Previous Page Next Page 
చదువు పేజి 22

   

    ఈ హెడ్మాస్టరు కిందటేడే వచ్చాడు. అంతకు పూర్వం ఉండిన హెడ్మాస్టరు పిల్లల్ని భయపెట్టటంలో చాలా అఖండుడు. ఆయన ఎవరినీ సాధారణంగా కొట్టేవాడుకాడట. అయినా ఎందుకో ఆయనకంటే పిల్లలకు సింహ స్వప్నంగా ఉండేది. ఒక్క పిల్లలేగాక ఎంతటివాళ్ళయినాసరే ఆయన దగ్గరికి వచ్చేసరికల్లా పిల్లులయేవాళ్ళని కొత్త హెడ్మాస్టరు విన్నాడు. అటువంటివాడి తరువాత ఆ పనిలోకి రావటం ఆయనకు పెద్ద చిక్క యింది. అందుచేత ఈ హెడ్మాస్టరు స్వతహాగా మంచివాడై ఉండికూడా లేని కాఠిన్యం తెచ్చిపెట్టుకున్నాడు. అయినప్పటికీ ఆయనకు కావలసిన ఫలితాలు రావటంలేదు.

    అదివరకు కుక్కిన పేనుల్లాగా ఉండిన ఫిప్తుఫారం, స్కూలు ఫైనలు విధ్యార్ధులలో రౌడీజట్టువాళ్ళు ఈ హెడ్మాస్టరుమీద తిరగబడే ధోరణీ చూపించారు. అది తన తప్పుకాదనీ, అంకుశం తీసి తరువాత ఏనుగ కొంతదూరం పరుగెత్తి తీరుతుందనీ ఆయన గ్రహించక, హెడ్మాస్టరు రౌడీపిల్లకాయల్ని శిక్షించటానికి పూనుకున్నాడు.
   
                                                                             

    హైస్కూల్లో ప్రవేశించిన మొదటి నెలలో క్లాసులో సుందరంది ఇరవై ఎనిమిదో "ప్లేసు" కృష్ణమూర్తిది తొమ్మిదో ప్లేసు. తెలివిగలవాళ్ళు ఎక్కువ స్థానాల్లో ఉంటారనీ, తెలివి తక్కువవాళ్ళు తక్కువ స్థానాల్లో ఉంటారనీ సుందరానికి తెలుసు గాని, హరిఓం అంటూనే తన తెలివి తేటలకూ, కృష్ణమూర్తి తెలివితేటలకూ ఇంత వ్యత్యాసం ఎట్లా వచ్చిందో సుందరం ఊహించలేకపోయాడు. అటెండెన్సు రిజిస్టరులో పేర్లు అక్షర క్రమాన్నిబట్టి రాస్తారని వాడికి తెలీదు. ఆ సంగతి వాడి కెవరూ చెప్పలేదు.

    తన కేదో గొప్ప అన్యాయం జరిగినట్టు సుందరం ఈ విషయం తల్లితోకూడా చెప్పుకున్నాడు. కాని ఆవిడకూ నిజం తెలియకపోవటంచేత,  లోపల నొచ్చుకుని కూడా, పైకి "నే చెప్పలా! వాడు తెలివిగలవాడే. నువ్వుకూడా బాగా చదివితే పైకిరావచ్చు" అన్నదావిడ.

    కాని ఈ చదవటందగ్గరకూడా సుందరానికి కృష్ణమూర్తి పక్కలో బల్లెం అయినాడు. వాడు సాయంకాలం దీపం పెట్టగానే కూర్చుని పైకి చదవటం ప్రారంభించేవాడు. అట్లా అన్నంతినేదాకా చేదివేవాడు. అన్నం తిన్న తరువాత పడుకుని నిద్రపొయ్యేవాడు. సుందరానికి పైకి చదవటం అసహ్యం. వాదు చదువుతున్నప్పుడు లోపలే చదువుకునేవాడు. సుందరాని కింకో దురభ్యాసంకూడా ఉంది. వాడు కృష్ణమూర్తిలాగా గిరిగీసినట్టు, క్లాసులో చెప్పినంత వరకే చదవక పుస్తకంతీసి తనకు చదవబుద్ది పుట్టినదల్లా చదివేవాడు. పాఠాలు ప్రారంభించి నెల తిరగకముందే  తెలుగు పుస్తకాలన్నీ చదివేశాడు. ఇంగ్లీషు పుస్తకంతో చిక్కొచ్చేది. ఇంగ్లీషు పాఠంలో తనకు తెలియనిమాట వచ్చేసరికి వాడికి గొంతుకేదో అడ్డంపడ్డట్టుగా ఉండేది. క్లాసు పుస్తకాలనేకాదు, ఏ ఇంగ్లీషు అచ్చుకనిపించినా చదవటానికి చదవటానికి ప్రయత్నించేవాడు. అందులో తనకు తెలిసినమాటలు చాలాఉంటే సంతోషించేవాడు. కొద్దిగానేవుంటే "ఇంత ఇంగ్లీషు నా కెప్పటికి వస్తుంది?" అని లోపల దిగులుపడేవాడు.

       "బుద్దిమంతుడు" లాగా కృష్ణమూర్తి క్లాసులో మేష్టరు చెప్పిన పాఠమే రెండు మూడుసార్లు చదవటం వినిపిస్తుంటే సుందరానికి పట్టరాని కోపంవచ్చేది.

    తెలుగులోగాని ఇంగ్లీషులోగాని పద్యాలు కంఠతాపట్టవలసి వచ్చినరోజు కృష్ణమూర్తి చిన్న యజ్ఞం చేసినంతపని చేసేవాడు. గొంతు హెచ్చించేవాడు, ఇరవై, ముఫైసార్లు చదివేవాడు. కృష్ణమూర్తి చదువుతూంటే సుందరం తడిక ఇవతల నుంచి ఆలకిస్తూ కూర్చునేవాడు. పద్యం  కంఠస్థంచేసే ఆఖరుదశలో కృష్ణమూర్తి పుస్తకాన్ని ఒళ్లో బోర్లాపెట్టుకుని వచ్చినంత వరకు కళ్ళుమూసుకుని ఏకరుపుపెడుతూ, "బ్రేక్" పడ్డచోట మళ్ళా పుస్తకంతీసి చూసి, మళ్ళా కళ్ళు మూసుకుని చదువు తూండే సమయానికి సుందరానికి పద్యం పూర్తిగా వచ్చిఉండేది. తరువాత మర్నాడు క్లాసులో పద్యం వప్పగించవలసి వచ్చినపుడు సుందరం, ప్రాంప్టింగ్ ఒక చెవితోవింటూ నటించే నటుడులాగా, కృష్ణమూర్తి కంఠస్వరాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ పద్యమంతా తడువుకోకుండా ఏకరుపు పెట్టేవాడు. ఇంకా ఒక్కొక్కసారి కృష్ణమూర్తే మధ్యలో పట్టుబడి మేష్టరో, పక్కపిల్లవాడో అందించే దాకా ముందుకు కదలలేకపొయ్యేవాడు!

    నెల ఆఖరై కొత్తరిజిస్టరు ఆరంభయేసరికి సుందరానికి జరగదగిన న్యాయం జరిగింది. వాడు అయిదో "ప్లేసు"కు వచ్చేశాడు.  కృష్ణమూర్తి ఒక్క ప్లేసు పైకి వచ్చి ఎనిమిదోవాడైనాడు.

    సుందరం ఆనందానికి మేరలేదు. "ఇప్పుడేమంటావు?" అని కృష్ణమూర్తి తో అనటానికి అవకాశం ఉంటే బాగుండు ననిపించింది సుందరానికి. కాని క్రిష్ణమూర్తి అటువంటి అవకాశం ఇవ్వనేలేదు. వాడు మొదటినుంచీ చాల "పెద్దమనిషి" తరహాగా ఉన్నాడు.

    క్రిందటి నెల ఎవరన్నా కృష్ణమూర్తిని, 'క్లాసులో నీ దెన్నోప్లేసురా ?" అని అడిగితే, నాది తొమ్మిదోప్లేసు" అని చెప్పేవాడు. "ఈ అబ్బాయిదో?" అని సుందరాన్ని గురించి అడిగితే, అతని దెంతయితే ఏంలే!" అని త్రోసి పుచ్చాటానికి ప్రయత్నించేవాడు. అట్లా అనటంలో కృష్ణమూర్తి తనది చాలా తక్కువ ప్లేసని వాళ్ళకి తెలియజేస్తున్నాడని సుందరానికి ఎట్లాగో తెలుసు.

    కొత్తనెల ఆరంభమయిన తరువాత కృష్ణమూర్తి కొత్తపద్దతి అవలంబించాడు. తనది ఎనిమిదోప్లేసని చెప్పేవాళ్ళతో తన పక్కనున్న సుందరానిది అయిదోప్లేసని విధిగా చెప్పేవాడు. వాడు లోపల "ఏడుచు" కుంటున్నాడని కూడా సుందరానికి ఎట్లాగో తెలుసు. కాని ఏమిటి చెయ్యటం?

    అయితే సుందరానికి మొదటినుంచీ తెలియని విషయం కృష్ణమూర్తికి తెలుసు. మొదటినెల ప్లేసులు పేర్ల మొదటి అక్షరాలనుబట్టి వచ్చినవని!
   
                                       *    *    *    *
   
    స్వదే-శమా_ తనీ_ పదా_ రవిం_ దముల్_ సదా_ మదిన్_ భజిం_ చెదన్_ ముదం_ బుగూ_ర్పుమా"___
      
    ఈ పాట ఆరోజు ఉదయం నుంచీ సుందరం తలకాయలో మారు మ్రోగుతూనే ఉన్నది. అప్రయత్నంగా ఎన్నిసార్లో నోటంటకూడా వచ్చేసింది. రోడ్డుమీద నడిచేటప్పుడుకూడా సుందరం ఆ పాటకు దరువు వేస్తూనే నడిచాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS