Previous Page Next Page 
అందరూ దొంగలే పేజి 21

    రాంబాబు, చిన్నారావ్ లు  ఇబ్బందిగా  నవ్వారు. రాంబాబు, చిన్నారావ్ లు ఇద్దరూ సంతోషంగా కేకైతే  పెట్టారుగానీ....ఇద్దరి మనసులో ఓ సందేహం ఒకేసారి కలిగింది.

    ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూస్కున్నారు. "ఇంతకీ నీ సంతోషానికి  కారణం?" భయం భయంగా  చిన్నారావ్ వంక  చూస్తూ అడిగాడు  రాంబాబు.

    "అదే ప్రశ్న  నిన్ను  అడగాలని  అనుకుంటున్నా  "అన్నాడు చిన్నారావ్.

    "నా సంగతి తర్వాత....ముందు నీ  సంగతి చెప్పు....నువ్వెవరికి  లైన్ వేస్తున్నావ్?" అడిగాడు రాంబాబు.

    "నేనా....నేనూ....నేనూ....నేనూ...." సందేహిస్తూ  అన్నాడు చిన్నారావ్.

    "నీ  నాన్చుడు  బేరం  మండా....త్వరగా  చెప్పు  సస్పెన్స్ తో చస్తున్నా" అరిచాడు రాంబాబు.

    "నేను  సునీతకి  లైనేస్తున్నా!" భయం భయంగా రాంబాబు వంక చూస్తూ చెప్పాడు చిన్నారావ్.

    రాంబాబు మొహంలో  టెన్షన్ మొత్తం  పోయింది.

    "వెరీగుడ్....అయితే మనమధ్య  కాంపిటీషనేమీ  లేదన్నమాట....నేను  సరోజకి లైనేస్తున్నా!" సంతోషంగా అన్నాడు రాంబాబు.

    మళ్ళీ  ఇద్దరూ సంతోషంతో కెవ్వుమని అరిచారు.

    మరోసారి  ఇందాకటి  పేషంట్  చేతిలోని  రెండో బత్తాయిపండు  కూడా జారి నేలమీద  పడిపోయింది. ఇంకో  పేషంట్ మళ్ళీ  మందు తాగుతూ పొలమారాడు. హార్ట్ పేషంట్  ఈసారి  గట్టిగా మూలిశాడు  బాధగా.



                                  *    *    *    *


    రాత్రి పదిగంటలైంది....ఇన్స్ పెక్టర్   అప్పారావ్  ఇల్లు....బెడ్ రూం....అప్పారావ్ మంచంమీద కూర్చుని గజగజ  వణుకుతున్నాడు.

    అప్పారావ్  అలా  వణుకుతున్నాడంటే   అతనికి  చీకటంటే లేదా రాత్రంటే భయమని కాదు. మరి? అతని ఎదురుగా వున్న ఆకారాన్ని చూసి అతను వణికిపోతున్నాడు. అతని ఎదురుగా వున్నది ఎవరు? బ్రహ్మరాక్షసా....కాదు.

    అతను ఏరికోరి చేస్కున్న  అతని  రెండో భార్య మదన మనోహరి  తెల్ల చీర  కట్టుకుని, తలనిండా  మల్లెపూలు పెట్టుకుని, చేతిలో పాలగ్లాసుతో నిల్చుని వుంది.

    ఆమెతో జరపబోయే   శృంగారాన్ని  తలుచుకునే ఇన్స్ పెక్టర్  అప్పారావ్ విపరీతంగా  వణికిపోతున్నాడు. అంతకుమించి కృంగిపోతున్నాడు. మదన మనోహరి అతన్ని సమీపించింది.

     "ప్లీజ్....మదనా....వద్దే....ప్లీజ్...." అన్నాడు మంచంమీద  వెనక్కి  జరుగుతూ.

    "ఓక్కే....మీకు  వద్దపోతే  నేనే తాగుతా!" మదన మనోహరి పాలని గటగటా తాగేసి గ్లాసుని గది మూలకి విసిరేసింది.    "నేను వద్దన్నది పాలని కాదే బాబూ! ఏంటో నాకీవేళ  నడ్డి పీకుడుగా వుంది....హిహిహి...." బలవంతంగా  నవ్వుతూ అన్నాడు ఇన్స్ పెక్టర్  అప్పారావ్.

    "నోర్ముయ్యండి....నడ్డిపీకుడూ  లేదూ  పాడూ  లేదు....మన మ్యారేజ్ డేని సెలబ్రేట్ చేస్కోఫోతే ఎలా? ఇది చేతకాదంటే  పోనీ ఆ గజదొంగ మంగులుగాడ్ని  పట్టుకోగలిగారా? అబ్బే అదేం లేదు....వాడిచేత మొహం బద్దలు  కొట్టించుకున్నారు....మీకంటే  ఆ రాంబాబు, చిన్నారావ్ లే నయం....ఊ....రండి...." అంది విసుగ్గా.

    "అమ్మో వద్దు మదనా" భయంగా  అన్నాడు  అప్పారావ్.

    "రా ఎహె!" అంటూ  అప్పారావ్ ని  రెండు భుజాలు పట్టి వెనక్కి తోసింది.


                                                                   *    *    *    *


    గజదొంగ  మంగులు  డెన్....మంగులు  హాల్లో  నిటారుగా నిల్చున్నాడు. కాస్త దూరంలో డజనుమంది దొంగలు నిలబడి వున్నారు.

    "బాస్....ఏంటి బాస్ మీరిలా  అయిపోయారు?" ఆందోళనగా  అడిగాడు ఒక దొంగ. "ఏం....ఏమైందీ?" అంతకంటే కంగారుగా అడిగాడు గజదొంగ మంగులు.

    "ఎప్పుడూ  దిక్కుతోచనివాడిలా  పచార్లు చేసే మీరేంటి  అలా కుదురుగా నిలబడ్డారు?" అన్నాడు దొంగ.

    గజదొంగ మంగులు నాలుక కర్చుకున్నాడు. "అర్రే....నిజమే...." అనుకుని  పచార్లు  చెయ్యడం మొదలుబెట్టాడు.

    అయిదు  నిముషాల  తర్వాత  మంగులుకి ఒక సందేహం వచ్చి  పచార్లు ఆపాడు.
"అవునూ....వీరూగాడు  కనబడ్డం  లేదేం?" అడిగాడు  దొంగల్ని.

    "ఈవేళ  శలవెట్టాడండి" చెప్పాడో  దొంగ.

    మంగులు  "ఆ...." అని అరుస్తూ జుట్టు పీక్కున్నాడు.

    "ఇదేమైనా  గవర్నమెంటాఫీసా  శలవెట్టడానికి?" అంటూ అరిచాడు. దొంగలందరూ  తలలు  దించుకున్నారు.

    అంతలోనే మంగులుకి ఓ ఆలోచన  వచ్చి రిలీఫ్ ఫీలయ్యాడు. వీరూగాడు  వుంటే ఇంతింత  లావు  కొవ్వోత్తిల్ని  వెలిగించి వాటిల్తో శపధాల పేర్తో  తన చేతులు  కాలుస్తాడు....వాడు  రాకపోవడమే  మంచిదైంది.

    "బాస్!" ఒక దొంగ  మెల్లగా  పిలిచాడు.

    గజదొంగ మంగులు వాడివైపు  చూశాడు   ప్రశ్నార్దకంగా. వీరూ లేని లోటు మీరు ఫీలవకుండా నేను చేస్తాను  బాస్!" అన్నాడు  వాడు  వినయంగా.

    "అంటే?" అడిగాడు  మంగులు.

    "ఏం  లేదు బాస్! నేను మీ కోసం వీరూ  తెచ్చే  కొవ్వొత్తులకంటే  లావు కొవ్వొత్తులు వెలిగించి తెస్తా బాస్!" ఆ మాట  వినగానే మంగులుకి చిర్రెత్తుకొచ్చేసింది. స్తంభంమీద పిచ్చెక్కినట్టు గుద్దుతూ "వద్దూ....వద్దూ....వద్దూ....వద్దూ...." అని వెర్రికేకలు  పెట్టాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS