Previous Page Next Page 
మల్లెలు ఎర్రగులాబీలు పేజి 23


    'ఏడిశావ్! నువ్వూ నీ అనుమానం. పిచ్చి పిచ్చి కబుర్లు చెప్పకు. మన ఊరి వాడివి. అందరిమధ్య కలుపుగోలుగా ఉంటూ తలలో నాలిక మాదిరి మసులుతానని ఊహించాను. ఇదట్రా...నీ సమాధానం? పిచ్చిపిచ్చి వేషాలు వేయక నే చెప్పినట్లు చెయ్యి' చనువు, అధికారం అతని మాటలలో ధ్వనించాయి.
    'సరే! నీ మాట ఎందుకు కాదనాలి? అలాగే. ఒక్కమాట! నా గౌరవానికి ఎటు వంటి భంగం కలిగినా సహించను. వెంటనే తిరిగి వచ్చేస్తాను' ఐస్ ప్రూటు కొనివ్వని కారణంగా అలిగిన కుర్రవాడిలా బుంగమూతి పెడుతూ అన్నాడు సుందరం.
    'ఒరేయ్! గౌరవమర్యాదలు ఒకరిస్తే వచ్చేవికావు. ఎవరైనా వారి వారి ప్రవర్తన లతో సంపాదించుకోవాలి. నీవు చేపట్టిన వృత్తి ఎంతో పవిత్రమైనది. కష్టపడి పైచేస్తే నీవు కావాలనుకుంటున్న ఆ గౌరవ మర్యాదలు వాటంతటవే వచ్చిపడతాయి. అయినా నీ కెందుకురా ఆ సందేహం? నే నున్నానుగా అన్నీ చక్కబరుస్తాను' సుందరం మాటలకు విస్తుపోతూ అన్నాడు రామం.
    రామానికి రాయప్రోలు వారి గేయం గుర్తుకు వచ్చింది. 'ఏ దేశమేగినా! ఎందుకాలిడినా! పొగడరా నీ భూమి పుణ్యభారతిని!' సుందరాన్ని చూస్తూ మళ్ళీ అన్నాడు.
    'జననీ జన్మ భూమిశ్చ! స్వర్గాదపి గరీసీయసీ!' తల్లి, జన్మభూమి స్వర్గం కన్న మిన్నయైనవి. సుందరం! ఇక్కడ నీ సేవ లకు అంత అవసరముండక పోవచ్చు. చాలా మంది డాక్టర్లున్నారు. అక్కడ అది నీ జన్మ భూమి, 'ఫలానా సుందరం. రంగయ్య తాత కొడుకు డాక్టరుగా వచ్చాడు. మనకిక ఎటు వంటి రోగాలు వచ్చినా భయపడనక్కరలేదు' అని అందరూ అనుకుంటూ ఉంటే మీ నాన్న ఎంత పొంగిపోతాడు? 'రామం స్నేహితుడు సుందరం డాక్టరయ్యాడు. మన ఊరి ఆస్పత్రికి డాక్టరుగా వచ్చాడు. ప్రమాదకరమైన వ్యాధులకుకూడా మనం ఆందోళన పడనవసరం లేదు' అని అందరూ అనుకుంటూ ఉంటేనే నెంత పొంగిపోతాను?'
    వీరిద్దరి సంభాషణను జాగ్రత్తగా వింటున్న శారద కల్పించుకోని, 'అవునన్నయ్యా! నేనూ ఆ మాటే అన్నాను. ఈ పాటికి వారు మనసు మార్చుకొని ఉంటారనుకున్నాను. మళ్ళీ మొదటికే వచ్చారు' చిరునవ్వుతో అంది.
    వీరి సంభాషణతో ఏమీ నిమిత్తం లేకుండా ప్లాజాటాకీసువైపు చూస్తూ ఉంది శాంత. ఆమెకు వెనుక ఒకరోజు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. సుందరాన్ని రామాన్ని పోల్చిచూసింది. టెర్రికాటన్ ప్యాంటుపై టెర్లిన్ షర్టు టక్ చేసి ఎప్పుడూ మద్తాహాలు నలగకుండా నీటుగా ఉండే సుందరం ముందు ముతక ఖద్దరు గుడ్డలతో ఉన్న రామం వెలవెల పోతున్నట్లు తోచసాగింది శాంతకు. 'ఎంతైనా సుందరం.....సుందరమే! బావ.....బావే!' అనుకుంది మనసులో.
    'మంచిది రామం. నీమాట తీసివేయలేను. తప్పకుండా అక్కడికి వస్తాను. ఇదిగో గది తాళం చెవి. నాకు రాత్రిపూట డ్యూటీ ఉంది. డ్యూటీ ఐపోయాక ఉదయమే రూముకు వస్తాను' అని శాంత, శారదలవద్ద శలవు తీసుకొని వెళ్ళిపోయాడు  సుందరం.
    సుందరం వెళ్ళినవైపే చూస్తూ 'ఏమిటో...? బస్తీ సుఖాలకు అలవాటు పడి, పుట్టి పెరిగిన జన్మస్థలాన్నే మరిచి పోతారు' అన్నాడు రామం.
    'అవునన్నయ్యా! ఈ జబ్బు ఒక్క సుందరానికే కాదు. చాలామందికి ఉంది. పల్లెల్లో పండే ధాన్యం, కూరగాయలు, తది తర దినుసులు వీరి దృష్టికి రావడంలేదు. పల్లెల్లో ఉండేవారు వీరి దృష్టిలో అసలు మనుష్యులే కారనుకుంటారు. అందుకే పల్లె ప్రజలు వెనుకబడి ఉంటున్నారు మన దేశంలో. వారి అమాయకత, నిస్సహాయత చూస్తున్నప్పుడల్లా నా గుండె తరుక్కు పోతూ ఉంటుంది. మనకు స్వాతంత్ర్యం లభించిన తర్వాత కొద్దిగా నయం కాని అభివృద్ది చెందవలసినంత చెందలేదు. అందుకు కారణం మన నైతిక విలువలు తగ్గి పోవడమే!' దీర్ఘంగా నిట్టూరుస్తూ అంది శారద.
    'అవునమ్మా ...నీ మాటలు అక్షరాలా నిజం. మన ప్రస్తుత ప్రధాన కర్తవ్య మల్లా, నానాటికి దిగజారిపోతున్న మన నైతిక విలువలను పునరుద్ధరించడం .... అందుకు ఒకరు పూనుకున్నారు. కాని వారికి వెలుగులోనికి రావడం యిష్టం లేనట్లుంది. 'జ్యోత్స్న' అనే కలం పేరుతో చక్కని వ్యాసాలు వ్రాస్తున్నారు. అసలు ఆ వ్యక్తి ఆడో, మగో తెలియడంలేదు. అజ్ఞాతంగా యింకెంతకాలం ఉంటారో నాకు అనూహ్యంగా ఉంది. చక్కని వ్యాసాలు సరసమైన భాషలో వెలువడుతున్నాయి. నా ఉద్దేశ్య ప్రకారం ఆ వ్యాసాలు వయసులో పండినవారివై ఉండి ఉండాలి. భారతీయ సాంస్కృతీ, సాంప్రదాయాలను, మతప్రాముఖ్యతను అరటిపండు ఒలిచి నోటి కందించినట్లుగా బోధ పరుస్తున్నాయా వ్యాసాలు. నిజంగా వారిది ధన్యజీవితం. వారి వ్యాసాలవల్ల ఏ ఒక్కరి ప్రవర్తనలో నైనా మార్చువస్తే చాలు' ఆ రచయితను పొగుడుతూ సంతోషంతో పొంగిపోయాడు రామం.
    'అన్నయ్యా...! రచనలవల్ల మనుష్యుల ప్రవర్తనలో మార్పు కలుగుతుందంటావా? నాకు అనుమానంగా ఉంది.'    
    'తప్పకుండా మార్పు వస్తుంది. అదేమి టమ్మా? ఒకనాడు మన సంఘ వ్యవస్థలో పాతుకుపోయి ఉన్న మతాచారాలను రూపు చూపి నవచైతన్యాన్ని తీసుకురాగలిగింది ఆనాటి రచయితలు, రచయిత్రులే! గత చరిత్రను తిరగవేస్తే ఆ విషయం రుజువౌతుంది' అన్నాడు రామం.
    'నీవు చెప్పేది నిజమే అన్నయ్యా!' రామంతో అని శాంతవైపు చూస్తూ ఈ సంభాషణ ఆమెకు రుచించడం లేదని గ్రహించి 'శాంతా! అన్నయ్య అంతదూరం మండి నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలనివస్తే నీవేమో మౌనవ్రతం పూనావు ఇదేమైనా న్యాయంగా ఉందా?' అంటూ శాంతపై నిష్ఠూరాన్ని మోపింది.
    'పాపం....! బావ నన్ను చూడడానికి వచ్చాడా ఏం? అదేమీకాదు. ఆస్పత్రి సామాన్లు ఫర్నీచరు కొనడానికి వచ్చాడు.' మూతి ముడుచుకొని అంది శాంత.
    'సరే! వచ్చిందెందుకైనా మనను కలిశాడు. మనతో మాట్లాడుతున్నాడు. మరి నీవలా మూగనోము పడితే ఎలా?'
    'నీవు మరీ చిలిపిదాన నవుతున్నావే శారూ....!' సిగ్గుపడుతూ నవ్వుతో అంది శాంత.
    రెండు నిముషాలు ముగ్గురు మౌనంగా గడిపారు-
    'బావా....! ఎగ్జిబిషన్ కు వెడదాం. నీవు చూసి చాలాకాలమైందను కుంటాను. ఇప్పుడు ఎంతో బాగుంది.'
    'అలాగే శాంతా!' అని శారదవైపు తిరిగి 'పదమ్మా వెడదాం' అని ఆ సమయానికి అక్కడ కనుపించిన టాక్సీని ఆపుచేశాడు రామం.
    శాంత ఏవో ఆలోచనలతో సతమతమవడం శారదకి ఆశ్చర్యాన్ని కలిగించింది. రామాన్నిచూస్తే చాలు మేఘాన్నిచూసి మయూరం సంతోషంతో పరవశించి పురివిప్పి నాట్యమెలా ఆడుతుందో అలా మారిపోయే శాంత ఈవిధంగా ఎందుకు ముభావంగా ఉందో శారదకు అర్ధం కాలేదు:

                             *    *    *

                                     10

    హైదరాబాదులో ప్రతిసంవత్సరం జరిగే యిండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఆ సంవత్సరం కూడా జరుగుతూ ఉంది. ఎగ్జిబిషన్ ను జంట నగరాలలో నివసించే ప్రాంతీయులు మీనాబజారు అనికూడా అంటారు.
    గాంధీభవన్ కు వెనుక భాగంలో కొన్ని ఎకరాల వైశాల్యంలో ఎంతో ఆకర్షణీయంగా ప్రతిసంవత్సరం జనవరిపదవ తేదీనుండి ఎగ్జిబిషన్ ప్రారంభమౌతూ ఉంటుంది. రకరకాల దుకాణాలు రకరకాల పారిశ్రామిక కేంద్రాల నమూనాలు ప్రభుత్వ సంస్థల అభివృద్దిని వివరించే మోడల్ రూములు, చిన్నపిల్లల రైలు, వినోద కార్యక్రమాలు, నృత్యప్రదర్శనాలు, రంగుల రాట్నాలు, చిన్నతరహా సర్కస్ లు, మ్యాజిక్ ప్రదర్శనలు, ఒకటేమిటి? వివిధ రకాలైన కార్యక్రమాలతో చూడ ముచ్చటగా ఉంటుంది.
    రంగు రంగుల దీపాలతో వివిధరకాల మనుషులతో, వింతసందడితో కళకళ లాడుతూ ఉంది ఆ ఎగ్జిబిషన్.
    చూడాలని ఉత్సాహంతో వచ్చేవారితో, చూసి ఉత్సాహంగా వెళ్ళిపోయేవారితో కోలాహలంగా ఉంది.
    రామం, శారద, శాంత ఎగ్జిబిషన్ కు వచ్చేసరికి రాత్రి ఏడు దాటింది. ముగ్గురూ కలిసి ఆ ఎగ్జిబిషనంతా ఒకసారి చుట్టి వచ్చారు. ఆ తర్వాత ఒక్కటొక్కటే వివరంగా చూడసాగారు.
    'బావా...! నాకు ఆ చీరె కావాలి.' లక్ష్మి క్లాత్ ఎంపోరియంలో ఉన్న ఒకచీరెను చూపిస్తూ అంది శాంత.
    'తీసుకో శాంతా!' అని శారదవైపు చూస్తూ 'శారదా! నీవుకూడా ఒకటి తీసుకోమ్మా!' అన్నాడు రామం.
    'నాకెందుకన్నయ్యా? ఉన్నవి చాలు'
    'అదేమిటమ్మా? నీవద్ద లేవని తీసుకో మంటున్నానా?'
    'శాంత తీసుకుంటే నేను తీసుకున్నట్లే నన్నయ్యా! ఇప్పుడు కడుతున్నవన్నీ శాంత చీరెలేగా!' నవ్వుతూ అంది శారద.
    'నా తృప్తికోసమైనా తీసుకో అమ్మా!' ఎంతో ఆప్యాయంగా అన్నాడు రామం.
    శారద యింకేమీ మాట్లాడలేక పోయింది-    
    ఎర్రనిరంగుపై నల్లనిపూలున్న సిల్కు చీరె ఎన్నుకుంది శాంత-
    తెల్లని రంగుపై పసుపుపచ్చని జరీ పూలున్న నేతచీరెను ఎన్నుకుంది శారద-
    వారి మనస్తత్వాల కనుగుణంగా వారు చీరెలు ఎన్నుకున్నట్లు గ్రహించాడు రామం-
    ప్యాక్ చేసి యిచ్చిన చీరెలను తీసుకొని మెల్లిగా నడుస్తున్నారు. వివరంగా అన్నీ చూసిన తర్వాత ఎగ్జిబిషన్ కు మధ్యలో ఉన్న పౌంటెన్ వద్ద కూర్చుని అలసట తీర్చుకో సాగారు.
    'ఎలా చదువుతున్నారు?' జిందా తిలస్మాత్ ఎడ్వర్టైజుమెంటు చూస్తూ అడిగాడు రామం.
    'బాగానే చదువుతున్నాం బావా! శారదకు మొన్నటి హాఫీయర్లీ ఎక్సామినేషన్సులో ఎవరేజు సెవంటీ పర్సెంట్ మార్కులు వచ్చాయి...'
    'మరి నీకో...?' శాంతమాట పూర్తి చేయకుండానే ఆదుర్దాగా ప్రశ్నించాడు.
    'ఎబౌట్ సిక్స్ టీ పర్సెంట్!'
    'వెరీగుడ్! ఇలాగే యిద్దరూ క్లాసు తెచ్చుకోవాలి. శాంతా నీవింకా కృషిచేయాలి శారదను అందుకో గలిగాలి'
    'అలాగే బావా!' సిగ్గుపడుతూ అంది శాంత.
    'అమ్మా శారదా! నీవు చక్కగా చదవడమే కాకుండా శాంతకూడా ఆవిధంగా చదివేలా చూస్తున్నావు. నిన్నెలా అభినందించాలో తెలియడం లేదమ్మా!'
    'అన్నయ్యా! ఇందుకు నేను ప్రత్యేకంగా చేస్తున్నదేముంది? శాంత చురుకైనది. తెలివైనది. చక్కగా చదువుకుంటూ ఉంది. ఆ విపత్కర సమయంలో శాంతే నాకు తటస్తపడి ఉండకపోతే నేనేమైపోయి ఉండేదాన్ని? మీరు నాకు చేస్తున్న దానిలో యిది ఎన్నోవంతు?' చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకుంటూ అంది శారద.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS