Previous Page Next Page 
మమత పేజి 22

"ఆంటీ- కుక్కపిల్ల ఏదీ..?" అన్నాడు.
బిక్కీ వరండాలో మూల నిద్రపోతోంది. ఆ గొంతు విని సుబ్బి బయటకొచ్చింది.
"ఇంద..!" అంటూ సుబ్బి చేతిలో పెట్టాడు.
అంత పెద్ద చాక్లెట్- సుబ్బి కళ్ళు ఆనందంతో వెలిగాయి. అమ్మగారు, అయ్యగారు ఏమంటారో...అని భయం వేసినా గబగబా తినేసింది సుబ్బి. సతీష్ సుబ్బివైపే చూస్తున్నాడు.
"కుక్కపిల్లకన్నా- మీ ఆంటీ పనిపిల్ల బాగుందిరా!" అన్నాడు మెల్లగా. ఇద్దరూ గట్టిగా నవ్వుకున్నారు.
సుబ్బి రెండు కప్పులతో టీ పట్టుకొచ్చింది.
"నువ్వూ తాగు" అన్నాడు సతీష్.
సుబ్బి అటుకేసి చూసి సైగ చేసింది- 'అయ్యగారున్నారు. కొడతారు' అన్నట్టు!
సుబ్బి చేతిలో బంతి లాక్కుంటూ ఆమె భుజాలమీద చేతులేసాడు సతీష్ కాసేపాగి ఆ సుబ్బి బుగ్గలు ముట్టుకుని "ఛీ... స్నానం చేయవా...ఎంతమట్టి!" అన్నాడు.
సుబ్బికి కోపం రావటం లేదు, తమాషాగా వుంది.
ఆ తర్వాత శంకరన్ వెళ్ళిపోయాడు సతీష్ టీవీ చూస్తూ కూచున్నాడు.
"మేము రేపు సినిమా కెడుతున్నాం, వస్తావా?" అన్నాడు.
"అమ్మో... మా అయ్యగారు పంపరు" అంది సుబ్బి పదకొండేళ్ళ సుబ్బి బుగ్గలు నునుపుగా వున్నాయి. చేతులు మెత్తగా వున్నాయి. కళ్ళు మెరుస్తున్నాయి.
"నా పక్కన కూచో! కింద కూచోటమేమిటీ..!" అంటూ ఆ సుబ్బి జబ్బ పట్టుకు లాగాడు సతీష్. గబగబా విదిలించుకుని పరిగెత్తింది సుబ్బి.
అంతలో చెన్నమ్మ లోపలకొచ్చి, "బాబూ, ఇంటికెళ్ళిపో! అల్లరిచేస్తే అయ్యగారు లేస్తారు" అంది.
"నేను అమ్మగార్ని అడిగే టీవీ చూస్తున్నాను. అయ్యగారు కూడా నన్నేమనరు" అన్నాడు కుర్చీలో కూచుంటూ సతీష్. చెన్నమ్మ కోపంగా వెళ్ళిపోయింది.
"ఆంటీ... హాలిడేస్ ఆంటీ! బోర్ - అందుకే నాలుగు రోజులు శంకరన్ తో గడపటానికికొచ్చా- మా అమ్మ కూడా వచ్చింది. కుక్కపిల్లతో కాసేపు ఆడుకుంటా" అన్నాడు ఆవులిస్తూ బయటకొచ్చిన జానకితో.
సతీష్ నాలుగ్గంటలకి ఇంటికెళ్ళాడు.
వెళ్ళిన పది నిముషాలకి ఫోన్ చేశాడు. ఇంట్లో ఎవరూ లేరు. సుబ్బి ఫోను తీసుకుంది.
"ఏం చేస్తున్నావ్..?"
"ఇప్పుడే కుక్కపిల్లకి పాలుపట్టా!"
"ఎవరూ లేరా..?"
"లేరు"
"నీకు మంచి పౌడరు తెచ్చి పెడతా, ముఖానికి రాసుకో."
"ఊ..." అంది సుబ్బి సిగ్గుపడుతూ.
"రేపు మేమంతా పార్టీ చేసుకుంటాం, వస్తావా?"
"బాబోయ్- అయ్య చంపేస్తాడు."
"నేనయ్యతో, ఆంటీతో చెప్తా సరే, సరే... ఇంక ఫోను పెట్టేయి."
"ఏదైనా చెప్పు-"
"ఏమో... నాకేం తెలియదు. ఉండు, నీకు చాక్లెట్ బాగుందా?"
"ఆ... సాయంత్రం రా! అయ్యగారు, అమ్మగారు రాత్రిదాకా రారు- పౌడరు తీసుకురా!"
సుబ్బి ఫోన్ పట్టుకుని సోఫాలో కూచుని కాళ్ళూపుతూ పదిహేను నిమిషాలు ఏదో మాట్లాడుతూనే వుంది సతీష్ తో..!
అంతే... వీపుమీద ఒక గుద్దు పడింది! ఒకదాని తర్వాత ఒకటి... సుబ్బి గొల్లుగొల్లున ఏడుస్తోంది.
"ఎంతసేపట్నుంచి మాట్లాడుతున్నావో తెలుసా?"
"- నేను ఫోను చేసిచేసి విసుగొచ్చి కారేసుకు ఇంటికొచ్చేసా! చెప్పు... ఎవరితో మాట్లాడుతున్నావ్?"
ఏడ్చి ఏడ్చి నేలమీద పడుకుని నిద్రపోయింది సుబ్బి.
మాధవరావు మనసంతా ఇదే ఆలోచన! అసలు... రాజీవ్ ఈ పిల్లని జానకికి అంటగట్టటంలో అర్ధం ఏమిటీ?! నా ఐశ్వర్యానికి వారసురాలిగా చేయాలనా? ఈ దరిద్రపు పిల్లని నా కూతురిగా పెంచి విద్యాబుద్దులు నేర్పించి, పెళ్ళి చేయాలనా? ఆ తర్వాత ఏదో వంకతో నా ఆస్తి కాజేయాలనా? మరెందుకు- ఎందుకు చెల్లెలి దగ్గర్నుంచి తీసి జానకికి అప్పగించాడు? ఇంక ఆలోచన లేక ఆ పిచ్చి జానకి దీన్ని పిల్లలా పెంచుకుందిట. స్కూల్లో వేస్తుందిట! ఇంకా నయం- నన్ను 'నాన్నా...' అని, దాన్ని 'అమ్మా...' అని పిలిపిస్తానంది ముందు! అలా అయితే నువ్వూ, అదీ కూడా బయటకెళ్ళండన్నా- లేకపోతే, ఛీ!" మాధవరావు కళ్ళు కోపంతో మండిపోయాయి.
"లే... కుక్కకి పాలు పొయ్యి!" అన్నాడు పడుకున్న సుబ్బిని కాలితో తనని.
"ఎందుకయ్యా, పాపం- పడుకుందిగా! నేను పోస్తా- కుక్కకి పాలు!" అంది చెన్నమ్మ.
"ఎవరు చేసే పనులు వాళ్ళే చెయ్యాలి - లే - మళ్ళీ ఓ తన్ను తన్ని లోపలకెళ్ళాడు మాధవరావు.
'తెల్లారితే వస్తాడు రాజీవ్!' అనే భావమే జానకికి భయాన్ని కలిగిస్తోంది. ఇలాటి పరిస్థితుల్లో ఉపాయం చెప్పగలవాడు తన భర్తే అనే నమ్మకం ఉంది జానకికి.
"ఏం చేద్దామంటారూ, పోనీ- ఏదో వంక చెప్పి రావద్దని ఫోన్ చేద్దామా!" అంది.
"ఈపాటికి బయల్దేరే వుంటాడు. అయినా - నేను చెప్తాగా... అన్నీ!" అంటూ గదిలోకి నడిచాడు.
అప్పుడే బజారు నుంచి కొనితెచ్చిన వస్తువులు బైటకి తీసాడు. "శ్రద్దగా విను, రాజీవ్ వచ్చే సమయానికి సుబ్బికి ఈ గౌను వెయ్యి... నీ ముత్యాలగొలుసు వెయ్యి. ఈ పూలపూల చెప్పులు వేసుకోమని- అతనున్నంతసేపూ ఆ పిల్ల మన పిల్లే! కోటీశ్వరుల గారాల బిడ్డ! -అలాగే చూడాలి" అన్నాడు.
"ఎలాగండీ..?!" జానకికి అది సాధ్యం కాదనిపించింది. కానీ, మాధవరావు చాలా ధైర్యంగా వున్నాడు.
"సుబ్బీ, ఇటురా-"
మళ్ళీ కొడతాడనే భయంతో బిక్కుబిక్కుమంటూ వచ్చి ఓ మూల నిలబడింది సుబ్బి.
"రేపు ఒకాయనొస్తాడు- ఆయన ఉన్నంతసేపు నీవు నన్ను 'డాడీ' అనాలి. అమ్మగార్ని 'మమ్మీ' అనాలి-తెలిసిందా? ఈ గౌను వేసుకోవాలి- నేల ఊడవకూడదు-మాతోబాటు సోఫాలో కూచోవాలి... తెలిసిందా?"
"ఏమీ తెలియలేదు సుబ్బికి! కానీ, అలా చేయటం అంటే సరదాగా అనిపించింది. శంకరన్ ఎప్పుడు మాట్లాడినా 'మమ్మీ, డాడీ' అనే మాటలు వాడతాడు. రేపు మంచి గౌను వేసుకోవచ్చు.
"ఇదిగో... అన్నీ గుర్తు పెట్టుకో!" మాధవరావు ఆజ్ఞలాగే చెప్పాడు.
"ఇటు రా!"
- సుబ్బి భయంగా వచ్చి నిలబడింది.
"రాజీవ్ తోనేనా అంతసేపు మాట్లాడింది?"
"నాకు తెలియదండీ....వారెవరో!"
"ఏమిటీ... అంతసేపు మాట్లాడి నీకు తెలియదా ఎవరో?!" మాధవరావు గర్జించాడు.
"చూడు జానీ, పది నిముహాలు పైగా ఫోనులో మాటలు- సోఫాలో పడుకుని తీరిగ్గా కబుర్లు చెప్పి, నాకు తెలియదంటుందేమిటీ?!" అన్నాడు.
జానకికి అర్ధమయింది- రాజీవ్ ఫోను చేసి వుంటాడు. ఎవరికీ చెప్పవద్దని వుంటాడు. అందుకే భయపడుతోంది అనుకుంది.
"నిజం చెప్పు..?" మాధవరావు సుబ్బి చెంప మీద కొట్టాడు.
"నాకు తెలియదు" అంది ఏడుస్తూ.
జానకికి కూడా అర్ధంకాలేదు- "ఎందుకు నిజం చెప్పదూ?! నిజంగా సుబ్బికి ఫోను చేసినవాని పేరు తెలియదు??- కానీ, అపార్ధాల కూడలిలో ఒకటి ఒకటి ఎదురుబొదురయ్యాయి.
"చెప్పు, నిజం చెప్పు, ఇంకా ఏం చెప్పాడు ఆ రాజీవ్?" మాధవరావు వెర్రి కోపంతో బెల్టు పెట్టి వీపుమీద బాదేశాడు.
సుబ్బి వెక్కివెక్కి ఏడ్చింది. జానకి అతని చేతిలో బెల్టు లాక్కుంది.
"ఏమిటిదీ.... గొడ్డును బాదినట్లు!" అంది అరుస్తూ.
బెల్టు నేలమీద విసిరి లోపలకెళ్ళాడు మాధవరావు.
"చెన్నమ్మా... ఇలా రా! కాస్త వేన్నీళ్ళ కాపు పెట్టు- వాపు తగ్గుతుంది!" అంది జానకి ఎంతో బాధగా.
'ఎవరు చేసారు ఫోనూ, ఎవరితో మాట్లాడింది సుబ్బి?' - జానకి ఎంత ఆలోచించినా అర్ధంకాలేదు.
"చెన్నమ్మా... పిలిచింది జానకి.
సుబ్బి నిద్రపోయింది.
"నేను లేనప్పుడు ఇంటికెవరయినా వచ్చారా?" అంది నెమ్మదిగా జానకి.
"ఆ బాబండీ- కుక్క బాబండీ!"
"ఏమిటీ- నీ మొఖం! కుక్కని తెచ్చిన బాబు అను- ఎప్పుడొచ్చాడూ..?" అంది మళ్ళీ.
"ఆ బాబు కుక్కతో కాసేపు ఆదుకుని వెళ్ళిపోయాడండి. ఆ బాబుతో మరో బాబు కూడా వచ్చాడండి. ఆయన సినిమా చూస్తూ కూచున్నాడండి, అంతే!" అంది.
"నేను లేనప్పుడు ఫోనులొస్తే నువ్వే తియ్యి, సుబ్బిని తీయనీకు!" అంది జానకి.
"అలాగేనమ్మా..!" చెన్నమ్మ వంటింట్లోకెళ్ళింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS