Previous Page Next Page 
శతదినోత్సవం పేజి 22

 

    'సిద్దంగా ఉండు!' అనే పదంలో పెళ్ళికే అనుకున్నాడు తప్ప, రాఘవ అంతకు మించి ఆలోచించలేకపోయాడు.


    ఆ తయారీ ఒక అనర్ధానికి అని ముందే తెలిసి ఉంటే కిన్నెర ఆలోచనలను ఆ క్షణంలోనే తుంచేసేవాడు.


    కానీ జమిందారీ ప్రాభావాల మధ్య పెరిగిన వ్యక్తులు-- ముఖ్యంగా వీర్రాజు లాంటి ప్రముఖులు యిలాంటి సంఘటనల్లో ఎలా స్పందిస్తారన్నది తెలిసింది అదే రోజున.


    ఉదయం తొమ్మిది గంటల కల్లా పొలానికి బయలుదేరిన వీర్రాజు గోడపైన ప్రకటన చూశాడు.


    విరాసక్తంగా ముందుకు నడుస్తుంటే మరో పది అడుగుల దూరంలో మరోటి కనిపించింది. అగేడాయన.


    "బొజ్జన్న కొండ గుహలో బ్యాంకాఫీసరు రాఘవతో గంటల తరబడి వీర్రాజు కూతురు ఎందుకు గడిపింది?"


    వీర్రాజు మొహం జేవురించింది. కళ్ళలో ఎరుపు జీరలు చోటు చేసుకుంటుంటే ఇంకా ముందుకు నడిచాడు.


    ఒకటో, రెండో కాదు - రాత్రికి రాత్రే వెలిసిన వాల్ పోస్టర్స్ అతడి అహాన్ని రెచ్చగొడుతూ కుటుంబ ప్రతిష్టను సవాల్ చేస్తుంటే ఆగిపోయాడు.


    అయన వెనుక నందిమాగాదుల్లా నిలబడ్డ భూస్వాములు కొందరు ఈ ఊరికేదో అనర్ధం దాపురించినట్లు ఆశ్చర్యాన్ని ప్రకటిస్తుంటే , 'ఎవడా వాల్ పోస్టర్ని అంటించింది' అనలేదాయన. అంటించాల్సిన అవసరం ఎవరి కుందో తెలుసు.


    "ఎవడా రాఘవా?" అన్నాడు పగలబోయే పర్వతంలా.


    గాలి స్తంభించిపోయింది క్షణం పాటు.


    "మాణిక్యమ్మ అని పోస్టాఫీసు పక్కన వుండే ఓ ముసల్దాని మనవడు." గొణుగుతున్నత్తుగా చెప్పాడేవరో.


    అయన సరాసరి లోగిలోకి వెళ్ళలేదు. ఘోషాను మరచి కోట దాటి బయటకు వచ్చి జట్కా బండి వాడితో మాట్లాడుతున్నందుకు భార్య తల నరికి, సమాధి చేసిన రావు బహుద్దూర్ రామ్మోహనరావు మనవడిలా......"


    వయసులో ఉన్న వీర్రాజుతో ఒకనాడు చనువుగా మాట్లాడబోయిన చాకలి చుక్కమ్మ జుట్టు కత్తిరించి, నడి వీధిలో నగ్నంగా నిలబెట్టిన రాజా ప్రభంజనరావు కొడుకులా......


    ఇప్పుడు కూతురి గురించి కాక రాఘవ గురించి ఆలోచిస్తూ మంగను పిలిపించాడు పొలానికి వెళ్ళాక.


    రక్తం ఓడుతున్న కళ్ళతో నిలబడ్డ అయ్యగారిని చూడగానే మంగ కంట తడి పెట్టుకుంటూ బావురుమంది. మరుక్షణం అయన కాళ్ళను చుట్టేసింది.


    "రాఘవ నీకూ తెలుసు కదూ?"


    "అది కాదయ్యా....." మరేదో చెప్పబోయిన మంగను కాలితోతన్నాడు. ఉన్నదేదో అర్ధమైనట్టు.


    పల్లెలో జరుగుతున్నదేమిటో తెలియకుండా లోగిలిలో పవళించిన కిన్నెర పరవశంగా రాఘవా కవితలను చదువుతున్న మిట్ట మద్యాహన వేళ......


    బ్యాంకు నుంచి భోజనానికి స్కూటర్ పై ఇంటికి రావాల్సిన రాఘవ కోసం కాపు కాచాడు స్వయంగా.


    అయన పక్క ఆదేశించగానే ప్రాణాలు తీయడానికి సిద్దంగా పది మంది వ్యక్తులు నిలబడి ఉన్నారు సాయుదుల్లా.


    పల్లె జనం ప్రాణాలు ఉగ్గబెట్టి చూస్తున్నారు.


    
                                                                     *    *    *    *


    ఉదయం నుంచీ చాలా నిగ్రహించుకున్న కిన్నెర చివరికి తనే తెగిమ్చినట్టు బ్యాంకుకు ఫోన్ చేసింది.


    "హల్లో!" రాఘవ కంఠం వినిపించింది.


    "నేను.....కిన్నెర!"


    "క్షణం నిశ్శబ్దం.


    "చెప్పండి....ఈరోజు ఎక్కడికి రమ్మంటారు?"


    "దేనికి?"


    "పారిపోయానుగా! పట్టుబడి మీకు తిట్టే అవకాశ మిద్డామని."


    "బాగా ధైర్యం వచ్చేసినట్టుంది?"


    "ధైర్యం కావాల్సింది తిట్టించుకోవటానికి కాదు తిట్టడానికి......"


    "రూలు ప్రకారం ఈరోజు మీరు తిట్టాలి" అంది.


    "అదేమిటి పాపం?"


    "ఓ అభిమానిలా పిలిచి కయ్యానికి సిద్దపడ్డానుగా!"


    "అంటే.......నన్ను క్షమించానంటారు!"


    కిన్నెర నేత్రాలు అరమోడ్పలయ్యాయి. "అంత తప్పు మీరేం చేశారు?"


    "తప్పు కాకపోతే నన్నెందుకు నిలదీశారు?"


    "నిలదియకపోతే అది తప్పు అనిపించుకుంటుంది కాబట్టి."


    "ఇరవై నాలుగు గంటల్లో అది ఒప్పు అయిందా?"


    "ఒప్పు కావాలనిపిస్తుంది" నవ్వేసింది కిన్నెర.


    "యూ ఆర్ వెరి క్లెవర్....."


    "ఎందుకలా అనిపించింది?"


    "తెలివైన మగాడితో మాట్లాడటానికి సిల్లియేస్ట్ వుమన్ సరిపోతుంది. కాని, ప్హుల్ తో వ్యవహారం చాలా తెలివైన అమ్మాయికే సాధ్యం కాబట్టి....."


    "మీరు ఫూల్ కాదు. రహస్యంగా కవితల్ని అందించి నన్ను ఫూల్ ని చేశారు."


    "అది ఫూల్ చేయడం అనిపించుకోదు."


    "మరి?"


    "పరిచయానికి మార్గం వెదుక్కోవడం." క్షణం ఆగి అన్నాడు_ "ఓసారి నేను మీ అన్నయ్యతో పాటు ఎమ్మే చదువుతున్న రోజుల్లో నా క్లాస్ మేట్ ఒకడు హాస్టల్లో ఉండేవాడు. తెలుగు ఎమ్మే చేస్తున్న ఓ అమ్మాయిని ప్రగాడంగా ప్రేమించేవాడు ఆఫ్ కోర్స్! ఆ విషయం అమ్మాయికి తెలిదనుకొండి. ఓ రోజు నన్ను అడిగాడు-- ఆ పిల్లతో పరిచయం ఎలా ప్రారంభించాలిరా అంటూ."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS