సుందరం కాస్త ఆలోచించి, "నేనుకూడా సిల్కుచొక్కాలు తొడుక్కుని, ముచ్చటముడీ, జులపాలూ పెట్టుకుంటే అందరూ మంచివాణ్ణనే అనుకుంటారు," అన్నాడు.
"ఛీ, వెధవా! వాళ్ళు వింటే ఏమనుకుంటారు?" అని తల్లి కోప్పడింది, కాని కొడుకు చురుకుదనానికి సంతోషం ఆగక పైకి నవ్వేసింది.
* * * *
తండ్రిపోయిన ఈ మూడునెలల కాలంలో సుందరంలో కలిగినమార్పు చూసి సీతమ్మగారు ఎందుకో జాలిపడేది. "చిన్నవెధవ, ఈడుకుమించి పెద్దవాడవుతున్నాడు," అని ఆవిడ అనుకునేది. ఇది కేవలం పరిస్థితులవల్ల కలిగిన మార్పు.
సుందరం పొద్దునలేచి మొహంకడుక్కుని చద్దన్నం తిన్నదిమొదలు తల్లివెంటే ఉండి ఆవిడకి అన్నిపనుల్లోనూ సహాయం చేస్తాడు. ముఖ్యంగా చంటిపిల్లకు ఉగ్గుపోస్తున్నా, పాలిస్తున్నా, నీళ్ళు పోస్తున్నా వాడు దగ్గర ఉండితీరాలసిందే. చెల్లెలంటే వాడికి అపరమితమైన ఆపేక్ష. అది ఏం చేసినా వాడికి వింతగానే ఉండేది. "అమ్మా చెల్లెలు నన్ను చూసి నవ్వుతున్నది... నా మొహంమీద చెయ్యి పెట్టుతున్నది.... ఆ _అని పాడుతున్నది,." అని సంతోషంతో పొలికేకలు పెట్టేవాడు.
ఇంటి కెవరన్నావస్తే సీతమ్మగారు చప్పున అవతలకి తప్పుకునేది. వాళ్ళను పలకరించి పరామర్శించటం సుందరం మెల్లిమెల్లిగా నేర్చుకుంటున్నాడు. వాడు కోమటికొట్టుకుపోయి చిల్లర వెచ్చాలు తీసుకురావటం నేర్చుకుంటున్నాడు. ముఖ్యమైన సామాన్లు పెద్దమొత్తాలలో శేషగిరి ఏర్పాటు చేసి మరీ వెళ్ళాడు.
సొంతయింటికి తిరిగి వచ్చినతరువాత సుందరం ఆటలు మళ్ళాతగ్గాయి. వాడు పొద్దూకిరావటానికి తల్లి ఒప్పుకోలేదు. సావాసం కావాలంటే ఇంటో రామ్మూర్తీ, కృష్ణమూర్తి ఉన్నారు కదా అని కొంత, పక్కనున్న ఆదినారాయణ గారి పిల్లలు "బుద్దిమంతనంగా" ఏ ఆటలకూ పోకుండావుంటే తన కొడుకు బడి విడవగానే నేరుగా ఇంటికిరాక ఆటలకు పోవడమెందుకని కొంతా, వాదు లేకపోతే ఇళ్ళు బిక్కు బిక్కు మంటుందన్న భావం కొంతా చేరి సీతమ్మగారు కొడుకు ఆటలు మానిపించింది. సుందరం ఎక్కువ అభ్యంతరం చెప్పలేదు. ఇప్పటికీ వాడికి తల్లి చేసే ఇంటి పనులు చూస్తూ కూచోవటం పరమానందమే.
రేపో ఎల్లుండో సుందరమూ, కృష్ణమూర్తి కూడా బడిలో చేరుతారనగా ఆదినారాయణగారు ఇద్దరినీ కలసి పరీక్ష చేశాడు. పరీక్ష అయిపోయిన తరువాత ఆయనేమీ అనలేదుగాని కృష్ణమూర్తి కన్న తనకే చదువు బాగా వచ్చునని సుందరం సులభంగా అర్డంచేసుకున్నాడు.
ఆదినారాయణ అననిమాట హైస్కూలు మూడోక్లాసు మేష్టరన్నాడు. ఆదినారాయణగారే ఇద్దర్నీ స్కూలుకు తీసుకువెళ్ళాడు. చేర్పించటానికి. మేష్టరు ఇద్దరికీ లెక్కలిచ్చాడు. కృష్ణమూర్తి నిజంగా మొద్దుకాకపోయినా కంగారువల్ల మొద్దల్లే కనిపించాడు. తెలుగు చదవటంలో కూడా సుందరం కంటె ఎక్కువగా తడువుకున్నాడు. నిజానికి సుందరం ఏమీ తడువుకోలేదు. ఇంగ్లీషులో ఇద్దరూ దాదాపు ఒక స్టాండర్డులోనే ఉన్నారు.
"ఈ అబ్బాయికి కాస్త ఇంగ్లీషు వచ్చిఉంటే నాలుగో క్లాసులో వేయించి ఉందును. ఇప్పటికైనా మించిపోలేదు. ట్యూషను చెప్పిస్తే_" అన్నాడు మేష్టరు.
ఆదినారాయణ రానినవ్వు తెచ్చుకుని, "ఆ పిల్లవాడికి ఈడుచాలదు లెండి" అన్నాడు.
ఇద్దరూ మూడో క్లాసులో చేరారు. కాని కృష్ణమూర్తి బీసెక్షనులో పడ్డాడు. సుందరాన్ని పరీక్షించి న మేష్టరు తన సెక్షనులోనే ఉంచుకున్నాడు_ స్వార్దంకొద్దీ.
వీధిబడికీ హైస్కూలుకూ ఏమీ సంబందం లేదనిపించింది సుందరానికి. ఈ హైస్కూల్లో ఎన్నో క్లాసులు. ఒక్కొక్క క్లాసుకూ నాలుగేసి డివిజనులు. ఏ డివిజను కాక్లాసు మేష్టరు. ఇంకా ఇతర మేష్టర్లుంటారు. మూడో క్లాసుకు ఒక్క డ్రాయింగు మేష్టరు మాత్రమె కొత్తగా వస్తాడు. కాని రామూర్తి క్లాసుకు లెక్కలమేష్టరు వేరు. తెలుగు మేష్టరు వేరు, హిస్టరీ మేష్టరూ, జాగ్రఫీ మేష్టరూ, డ్రాయింగుమేష్టరూ వేరువేరు. పొద్దున సరిగా పదికి గంటకొట్టి క్లాసులు ప్రారంభిస్తారు. ప్రతిపీరియడుకూ రెండేసి బెల్లులు కొడతారు. పీరియడుమారగానే పాఠాలు మారతాయి. టైమ్ టేబుల్ ప్రకారం పాఠాలు చెబుతారు.
మేష్టరు క్లాసులోకి రాగానే పిల్లలంతా లేచినిలబడతారు.మొట్ట మొదటి పిరియడు ప్రార్ధనతో ఆరంభమవుతుంది. తరువాత అటెండెన్సు. స్కూలు బయట వీధిలో మేష్టరు కనబడినా పిల్లలు నమస్కారాలు చెయ్యాలి.
స్కూలుకంతకూ హెడ్మాస్టరుంటాడు. ఆయన వస్తుంటే మేష్టర్లుపిల్లలూకూడా ఎంతో భయంగా ఉంటారు.
"వెధవ వీధిబడి! ఒకటేకొట్టటం. ఇక ఈ హైస్కూల్లో అటువంటి వేమీవుండవు. హైస్కూల్లో ప్రవేశించటం ఎంత అదృష్టం" అనుకున్నాడు. సుందరం చదువుమీద సుందరానికున్న ఆదరాన్ని హైస్కూలు వాతావరణం రెట్టింపుచేసింది. కాని ఈ అభిప్రాయం ఇంకా ఏర్పడుతుండగానే సుందరం వీధిబడిని మరిపించే దృశ్యం చూశాడు. హెడ్మాష్టరు తనగదిలో ఒక విద్యార్దిని పేముబెత్తంతో కొడుతూ ఉండటం సుందరం కంటబడింది. హెడ్మాస్టరు పొట్టి వాడైనా మంచి వర్చస్వీ, స్పురద్రూపీ. ఆయన తల పాగాదగ్గర్నుంచి కాలికి తొడిగిన చెప్పులవరకూ ఎంతో నాజూకు గానూ, సరికొత్తగానూ, గౌరవనీయంగానూ ఉండేవి. ఆయన బెత్తంతీసుకుని ఎవర్ని గాని కొడతాడని ఎవరూ అనుకోరు. ఆయన చేత తన్నులుతినే విద్యార్ది హెడ్మాస్టరు కెదురుగా నిలబడి కనబడగా హెడ్మాస్టరు పేంబేత్తంతోనే చేతిని కొద్దిగా పైకెత్తి విసురుగా అరిచేతిమీదకొట్టాడు. విద్యార్ది నోట ఏ శబ్దమూ రాలేదు. దెబ్బకు వాడి శరీరమంతా కొద్దిగా బిగుసుకున్నట్టు కనబడింది. హెడ్మాస్టరు విద్యార్ది కుడిచేతిమీద మూడుదెబ్బలూ, ఎడంచేతిమీద మూడుదెబ్బలూ వేసి, "గోః" అన్నాడు.
దెబ్బల బాధ అటుంచి, అంత గొప్పవాడిచేత దెబ్బలు తినటంలో చాలా అవమానం ఉంటుందని సుందరం ఊహించాడు. హెడ్మాస్టరుపైన సుందరానికి గౌరవభావంతో బాటు భయం కూడా కలిగింది.
