Previous Page Next Page 
స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ పేజి 22

    ఆ సాయంత్రానికి వూరంతా వాల్ పోస్టర్లు అతికించబడ్డాయి. వేలకొద్దీ పాంప్లేట్లు పంచారు. "పోలీసు జులుం నశించాలి" బీదలపాలిటి పెన్నిధి వీరదాసు అక్రమ నిర్భంధం" వగైరా హెడ్డింగులున్న కరపత్రాలు రాత్రికి రాత్రి ప్రింట్ చేయబడ్డాయి.    
    ఆ మరుసటి రోజు ప్రొద్దున్నే వూరు బంద్ ప్రారంభమైంది.    
    అయితే ఈ కురుక్షేత్ర సంగ్రామంలో అవతలి పార్టీ కూడా ఖాళీగా లేదు. కేంద్రం నుంచి పర్యవేక్షకుడుగా వచ్చిన కార్యదర్శి పులిరాజును కలుసుకొని వ్యూహం రచించాడు.    
    -గుడిలో పవిత్రమైన నగల దొంగతనం జరిగింది. దీనికి కారణం ఎమ్మెల్యే.    
    -రామస్వామి అనే అమాయకుడిని వురి తీశారు.    
    -రామాచారి చనిపోతూ తనని కాల్చింది వీరదాసు అని స్వయంగా చెప్తే, ఆ వాంగ్మూలం ఆధారంగా వీరదాసుని అరెస్ట్ చేస్తే, ఇప్పుడు రాష్ట్ర పార్టీ ఆ వీరదాసుని విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తోంది.    
    "మహా ప్రజలారా! ఇటువంటి పార్టీని రాష్ట్ర అధికారంలో వుంచుతారా? మీరు ఆలోచించండి."    
    - ఈ విధంగా సాగింది వారి ప్రోపగాండా.    
    కేంద్రంలో అధికారంలో వున్న పార్టీ ఈ పరిణామాల పట్ల చాలా సంతోషంగా వుంది. ఈ కేసు బలంగా ప్రజల్లోకి వెళ్ళేకొద్దీ ముఖ్యమంత్రి మరింత బలహీనమై సాలెగూడులో చిక్కుకు పోతాడని కేంద్ర పార్టీకి తెలుసు.    
    రాణాకి మాత్రం ఇదంతా ఆశ్చర్యంగానూ, అసహ్యంగానూ వుంది. అమాయకుడైన తన తండ్రి వురి తీయబడ్డప్పుడు ఏ అలజడీ లేదు....గుళ్ళో నగలు పోయినప్పుడు ఏ మిన్నూ విరిగి మీద పడలేదు. వీరదాసు అనే ఒక హంతకుడిని, పూర్తి సాక్ష్యాధారాల్తో అరెస్ట్ చేస్తే, దానికింత ప్రతిస్పందన!    
    ప్రొద్దున్న ఏడింటికి, రాష్ట్ర పార్టీ వాళ్ళు రిక్షాల్లోనూ, సైకిళ్ళమీద ప్రచారానికి బయల్దేరారు. కార్యకర్తలు జీపుల్లో మెయిన్ బజార్లో పర్యవేక్షణ జరిపి, దుకాణాలు బంద్ చేయించారు. కానీ అది పది నిముషాలసేపే అంతలో అవతలి పార్టీ వాళ్ళు వచ్చి మళ్ళీ దుకాణాలు తెరిపించారు. వీళ్ళిలా వెళ్ళగానే తిరిగి మళ్ళీ వాళ్ళు వచ్చి మూసేయించారు. 'ఎవడ్రా మిమ్మల్ని ముయ్యమంది?' అని వాళ్ళొచ్చి కొట్టారు. 'ఎవర్రా తెరవమన్నది' అని వీళ్ళొచ్చి కొట్టారు. ఇలా సాయంత్రం వరకూ సాగింది. ఏ పార్టీ వ్యవహారాల్లోనూ కలుగ జేసుకోవద్దని పోలీసులకి ఇన్ స్ట్రక్షన్లు వచ్చాయి. వాళ్ళు ప్రేక్షకుల్లా వుండిపోయారు.    
    సాయంత్రానికి - రాష్ట్ర ప్రభుత్వం తరపు పేపర్లు 'బంద్ సంపూర్ణం' అని వ్రాశాయి. కేంద్ర పార్టీ తరపున పత్రికలు 'బంద్ విఫలం' అని వ్రాశాయి మొత్తానికి బంద్ పాక్షికం అనుకున్నారు ప్రజలు మర్డర్లు జరగనందుకు హాయిగా వూపిరి పీల్చుకున్నారు.    
    ముఖ్యమంత్రికి ఏం చెయ్యాలో తోచడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో తానుగానీ వీరదాసుకి సాయపడకపోతే రేపు జైలు నుంచి బయటకొచ్చాక తనతో వీరదాసు ఇంతకు ముదున్నంత 'స్నేహం'గా వుండకపోవచ్చు. అతడిమీద దాదాపు వందమంది ఎమ్మెల్యేలు ఆధారపడి వున్నారు. అతడు ప్లేటు మార్చేస్తే తన పార్టీ బలహీనం అయిపోతుంది. ఆ ఇన్ స్పెక్టర్ని ఎలా లొంగదీయాలి? వీరదాసుని గౌరవప్రదంగా ఎలా బయటకు తీసుకు రావాలి? ఈ పరిస్థితుల్లో రాణా మీద ఏ చర్య తీసుకున్నా కనీసం ట్రాన్స్ ఫర్ చేసినా కష్టమే.    
    ముఖ్యమంత్రి హోం మినిష్టర్ తో సంప్రదింపులు జరిపాడు. అతడూ ఏ విధమైన సలహా ఇవ్వలేకపోయాడు హోమ మినిష్టర్ ఇంటికొచ్చేసరికి భార్య ఢిల్లీ వెళ్ళిందని తెలిసింది.    
    అంత అర్జెంటుగా, తనతోనైనా చెప్పకుండా కామిని ఢిల్లీ ఎందుకు వెళ్లిందో రెడ్డికి అర్ధంకాలేదు.    
    రాజకీయాల్లో సరైన నిర్ణయాలు సరైన టైమ్ లో తీసుకోవాలి. రాజకీయ చదరంగంలో వెంట వెంటనే ఎత్తులు వేయగలవాడే చివర్లో "షో" చెప్పగలడు. అటువంటి శక్తి కామినికి వుంది.    
    తనని ముఖ్యమంత్రిని చేయటానికే కామిని ఢిల్లీ వెళ్ళిందని అతడు కలలో కూడా వూహించలేడు.    
                                           *    *    *    
    "ఎందుకంత అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళొచ్చావ్?" అరవింద్ చౌరసియా అడిగాడు.    
    కామిని నవ్వింది. "ఈ టైమ్ లోనా అటువంటి ప్రశ్నలడిగేది?" అంది నవ్వుతూనే తెల్లటి దీపపు కాంతి ఆమె నగ్న శరీరంమీద మరింత తెల్లగా మెరుస్తూంది. ఆమె చెయ్యి అతడి వెన్నెముక మీద నుంచి క్రిందికి నెమ్మదిగా జారి ముందు కొస్తూంది. అక్కడ సుతారంగా కదిలి అతడిని వెర్రివాడిని చేయటానికి ప్రయత్నిస్తోంది. ఆ లయ విన్యాసం చాలా కొద్దిమంది ఆడవాళ్ళకి మాత్రమే సాధ్యం.    
    అయినా చౌరసియా టెంప్ట్ కాలేదు.    
    "రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మార్చటానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టున్నాయి" అన్నాడు ఆమె కలవరపాతుని అణుచుకుని- "అటువంటిదేమీ లేదే" అంది.    
    "నాకు తెలియనిదంటూ ఏమీలేదు కామినీ తెలియదని అనుకుంటే అది పొరపాటు" అని క్లుప్తంగా.... "రాణా విషయం కూడా నాకు తెలుసు."    
    "ఏ విషయం."    
    "అతడు చాలా మంచి ఇన్ స్పెక్టర్ అని" - 'మంచి' అన్న విషయం నొక్కి పలుకుతూ అన్నాడు. ఆమెకి అర్ధం కాలేదు.    
    "అయినా ఆ విషయాలన్నీ నాకు సంబంధించినవి కావులే. నీ భర్తని నువ్వు చీఫ్ మినిష్టర్ ని చేసుకుంటే నాకేం?- ప్రైంమినిష్టర్ ని చేసుకుంటే నాకేం?" ఆమెని ఆక్రమించుకుంటూ అన్నాడు.    
    అతడు లయబద్దంగా కదులుతున్నాడు ఆమె ఆలోచన్లు మాత్రం వేరేచోట కదుల్తున్నాయి.    
    వీరదాస్ అరెస్టు సాకుతో తన భర్త పార్టీ మార్చబోతున్నాడని చౌరసియాకి ఎలా తెలిసింది?                                             *    *    *    
    "ఏం కావాలి?" రాణా అడిగాడు.    
    "వీరదాస్ గారి కోసం బెయిల్ తెచ్చాను" అన్నాడు కుర్రలాయరు.    
    "నేరస్తుడిని ఇరవై నాలుగ్గంటల్లోగా మేజిస్ట్రేటు ముందు హాజరు పరచాలి. ఆ విషయమై మీ పై అధికార్లకి కంప్లయింట్ కూడా చెయ్యబోతున్నాను" అంటూ బెయిల్ పేపర్లు అందించాడు.    
    రాణా వాటివైపు నిస్సహాయంగా చూశాడు.    
    ఒక్కసారి వీరదాస్ బైటకొచ్చాడంటే ఇక ఈ కేసులో అతడికి శిక్ష పడటం కల్లోమాట కేసు కోర్టువరకూ కూడా వెళ్ళదు.    
    ఏం చెయ్యాలి?        
    అతడు బెయిల్ పేపర్లవైపు చూశాడు. "ఇవి రామాచారి హత్యకేసుకి సంబంధించినవి నేను వీరదాస్ ని అరెస్ట్ చేసింది సంవత్సరం క్రితం జరిగిన గుడి దొంగతనం కేసులో" అన్నాడు. రాణాకి లీగల్ పాయింట్స్ తెలీదు. చిత్రమేమిటంటే ఆ లాయర్ కీ అవి సరీగ్గా తెలీదు.    
    "దానిక్కూడా ఓ గంటలో బెయిల్ తీసుకొస్తా" అంటూ కుర్చీలోంచి లేచాడు.    
    సరిగ్గా అదే సమయానికి నాయుడు లోపలకు ప్రవేశించాడు. "ఏం జరుగుతుంది?" అని ప్రశ్నించాడు.    
    రాణా కసిగా "ముందు బంద్ చేశారు. అది ఫెయిళ్ అయ్యేసరికి ఇప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు" అన్నాడు.        
    నాయుడు నవ్వేడు. "ఇక బందూ లేదు. న్యాయస్థానమూ లేదు. మొత్తం కేసే క్లోజయి పోతూంటే-"    
    "కేసెలా క్లోజవుతుంది?" రాణా అడిగేడు.    
    "చచ్చిపోతూ చచ్చిపోతూ ఆ రామాచారి ఇచ్చిన డెత్ స్టేట్ మెంట్ అదే-ఆ మరణ వాంగ్మూలం నువ్వు చింపేస్తే."    
    "నేను చింపుతానని మీరెలా అనుకున్నారు?"    
    నాయుడు నవ్వుతూనే వున్నాడు. రాణా మనసు కీడు శంకించింది.    
    నాయుడివైపు అయోమయంగా చూశాడు.    
    నాయుడు నవ్వేడు. 'అంత పెద్ద సమస్యకి ఎంత చిన్న పరిష్కారమో చూశావా?' అన్నట్టుంది ఆ నవ్వు. నవ్వుతూనే అన్నాడు"....మీ పోలీసులు ఇంటరాగేషన్ పేరు చెప్పి సంవత్సరాల తరబడి నేరస్తుల్ని లాకప్పులో వుంచుతారు. వాళ్ళని బైటకు తెచ్చుకోవటం కోసం ఆ నేరస్తుల తరపు వాళ్ళు ఒక ప్రభుత్వాధికారిని కిడ్నాప్ చేస్తారు. దాంతో మీరు లాకప్ లో వున్నవాడిని వదిలిపెడతారు. ఇదంతా సహజమేగా పోతే ఇప్పుడిక్కడ జరిగిన మార్పేమిటంటే, ప్రభుత్వాధికారుల్ని బదులు నీ అలక్ నందాని మా దగ్గిర వుంచుకున్నాం అంతే తేడా!"    
    రాణా నిరుత్తరుడై చూశాడు. నాయుడి మొహంలో నవ్వు మాయమైంది.    
    "చచ్చిపోతూ రామాచారి ఇచ్చిన స్టేట్ మెంట్ మా కిస్తే మా అమ్మాయిని వదిలిపెడతాం" అన్నాడు.    
    రాణా ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఈ కోర్టులూ, ఈ సాక్ష్యాలూ వీటన్నింటికీ అతీతమైనది 'దాదాగిరి' అని అతడికి తెలుసు. కానీ దాని విష ఫలితాన్ని ఇన్నేళ్ళ సర్వీసులో ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాడు. ఒక నేరస్తుడిని అరెస్ట్ చేస్తే, ఇరవై నాలుగు గంటలు తిరిగేలోగా ఒకరు బెయిల్, ఒకరు బెదిరింపు తెచ్చారన్నమాట. ఇక న్యాయం ఏం నిలబడుతుంది?    
    అప్పటికీ అతడు జాగ్రత్తగానే వున్నాడు. వీరదాస్ ని అరెస్ట్ చేసిన ఇరవై నాలుగ్గంటలలోపే మేజిస్ట్రేటు ముందు హాజరు పరచి, పధ్నాలుగు రోజులపాటు పోలీస్ స్టేషన్ లో వుంచటానికి అనుమతి తీసుకున్నాడు. చట్టరీత్యా అంతకన్నా ఎక్కువరోజులు సాధ్యంకాదు. వీరదాస్ ని వీలైనంత ఎక్కువకాలం రిమాండ్ లో వుంచాలని రాణా ప్రయత్నం అయితే దానికి ఇన్ని వైపుల్నించి ప్రతిఘటన ఎదుర్కోవలసి వస్తుందని అతడు వూహించలేదు.    
    నాయుడు అన్నాడు- "నాకు నీ నిర్ణయం ఏమిటన్నది వెంటనే తెలియాలి."    
    "లేకపోతే?"    
    "చెప్పానుగా అలక్ నందా సంగతి మరో అయిదు నిమిషాల్లో అక్కడ ప్రాణంపోతుంది-"    
    "నమ్మమంటారా?"    
    "నమ్మకపోతే మరో గంట ఆగు. పోస్ట్ మార్టమ్ చేద్దూగాని."    
    "మైగాడ్..." అంటూ కుర్చీలోంచి లేచి, "రాణా ప్రతాప్- రాణాప్రతాప్" అని అరిచాడు బిగ్గరగా.    
    "అదేమిటి నీ పేరు నువ్వే పిల్చుకుంటున్నావ్."    
    "ఓ....అది నా పేరు కదూ కంగార్లో మర్చిపోయాను తాళాలు....సెల్ తాళాలు ఎక్కడ? యస్సై ఏడీ? సెల్ తాళాలు తీసి వీరదాసుని వెంటనే వదలమని చెప్పు...!! ఎక్కువ టైమ్ లేదు" కంగారుగా అరవసాగాడు.    
    కుర్ర లాయరు ఉత్సాహంగా నాయుడి వైపు చూశాడు. 'అనవసరంగా 'లా' చదివాను. ఏ దాదానో, ఎమ్మెల్యేనో అయివుంటే బావుండేది కదా' అనుకుంటున్నట్టున్నాడు కాబోలు.    
    నాయుడు ఇచ్చిన గడువుకి ఇంకా నాలుగు నిమిషాలు టైముంది.    
    "ఆ డెత్ స్టేట్ మెంట్ ఇవ్వు" నాయుడు అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS