"కాదననన్నాయ్యా!" పూర్తిగా చల్లబడిపోయింది కాని, ఒక్క విషయంలో మాత్రం యింకా అతన్ని క్షమించలేకపోతోంది. "కాని ఒక పెళ్ళయిన మగాడు పెళ్ళి కాని అమ్మాయిని కవితలతో మభ్యపెట్టాలని ప్రయత్నించటం ఎంతవరకు న్యాయం?"
ఉలిక్కిపడ్డాడు ఉదయ్. "వాడు కవిత్వంతో కాదమ్మా, మాటలతో నిన్ను మభ్యపట్టాడు.
"అంటే?"
"ఆ రాస్కెల్ కింకా పెళ్ళే కాలేదే!"
"వ్వాట్?"
"అవును కిన్నెరా, నిజం!"
"ఒక తుఫాను వెలిసిన తర్వాతి ప్రశాంతి.
భూకంపం మొదలై హాని కలిగించక ముందే అకస్మాత్తుగా ఆగిపోయినప్పటి స్థితి.
అసలు కవితలు పుస్తకాలదాకా ఎలా చేరాయా అన్న విషయం ఆమె మరిచిపోయింది. అది మరి మనసును కష్టపెట్టిన విషయమైతే లోతుగా పరిశోధించేదే కాని, కొన్ని రోజులపాటు ఆహ్లాదాన్ని అందించిందిగా!
కాబట్టి యిదంతా చేసింది ఉదయ్ అన్న విషయం మరుగున పడిపోయింది.
అసలు యిందాక ఉదయ్ విశ్లేషించి చెప్పిన వాక్యాలు సైతం ఆమెను గాడంగా కదిలించాయనటానికి సాక్ష్యం - ఆ రాత్రి కిన్నెర రాఘవ తలపులతో నిద్ర పోకుండా గడపడమే!
అహంకారికైతే మాత్రం అందమైన తొలివలపు ఆనందాన్ని ఇవ్వదూ?
పొగరున్న ఆడపిల్లకైనా గాని గుండె లోతుల ప్రభంజనమై ఆరడి పెట్టనివాడు అది ప్రేమెలా అనిపించుకుంటుంది.
ఆ రాత్రి ఉదయ్ సైతం నిద్రపోలేదు. తన ఉహాకు మించిన వేగంతో ఎలాగన్నా కాని కవితలు రాస్తున్నది రాఘవే అని తెలుసుకోగలిగింది కిన్నెర.
తెలతెల వారుతుండగా జాగింగ్ కని శారదా నది తీరానికి బయలు దేరిన ఉదయ్ కావాలనే రాఘవను కలుసుకున్నాడు.
"కొంప ముంచావు ఉదయ్!" ఇంచుమించు కలియబడి కొట్టినంత పని చేశాడు రాఘవా! "వీక్లీలో పడిన కవితలు చదివి మొత్తానికి నా చిరునామా తెలుసుకున్న మీ చెల్లెలు , ఏదో రొమాంటిక్ గా పిలిచింది అనుకుంటే, మొహం వాచేట్టు వాయించి మరీ వదిలిపెట్టింది. అసలు పిలిచింది మీ చెల్లెలే అని తెలిసుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకునేవాడిని రా! అయినా ఇలాంటి పిచ్చిపని ఎందుకు చేశావ్?"
"నిజానికి మీ ఇద్దరినీ కలపాలని మాత్రం కాదు!" గిల్టిగానే అన్నాడు ఉదయ్......"కవిత్వమంటే ఇష్టపడే కిన్నేరలో చిన్న సంచలనం కలిగించాలని మాత్రమే!"
అర్ధం కానట్టు చూశాడు రాఘవ.
జమిందారీ లోగిలిలోని సంప్రదాయాలంటే మొహం మొత్తిన వాడిలా చెప్పుకుపోయాడు ఉదయ్-- "స్వాతిశయం ఇంటి పేరులా, అభిజాత్యం తరగని అస్తిలా పెంచుకుపోయే మా నాన్నకు ముద్దుల కూతురైన కిన్నెర- ఒట్టి అమాయకురాలు రాఘవా! నిజానికి అదెంత నష్టపోతున్నది దానికి తెలియదు. ఎవడిక్కావాలి ఈ జమిందారీ భేషజాలు? మా తాత ఎంత గోప్పవాడైతే మాత్రం నా కెందుకని? కానీ మా కుటుంబం అలా ఆలోచించదు. గతమనే ఘన కీర్తిని యిప్పటి మా భుజకిర్తుల్లా అలంకరించుకోవడం మా ఫేషనైపోయింది. నీకు తెలిదు రాఘవా! ఇలా వదిలిపెడితే కిన్నేరకి జన్మలో పెళ్ళికాదు. నిజానికి అది దాని తప్పు కాదు, అలా దాన్ని పెంచిన మా నాన్నది. దానికేం తక్కువని? అరుదైన అందం, అవసరమైన తెలివి మాత్రమే కాక, పెళ్లిడు కూడా వచ్చింది. కాని ఆ స్పృహ లేదు.....దాన్ని తట్టి నిద్ర లేపాలనే నేనీ పధకం వేశాను. అప్పటికి నాకు తోచిన మార్గంలో అందమైన ప్రేమ కవితల్ని నీచెత రాయించి ప్రతిరోజూ ఇంట్లో అది తెచ్చుకునే నవలల్లో ఉంచేవాడిని.....ఎస్! నా నమ్మకం తప్పు కాలేదు. అద్భుతంగా స్పందించింది కాబట్టే ఏనాడూ స్వేచ్చగా ఆలోచించడం అలవాటు లేని కిన్నెర తన సంకెళ్ళను చేదించుకుని నిన్ను కలుసుకునే దాకా వచ్చింది. ఇట్సే గుడ్ సైన్! నేను కోరిన మార్పదే రాఘవా!" అది ఉత్సాహమో, లేక ఆనందమో ఆగాడు క్షణంపాటు. "అయితే అదృష్టవశాత్తు దీంట్లో మరో ఫలితాన్ని సాధించగలిగాను."
అర్ధం కానట్టు చూశాడు రాఘవ.
"నిజం రాఘవా! అసలు ఏ మగాడిని మనిషిలా చూడని మా కిన్నెరా నీ కవితల ఘాటుకు బలంగా కదిలింది. చిత్రంగా నీ మీద యిష్టాన్ని పెంచుకుంది."
"ఉదయ్!" అదిరిపడ్డాడు రాఘవ.
"నేనెక్కడా, మిరేక్కడా - అనకు రాఘవా! ఆస్తుల్ని, అంతస్తులను పోలుస్తూ, రొటీన్ తెలుగు సినిమా కధా నాయకుడిలా ఉపన్యాసం చెప్పకు. వినడానికి నాకు ఓపిక లేదు. ఒక తూటాను నేను ప్రయోగిస్తే చిత్రంగా ఒక మనిషిలో మార్పుకు బదులు రెండు పిట్టలు దగ్గరయ్యే అవకాశం ఏర్పడింది."
"కాని, ఉదయ్!"
అర్ధోక్తిలోనే ఖండించాడు ఉదయ్- "నీ కంటూ కిన్నెర నీ భార్య కావడం అభ్యంతరమైతే తప్ప మీరిద్దరూ భార్యభర్తలయ్యేట్టు నేను సహకరిస్తాను."
హటాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
"చెప్పు రాఘవా! కిన్నెర నీ దృష్టిలో అనర్హురాలైతే....."
"నవ్వేశాడు రాఘవ. "ఆమె అనర్హత గురించి నేను ఆలోచించటం లేదు ఉదయ్! నా అర్హత గురించి......"
"కిన్నెర నీ మీద ఆసక్తిని ప్రదర్శించినప్పుడే నువ్వు మా యింటి అల్లుడు కాగలిగే అర్హత సంపాదించావు. కనుక సిద్దంగా వుండు" రాఘవ జవాబును ఆశించకుండా బయలుదేరాడు ఉదయ్.
