Previous Page Next Page 
మల్లెలు ఎర్రగులాబీలు పేజి 21


    'కోయీబాత్ నహీఁ భాయిసాబ్! బచ్చీ బచ్ గయీ! మై ఖుష్ హోగయాహుఁ.' అతని వీపు తడుతూ సంతోషంగా అన్నాడు ప్రభాకరం.
    'భగవాన్ ఆప్ కో ఆబాద్ రఖే...! భైయ్యా .....హమ్ గరీబ్ లోగ్ హైఁ. దువాకే సివా ఆప్ కో కుచ్ భీ నహీఁదే సక్ తే!' ఆ భార్యా భర్తలిద్దరూ ఒకేసారి అన్నారు.
    వారివైపు ఆప్యాయంగా చూస్తూ 'సచ్చేదిల్ సే ఆప్ దియే సో దు వాఁ హి హమారేలియే బహుత్ కుచ్ హై...' చిరు నవ్వుతో అన్నాడు ప్రభాకరం. ప్రమాదం నుండి బయటపడిన అమ్మాయితో ప్రభాకరానికి ఆ యువకునికీ దండాలుపెట్టిస్తూ వారిని నూరు సంవత్సరాలు సుఖ సంతోషాలతో జీవించమని దీవిస్తూ వెళ్ళిపోయారా దంపతులు. వారువెళ్ళిన తర్వాత ప్రభాకరం ఆయువకుడిని మాటలలోకి దించాడు.
    'మీపేరు చెప్పలేదు.'
    'నా పేరు వరప్రసాదమూర్తి.'
    'చాలా పెద్ద పేరండీ!' నవ్వుతూ అన్నాడు ప్రభాకరం.
    'అవునండీ! నన్ను అందుకే మూడు రకాలుగా పిలుస్తారు. మాయింట్లో లేక లేక కలిగినవాణ్ణి నేను. అందుకని మా నాయనమ్మగారు, తాతగారు 'వరం' అని పిలుస్తారు. నాన్నగారు, అమ్మ 'మూర్తి' అని పిలుస్తారు. ఇక స్నేహితులు 'ప్రసాద్' అని పిలుస్తారు.' చిరునవ్వుతో అన్నాడు.
    'ఇంతకూ నన్నే పేరుతో పిలవమంటారు?'
    'అది మీ యిష్టానికే వదిలేశాను.'    
    'అవుతే ఈ స్నేహితునిగా 'ప్రసాద్' అని పిలుస్తాను.'
    'మీరు స్నేహితులుకారు. ప్రాణ ధాతలు స్నేహానికన్న మించిన బంధంతో మీరు నన్ను బంధించారు. మీ యిష్టంవచ్చిన పేరుతో పిలవవచ్చు.' ఆప్యాయంగా ప్రభాకరాన్ని చూస్తూ అన్నాడు ప్రసాద్. ఇద్దరూ చిరు నవ్వు నవ్వుకున్నారు.

                          *    *    *

                                 9

    ప్రసాద్ ప్రభాకరంల స్నేహం అనతి కాలంలోనే వృద్ది చెందింది. హాస్టల్ వార్డన్ ను బ్రతిమిలాడి తనరూము మార్చుకొని ప్రసాదు రూముకు వచ్చాడు ప్రభాకరం.
    ప్రసాదు చక్కని ఆదర్శభావాలుగల యువకుడు. శారీరకంగా ఎంత బలహీనుడో మానసికంగా అంత బలవంతుడు. అతనిది ఖమ్మం. పెద్ద ఆస్తిపరులు కాకున్నా తిన, కుడన ఉన్న సంసారం. అతని కుటుంబం లోని వారంతా భగవద్భక్తి, సనాతనాచార పరాయణులు. చామనచాయతో కళగల ముఖంతో ఎప్పుడూ నవ్వుతూ, ఎదుటి వారిని నవ్విస్తూ ఉంటాడు. అతని తాత గారికి కాశీలో అతనిని చదివించాలనే ఊహ తట్టిందట! వెంటనే ఆ విషయం ప్రసాద్ తండ్రికి చెప్పాడు. ఆయనగారు ఆ విషయం ప్రసాద్ కు తెలియజేశారు. పిత్రు వాక్యాధురీణుడైన ప్రసాద్ తక్షణమే కాశీకి వచ్చాడు. ప్రభాకరం చేరినప్పుడే అతను కాలేజీలో చేరాడు. గ్రూపుభేదం ఉండబట్టి యిద్దరూ యింతకాలం సన్నిహితులు కాలేదు.
    ఒకరోజు ప్రభాకరం దురుసుగా ప్రవర్తించి తోటి స్నేహితులతో వాదనకు దిగాడు. వాళ్ళు నలుగురున్నారు. ప్రభాకరం ఒక్కడే! అయినా వెనుకంజ వేయకుండా మాటలు దంచేస్తున్నాడు. చిలికి చిలికి వాన పెద్దదైనట్లు ఆ వాదన దెబ్బ లాటగా మారబోతూ అటువైపు వస్తూన్న ప్రసాద్ దృష్టిని ఆకర్షించింది.
    పరిస్థితి విషమించిందని ఊహించిన ప్రసాద్ ప్రభాకరానికి, అటు మిగతావారికి నచ్చజెప్పి ఆ తగువును అంతటితో ఆపుచేయించి బలవంతంగా అతనిని అక్కడినుండి లాక్కువెళ్ళాడు.
    అతనిద్వారా జరిగిన సంగతులన్నీ తెలుసుకున్నాడు ప్రసాద్. ప్రభాకరాన్ని ఆప్యాయంగా చూస్తూ 'తప్పునీదే ప్రభాకరం! నీతో పరిచయం కలిగినప్పటినుండీ నిన్ను జాగ్రత్తగా గమనిస్తున్నాను. నీలో ఆవేశం ఎక్కువ. ఆలోచన తక్కువ, మరీ దుడుకుగా ప్రవర్తిస్తావు. నీతో చాలావిషయాలు మాట్లాడాలి. అలా గంగఒడ్డుకు వెళ్ళి మాట్లాడుకుందాం. ముందు మన మిద్దరమూ రూముకు వెళ్ళివద్దాం పద' అని హాస్టలు రూమువైపు దారితీశాడు ప్రసాద్.
    రూములో తన షెల్ఫునుండి నాలుగైదు తెలుగు మ్యాగజిన్ లు తీసుకొని 'పద...! ఇక వెడదాం' అని ప్రభాకరంతో బయలుదేరాడు.
    ఇద్దరూ గంగఒడ్డుకు చేరారు. అక్కడ ఏకాంతంగా ఒక స్థలంలో కూర్చున్నారు.
    వేసవి అప్పుడే ప్రారంభమౌతూ ఉంది. అది ఫాల్గుణమాసం. నీరెండ గంగానదీ జలాలపై బడి బంగారు రంగులీనుతూ పైడినది ప్రవహిస్తూ ఉన్నదా అనే భ్రమ కలిగిస్తూ ఉంది. విశ్వనాధదేవాలయ గోపురాలు తళతళ మెరుస్తూ స్వామి సన్నిధికి భక్తులను ఆహ్వానిస్తున్నాయి. సాధువుల గుంపొకటి వేదాంత గీతాన్ని ఆలపిస్తూ ఆలయాభిముఖంగా కదులుతూ ఉంది. ఆ పరిసరాలలో యెక్కడ చూసినా పవిత్రత గోచరమౌతూ ఉంది.
    'ప్రభాకరం...! నీతో కొన్ని విషయాలు మాట్లాడాలని, నీతో పరిచయం కలిగినప్పటినుండీ అనుకుంటున్నాను. కాని వీలు చిక్కడంలేదు. ఇందాక జరిగిన ఆ సంఘటన నీతో మాట్లాడించాలని నన్ను ప్రేరేపించింది.'
    'అంత ముఖ్య విషయమా ప్రసాద్!'
    'అవును.'
    'ఏమిటబ్బా...? అంత ముఖ్యవిషయం!'
    'నీవు చూడబోతే చక్కని సంస్కార కుటుంబంలో జన్మించినవాడిలా కనిపిస్తున్నావు. దానికి విరుద్ధంగా ఉంది నీ ప్రవర్తన. చూడు ప్రభాకరం నేను చెప్పబోయే విషయాలను అపార్ధం చేసుకోకూడదు. జాగ్రత్తగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. నా మాటలు నీవు ఆచరించినా ఆచరించకున్నా యిప్పుడున్న మన ఈ స్నేహానికి ఎటువంటి భంగమూ వాటిల్ల కూడదు. నాకు తెలుసు. నీవు చక్కని తెలివితేటలు గలవాడవు. పట్టుదలగల వ్యక్తివి. వాటిని సక్రమ మార్గాలలో వినియోగ పరుస్తే ఎంతో పైకి వస్తావు' అన్నాడు ప్రసాద్.
    ఆ మాటలకు ప్రభాకరం ముఖం చిట్లించాడు-
    'నా మాటలు అపార్ధం చేసుకోకూడదు. ఆ మాటలు నీకు నచ్చితే ఆచరణలో పెట్ట ప్రయత్నించు. నా మాటలవల్ల మన ఈ స్నేహానికి ఎటువంటి భంగం వాటిల్ల కూడదు. మానసికంగా నీవు బాధపడకూడదనీ, రెండవసారి హెచ్చరిస్తున్నాను.'
    'అలాగే ప్రసాద్! చెప్పు. జాగ్రత్తగా వింటాను. ఇంత ఆప్యాయతతో నావద్ద చొరవ తీసుకొని చెప్పేవాళ్ళు మాత్రమెవరున్నారు?' అని నాలుక కరుచుకొని 'ఉన్నారు.....కాని నేనే దూరం చేసుకున్నాను. పాపం ఎంత అవస్థపడుతుందో?' అని ఊరు కున్నాడు ప్రభాకరం.
    'ఎవరు? ఎక్కడో ఉండడమేమిటి? అవస్థలు పడడమేమిటి? నీకు వివాహ మైందా ప్రభాకర్!' ప్రశ్నల వర్షం కురిపించాడు ప్రసాద్.
    'లేదు. ఆ విషయాలన్నీ తర్వాత చెబుతాను. ముందు నీవు చెప్ప తలచుకున్న దేమిటో చెప్పు' అతను చెప్పబోయే విషయాలను చూచాయగా గ్రహించే, అడిగాడు ప్రభాకరం.
    'ఏం లేదు ప్రభాకరం. నీ రక్తం అతిచురుకైనది. ఆ చురుకుదనం తో నిన్ను దుడుసుపనులు చేయడానికి ప్రేరేపిస్తూ ఉంది.' విచిత్రంగా అతని బలహీనతను ఎత్తి చూపాడు ప్రసాద్.

                         
    'నేను చేస్తున్నపని తప్పని నాకు తెలుస్తుంది ప్రసాద్! కాని ఏం చెయ్యను? అణువణువునా జీర్ణించుకు పోయిన దురభ్యాసాలు నన్ను పిచ్చివాణ్ణి చేస్తూ ఉన్నాయి. ఏం చేయాలో తోచడం లేదు.' విచార పడుతూ అన్నాడు ప్రభాకరం.
    'విచారపడకు. అన్నీ సర్దుకుంటాయి. నేను చెప్పబోయే సంగతులనన్నింటినీ జాగ్రత్తగా విను. దీర్ఘంగా ఆలోచించు. ఆ తర్వాత నీకు కలిగే సందేహాలను నా శక్తి వంచన లేకుండా తీరుస్తాను. మధ్యలో మాత్రం నన్ను ఆపకు' అని ప్రభాకరం ముఖంలోకి నిశితంగా చూస్తూ అన్నాడు ప్రసాద్.
    అంతలో వీరు కూర్చున్న చోటుకు ఐదారుగజాల దూరంలో ఎవరో విద్యార్ధులు, విద్యార్ధినులు పిక్నిక్ కు వచ్చి రాక్ అండ్ రోల్ డాన్సు ప్రారంభించారు. ప్రభాకరం తన ఎదుట ప్రసాద్ ఉన్నాడన్న విషయాన్నే మరిచిపోయి పరుగెత్తి వెళ్ళి ఆ గుంపులో చేరి తను కూడా నృత్యం చేయసాగాడు. ప్రభాకరం అలా వెళ్ళడం ప్రసాద్ కు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. కొద్దిగా కోపం కూడా వచ్చింది. కాని సహనంతో అతని రాకకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అరగంట తర్వాత ఆయాస పడుతూ వచ్చాడు ప్రభాకరం. ప్రసాద్ వైపు క్షమించమనే భావంతో చూస్తూ 'చెప్పానుగా ప్రసాద్! ఇలాగే ఆవేశంతో ప్రవర్తిస్తూ ఉంటాను. నన్ను క్షమించు.'
    'ఫర్వాలేదులే కూర్చో ' అన్నాడు ప్రసాద్ చిరునవ్వుతో.
    'ఇక నీవు చెప్పతలచుకున్నదేదో చెప్పు' అన్నాడు ప్రభాకరం.
    ప్రసాద్ ప్రారంభించాడు. మన జీవితాలు బుద్బుదప్రాయాలు. వర్షాకాలంలో వర్షం పడిన తర్వాత పారే నీటిపై పుట్టే బుడ గలలాంటి వాళ్ళం మనం. క్షణానికి ఎన్నో చిట్లి పోతుంటాయి. వేదాంతం చెబుతున్నానని విసుగుపడకు. మనకున్న ఈ కొద్ది కాలాన్ని సద్వినియోగపరచి నలుగురిలో పేరు తెచ్చుకోవడం ఎంతైనా అవసరం. మనమూ బ్రతుకుతున్నాం. అడవిలో జంతువులూ బ్రతుకున్నాయి: మనకూ వాటికీ తేడా ఏమిటి? వివేకము, అవివేకము వాటికి లేకున్నా మనకు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం కొందరు ఆ వివేకాన్నే కోల్పోయి అంధకారంలో అలమటిస్తున్నారు.
    'నీ వేషధారణ, ఆచార వ్యవహారాలు నాకు ఎంతో ఎబ్బెట్టుగా కనుపిస్తున్నాయి. కాని నూటికి తొంభై మంది నీలాగే గ్రుడ్డిగా ఒకరిని చూసి మరొకరు అనుకరిస్తున్నారు.
    'వినయ విధేయతలతో, చక్కని సంభాషణతో ఎటువంటి వారినైనా వశపరచుకోవచ్చు. శత్రువుని కూడా మిత్రునిగా మార్చవచ్చు. కాని దురుసుప్రవర్తనతో మిత్రులు శతృవులౌతారు. నలుగురు నాలుగురకాలుగా అనుకుంటారు. పైగా నీవు సాధించేది కూడా ఏమీ ఉండదు. ఆ రోజు గంగాఘాట్ లో జరిగిన సంఘటనను గుర్తుకు తెచ్చుకో. ఆ జన్మాంతం ఆ కుటుంబం నిన్ను మరిచిపోదు, ధైర్యం చేశావు. తెగించావు. రక్షించావు. ఇహపరాలను రెంటినీ పూలబాటలుగా మార్చుకున్నావు.
    'నీకు త్రాగుడు అలవాటైంది. అది ఎలా అయిందో నాకు తెలియదు. దానివల్ల నీవేమీ సాధిస్తున్నావు? కొంత కాలానికి అనారోగ్యం ఏర్పడుతుంది తప్ప వేరే ప్రయోజనమేమీ ఉండదు. 'అలవాటైంది. మానుకోలేక పోతున్నాను' అనే చాతకాని మాటలు చాలామంది నోట వినవస్తుంటాయి. ఆ మాటలో అర్ధం లేదు. అసలు ఎవరైనా ప్రయత్నిస్తే గా మానుకోగలగ డానికి.
    'చక్కని సంభాషణ, సత్ప్రవర్తన, మనను నలుగురిలో ఉన్నతస్థాయికి తీసుకువెడుతుంది. అందుకు మనం నష్టపడేది కూడా ఉండదు. మనము భారతీయులము. మనదేశ ఆచార వ్యవహారాలే మనకు ఆచరణీయాలు. ఇప్పుడు రాక్ అండ్ రోల్ నృత్యం ప్రారంభించగానే లేచివెళ్ళి నిన్ను ఆహ్వానించకుండానే అందులో పాల్గొన్నావు. నృత్యం చేశావు.
    'మన సాంప్రదాయంలో నాట్యాలు ఉన్నాయి. భరతనాట్యం, మణిపూరి, కధాకళి, జానపదనృత్యం యిత్యాదులు మన సాంప్రదాయ నృత్యాలలో ఉన్న లయ, రసికత, పాశ్చాత్య నృత్యాలలో లేవు. సభికులను హావభావ గాంభీర్యములతో తమలో తల్లీన మొనర్చుకొనే మన నృత్యాలలో ఉన్న ఔన్నత్యము, అంగవిన్యాసము ఆకర్షణ అసాధారణమైనది. మన సాంప్రదాయాలను మన లలితకళలను మనమే అణగద్రొక్కు కుంటూ పాశ్చాత్య నాగరికతను ప్రోత్సహించడం తల్లిరొమ్మును గ్రుద్ధటంలా ఉంటుంది. మన సాంప్రదాయ నృత్యాలను చూస్తున్నప్పుడు.
    మనముపొందే ఆ ఆనందము అనుభూతి మనము విహరించే ఆ ఊహా లోకాలు పాశ్చాత్య నృత్యాలు చూస్తున్నప్పుడు సాధ్యపడదు. అర్ధనగ్నంగా అర్ధంలేని పదాల నుచ్చరిస్తూ అరిషడ్వర్గాలలో ప్రముఖ దుర్గుణమైన కామాన్ని రెచ్చగొడుతూ మనుష్యుల మతులను చలింప జేస్తాయి ఆ నృత్యాలు. అటువంటి వాటికీ ఎంతదూరంగా ఉంటే అంత మంచిది.
    'వీలున్నంతవరకు దురలవాట్ల కు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో, చక్కని క్రమ శిక్షణతో మంచిపేరు సంపాదించుకో వలసిందని నిన్ను వేడుకుంటున్నాను. కనీసం ఈ స్నేహితుని తృప్తిపరచడానికైనా నీ ఈ ప్రవర్తన మార్చుకోక తప్పదు. నలుగురిలో నీవు 'సెభాష్' అని అనిపించుకున్ననాడు నేను గర్వంతో పొంగిపోతాను. నీవు నా ప్రాణ స్నేహితుడవని నలుగురిలో తలఎత్తి చెప్పుకోగలుగుతాను. ప్రభాకరం.....! నీవు నా ప్రాణదాతవు. పేరు ప్రతిష్టలు సంపాదించుకో గలిగిననాడు నిన్నుచూసి ఆనంద పడేవారిలో నేను మొదటివాడిని.
    'చెడును బోధించేవారు నక్కవినయాలు చూపుతారు. ప్రలోభపెడతారు. స్వార్ధంతో దురలవాట్లకు లోనుజేసి తమ అవసరాలను తీర్చుకుంటారు. మనకు వారిమాటలు చేష్టలు ఎంతగానో నచ్చుతాయి. మంచి ఎప్పుడూ త్వరగా తలకెక్కదు. పైగా ఆ నిషాలో ఉన్న వారికి మంచి బోధించేవారి మీద కోపంకూడా వస్తుంది. అది మానవనైజం. దానికి అతీతుడుగా ఉండేవాడే రాణిస్తాడు' అనిచెప్పి ఒక్క నిముషం విశ్రాంతిగా అటూ యిటూ కదిలాడు.
    'ప్రభాకరం నేనిలా అంటున్నానని కోపగించుకోకు. దీర్ఘంగా ఆలోచించు. ఈ మధ్య జరిగిన రెండు సంఘటనలే సక్రమమార్గానికి నీకు త్రోవ చూపిస్తాయి. ఆ అమ్మాయిని రక్షించావు. జీవితాంతం వారి మనసులలో దేవుడివై మెదులుతావు. ఈ రోజు నలుగురితో పోట్లాడావు. ఆ నలుగురు మరొక నలుగురితో నీగురించి చెడును చెపుతారు. అలా చెడు త్వరగా ప్రచారానికి వస్తుంది. ఇంతే ప్రభాకరం...! నా ఈ మాటలను సహృదయంతో అర్ధం చేసుకో. ఆచరించడానికి ప్రయత్నించు.' దీర్ఘంగా నిట్టూర్చాడు ప్రసాద్!
    'ప్రయత్నిస్తాను. నీ సహచర్యం తోనైనా నేను నా అలవాట్లకు దూరమౌతాను. నన్ను మార్చావన్న కీర్తి, మంచి పేరు నీకైనా దక్కుతుంది.' నవ్వుతూ అన్నాడు ప్రభాకరం.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS