Previous Page Next Page 
ఈ రేయి నీదోయి పేజి 23

 

    ఇక అక్కడే వుంటే తన తొట్రుపాటునంతా అతను కనిపెట్టేస్తాడేమోననే సంశయంతో లోపలికి వెళ్ళింది. అయితే ఆమె మనసు మాత్రం అతని చుట్టూ తిరుగుతోంది.
    
    అతని పరిస్థితి కూడా అంతే.
    
    చీమ చిటుక్కుమన్నా ఆమె వచ్చినట్టే భ్రమిస్తున్నాడు.
    
    ఎంతకూ రాకపోయేసరికి "మంచినీళ్ళు కావాలి" అని కాంతమ్మను అడిగాడు.
    
    ఆమె కూతుర్ని కేకేసింది "సుమతీ! కాసిన్ని మంచినీళ్ళు పట్రా" అంది.   

 

    సుమతి నీళ్ళు తెచ్చింది.
    
    ఆమెను పై నుంచి కిందవరకు ఒకసారి చూసి నీళ్ళందుకున్నాడు. అలా నీళ్ళు అందుకున్నప్పుడే ఆమె చేతులకు తన వేళ్ళను తగిలించాడు.
    
    ఆ స్పర్శే అతని గుండెల్ని వూపేసింది.
    
    తల్లి వున్నప్పుడు అంతకంటే ఏం చేయగలడు" అవీ ఇవీ మాట్లాడి వచ్చేశాడు.
    
    ఇంటికొచ్చాడు గానీ నిద్ర రావడం లేదు. తన కోరికను ఆమెకి ఎలా చెప్పాలా అన్న సందేహం దగ్గర ఆగిపోయింది ఆలోచనంతా.
    
    ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపట్టే మునుపు చిన్న ఐడియా తట్టింది. కట్టె విరక్కుండా, పామూ చావకుండా అలా చెప్పడం మంచిదనుకున్నాడు.
    
    మరో రోజు చీకట్లు పడుతుండగా సుమతి ఇంటికి వెళ్ళాడు. వరండాలో విగ్రహంలా వుండే కాంతమ్మ లేదు.
    
    అయినా వరండా దాటి ఇంట్లోకి వెళ్ళే సాహసం చేయలేక పోయాడు. వరండా మెట్ల మీదే కూర్చుని "కాంతమ్మత్తా" అని మొదటిసారి వరస కలుపుతూ పిలిచాడు.
    
    "ఎవరూ?" అంటూ కాంతమ్మకి బదులు సుమతి వచ్చింది.
    
    "అమ్మ లేదా?" అని అడిగాడు.
    
    "విస్తరాకులు ఏరుకురావడానికి వెళ్ళింది. ఇంతవరకు రాలేదు" అంది సుమతి దిగులుగా.
    
    కాంతమ్మ లేకపోవడం శుభసూచకంలా అనిపించింది అతనికి.
    
    "వచ్చేస్తుందిలే" అంటూ ఆమె వెనకాలే లోపలికి నడిచాడు.
    
    "సుమతీ" తన కోరికనంతా అక్షరాల్లో కూరి పిలిచాడు.
    
    "వూ"
    
    "నిన్ను చూడకుండా వుండలేకపోతున్నాను"
    
    "ఎవరుండమన్నారు? వచ్చి చూసి వెళ్ళొచ్చుగదా" అంది వుడికించే ధోరణిలో.
    
    "రావచ్చు కానీ ఇప్పటికే వూరు వూరంతా మనిద్దరికీ సంబంధం వుందని చెప్పుకుంటోందట"    

 

    "చెప్పుకోనీ"
    
    "వూరు వూరంతా మన గురించి అలా చెప్పుకుంటున్నప్పుడు మనం ఎందుకు విడివిడిగా వుండాలి?" అని ఖచ్చితంగా ఆమె నడుం ముడతల్లో చేయి వేశాడు.
    
    ఆమె చిన్న జర్క్ ఇచ్చింది. అతని పట్టు ఆమెలో ఉద్రేకాన్ని రెచ్చగొట్టింది.
    
    ఠక్కున అతనివైపుకు తిరిగి తన ఎదనంతా అతనికేసి నొక్కింది. ఆమె గుండెల చుట్టుకొలత ఎంతో తెలుసుకోవడానికి అతని వేళ్ళు కదిలాయి. పెదవుల్లో అమృతం ఎంతో రుచి చూడడానికి పెదవులు ఆతృత పడ్డాయి. ఆమె కళ్ళలోని కోరికను మరింతగా రెచ్చగొట్టడానికి అతని ముఖం ఆమె ముఖాన్ని రుద్దేస్తోంది.
    
    అదిగో- అలాంటి సమయంలో తలుపు దగ్గర చప్పుడయింది.
    
    ఆమె నుంచి బలవంతంగా తన శరీరాన్ని బయటికి లాగి, వరండాలోకి వచ్చాడతను.
    
    "ఏం నారాయణా! ఎప్పుడొచ్చావ్?" కాంతమ్మ తన తలపై నుంచి పనసాకుల మూటను దించమని కళ్ళతో సైగ చేస్తూ అడిగింది.
    
    "ఇప్పుడే అత్తా"
    
    ఆమె మూట దించి, అలసిపోవడంతో పైట చెంగుతో విసురుకుంటూ కూర్చుండిపోయింది.
    
    "ఏం చేసేది నాయనా ఆయనేమో పేకాటతోనే సరిపెట్టేస్తున్నాడు. మరి ఇల్లు జరగాలి. చీటీలు కట్టాలి కుటుంబం అన్నాక ఎన్ని ఖర్చులుంటాయి! అందుకే విస్తర్లన్నా కుడదామనుకుంటున్నాను. వాటికోసమే నాయుడోళ్ళ చేలోకి వెళ్ళి ఇదిగో ఈ పనసాకులు కోసుకుని వస్తున్నా"
    
    "ఓహో- అలాగా" అన్నాడు. అతనికింకా వణుకు తగ్గలేదు. మరికొంత ఏమరుపాటుతో వుండుంటే కాంతమ్మ కళ్ళల్లో పడిపోయేవాళ్ళు. భగవంతుడే రక్షించాడు అనుకున్నాడు.
    
    "వీటిని కుట్టి టౌన్ కి తీసుకెళ్ళి అమ్మాలి"
    
    "సరే అత్తా- మరి వస్తా" అని నారాయణ వచ్చేశాడు.
    
    సుమతి ఒప్పుకుంది. మరి తీరిగ్గా ఎలా కలుసుకోవాలన్నది అతనికి తెలియడం లేదు. చదువుకున్న పిల్ల కాబట్టి చేలల్లోనో, కసువు వాముల దగ్గరో కలుసుకోవాలంటే ఒప్పుకోదు. ఇంట్లో అయితే ఫరవాలేదు. మరి కాంతమ్మత్తను ఎలా తప్పించడం?
    
    అతను కన్నారా నిద్రపోయి వారం పైగానే అయింది.
    
    అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడతను.
    
    ఆ అవకాశం రానే వచ్చింది.
    
    సంత రోజు కాంతమ్మ టౌన్ కి బయల్దేరింది. అప్పటికి ఆమె నాలుగు కట్టలు విస్తర్లు కుట్టింది. ఓ విస్తర్ల కట్ట ఇరవై రూపాయలదాకా సంతలో అమ్ముడవుతుంది. వాటిని అమ్మి ఇంటికి కావలసినవి తీసుకురావచ్చని చుట్టుపక్కల అమ్మలక్కలతో కలిసి బయలుదేరింది.    

 

    సాయంత్రం అయిదుగంటలకి డ్యూటీ నుంచి నారాయణ తిరిగొస్తుండగా కాంతమ్మ వెళుతూ కనిపించింది. హ్సిన్నగా నవ్వి సైకిల్ ఆపకుండా వచ్చేశాడు.
    
    ఇంటికి రావడంతోనే స్నానం చేసి శుభ్రంగా తయారయ్యాడు. మరి సుబ్బరామయ్య ఎక్కడున్నాడో తేల్చుకోవడానికి బయలుదేరాడు. బడి వెనుక వున్న కంపచెట్ల మధ్య కొన్ని తలలు వేలాడుతున్నట్లు కనిపించగానే పేకాట అక్కడ జరుగుతూ వుందని కనిపెట్టాడు.
    
    అతను వెళ్ళేటప్పటికి జోరుగా సాగుతోంది పేకాట. పక్కనే పెద్ద కిరసనాయిల్ దీపం రెడీగా వుంది. వాళ్ళు సాయంకాలం వరకు రమ్మీ ఆడితే చీకటి పడడంతో 'లోపలా బయటా' ప్రారంభిస్తారు. ఇక జేబులు ఖాళీ అయ్యేవరకు ఆడి ఆ తరువాత ఎవరి ఇళ్ళకు వాళ్ళు బయలుదేరుతారు.
    
    సుబ్బరామయ్య ఇప్పుడొచ్చే అవకాశం లేదని నిర్ధారణ కొచ్చాడు.
    
    చీకట్లు వాలేవరకు అక్కడే వుండి ఆ తరువాత నెమ్మదిగా ఊళ్ళోకి బయలుదేరాడు.
    
    ఆకాశంలో అప్పుడే పుట్టిన నెలవంక పాలబిస్కట్టులా వుంది. మబ్బులు మైదాపిండి ముద్దల్లా వున్నాయి. గాలి సంతనంతా చుట్టుకుని వస్తున్నట్టు ఎండుచేపల వాసన ముక్కులను బిరుసుగా తగులుతోంది. ఆకలి తీర్చడానికి స్త్రీలు ఇంట్లో వంటలు మొదలు పెట్టినట్టుగా పొగ పైకిలేస్తోంది, పెళ్ళి కాని అమ్మాయిలు అందంగా ముస్తాబై ద్వారాలకు తగిలించిన బొమ్మలై పోయారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS