"విధివ్రాత!"
వాళ్ళు చిన్న గొంతుకతో మాట్లాడుకొంటున్నా ఆ మాటలు సంధ్య చెవిలో పడుతూనే ఉన్నాయి.
బాధపడటం తప్ప ఇంకేమీ చేయలేని నిస్సహాయత.
పెళ్ళి అయిదురోజుల్లోకి వచ్చేసింది.
ఆ రోజు,
అప్పడాలు, వడియాలు బయట మంచాలమీద ఎండబెట్టి, కుక్కలు ముట్టుకుపోకుండా సంధ్యని ఉండమంది నర్సమ్మగారు.
నల్లటి కారు ఒకటి టౌన్ వైపు నుండి దూసుకువచ్చి ప్రక్కింటి ముందు ఆగింది. అందులోంచి సూటుబూటులో ఉన్న యువకుడు ఆ ఇంటి గుమ్మం ముందుకు వెళ్ళి ఏదో అడుగుతున్నాడు. కారులోంచి మరో ఇద్దరు దిగారు. సంధ్య గుండెలు దడదడలాడాయి.
అతడు అరుణ్ కాదుకదా? తమ ఇల్లు మూసి ఉండడంచూసి తమ గురించి అడుగుతున్నాడా?
అయిదు నిమిషాల తరువాత దిగిన వాళ్ళందరూ ఎక్కారు. గుడి ముందుకు వెళ్ళి కారు రివర్స్ అయి వచ్చినంత వేగంగా టౌన్ వైపు వెళ్ళిపోయింది, ఎర్రటి దుమ్ములేపుతూ.
సంధ్యం హృదయంలో చెప్పలేనంత నిస్పృహ ఆవరించుకొంది.
ఆ యువకుడు అరుణ్ అయితే ఎంత బాగుండును? నిజంగా ఆ వచ్చింది అరుణే అయితే?
"చిన్నప్పుడే నువ్వు నాకు వాగ్దత్తమయ్యావు! ఇంకెవరినో ఎలా పెళ్ళిచేసుకొంటావు?" అంటూ, ఈ పెళ్ళి నుండి తనని తప్పించి తీసుకువెడితే ఎంత బాగుండును.
ప్చ్! ఓ చెంప పెళ్ళి అయిపోతుంటే ఇంకా అరుణ్ అరుణ్ అనుకోవడం ఎంత వెర్రి?
తరువాత తెలిసింది సంధ్యకు, కారులో ఇందాకా వచ్చినవాళ్ళు దేవస్థానానికి సంబంధించిన వాళ్ళని, వారంరోజుల క్రితం గుడిలో మాయమైన విగ్రహాల గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చారని!
* * *
సంధ్య గతస్మృతులనుండి బయటపడుతూ ఒక నిట్టూర్పు విడిచింది. జానకి అత్తే మారిపోకుండా ఉంటే తనకీ దురవస్థ ప్రాప్తించేది కాదుకదా అనుకొంది. అదే మాట శ్యామలతోనూ అంది.
"కొంచెం ముందుగా నీ కథ తెలిసి ఉంటే ఎంత బాగుండును? ఆ అరుణ్ ఎక్కడున్నా మెడపట్టి లాక్కువచ్చి నీ ముందు పడేసేదాన్ని తెలుసా? మీ జానకి అత్త ఎంత దుర్మార్గురాలు! ఇక్కడ ఉన్నప్పుడు మీ అమ్మతో అంత చాకిరీ చేయించుకొని, తన కొడుక్కి నిన్ను పేరు పెట్టుకొని, ఈ ఊరి నుండి వెళ్ళాక ఒక్కసారైనా ఇటు తిరిగి చూడలేదంటే ఏమనాలి ఆమెను? ప్రపంచంలో ఇంత విశ్వాసహీనులుంటారన్నమాట!" అంది శ్యామల, కొంచెం ఆవేశంగా.
*నా దురదృష్టం ఇలా ఉంటే ఎవరినో ఎందుకు నిందించాలి అనుకొంటాను!" విరక్తిగా అంది సంధ్య.
* * *
ప్రతిమతో గుడిచుట్టూ ప్రదక్షిణాలు ముగించి, గంట మ్రోగించి నమస్కారం చేసి వచ్చి కట్టమీద కూర్చున్నాడు అరుణ్.
"బాబూ ధర్మం!"
చేయిచాచి తన ముందు నిలబడిన పిల్లను రెప్పకొట్టకుండా చూడసాగాడు అరుణ్.
ఆ పిల్ల వయసు ఏ అయిదారేళ్ళో ఉంటుంది. బాగా చిరిగిపోయి మాసిపోయిన లంగా వేసుకొంది. దానికి తగిన జాకెట్ వేసుకొంది. ఇక ఆ పిల్ల రూపం గురించి చెప్పాలంటే మురికిపట్టిన రత్నం అనిచెప్పొచ్చు! పచ్చటి రంగు. చంద్రబింబం అని చెప్పేట్టుగా ఉన్న ముఖం.
"ఏం? ఆ పిల్లని బరా బరా లాక్కుపోయి ఏ కొళాయి క్రిందో ఉంచి రుద్దెయ్యాలనిపిస్తూందా?" ప్రతిమ నవ్వుతూ అడిగింది, అరుణ్ అదే పనిగా ఆ పిల్లని చూడడం చూసి.
"కాదు! అచ్చం నా స్నేహితురాలిలా ఉందా అమ్మాయి!"
"హతోస్మి! నీ బాల్యస్నేహితురాలిని ఈ బిచ్చపు పిల్లకి పోలిక తెచ్చావేమిటి?"
