Previous Page Next Page 
లోకం పోకడ పేజి 23


                                    17

                 
    వేసవి కాలం సెలవుల అనంతరం కాలేజీ లు తెరిచాక సురేంద్ర బి.ఎస్.సి చదవటానికి గుంటూరు లో అదే గది లో ఉంటున్నాడు. సెలవులు రెండు నెలలు కూడా ఆ గదికి అద్దె కట్టి తాళం వేసుకున్నాడు. ఇప్పుడు సురేంద్ర బాగా మారిపోయాడు. ప్రతి విషయమూ అతని కిప్పుడు ఆకళింపే . ఇదివరకు మాదిరి ఏ విషయానికీ ఆశ్చర్య పడడు.
    రాయుడు గారు శ్యామసుందరి ని పి.యు.సి లో చేర్పించారు. హాస్టల్లో ఉంచారు. ఇప్పుడు శ్యామసుందరి పొదుగు ఎదిగింది. ఇదివరకంత లావుగా లేదు. ఉండవలసిన తీరుగా ఉంది. నాజూకు గా ఉంది. ఎంతో చక్కగా, సౌమ్యంగా సరళంగా మాట్లాడటం నేర్చుకుంది. ఆమె మనస్సు లో సురేంద్ర తొలగి పోలేదు. గుంటూరు లో చేరిన తరువాత సురెంద్త ను చూడాలని అనిపించేది. మామూలు పరిస్థితుల్లో అయితే చొరవ చేసి తండ్రికి చెప్పేదే. ఇప్పుడు రామయ్య గారికీ, రాయిడు గారికీ అసలు పడటం లేదు. కారణం రాజకీయాలే . రాజకీయాలకు ప్రాధాన్యం ఇచ్చి బంధుత్వం మరిచిపోయారు. ఇద్దరూ బావ బావమరుదుల మని ఎవ్వరికీ స్పురణ కు , రావటం లేదు. ఈ వాతావరణం లో సురేంద్ర , శ్యామ సుందరి మాట్లాడుకోవటం వాళ్లకు తెలుస్తే, డానికి రాజకీయపు మెరుగులు దిద్ది ఒకరి నొకరు దుయ్య బట్టుకుంటారని శ్యామశుందరి భయం. అందుకని ప్రయత్నించలేదు. సురేంద్ర భయమూ అదే. ఎవరి మట్టుకు వారు ఈ రీతిగా అనుకోవటం తో గుంటూరు లో కాలేజీ ల్లో చదువుతున్నా ఒకరు నొకరు కలుసుకోవటానికి ప్రయత్నించటం లేదు. వాళ్ళ భావాలు మనస్సులోనే అణగి పోయినాయి.
    రామయ్య గారు ఎన్నికల్లో ఓడిపోయినా తరువాత ఊరికే ఉండటం లేదు. ఎట్లాగయినా ఆ నియోజక వర్గం లో తన పలుకుబడి తగ్గకూదడనే అయన పట్టుదల. ముఖ్యంగా ఆ చుట్టూ పక్కల పల్లెటూళ్ళ లో జరిగే ప్రతి చిన్న విషయానికీ రాజకీయపు రంగులు పూసి అధికార పక్షాన్ని దుయ్యబట్టసాగాడు. రాబోయే పంచాయితీ సమితుల ఎన్నికల్లో తన పలుకుబడి ఉపయోగించి తమ ఊరి బ్లాకు ప్రెసిడెంటు కావాలని అయన అంతరంగిక ఉద్దేశ్యం. అందుకు ప్రాతి పదికలు ఇప్పటి నుంచే వేస్తున్నాడు. ఈయన వ్యవహారమంతా చూస్తుంటే కొంత మంది పార్టీ లో వాళ్ళకే నచ్చటం లేదు. దానితో కొంతమంది కి యిష్టుడూ, కొంతమంది కి అయిష్టుడు అయినాడు.
    రామయ్య గారికి ముప్పై ఐదు ఎకరాల పొలం ఉంది. అంతా స్వంత వ్యవసాయమే. ఇద్దరు పెద్ద పాలేళ్ళూ , ఇద్దరు చిన్న పాలేళ్ళూ ఉన్నారు.
    రామన్న పాలెం పొలాలు అంతా మాగాణి భూములే అయినా సగం పైగా పల్లపు భూములు. మిగతా పొలాలు కొంచెం మెరక భూములు. మూడు పంట కాలువలు. మెరక భూములకు హైలెవెల్ చానెల్ ద్వారా నీటి వనరు ఏర్పాటు. పల్లపు భూములకు రెండు పక్కలా రెండు కాలువలు. ఊళ్ళో కొద్ది మంది రైతులకు మూడు కాలువల క్రిందా పొలాలు ఉన్నాయి. సాధారణంగా పల్లపు భూములన్నీ సాగయిన తరువాత గాని మెరక భూములు నాట్లు పడవు. రామయ్య గారికి మాత్రం మెరక ప్రాంతం లోనే పదిహేను ఎకరాల పొలం ఉంది. మిగిలిన పొలం పల్లపు ప్రాంతాల్లో ఉంది. మిగిలిన పొలం పల్లపు ప్రాంతాల్లో రెండు కాలువల క్రిందా ఉంది. మెయిన్ కెనాల్ ద్వారా ఏర్పడిన పెద్ద పంట కాలువ కొంత దూరం వచ్చాక డాము గుండా ప్రవహించి పల్లపు పొలాలు పంట కాలువల్లో పడుతుంది. ఎగువ పొలాలు నాట్లు పూర్తయ్యే వరకూ డాము కు అడ్డు వేసి, నీరు పెట్టుకుంటారు. అందుచేత మెరక పొలాలు సాగయ్యే టంత వరకూ డాము కాలువ అడ్డు తియ్యరు. ఆ ఊళ్ళో నాట్లన్నీ ప్రతి సంవత్సరం ఈ రకంగా జరుగుతూ ఉండేవే.
    ఈ సంవత్సరం కాలువ లో నీటి వనరు తక్కువగా ఉండటం నుంచి , డాము కాలువ కు అడ్డు తలుపులు వేసినా రామయ్య గారి పొలానికి నీళ్ళు ఎక్కలేదు. ఒకరోజు రాత్రి ఇద్దరు పాలెళ్ళను పంపి కాలువకు గండి కొట్టించారు. ఇంకేం? తెల్లవారేసరికి పదిహేను ఎకతాల పొలమూ తడిసింది. తెల్లవారేసరికి ఈ వార్త గ్రామమంతా పాకిపోయింది. రామయ్య గారంటే యిష్టం లేని వాళ్ళకు ఇదో అదను దొరికింది. వెంటనే పి.డబ్యూ. డి అధికార్లకు టెలిగ్రాములు ఇచ్చారు. అధికారులు వచ్చి ఆరో నంబరు వ్రాసి పై అధికారులకు పంపారు. ఇదంతా జరిగేసరికి రామయ్య గారికి ఊళ్ళో వాళ్ళ మీద కక్ష జాస్తి అయింది. ఊళ్ళో వాళ్ళకూ అయన మీద కక్ష ఎక్కువయింది. ఇదంతా అధికార పక్షం వారు చేయించారని అయన ఆరోపణ. ఇదంతా జరిగాక రాయుడు గారంటే యింకా మంట జాస్తి అయింది.
    ఈ రాజకీయాల తాపత్రయమూ, కక్షలూ, జస్టీ అయి అయన హైదరాబాదు, గుంటూరు ఎక్కువగా పోతూ, పార్టీ పెద్దలతో చర్చిస్తూ , కేవలం పార్టీ ప్రయోజనాలకే జీవితం ధారపోసిన వాడులా ప్రవర్తించ సాగాడు.
    కొడుకు సురేంద్ర గుంటూరు లో చదువు తున్నా, ఎట్లా ఉన్నాడో సరిగ్గా చదువుతున్నాడో లేదో ఒక్కసారి వెళ్లి చూద్దామనే ఉద్దేశ్యమే లేదు. ప్రతి నెలా డబ్బు పంపించటం వరకే అయన బాధ్యత. ఇంక అయన వ్యపకమంతా పార్టీ రాజకీయాల మీదా, గ్రామ పంచాయితీ వ్యవహారాల మీదా మళ్ళించాడు.
    నాట్లు పూర్తయినాయి. గండి సాగుకు రెవెన్యూ అధికారులు ఫేనాల్టీ వేశారు. ఈ ఫేనాల్టీ మాఫీ చేసుకోవటానికి అయన ఎంతో తాపత్రయ పడి ప్రయత్నం చేశాడు గాని ఫేనాల్టీ కట్టక తప్పలేదు. ఇది ఆయనకు పెద్ద తలవంపుగా ఉంది.
    ఒకరోజున రామయ్య గారి పల్లపు చేలో ఊళ్ళో వాళ్ళు ఎవరివో ఎడ్లు పడి చేను కొద్దిగా పాడుచేసినాయి. రామయ్య గారి పాలేళ్ళు ఈ సంగతి గోరంతలు కొండంతలు గాచేసి చెప్పారు. చేను పాడు చేసిన ఎడ్లు వెంకతయ్యా గారివి. ఇది వరకటి దాకా సఖ్యంగా ఉండేవాళ్ళిద్దరూ. ఇప్పుడు కత్తులు దూస్తున్నారు. ఈ రకంగా రామయ్య  గారికి విరోధులు ఇంకా ఎక్కువయ్యారు.
    దసరా సెలవుల్లో సురేంద్ర యింటికి వచ్చాడు. ఒకటి రెండు రోజుల్లోనే తండ్రికి గ్రామం లో ఎంతమంది అయిష్టు లున్నది అర్ధమయింది. తల్లి కూడా కొంతవరకు పరిస్థితులు చెప్పింది. ఇవన్నీ విని సురేంద్ర మనస్సులో ఎంతో బాధపడ్డాడు.
    ఒకరోజున రామయ్య గారు గుంటూరు వెళ్ళాడు. సురేంద్ర కు వడ్డించి తల్లి అక్కడే కూర్చుంది.
    "ఏరా, బాబూ! శ్యామసుందరి కూడా మీ కాలేజీ లోనే చేరిందా? ఎప్పుడయినా కనబడుతుందా?' అన్నది.
    "పి.యు.సి లో చేరిందమ్మా. మా కాలేజీ లో కాదు. ఆడవాళ్ళ కాలేజీ లో చేరింది. హాస్టల్లో ఉంటున్నది. అక్కడ చాలా కట్టుదిట్టంగా ఉంచుతారు. ఒక్కసారి మాత్రం నాకు కనిపించింది." అన్నాడు ముభావంగా.
    ఈ మాటలు మాట్లాడుతుంటే ఎక్కడో అంతర్లీనమై ఉన్న ఆవేదన పెల్లుబికి నట్లయింది సురేంద్ర మనస్సు లో.
    "అట్లాగే పొట్టిగా లావుగా ఉందా? కాస్త ఎదిగిందా? పెద్ద పిల్లయాక మనిషి కాస్త పల్చబడి నేవళం గా ఉండచ్చు. ఎప్పుడయినా మాట్లాడిందా? అత్తయ్యా వాళ్ళూ కులాసాగా ఉన్నారా?" అన్నది.
    "ఇప్పుడు చాలా బావుందమ్మా. పొడుగు ఎదిగింది. ఏమిటో ఆడపిల్లలు ఉన్నట్లుండి ఇట్టే ఎదుగుతారు. ఒక్కసారి పలకరించింది. నిన్ను అడిగానని చెప్పమన్నది. ఎంతో నెమ్మదిగా నమ్రతగా మాట్లాడింది. ఇదివరకులా పెంకె ఘటం లాగా లేదు. అంత చక్కగా మాట్లాడుతుందని నేననుకోలేదు. ఎవరి అదృష్టం ఎవరు చెప్పాగలరు చెప్పమ్మా?" అన్నాడు ఎంతో ఆవేదనతో. సురేంద్ర మనస్సులో శ్యామసుందరి మెదిలింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS