"కానీ బయట పనులు ఎక్కువే వుంటాయి పాపం!" అన్నాను.
ఆ అమ్మాయి నవ్వి "ఔను....! చాలా ఎక్కువ..." అని వెళ్ళిపోయింది.
"నేను ఆ అమ్మాయి నవ్వు అదోలా వుండడం గమనించి ఆలోచిస్తుండగా, డోర్ తీసుకుని ఓ పొట్టిగా పీలగా వున్న వ్యక్తి లోపలికి వచ్చాడు. అతను జుట్టుని అరిటాకులా మధ్య పాపిడి తీసి దువ్వాడు. కళ్ళు పుచ్చగింజల్లా వుండి చంచలంగా అటూ-ఇటూ కదులుతున్నాయి. పేడిమూతీ, పెద్ద ముక్కూ...ఏదో వెతుకుతున్నట్లుగా చూస్తూ దగ్గరకొచ్చి "అనసూయ లేదా?" అన్నాడు.
అతను అలా ఏకవచనంతో సంబోధించడం నాకు నచ్చలేదు. "అనసూయగారా! ఉన్నారు" అన్నాను.
"పిలుస్తారా?" అన్నాడు.
నేను ఇంటర్ కమ్ లో ఆమెతో "మీకోసం ఎవరో వచ్చారు" అన్నాను.
అతను ఆమె వచ్చేలోగా అక్కడున్న చైర్ లో కూర్చుని ఆగలేనట్లు సిగరెట్ వెలిగించుకున్నాడు.
అనసూయ డోర్ తీసుకుని వస్తూ కొంగు సవరించుకుంది. ఆమె జడలో జారుగా పెట్టుకున్న మల్లెపూల దండ కూడా లేదు. అతని దగ్గరగా వెళ్ళి నిలబడి "ఏమిటీ?" అంది.
అతను లేచి నిలబడి నవ్వుతూ "డిస్టర్బ్ చేశానా?" అన్నాడు.
ఆమె ముఖంలో చిరాకు కనిపించింది. "ఏమిటో త్వరగా చెప్పండి" అంది.
"ఐదొందలు కావాలి అర్జెంట్" అన్నాడు.
ఆమె చేతిలో వున్న పర్స్ తెరిచి వెదికి "ఇదిగో రెండొందలు ఇంతకన్నా లేవు" అంది.
"నాకు ఐదొందలు అవసరం. లోపల అడిగి తీసుకురా" అతను కాస్త గట్టిగానే అన్నాడు.
సభ్యత కాదని తల వంచుకుని పేపర్ చూస్తున్నా నాకు అన్నీ వినిపిస్తూనే వున్నాయి. అతనంటే భరించలేని విసుగు కలిగింది.
"అయితే ఇక్కడే వుండండి. ఇప్పుడే వస్తా" అని ఆమె లోపలికి వెళ్ళింది.
అతను నా టేబుల్ దగ్గరికి వచ్చి "ఇంకా అనసూయకి ఫోన్లు అటెండయ్యే పని కూడా లేదన్నమాట. రోజంతా లోపలే వుంటోందా? బాగా అలిసిపోతోంది పాపం" అని నవ్వాను.
నాకు చాలా అసహ్యం వేసి జవాబు చెప్పలేదు.
అనసూయ హడావుడిగా వచ్చి అతనికి డబ్బిచ్చి "ఇంక వెళ్ళండి. బాబీ వచ్చే టైమయింది" అంది.
"అలాగే వస్తా" అని అతను డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు.
అనసూయ నావైపు చూసి "ఏవన్నా అడిగారా?" అంది.
"లేదు ఎవరు ఆయన?" అన్నాను.
"మా ఆయనే" తల వంచుకుంటూ అంది.
ఆశ్చర్యం శబ్దం రూపంలో రాకుండా అణగద్రొక్కేస్తూ కళ్ళలలోనే ఆపేసి చూశాను. సీతాకోక చిలుక రెక్కలు కత్తిరించినట్లు అనిపించింది. ఈ అజంతా శిల్పానికి ఇతను మొగుడా? బాహ్యరూపం సంగతి సరే.... కనీసం ప్రవర్తనలో కూడా సౌందర్యం లేదే.....ఆశ్లేషగా మాట్లాడడం, అణువు అణువూ ఆబగా తడిమి చూడడం, వెన్నెముక లేనట్లు ఆడంగి నడకా.....భగవాన్! అసలు వున్నావా? అనుకున్నాను. నేను తలతిప్పి చూసేసరికే అనసూయ లేదు.
* * *
మర్నాడు అత్తయ్యా, జయంతీ వచ్చారు. ఎవరో జడ్జీగారింట్లో ఆయన భార్య ఏదో వ్రతం చేస్తోందిట. దానికి వీళ్ళు తయారు. "నువ్వూ రావాలి. నూట పదహారుమంది ముత్తయిదువులకి బంగారు పువ్వుతో తాంబూలాలు ఇచ్చుకుంటుందిట ఇందిర" అంది అత్తయ్య.
'నాలాంటి దానికి వాయినం ఇచ్చి దండం పెడితే ఏం దీవించగలనూ?" అనుకుని "నాకు ఆఫీసుంది" అన్నాను.
"అదేమైనా కలెక్టర్ ఉద్యోగమా? లీవ్ పెట్టేసెయ్" హేళనగా అంది జయంతి.
ఉద్యోగం చిన్నదైనా, పెద్దదైనా పని చెయ్యడంలో వున్న ఆనందం ఆమెకి తెలీదు. తెలిస్తే ఇలా నిరర్ధకంగా ఫ్యాషన్ లకీ, ముచ్చట్లకీ టైం వేస్ట్ చేసుకోదు. కనీసం తనకు పుట్టిన బిడ్డనైనా సరిగ్గా చూసుకుంటుంది. వాడికి తల్లి వుండీ ఆయా సంరక్షణే పాపం.
"నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను రాను" అన్నాను.
"నీకు ఈ మధ్య మా మాటంటే బొత్తిగా లెక్కలేకుండా పోతోంది" అంది అత్తయ్య.
"నాకు నేనంటేనే పెద్దగా లెక్క వుండటంలేదు. జనాభా లెక్కల్లోకి తప్ప ఇంకెందుకు పనికివస్తాను చెప్పు అత్తయ్యా" అన్నాను.
ఆవిడ లేచి నిలబడి కోపంగా "పదవే....ఈవిడతో మాట్లాడుతూ కూర్చోడానికి మనకి టైం లేదు" అంది.
జయంతి నా చీరవైపు చూస్తూ "ఇంత దిక్కుమాలిన చీరలు కట్టుకుని వెళ్ళకపోతే కాస్త మా స్టేటస్ కి తగ్గవి కట్టుకుని వెళ్ళొచ్చుగా?" అంది.
"ఒక రిసెప్షనిస్ట్ కి ఇంతకన్నా ఎక్కువ ధర వున్న చీర అనవసరం. నా జీతంకన్నా చీర విలువ ఎక్కువ వుంటే బావుండదుగా" అన్నాను.
వాళ్ళిద్దరూ చిరబురలాడుతూ వెళ్ళిపోయారు. నాలో ఈ మధ్య శాడిజం ముదుర్తోందనుకుంటా వాళ్ళు అసహనంగా ఫీలయితే నాకు ఆనందంగా వుంటోంది.
ఇప్పటికీ రాత్రయ్యేసరికి తెల్లచీర కట్టుకుని మల్లెమొగ్గలు సిగలో పెట్టుకుని మావయ్యతో గదిలోకి వెళ్ళే అత్తయ్యకి నన్ను చూస్తే ఎందుకు గిల్టీగా వుండదో నాకు అర్ధం కాదు. ఆనంద్ అసలు ఇంటికే రావడం లేదు.
"ఆంటీ...ఆంటీ!" అన్న పిలుపునకు ఉలిక్కిపడి చూస్తే ఎదురింటి అల్పన కొడుకు. "బాల్ ఆంటీ!" అని లోపలకి చూపిస్తున్నాడు.
నేను వాడికన్నా ముందుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి బాల తీసుకుని వాడి దగ్గరికి వెళ్ళి "నాకు ముద్దు పెడితే ఇస్తాను" అని బుగ్గలు చూపించాను.
వాడికి ఐదేళ్ళుంటాయి. సిగ్గుపడుతూ, మొహమాటంగా బాల్ కోసం తప్పదన్నట్లు అంటీ అంటకుండా తన లేత పెదవులని నా బుగ్గలకి ఆన్చి 'ప్చ్' అని పెద్ద శబ్దం చేస్తూ ముద్దు పెట్టాడు. వెంటనే చెయ్యి జాపి "బాల్ దే!" అన్నాడు.
"అవుర్ ఏక్!" రెండో బుగ్గ కూడా చూపించాను. వాడి కళ్ళల్లో చిరాకు కనపడింది. నెమ్మదిగా ఒంగబోయాడు.
"బస్!" నవ్వుతూ వెనక్కి జరిగి బాల్ ఇచ్చేశాను. వాడు "థాంక్యూ ఆంటీ" అంటూ తూనీగలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. రెండో ముద్దు బలవంతంగా పెట్టి నేను పొందే ఆనందంకన్నా వద్దన్నప్పుడు వాడు పొందే రిలీఫే నాకు ఎక్కువ ఆనందాన్నిచ్చింది. జీవితంలో నిరాశామేఘాలు తప్ప సంతోషపు చినుకు ఎక్కడా కనిపించడంలేదు.
"అమ్మా టిఫిన్ వడ్డించేసాను" వంటమనిషి పిలిచింది.
నేను ఉద్యోగంలో చేరాక మావయ్య వంటమనిషిని ఏర్పాటు చేశాడు. వంటకో, నా మీద నిఘాకో నాకు తెలీదు.
"వద్దు బాక్స్ లో సర్దు చాలు" అన్నాను.
* * *
