Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 22

 

    "ఎంతమాట అన్నారండి! ఇప్పటికి నా సర్వీసులో వంద పందిళ్ళు వేసుంటాను" అన్నాడు మేస్త్రి గర్వంగా.

    "అందుకేగా నిన్ను పిలిపించింది.

    "ప్రెసిడెంటు గోపాలరావు అమ్మాయి పందిరి కూడా నువ్వేనా వేసింది?" అడిగాడు సోమసుందరం.

    "అవునండి నేనే " అన్నాడు మేస్త్రి.

    "ఇంత పెద్ద పందిరి వేశాడా?" అడిగాడు సోమసుందరం.

    "అబ్బే లేదండి! మనదే పెద్దది" అన్నాడు మేస్త్రి.

    "ఈ విషయం నాకు కాదు చెప్పేది, రేపు వూళ్ళో జనంతో చెప్పు అన్నాడు సోమసుందరం.

    "చిత్తం అలాగేనండి" అన్నాడు మేస్త్రి.
                                           *    *    *    *

    జయంతి! పిల్లలందరు స్నానాలు చేశారా?" అడిగింది కస్తూరి.

    "చేశారమ్మా" చెప్పింది జయంతి.

    "అయితే గదిలో చాపపర్చు, భోజనాలు వడ్డిస్తాను. ముందు పిల్లలకు పెట్టు, మళ్ళి నిద్రపోతారు. పగలంతా పడుకోకుండా ఆ పందిరి కింద ఆడుతూనే వున్నారు" అంది కస్తూరి.

    "అలాగే" అంది జయంతి అప్పటివరకు గిరిజ పక్కనే కూర్చుని కబుర్లు చెపుతూ వుంది. తల్లి కేకతో నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళింది.

    "అమ్మాయ్ కస్తూరి జయంతి పెళ్ళి ఎప్పుడు చేస్తావే?" అడిగింది పొద్దుటే ఊరినించి వచ్చిన కస్తూరి తల్లి కామేశ్వరమ్మ.

    "చుద్దాంలేమ్మా! తొందరేముంది: అంది కస్తూరి.

    "తొందరేముంది అంటావేంటి? నీకు పదమూడోఏటనే పెళ్ళి చేశాం మేము" అంది ఆమె కోపంగా.

    "అబ్బా! ఆ రోజులు వేరమ్మా" అంది కస్తూరి ప్లేట్లు కడుగుతూ.

    "ఎంటమ్మా, ఆ రోజులు వేరంటున్నావ్?" అంటూ వంటగదిలోకి వచ్చింది జయంతి.

    "నీ పెళ్ళి విషయం అడుగుతుంది లేవే మీ అమ్మమ్మ" అంది నవ్వుతూ.

    "అబ్బా! అమ్మమ్మా, పొద్దుటే కదా వచ్చావు. అప్పుడే మొదలేశావా?" అంది జయంతి విసుక్కుంటు.

    "నోరుమూయావే....ఇంకెన్నాళ్ళుంటావు పెళ్ళి చేసుకోకుండా?' అంది కామేశ్వరమ్మ.

    "అసలు చేసుకొనే నీకు అభ్యంతరమా?' అంది జయంతి.

    "చూశావటే కస్తూరి దాని మాటలు" అంది.

    "దాని మాటలకేంగానీ పదమ్మా నువ్వు కూడా భోంచేద్దువు" అంది కస్తూరి.

    "ముందు పిల్లలకి పెట్టండి. నేను తరువాత తింటాలే" అంది ఆమె.

    "నువ్వు కూడా తిని తొందరగా పడుకో అమ్మమ్మా, ప్రయాణం చేసి వచ్చావు కదా" అంది జయంతి.

    "అబ్బో! నామీద ఎంత ప్రేమో నా మనవరాలుకి" అంటూ మురిసిపోయింది కామేశ్వరమ్మ.

    "అమ్మాయ్ దాక్షాయణి, ఏరా మీ అమ్మా, నాన్న ఇంకారాలేదా?' అడిగింది కామేశ్వరమ్మ.

    "ఇంకా రాలేదమ్మా, రెండ్రోజుల్లో వస్తారు" అంది దాక్షాయణి.

    "అలాగా! ఎలా వున్నారు తల్లీ అమ్మవాళ్ళు? బావున్నారా?" అడిగింది మళ్ళి.

    "బానేవున్నారమ్మా, చెల్లెలికి పరిక్షలు జరుగుతున్నాయి, అవి అయిపోయిన వెంటనే బయల్దేరి వస్తారు" అంది దాక్షాయణి.

    "అలాగా! మంచిది తల్లీ, నీ ఆరోగ్యం ఎలా వుంది? పోయినసారి వచ్చినప్పుడు కడుపునొప్పి వస్తుంది అన్నావుగా" అంది కామేశ్వరి ఆప్యాయంగా.

    "ఆ తగ్గిపోయిందమ్మా, ఇప్పుడు బానేవున్నను" అంది దాక్షాయణి.పోనిలేమ్మా, రా భోంచేద్దాం" అంది.

    "మీరు తినండి, మీ అబ్బాయి యింకా రాలేదు, అయన వచ్చాక భోంచేస్తాము" అంది దాక్షాయణి నవ్వుతూ.

    "ఇంకా రాలేదా?" అంది ఆశ్చర్యంగా ఆవిడ.

    "పెళ్ళి పనుల్లో తిరుగుతున్నారు కదా, ఆలస్యమవుతుంది" అంది జయంతి.

    "నేను నిన్ను అడగలేదుకదే నువ్వెందుకు చెపుతావు?" అంది కామేశ్వరమ్మ నవ్వుతూ.

    "పెద్దపిన్ని అయినా అదే సమాధానం చెబుతుంది" అంది జయంతి.

    "అమ్మాయ్ దాక్షాయణి! చంటి నిద్రపోతున్నాడు చూడు, వాడికి నువ్వు తినిపించు" అంది కస్తూరి.

    "అలాగే అక్కా! మీరు కూర్చోండి. పాపం పొద్దుటినుంచి ఒకటే పని మీకు" అంది దాక్షాయణి.

    "మనకు అలవాటే కదా. ఈమాత్రం పనికే అలసిపోతామా?" అంది కస్తూరి నవ్వుతూ.

    "రేపు వంటవాడిని పిలిపిస్తున్నార్లే మీ బావగారు, ఆ పదిరోజులు పెళ్ళయ్యేవరకు వాడే చేస్తాడు వంట. ఇక మనం వాడికి అన్నీ అందించటమే" అంది జయంతి.

    "అలాగా! ఇంకేం ఇక మనం ఎంచక్క కబుర్లు చెప్పుకోవచ్చు కదూపిన్ని" అంది జయంతి.

    దాక్షాయణి నవ్వింది.

    "అరేయ్ పెద్దోడా.....పెరుగు వేసుకుని తిను" అంది దాక్షాయణి.

    "వద్దమ్మా, చాలు" అన్నాడు వాసు ఆవులిస్తూ.

    "వెధవ, పొద్దుటినుంచి ఒకటే ఆటలు, అప్పుడే నిద్ర వచ్చేస్తుంది వాడికి" అంది దాక్షాయణి.

    "జయంతి ఆ కంచాలన్నీ తీసేయి. ఇక మీకు వడ్డిస్తాను. పార్వతి ఎక్కడ? పిలువు, బాబాయ్ వచ్చాడా?' అంది కస్తూరి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS