపి వగరుస్తు అన్నాడు శ్రీచంద్ర.


    "ఎందుకంటావ్ గురూ....." అడిగాడు సత్తిపండు. నెత్తిమీద ఠపిమని కొట్టాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS