'లేదు. ఆ పేరు నాకక్కరలేదు. ఈ పత్రికలలో ఉన్న వ్యాసాలు చదువు. నీకే తెలుస్తుంది. ఒకనాడు నేనుకూడా నీలాగే ప్రవర్తించాను. కాని ఈ అజ్ఞాత రచయిత వ్యాసాలు నన్ను మార్చాయి. నీవుకూడా ఈ వ్యాసాలను జాగ్రత్తగా చదువు. ఆ రచయిత, ఆడో, మగో తెలియడంలేదు. 'జ్యోత్స్న' అనే కలంపేరుతో రాస్తూ ఉంది. ఆ పేరు నపుంసక లింగానికి చెందినది కాబట్టి అలాగే వ్యవహరిద్దాం. మీగడ తరకల్లాంటి స్వచ్చమైన భాషలో ఎంతో మృదువుగా నచ్చజెపుతాయి ఆ రచనలు. మంచిని గురించి, చెడును గురించి ఎన్నో విధాల తర్కించి తను చెబుతున్న విషయం సక్రమమైనదని ఎంతో సౌమ్యంగా నిరూపిస్తుంది; తన ఆ వ్యాసాలద్వారా, చాలా చక్కగా ఉన్నాయి. వాటిని చదివి ఆచరించ కుండా ఉండేవారు చాలా అరుదు' అని ఆ వ్యాసాలను పొగిడాడు ప్రసాద్.
'తప్పకుండా చదువుతాను ప్రసాద్! ఆచరణలో పెట్టడానికికూడా నా శాయశక్తులా ప్రయత్నిస్తాను' భారంగా నిట్టూరుస్తూ అన్నాడు ప్రభాకరం.
'మర్చిపోయాను. నీతో చొరవతీసుకొని ఎవరో మాట్లాడారన్నావు. ఎక్కడో ఉండి ఏ వస్తలు పడుతుందోనని అనుమానపడ్డావు. ఎవరామె? ఆమెకు, నీకుగల సంబంధ మేమిటి?' ప్రభాకరం కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు ప్రసాద్.
రోజాతో తన స్నేహం-ఆ తర్వాత శారద తనను హెచ్చరించడం - తను శారదపై కక్షగట్టి అనవసరంగా ఒకటికి నాలుగుసార్లు అవమానించడం-తుదకు అపనిందలువేసి ఆమెను యింటినుండి తరిమేయడం-అన్నీ సాకల్యంగా వివరించాడు ప్రభాకరం.
అన్నీ విన్న ప్రసాద్ పది నిముషాలు దీర్ఘంగా ఆలోచించాడు. 'ప్రభాకర్! నీవు మణిని కాలదన్ని మసిబొగ్గుకు ఆశ్రయ మిచ్చావ్. ఒకరు చేసిన నేరాలను ఎవ్వరూ అంత తేలికగా తమపై వేసుకోరు. అలా వేసుకోవడానికి ఎంతో సంస్కార హృదయ ముండాలి. నీవు దొంగవని నలుగురికి తెలియడం ఆమెకు బొత్తిగా యిష్టం ఉండి ఉండదు. నీవు మరొక కోణంలోకూడా ఆలోచించి చూడాలి. బహుశా ఆమె నిన్ను ప్రేమించి ఉండవచ్చు. ఆమె ధనవంతురాలు కాకపోయినా మంచి గుణవంతురాలై ఉంటుందను కుంటున్నాను. ఏది ఏమైనా ఆమెను గురించి నీవు చెప్పిన తర్వాత నాకు ఆమెను చూడాలనీ, ఆమెతో మాట్లాడాలనీ, అనిపిస్తూ ఉంది. ఆమె ఎక్కడ ఉందో నీకే తెలియనప్పుడు నా కోరిక ఎలా నెరవేరుతుంది?' నిరాశతో అన్నాడు ప్రసాద్.
'బి. ఏ. పూర్తిచేశాకగాని నేను ఇంటికి వెళ్ళను. ఇంటికి వెళ్ళాక ఎక్కడ ఉన్నా సరే, ఆమె జాడతీసి క్షమాపణ కోరుకొనేంతవరకు నిద్రపోను ప్రసాద్' గంభీరంగా ముఖకవళికలను మార్చుకొని దృఢంగా అన్నాడు ప్రభాకరం.
'చాలా సంతోషం! నీలో మార్పుకు యిది నాందీ ప్రస్తావన. భగవంతుడు ఎల్లప్పుడూ నీకు సాయపడుగాక' అని నలువైపులా చీకట్లు దట్టంగా ముసరడంవల్ల తన రూముకు వెళ్ళాలనే ఉద్దేశంతో లేచి నిలుచున్నాడు. ప్రభాకరంకూడా లేచాడు. ఇద్దరూ నెమ్మదిగా హాస్టలువైపు నడక సాగించారు.
* * *
లక్ష్మయ్యగారి మామిడితోటలో ఆస్పత్రి భవన నిర్మాణం పూర్తయింది-
ఇక ఆ భవనానికి రంగులు వేయించి, ఫర్నిచరు, పరికరాలు సమకూర్చాలి-
ఒకరోజు రామం తయారైన ఆ భవనం ముందు కూర్చొని ఆలోచనలో పడ్డాడు. 'ఈ నిర్మాణ కార్యక్రమంలో ఊరివారంతా సాయపడ్డారు. అలా సాయపడకపోతే నేను ఎంతో యిబ్బందిపడవలసి వచ్చేది. ముఖ్యంగా మామయ్య నన్ను ప్రోత్సహించి కుడి భుజంగా నిలబడబట్టి అనుకున్న వ్యవధికి ముందుగానే నిర్మాణం పూర్తయింది. తరువాత కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా కొనసాగితే, నా ఆశయం నెరవేరుతుంది. ఈ భవనం చుట్టూ చక్కని పూలతోట వేయించాలి. అందమైన క్రోటన్సుతో ఆస్పత్రి భవనం కళకళ లాడాలి. ఆ తోట అనారోగ్యంతో బాధపడే రోగులకు మానసికోల్లాసం కలిగించాలి. మామయ్యతో చెప్పి రేపు హైదరాబాదు వెడతాను. సుందరాన్ని కలుపుకొని ఆ ఫర్నీచరూ, పరికరాలు కొనే సంగతి ఆలోచించి, వచ్చేటప్పుడు అన్ని రకాల పూలమొక్కలు తీసుకు వస్తాను. శాంతను, శారదను చూసినట్లు కూడా అవుతుంది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా చదవమని హెచ్చరించినట్లూ ఉంటుంది.
'శారద ఎంతో చురుకైనది. పాపం ఆ అమ్మాయిని ఏకాకిగా చేశాడా భగవంతుడు. ఆమెకు అండదండ లున్నట్లయితే యింకా ఎంతగా రాణించి ఉండేది! ఏమో? అందదండలు సరియైన అవకాశాలుంటే అంతకష్టపడి చదివేదికాదేమో? ఆమె స్నేహంతో శాంత మంచిమార్కులు తెచ్చుకుంటూ చక్కని ప్రవర్తన అలవరచుకుంటూ ఉంది. సత్సాంగత్య ఫలితం అలా ఉంటుంది,
'ఈ సంవత్సరంతో శాంత చదువు పూర్తవుతుంది. ఇద్దరూ కలిసి ఎం. ఏ. చదువుతానంటారేమో? నాకు చదివించాలనే ఉంది. మరి మామయ్య ఏమంటాడో? ఆయన ఏమాత్రం ఒప్పుకోడు. ఇప్పటికే వివాహానికి ఎంతో ఆలస్యం జరిగిపోయిందని ఎంతో గొడవ చేస్తున్నాడు.'
పై విధంగా ఆలోచిస్తున్న రామానికి సమయం తెలియలేదు. ఆరోజు పౌర్ణిమ. అతని హృదయంలా ఆకాశం నిర్మలంగా ఉంది. తారలు మిణుకు మిణుకుమని మెరుస్తున్నాయి. వాటి అందాలను ఆనందంతో తిలకిస్తూ తనలో పొంగి పొరలుతూన్న సంతోషాన్ని అరికట్టలేక సతమత మౌతున్నాడు శశాంకుడు. మామిడి లే చిగుర్లను తిని మత్తెక్కిన స్వరంతో కుహు...కుహు...నాదం చేస్తుందొక కోయిల. పౌర్ణిమ జ్యోత్స్నతో తోటంతా ధవళకాంతు లీనుతూ మెరిసిపోతూ ఉంది. ఆ మత్తెక్కిన ప్రకృతి సౌందర్యంలో శాంతను తన హృదయంలో ప్రతిష్టించుకొని ఆమెను గురించిన తీయని తలపులతో ఆ కూర్చున్న మంచంపై మగతగా కన్ను మూశాడు రామం. ఆ మగత నిద్రలో ఏవేవో ఊహలోకాలలో విహరిస్తూ, మధుర స్వప్నాలను కంటూ గాఢ నిద్రలో మునిగి పోయాడు.
రాత్రి పది దాటినా యింటికి రాని కారణం ఊహించుకోలేక లక్ష్మయ్యగారు గాభరాపడుతూ పాలేరు పుల్లయ్యను తోడు తీసుకొని మొదట పంచాయితీ ఆఫీసు, దేవాలయం, ఆ తర్వాత రామం స్నేహితుల యిళ్ళు అన్నీ వెదికి బహుశా తోటలోనే ఉండి ఉంటాడనే ఉద్దేశంతో యిద్దరూ తోటవైపు నడక సాగించారు. ఆందోళన వల్ల లక్ష్మయ్యగారి ముఖంలోని ముడతలు రెట్టింపయ్యాయి. మౌనంగా నడుస్తూన్న వారిని చూసి ఆ సమయంలో ఎక్కడికి వెడుతున్నారో తోచక తికమక పడసాగారు అంతవరకూ మెలుకువలో ఉండి రచ్చబండ దగ్గర నుండి అప్పుడే యింటిముఖం పట్టిన రైతులు.
వేగంగా నడుస్తూన్న లక్ష్మయ్యగారిని ఆపుతూ 'పెదబాబుగారూ.....ఆగండి...' అని అతనికి ముందు నడుస్తూన్న పాలేరు పుల్లయ్య ఆపాడు. వారు నడుస్తున్న దారికి అడ్డంగా చేతి మణికట్టులా వున్న కోడె త్రాచొకటి నల్ల ఛాయతో, వెన్నెల దాని మీద పడడంతో తళతళ మెరుస్తూ, చురుకుగా మెలికలు తిరిగి ప్రాకుతూ ప్రక్కన ఉన్న పొదలో దూరింది.
పల్లెవాసులకు పాములు కనపడడం వింత కాదు. పొలాలల్లో, చేలగట్లమీద, తోటల్లో, చెరువు ఒడ్డున తరచుగా కనుపిస్తూనే ఉంటాయి. కాని రామం యింటికి రాలేదన్న ఆందోళనతో పరధ్యానంగా రాత్రి పదిదాటిన తర్వాత నడుస్తూన్న లక్ష్మయ్య గారి గుండె ఆ పామును చూడడంతో వేగంగా కొట్టుకోనారంభించింది. పాము కనుపించడం అపశకునంగా భావించాడు లక్ష్మయ్యగారు. 'ఇంత రాత్రపుడు యింకా ఆ తోటలో ఏం చేస్తున్నాడో ఏమో? ఏ వెర్రిపడితే అదె వెర్రి! పాములు యిలా తిరుగుతున్నాయి. వాడికి ఏమైనా జరుగుతే?' ఆ ఊహ మనసుకు తట్టే సరికి భయంతో వణికి పోయారు లక్ష్మయ్యగారు. నడక వేగాన్ని హెచ్చించారు.
చిరునవ్వు ముఖంతో, నిర్మలమైన ముఖ కవళికలతో పసిపాపలా నిద్రపోతూన్న రామాన్ని చూసి హాయిగా నిట్టూర్చారు వారు. ఆయన మనసు కుదుటపడింది. గుండె దడ తగ్గింది. బరువుగా శ్వాస పీల్చారు.
'శాంతా...! ఎన్ని జన్మలకైనా నీవునా దానివే! మనిద్దరినీ ఎవ్వరూ వేరు చేయలేరు.' పలవరిస్తున్నాడు రామం.
'రామం....రామం...' అని గట్టిగా కుదిపి రామాన్ని నిద్ర నుండి లేపారు లక్ష్మయ్య గారు.
శాంతపై అతనికిగల ప్రేమకు ముగ్ధులయ్యారు-
'ఏమిటి మామయ్యా...?' అంటూ గాభరాతోలేచాడు ముఖం చిట్లిస్తూ రామం.
అతని స్థితి లక్ష్మయ్యగారికి విస్మయాన్ని కలిగించింది. లక్ష్మయ్యగారు చిరునవ్వు నవ్వుతూ 'ఒరేయ్! ఏమిట్రా యిది? ఇంత రాత్రపుడు ఈతోటలో యిటువంటి బయలు ప్రవేశంలోని ఈ నిద్రేమిటి? పలవరింత లేమిటి? రాత్రి పదిదాటినా యింటికి రాలేదేమిటా అని భయపడ్డాం. చివరకు ఆగలేక పుల్లయ్యను తీసుకొని ఊరంతా వెదికి యిక్కడికి వచ్చాను.'
సిగ్గుతో తల ఒంచుకున్నాడు రామం-
'చల్లని ఈగాలి ఈవెన్నెల నాకు మైకాన్నికలిగించాయి. కూర్చొని ఆలోచిస్తూన్న నేను నాకు తెలియకుండానే నిద్రపోయాను మామయ్యా!' ముసిముసినవ్వులు ముఖాన చిందిస్తూ అన్నాడు రామం.
'సడే! సంబరం! నీవేమో యిక్కడ నిద్రపోతూ కలలు కంటున్నావు. మేమేమో నీవు యింకా రాలేమిటబ్బా అని యింటివద్ద బెంగటిల్లి పోతున్నాము. పద వెడదాం' చిరునవ్వుతో అన్నారు లక్ష్మయ్యగారు.
లక్ష్మయ్యగారు ముందు నడిచారు. రామం, పుల్లయ్యవారిని అనుసరించారు. రామం యింటికిచేరి భోజనం చేసేసరికి రాత్రి పన్నెండు దాటింది. అంతకుముందే నిద్రలేచిన కారణంగా అతనికి త్వరగా నిద్ర పట్టలేదు. ఏవో ఆలోచనలతో రాత్రి చాలా ప్రొద్దుపోయేంతవరకు మెలుకువతో ఉండి ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోయాడు.
* * *
రామం, సుందరం, శాంత, శారద నలుగురూ సికింద్రాబాదు పెరేడు మైదానంలో కూర్చున్నారు. సాయంత్రం ఆరు దాటింది.
సాయంత్రం వేళల్లో షికారుగా వచ్చి చాలా మంది ఆ పచ్చికపై కూర్చుంటూ ఉంటారు. ఆరోజుకూడా అక్కడక్కడ గుంపులు గుంపులు కూర్చొని చల్లగాలి లోని హాయిననుభవిస్తున్నారు. పెద్ద పెద్ద సిటీలలో ఊరిమధ్య అటువంటి పచ్చిక బైలు ప్రదేశాలుండి పట్టణవాసులు తమ సాయంసమయాలను కులాసాగా గడిపేం దుకు తోడ్పడుతుంటాయి.
అక్కడ కూర్చున్న నలుగురూ ఐదునిముషాలు మౌనంగా గడిపారు-
రామం మౌనభంగం చేస్తూ 'ఒరేయ్ సుందరం! హాస్పిటల్ భవనం తయారైంది ఫర్నిచరు పరికరాలు కావాలి. మరి నీవు రెండురోజులు శలవు పెడితే అవన్నీ కొనిలారీలో తీసుకువెడతాను. భవనానికి వేసే రంగులుకూడా నీవే సెలెక్టు చెయ్యి. హౌస్ సర్జన్ షిప్ పూర్తవగానే అక్కడికి వద్దువు గాని.' ఆప్యాయంగా చూస్తూ అన్నాడు.
'అక్కడికి నేను డాక్టరుగా రావాలంటే నాకు ఎందుకో సంకోచం కలుగుతూ ఉంది. నా విలువ తెలుసుకొని నన్నెవరు గౌరవిస్తారు? ఆరు సంవత్సరాల క్రితం నేను ఆ ఊరు వదిలిపెట్టాను. మళ్ళీ నేను అక్కడికి రాలేదు. ఆ వాతావరణం.....ఆ మనుష్యులు....ఏమిటోరా నాకు అక్కడికి రావాలని బుద్ధి పుట్టదు. అన్నీ మడ్డెరకాలు. నీమాదిరిగా చదువు, సంస్కారం ఉన్నవాళ్ళను వ్రేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. రానంటే నీవు కోప్పడ తావని భయం. వచ్చి ఉండలేనేమోనన్న అనుమానం. ఏంచేయాలో తోచడంలేదు' సందిగ్ధావస్థలో కొట్టు మిట్టాడుతూ అన్నాడు సుందరం.
