"అరె! అమ్మయెప్పుడూ ఈవిషయం నాకు చెప్పలేదే!"
"చిన్నప్పుడే పోట్లాట వచ్చి విడిపోయాము. అందుచెప్పలేదేమో?"
"అంతేనేమో మరి" నమ్మినట్టు నటిస్తూ అంది శీతల్.
లోకేశ్వరరావు తో పాటు వచ్చిన ఇరువురు ఆయన గారి తాలూకా చేతికిందవాళ్ళు. చిన్నసైజు గూండాలు శీతల్ కి తెలివివచ్చి ఎదురుతిరిగితే ఓ పట్టుపట్టడానికి వాళ్ళని వెంట తెచ్చుకున్నాడు. ఇక్కడికి వచ్చేసైర్కి కథ మారిపోయింది.
గూండాలిద్దరూ చేతులు కట్టుకుని నుంచున్నారు. "వీళ్ళిద్దరూ ఎవరు అంకుల్?" వరస కలిపేస్తూ అడిగింది శీతల్.
"వీళ్ళు...వీళ్ళు మనకి కావలసినవాళ్ళే!" అంతకు మించి ఇంకెలా చెప్పాలో తెలియలేదు లోకేశ్వరరావుకి. అంకుల్ అన్న పిలుపు ఆయన చెవులకి అమృతంలా తాకింది.
"నమస్కారం!" అని చేతులు కలిపి వాళ్ళకి నమస్కారంపెట్టి" అదేంటి అలా నిలబడేవున్నారు. కూర్చోండి" అంది శీతల్.
వాళ్ళిద్దరూ ఇది వూహించని విషయం. కంగారుపడి పోయారు.
"వాళ్ళు కూర్చోకూడదు. మన నౌకర్లు" లోకేశ్వర రావు ముఖం చిట్లిస్తూ చెప్పాడు.
"నౌకర్లా!"
"అవును నౌకర్లే ఎందుకంత ఆశ్చర్యం?"
"బూట్లు, రబ్బరుకోట్లు వేసుకుంటేను...మాకు నౌకర్లు ఇలాంటి డ్రస్ లు వేసుకోరు. అందుకని ఆశ్చర్యపోయాను."
అదన్న మాట విషయం అనుకున్న లోకేశ్వరరావు మరో కథ చెప్పేశాడు. "మీ నాన్న అంటే బికారి. నేనలా కాదు కదా! కోటీశ్వరుడిని. నా దగ్గర నౌకర్లు కూడా కోట్లు వేసుకుంటారు."
"ఆహా" అంది శీతల్ ఏదో అర్ధమయినట్టు.
ఈ పిల్లది తెలివో, అతితెలివో ఇహ చూడాలి అనుకున్న లోకేశ్వరరావు డైరెక్టుగా రంగంలోకి దిగి "నిన్ను తమాషాగా పెళ్ళి పందిట్లోంచి ఎత్తుకొచ్చేశారు తెలుసా?" అన్నాడు.
"ఓ...తెలుసు" శీతల్ పసిపిల్లలా కళ్ళు తిప్పి అంది.
"తెలుసా! ఎలా తెలుసు?"
"నాకు ఇందాకనే మెలుకువ వచ్చింది. చూడబోతే కొత్తగా వుంది. బాగా ఆలోచించాను, అని అర్ధమైంది"
"ఏమిటి?"
"నన్నెవరో ఎత్తుకొచ్చి ఇక్కడ అట్టిపెట్టారని ముందే చెప్పింది-నన్ను ఈ పెళ్ళినుంచి తప్పిస్తాను. నాటకం అడుతున్నాము అని రంజిత్ మనుషులని పంపేడేమో అనుకున్నాను. కారులో నన్ను ఎక్కించి నా మీద మత్తుమందు చల్లారు కదా! రంజిత్ అయితే ఆపని చేయడు కనుక ఎవరో నన్ను ఎత్తుకొచ్చి ఈ గదిలో దాచారు అనుకున్నాను. అలా అనుకుంటున్నానో లేదో మీరు గదిలోకి వచ్చారు" శీతల్ చాలా చక్కగా చెప్పింది.
"నీకు భయం వేయలేదా?" శీతల్ చెప్పింది నమ్మదగిందిగా ఉండడంతో లోకేశ్వరరావు మరో ప్రశ్నవేశాడు.
"కొద్దిగా వేసిందికాని దానికన్నా ఇదే బెటర్ కదా?"
"దేనికన్నా?"
"ఇష్టంలేని పెళ్ళికన్నా!"
లోకేశ్వరరావు ఎలాంటివాడో మొదటి చూపులోనే చక్కగా గ్రహించింది శీతల్. తను నోరుజారి రంజిత్ విషయం, ఆంటీ అనే ఆవిడ దగ్గర మాట్లాడడం జరిగింది. ఆ మహాతల్లి ఈ విషయం ఈయనగారికి చెప్పే వుంటుంది. కనుక విషయాన్ని అటు మార్చి, ఇటు మార్చి ఉన్న విషయానికి మసిబూసి మారేడుకాయచేసి ఓ కథ కల్పించి చెపితే వీడు, వీడితలలో జేజమ్మ నమ్ముతారు అని చక్కటి ప్లాన్ చేసింది. 'మొదటి అడుగుచక్కగాపడితే, రెండో అడుగుదానంతట అదే పడుతుంది' అన్న సూక్తి శీతల్ కి బాగా తెలుసు. కాకపోతే కాస్త మొండితనం, తన తెలివిమీద నమ్మకం జాస్తి అదే అప్పుడప్పుడు జీవితంమీద దెబ్బ కొడుతున్నది. చిన్న చిన్న విషయాలు శీతల్ పట్టించుకోదు కాబట్టి అది మనసుకి దెబ్బలా తగలడం లేదు.
లోకేశ్వరరావు అపర లంకేశ్వరుడు. శీతల్ మొదటి అడుగు సరీగా వేయబట్టి లోకేశ్వరరావుకి పట్టుబడలేదు.
శీతల్ తలదించుకుని మౌనం వహించడంతో "ఇష్టం లేని పెళ్ళా! అంటే అర్ధం ఏమిటి?" అంటూ మళ్ళీ అదే ప్రశ్న రెట్టించి అడిగాడు లోకేశ్వరరావు.
"అంకుల్! నేను చెప్పింది మీరు నమ్ముతారా శీతల్ నెమ్మదిగా తల ఎత్తి అడిగింది.
"ఎందుకు నమ్మను, తప్పక నమ్ముతారా చెప్పమ్మా!"
"ఈ పెళ్ళి నాకు ఇష్టంలేదు."
"ఇష్టంలేదా? మరి ఎలా చేస్తున్నారు?"
"బలవంతాన."
"నీవు నీ తల్లిదండ్రులకి ఏకైక కుమార్తెవి పైగా..."
"ఆగండి అంకుల్! వివరంగా చెపితేకాని మీకు అర్ధం కాదు. నాకు నయన్ బాబుని పెళ్ళి చేసుకోవటం అసలు ఇష్టంలేదు. పెళ్లి సంబంధం అప్పుడే ఆ విషయం చెప్పాను. కారణం నాకు తెలియదు- డాడీ నా మాట వినిపించుకోలేదు. పెళ్ళి ఏర్పాట్లు చేశారు. మమ్మీ నా పక్షమే కాని మా మాట డాడీ వినిపించుకోలేదు మా కళ్ళముందే చస్తానని బెదిరించారు. డాడీది ఉత్త బెదిరింపే గాని ఏమీ కాదని నా నమ్మకం. మమ్మీ మాత్రం బెదిరిపోయింది. డాడీ మాటలకి ఊ అంది. నా ఇష్టం లేకుండా పెళ్ళి ప్రయత్నాలు జరిగిపోతున్నాయి. నా మాట, నా మనసు డాడీకి అక్కరలేనప్పుడు నేను మాత్రం ఈ పెళ్ళికి తల ఎందుకు వగ్గాలి అనుకున్నాను. రజియా రంజిత్ కి కబురు చేశాను..."
"రంజిత్ ఎవరు?" శీతల్ చెపుతుంటే మధ్యలో తగిలి అడిగాడు లోకేశ్వరరావు.
"చాలా మంచివాడు."
