"నేనా!" అంది అదో విధంగా సిగ్గులాంటి భయం కళ్ళల్లో కదలాడింది.
"నువ్వే- నవ్వు అడిగితే తప్ప ఇవ్వడు. సాయంకాలానికి డబ్బు అందకపోతే ఆ సుభాషిణి నోటికొచ్చినట్టు కడిగేస్తుంది"
ఇష్టం లేనట్టు ముందుకు సాగింది సుమతి.
అప్పుడు టైం మధ్యాహ్నం రెండు గంటలయింది. గాలి మధ్యాహ్నం నిద్రకు అలవాటుపడినట్టు ఎక్కడా అలికిడి లేదు. చలి అంటుకున్న ఎండ అంత తీక్షణంగా లేదు.
పక్కిల్లే అయినా ఆ ఇంటికి నడిచేసైరకి సుమతికి పదినిమిషాలు పట్టింది.
నారాయణది పెద్ద అడ్డాపిల్లు. తలుపు కొద్దిగా మూసుంది.
అక్కడికెళ్ళి కాసేపు నిలుచున్నా లోపల ఎవరూ వున్నట్టు అలికిడి లేదు.
"ఏమండీ!" మెల్లగా పిలిచింది.
ఎవరూ పలకలేదు.
ఈసారి మరింత గట్టిగా పిలిచింది.
"ఎవరూ?" అంటూ నారాయణ లోపలి నుంచి వచ్చాడు.
ఎదురుగ్గా సుమతిని చూసి అతను తడబడ్డాడు.
తండ్రి భోజనం చేసి పొలం వెళ్ళాడు. ఇక ఆయన సాయంకాలమే తిరిగి వచ్చేది.
"రా" అంటూ లోపలికి పిలిచాడు.
ఆమె సుతారంగా అడుగుతీసి అడుగేస్తోంది.
అతనిలో కోరిక రాక్షసుడి శరీరంలా క్షణక్షణానికీ పెరిగిపోతోంది. అతని కళ్ళల్లోని కోరిక తనను చుట్టేసుకుంటున్నట్టు ఆమె ఫీలయింది.
సుమతి తడబడుతూ లోపలికి అడుగుపెట్టింది.
అప్పుడు నారాయణ ఒంటిమీద లుంగీతప్ప మరేం లేదు. ఛాతీ మీదున్న వెంట్రుకలు తనకు తగిలి గిలిగింతలు పెడుతున్నట్టే వుంది ఆమెకి. అందుకే ఆమె ఠక్కున ముఖం దించుకుంది.
"కూర్చో" అన్నాడు కొయ్య కుర్చీ చూపిస్తూ-
ఆమె మౌనంగా వెళ్ళి కూర్చుంది.
"ఏమిటి కనబడడం లేదు" అని అడిగాడు.
"ఇంట్లోనే వున్నానే" అంది.
"నిన్ను చూడకపోతే ఏదోలా వుంటుంది"
"నాక్కూడా" అని అనాలనిపించింది ఆమెకి. కానీ నోరు పెగల లేదు.
ఆమెను అంత దగ్గరగా చూస్తుండడంతో అతని గుప్పెడు గుండెలో తుఫాను రేగుతోంది.
అందులోనూ ఇద్దరూ ఏకాంతంలో వున్నారు.
"ఈ బ్లూ చీరలో బావున్నావు. ఒడ్డున నిలబడి సముద్రాన్ని చూస్తున్నట్టుంది" అన్నాడు. అతని కంఠంలో వచ్చిన మార్పు ఆమె కనిపెట్టింది.
"అబ్బో! కవిత్వం"
"పూర్వం ఎవరో రాజు వుండేవాడట. అతన్ని చూస్తే ఎవరికయినా కవిత్వం వచ్చేదట. అలాగే నేనూ"
ఆమె సిగ్గుపడింది. సిగ్గు ముఖానికే పరిమితం కాకుండా ఎదలోకి కూడా దిగినట్టు ఆమె పైట పక్కకు తప్పుకుంది. సగం తెరిచి, సగం మూసివున్న ఆమె ఎద శుక్లపక్షమి చందమామలా వుంది.
అతను ఆమెకి దగ్గరగా నడిచాడు.
అతను తన పైబడి వత్తుతున్నట్టే వుంది ఆమెకి.
ఇక అక్కడ వుంటే తనకి ఏమౌతుందో తెలుస్తూనే వుంది ఆమెకి. తమ ఆరాటం మొదలవుతోంది.
అందుకే ఆమె గబుక్కున పైకి లేచింది.
"వెళ్ళిపోతున్నావా?" అతను బాధగా అడిగాడు.
"ఆ చిన్న పనిమీద వచ్చాను"
"ఏమిటి?"
"చీటీ కట్టాలి. ఓ అయిదు వందలు ఇస్తే- త్వరలో ఇచ్చేస్తాం" ఇబ్బందిగా అడిగింది. అప్పు అడగడం ఏదోలా వుంది. ఈ పనిని తనకి చెప్పిన తల్లిని మనసులోనే తిట్టుకుంది.
అతను గబ గబా చొక్కా దగ్గరికి వెళ్ళి అయిదువందల రూపాయల నోట్లని తెచ్చి ఇచ్చాడు.
ముఖం పైకెత్తి నవ్వుతూ చూస్తూ "థాంక్స్" అంది. చాలా యేళ్ళ తరువాత ఆమె నోటివెంట ఓ ఇంగ్లీషు ముక్క వూడిపడింది.
"వస్తాను" అని చిన్నగా నడుచుకుంటూ ఇంటికి వచ్చేసింది.
ఆమె వెళ్ళిపోతుంటే గుండెను మొనదేలిన రాయితో కోస్తున్నట్టు అతను గిలగిల్లాడిపోయాడు.
ఆమె ఇంటికి వెళ్ళేసరికి తల్లి ఆతృతతో ఎదురుచూస్తోంది.
"ఇదిగో" అని తన చేతిలోని డబ్బును తల్లి చేతిలోకి విసిరి కొట్టింది.
"ఆ నారాయణ చల్లగా వుండాలి. గండం దాటించాడు. లేకుంటే ఆ సుభాషిణి నోటికి నేను చిక్కేదాన్ని" అని కాంతమ్మ కళ్ళు మిలమిల మెరుస్తుండగా దేవాలయంలో జరిగే చీటీపాట దగ్గరికి వెళ్ళిపోయింది.
రెండోరోజు నుంచి మరింత కలవరమైపోయింది నారాయణకు ఆమెను చూడాలని తహతహలాడిపోయాడు కానీ ఇంట్లోకి వెళ్ళాలంటే బెరుకుగా వుంది.
ఒకరోజు సాయంకాలం పూట అలా వీధిలో నడుస్తూ సుమతికోసం ఇంట్లోకి చూపుల్ని గురిపెట్టాడు. అవి సుమతికి కాకుండా మెట్లమీద కూర్చున్న కాంతమ్మకి తగిలాయి.
"రా నారాయణా" అంటూ ఇంట్లోకి పిలిచింది ఆమె.
ఇలాంటి ఆహ్వానం కోసమే ఎదురు చూస్తున్న నారాయణ లోపలికి అడుగుపెట్టాడు.
ఆ ఇల్లు చిన్నదే అయినా ముందున్న ఆవరణ మాత్రం చాలా పెద్దది. చుట్టూ తడికెలతో కంచె వుంటుంది. ఆ ఆవరణ దాటి లోపలికి వెళుతూనే ఆ ఇంటికుక్క తల ఎత్తుకు లేస్తుంది. కరవదు గానీ బాగా మొరుగుతుంది.
అందువల్లే ముందుకు అడుగువేయలేకపోయాడు.
కాంతమ్మ అదిలించడంతో అది తోక ముడిచి పడుకుండిపోయింది.
ఇక నిర్భయంగా ఇంట్లోకి అడుగుపెట్టాడు.
మెట్లమీదే కాంతమ్మకి ఎదురుగా కూర్చున్నాడు.
ఆరోజు నుంచి డే డ్యూటీ కావడంతో సాయంకాలమే వచ్చేశాను. మరో నెలరోజులు అదే డ్యూటీ కాబట్టి సుమతిని చూసే వీలుంది.
సుమతి కోసం అతని కళ్ళు గాలిస్తున్నాయి.
ఎవరో వచ్చి మాట్లాడుతున్నారనిపించి వంటింట్లో వున్న సుమతి బయటికి వచ్చింది.
నారాయణ కనిపించడంతో ఒక్కసారిగా రక్తమంతా ఒంట్లో జరజరమని పాకినట్టు సంచలనం మొదలయింది.
