Previous Page Next Page 
లోకం పోకడ పేజి 22


    కర్మ కాండలన్నీ యధావిదిగానే చేశారు. రమేష్ అన్నలిద్దరూ కూడా తండ్రి బ్రతికి ఉన్నప్పుడు మనస్సులో ఏమున్నా, తండ్రి పోయిన తరువాత చేయవలసిన వన్నీ యధావిదిగానే చేశారు. ఖర్చు పన్నెండు వందలయింది. అన్న లిద్దరూ చెరో నాలుగు వందలూ ఇచ్చారు. రమేష్ వాటాకు గాను ఇంట్లో ఉన్న డబ్బు నాలుగు వందలు ఖర్చు పెట్టారు. రమేష్ కు, కామాక్షి కి చెప్పవలసిన ఓదార్పు మాటలు చెప్పి, ఇంక తమ పని తీరిపోయినట్లుగా అన్నలిద్దరూ పదమూడో రోజునే వెళ్ళిపోయారు చేతులు దులుపుకొని.
    నాగభూషణం పోయిన మరునాడే మళ్ళీ వస్తానని చెప్పి సురేంద్ర వెళ్ళిపోయాడు. ఇంక బావురుమనే ఆ ఇంట్లో రమేష్, వసుంధర, కామాక్షి మాత్రమె ఉన్నారు. వచ్చిన చుట్టాలంతా కూడా పదమూడో రోజునే వెళ్ళిపోయారు. వసుంధర తల్లి తండ్రులు అయిదో రోజున వచ్చి ఆ వారం రోజులూ ఉండి, అల్లుడికీ, కూతురు కూ విచార పడవద్దని వచనాలు చెప్పి, అల్లుడికి బట్టలు చదివించి వెళ్ళిపోయారు. అంతా వెళ్ళిపోయినా శోక దేవత మాత్రం ఆ ఇంట్లోనే ఉండి కామాక్షి ని కనిపెట్టుకు ఉంది.
    రమేష్, వసుంధర 20 రోజులు సెలవు పెట్టారు. తండ్రి పోయే సరికి ఉన్న లావాదేవీలు రమేష్ కు తెలియవు. వ్యవహారమంతా కామాక్షి చేతుల మీదనే జరిగిపోతున్నది. కామాక్షి కి తెలిసి నంతవరకూ ఆ ఊరి కరణం గారికి మాత్రం రెండు వందలు ఇవ్వాలి. తమకు రావలసిన బాకీలు లేవు. అంతవరకూ కామాక్షి కి తెలుసు.
    పదిహేనో రోజున రాఘవరావు మళ్ళీ వచ్చాడు రమేష్ కు పలకరించటానికి. అతన్ని చూడగానే మళ్ళీ ఏవో తిప్పలు వచ్చినాయని అనుకుంది కామాక్షి .
    "పాపం! మీ నాన్నగారు అందరికీ తల్లో నాలుకగా ఉండేవాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదరణ గా ఆదుకునే మనిషి. పెద్దవాడే అయినా ఇంకా పదేళ్ళు బ్రతక్కూడదూ! ఇంతకూ మృత్యుదేవత అట్లా ముందుకు వచ్చింది" అన్నాడు రాఘవరావు . రమేష్ అన్నీ వింటూ కంట తడి పెట్టుక్కూర్చున్నారు.
    "పోయిన వాళ్ళు పోయినా, ఉన్నవాళ్ళయినా జాగ్రత్త పడాలిగా? చచ్చిన నాటి దుఃఖం మర్నాడు ఉండదు. మర్నాటి దుఃఖం మూడో రోజున ఉండదు. అట్లాగే గుండె రాయి చేసుకుని ముసలాయన పూర్తీ చెయ్యకుండా వదిలి వెళ్లిన వ్యవహారాలు నువ్వు పూర్తి చేసుకోవాలి. నువ్వూ పెద్దవాడి వయినావు కదా!" అంటూ రమేష్ చేతికి ఒక కాగితం ఇచ్చాడు రాఘవరావు.
    రమేష్ చదువుకున్నాడు. దాని సారాంశం , సాటి దిబ్బల చేను యకరం పదహారు సెంట్లూ , యకరం రెండు వేల రెండు వందల చొప్పున రాఘవరావు కు క్రయం చెయ్యటానికి నాగభూషణం వ్రాసి యిచ్చిన అగ్రిమెంటు అది. బయానాగా రాఘవరావు దగ్గర వెయ్యి రూపాయలు పుచ్చుకున్నట్లుగా అందులో ఉన్నది. దస్తూరి రాఘవరావుది. సంతకం తన తండ్రి నాగభూషణందే. ఆశ్చర్యపోయాడు రమేష్. పదిహేను రోజులు క్రితం వెయ్యి రూపాయలు తీసుకుంటే ఎమయినట్లు? తండ్రి పోయే సరికి ఇంట్లో అయిదు వందలకు లోపే ఉన్నాయి. కామాక్షి నడిగితే ఆ డబ్బు , పుర్లు తగుల పెట్టినప్పుడు పోయిన ధాన్యం పోగా, మిగిలిన ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బని చెప్పింది. ఈ అగ్రిమెంటు సంగతి విని నీరయిపోయింది కామాక్షి. "సాటి దిబ్బల చేను రాఘవరావు కు అమ్మి వెయ్యి రూపాయలు బయానా పుచ్చుకుంటే, నాతొ అన్ని వ్యవహారాలు చెప్పే తండ్రి, ఈ విషయం ఎందుకు చెప్పకుండా ఉంటాడు?" అన్నది కామాక్షి. కాకపోయినా కొడుక్కు తెలీకుండా తండ్రి పొలం ఎట్లా అమ్ముతాడు? అమ్మినా ఎకరం మూడు వేల అయిదు వందలు చేసే పొలం రెండు వేల రెండు వందలకు అమ్ముతాడా? "ఇది రాఘవరావు చేసిన మోసమే' అన్నది కామాక్షి. రాఘవరావు అంతర్యం తెలిసినదే కనుక ఇది ఫోర్జరీ అగ్రిమెంటు గానే భావించాడు రమేష్. వచ్చే కోపమంతా మనస్సులోనే దిగమింగి రాఘవరావు దగ్గరికి వచ్చాడు.
    "మిగతా పైకం అంతా సిద్దంగానే ఉంది. ఎల్లుండి కొలతలు వేయించుకొని మిగతా పైకం ఇస్తాను. దస్తావేజులు కూడా ఆ రోజునే పూర్తీ చేసి రిజిస్టరు చేసుకుందాం. ఏమంటావు?" అన్నాడు రాఘవరావు.
    "వారం పది రోజులు పోయాక అలోచించి చేపితాను." అన్నాడు రమేష్. సరేనని అగ్రిమెంటు తీసుకుని వెళ్ళిపోయాడు రాఘవరావు.
    హైదరాబాద్ వెళ్ళాక ప్లీడరు సలహా తీసుకుని కార్యక్రమం ఆలోచిద్దామని కామాక్షి తో చెప్పాడు రమేష్. కామాక్షి కిదంతా అయోమయంగా ఉంది.
    పదిహేడో రోజునే ఉన్న సామానంతా బళ్ల మీద గుంటూరు చేర్పించి, అక్కడి నుంచి లారీ మీద హైదరాబాద్ చేర్పించే ఏర్పాటు చేశాడు రమేష్. తన వ్యవహరం తేల్చి పొమ్మన్నాడు రాఘవరావు. మళ్ళీ పదిహేను రోజుల్లో వస్తానన్నాడు రమేష్. ముగ్గురూ హైదరాబాద్ చేరుకున్నారు.
    హైదరాబాద్ వెళ్ళగానే జరిగిన వ్యవహరమంతా సురేంద్ర కు ఉత్తరం వ్రాశాడు రమేష్. భార్యాభర్తలు ఆఫీసుకు వెళ్లితే కామాక్షి ఇంటి పనులు చేసుకుంటూ ఇంట్లోనే ఉండేది. జరిగినవన్నీ తలుచుకుని తనలో తనే కుమిలి పోయేది.
    వారం రోజులు గడిచాక కామాక్షి ప్రోద్బలం మీద ప్లీడరు సలహా తీసుకుని రాఘవరావు కు లాయరు నోటీసు ఇప్పించాడు ---తండ్రి నాగభూషణం, వ్రాసిన అగ్రిమెంటు ఫోర్జరీ అగ్రిమెంటనీ దాని మీద తగిన చర్యలు తీసుకుంటాననీ.
    ఒక రోజున రమేష్ కామాక్షి ని అడిగాడు -- హైదరాబాద్ వాతావరణమూ, వసతులూ యెట్లా ఉన్నాయని.
    "బాగానే ఉన్నాయి" అన్నది కామాక్షి.
    "అది కాదే అక్కయ్యా. ఆడవాళ్ళు ఉద్యోగం చెయ్యటం నీకు కొత్తగా ఉంది కదూ? అందుకని ఇంటి పనంతా వసుంధర నీ మీద వదిలి, తను ఆఫీసుకు పోతున్నది. దాని జీతం దాని చీరెలకూ, జాకెట్ల కూ , బస్ చార్జీలకు సరిపోతుంది. పట్టుమని ఏ నెల్లోనూ ఏభై రూపాయలు దాచుకున్న పాపాన పోలేదు" అన్నాడు వసుంధర వైపు యెగతాళి గా చూస్తూ.
    "కాలానుగుణంగా మనమూ మారాలి. ఒక్క వసుంధర మాత్రమె ఉద్యోగం చేస్తున్నదా?  ఎంతమంది ఆడవాళ్లు ఉద్యోగాలు చేయటం లేదు? ఇలాంటి మహా పట్టణం లో వందల మంది ఉంటారు. ఇంక యింటి పన్లంటావూ? అది ఉన్నంత సేపూ నాకు ఏదో పని సాయం చేస్తూనే ఉంది. మన ఊళ్ళో కన్నా ఇక్కడ ఏమంత ఎక్కువ పనుంది? ఇంక సంపాదనంటావా? దాని బట్టలు అదే కొనుక్కుంటుంది. నిన్నేమీ కొని పెట్టమని అడగటం లేదుగా? అది మాత్రం సాయం కాదూ?' అన్నది కామాక్షి.
    "బాగా చెప్పారు వదినా. అట్లా చెప్పండి మీ తమ్ముడికి. ఎప్పుడూ నన్నూ, నా ఉద్యోగాన్ని విమర్శించటం తప్ప వారికి వేరే పని లేదు" అన్నది వసుంధర.
    "ఎవరూ ఏ విధంగానూ మనస్సు కష్ట పెట్టుకోకుండా, ఎవరి పన్లు వాళ్ళు చేసుకు పోతుంటే, అంతకన్నా మన జీవితాల్లో కావలసిందేముంది అక్కా? నాన్నకు నేనిచ్చిన మాట ఎంతవరకూ నిలబెట్టు కుంటావా అనేదే నా అనుమానం. అంతకన్నా మరేం లేదు" అన్నాడు రమేష్.
    ఈ మాటల్లోని అంతర్యం కామాక్షి అర్ధం చేసుకుంది.
    "పిచ్చి పిచ్చి ఊహలు, ఆలోచనలూ మాని మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి. మీ నుంచి నాకేమీ కష్టం కలుగటం లేదు. నా నుంచి మీరు కష్ట పడుతున్నామని అనుకోకుండా ఉంటె అదే పదివేలు."అన్నది కామాక్షి.
    "అట్లా ఎన్నటికి అనుకోవద్దు వదినా మాకు, మీరు ఎంతో సాయం గానే ఉంటున్నారుగా? మాకేమీ కష్టం కలిగించటం లేదు. మీరు మనస్సులో ఏ సంకోచమూ పెట్టుకోవద్దు. మన ముగ్గురి లోనూ ఏ కలతలూ, మాట పట్టింపులు, ఏ పరిస్థితుల్లోనూ రావనే నమ్మకం నాకుంది. మన జీవితాలు ఏ పొరపొచ్చాలు రాకుండా సాఫీగా వెళ్లి పోవాలనే నా కోరిక" అన్నది వసుంధర.
    కామాక్షి మనస్సు లో ఎంతో సంతోషించింది. రమేష్ తృప్తి గా వసుంధర వైపు చూశాడు.
    ఇన్ని నెలల నుంచీ రమేష్ కధలు గాని, నవలలు గాని, నాటకాలు గాని వ్రాయటం లేదు. మొదటి ఘట్టం లో వసుంధర కు ఉత్తరాలు వ్రాయటం తో సరిపోయింది. తరువాత పెళ్లి, ఉద్యోగం , కొత్త కాపురం, హైదరాబాద్ మకాం , తండ్రి పోవటం -- ఈ కారణాలతో రచనలు మానేశాడు. ఇప్పుడు మళ్ళీ  నగరంలో జరిగే సాహిత్య సభలూ, రచనల పోటీలు అన్నీ చూస్తుంటే మళ్ళీ కధలు వ్రాయాలనే కోరిక కలిగింది. ఈసారి నవలల పోటీకి తానూ ఒక నవల పంపాలని నిశ్చయించు కుని ఒకరోజున ప్రారంభించాడు. ఇదంతా చూసి వసుంధర, "మళ్ళీ ఆడవాళ్ళ దస్తూరీ లో ఉత్తరాలు రాయటం మొదలు పెట్టారా ?ఈసారి పేరు కూడా సరోజా, లేక ఇంకేదన్నా పేరా?" అన్నది.
    "కాదు, కాదు . ఈసారి నాపేరు వెంకాయమ్మ. ఈ పేరు బాగుండ లేదా?"
    "భేషుగ్గా ఉంది. మీ పేరు వెంకాయమ్మ యితే ఏ నరసమ్మత్తయ్య కి ఉత్తరం వ్రాస్తున్నారు?"
    "ప్రేమలేఖలు వ్రాసి నీలాంటి శూర్ప ణఖను చేసుకున్నాను. ఈసారి ఇంకో తాటకి ని చేపడతాను."
    "చాల్లెండి మీ కబుర్లూ మీరూనూ. ఆ వచ్చేదేవత్తో రానీండి. మీ ఇద్దరికీ తగిన సమాధానం చెపుత్తా."
    "నిజంగా ఎవర్నయినా ప్రేమించట మో, కామించటమో చేస్తాననుకో. ఉహూ! కాస్సేపు అనుకో. నా ప్రణయ సామ్రాజ్యలక్ష్మీ ని మనింటికి తీసుకొస్తాననుకో. కాసేపు అనుకుందూ , ఏం పోయింది? అప్పుడీ వసుంధర దేవీ ఏం చేస్తుంది చెప్మా?" అన్నాడు రమేష్ , వసుంధర బుగ్గ మీద చిన్న దెబ్బ ముద్దుగా వేసి.
    "ఏం చేస్తాను? ముందుగా హారతి పడతాను. అతిధి సత్కారాలన్నీ చేస్తాను. చీరే సారే పెడతాను. ఇవన్నీ చూసి ఆ వచ్చిందేవతో ఆశ్చర్యపడుతుంది. శ్రీమాన్ రమేష్, బహుద్దూర్ వారి ధర్మపత్ని , నా కింత బ్రహ్మరధం పడుతుందేమా అని అనుకుంటుంది. అప్పుడేమని చేపుతానో తెలుసా?" అన్నది వసుంధర.
    "ఏం చెపుతావు?"
    "కనుక్కోండి. మీరే చెప్పండి."
    "నాకు తెలీదు."
    "చెప్పనా? కోపం రాదు గదా?"
    "రాదు, చెప్పు."
    "అమ్మా, మహాతల్లి , నర్సమ్మక్కా , ఎంత దురదృష్ట వంతురాలివే నా తల్లీ! నాకు ప్రేమలేఖలు వ్రాసి వ్రాసి నన్ను మెడ కట్టుకున్నారు. వీరిని కట్టుకొని ఈ తీరున సుఖ పడుతున్నాను. నాకు తోడూ ఏడిచే వాళ్ళు లేరని నువ్వు వచ్చావా! మా అమ్మా, మా తల్లీ , ఓ నర్శమ్మాక్కా! అని చీపురు తిరగేస్తాను." అన్నది వసుంధర.
    ఇద్దరూ పొట్ట చెక్కలయ్యేటట్లుగా నవ్వుకున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS