Previous Page Next Page 
లోకం పోకడ పేజి 21


    "ప్రమిదలో వెలిగే పత్తి నల్లగా మసిబారి కొడిగట్టే ఉంటుంది. అందుచేత ప్రమిద లో నూనె ఉండగానే ఆ వత్తిని తీసి పారేయ్యరు కదా? కోడి గట్టిన ఆ వత్తిని ఎగద్రోసి ప్రకాశింపచేయటానికి ఎవ్వరూ పూనుకోకపోతే ఏమవుతుంది చెప్పు వసుంధరా?' అన్నది శారద. వసుంధర చూడకుండా ఉండాలాని వెనక్కి తిరిగి కళ్ళు తుడుచుకుంది. కాని వసుంధర చూసింది.
    "ఇటు చూడు శారద. నాకన్నపెద్ద దానివి. నీకు నేనేం చెప్పాలో నాకు తోచటం లేదు. నీ హృదయాన్ని అర్ధం చేసుకున్న వ్యక్తీ ఏనాటి కయినా నిన్ను చేపట్టక పోడు నాకు అంతా అర్ధమయింది." అన్నది.
    "నన్ను చూసి భ్రమించి చేసుకునే వాళ్ళెవరూ లేరు వసుంధరా. అసహాయురాలయిన నాబోటి డానికి ఈ ప్రపంచం లో తావు లేదు. అందాల రాశి హాళ్ళూ, పెళ్లూగా తిరిగినా ఈ సంఘం హర్షిస్తుంది. అన్ని సుగుణాలు ఉన్నా, అందం లేని ఆడదాన్ని, , అనాకార్ని ఎవ్వరు చేపట్టరు. ఆత్మ సౌందర్యం బంగారు వన్నెతో ఉన్నా, బాహ్య సౌందర్యం బొగ్గుల గుట్టగా ఉంటె ఎవ్వరు హర్షిస్తారు చెప్పు" అన్నది శారద.
    నరనరాల్లో జీర్ణించుకు పోయిన ఆమె ఆవేదన మానసిక పరిధి లోని అంచులు దాటి ప్రవహించింది. ఆ ప్రవాహం లో ఒక్కసారి మునిగి నట్లుగా అనిపించింది వసుంధర కు.
    "ఏమీ అనుకోకు వసుంధరా. ఏదో నా మనస్సు లోని ఆవేదన ఈరోజున కారు మబ్బులు పట్టి వర్షించింది. ఈ వర్షం లో తడిశావు ఇంక జలుబు చేస్తుంది. కిందికి వెళదామా?' అన్నది శారద.
    బస్సు స్టాప్ దాకా వచ్చి వసుంధర ను బస్సు ఎక్కించింది వెళ్ళింది శారద. ఆ రాత్రి వసుంధర కు నిద్ర పట్టలేదు.
    మరో రెండు నెలలు గడిచినాయి. ఆఫీసు వాతావరణం వసుంధర కు అలవాటయింది. ఆఫీసు పని కూడా బాగా తెలిసింది. రమేష్ కు కూడా ఆ కంపెనీ లో ఆరునెలలు ప్రొబేషన్ పూర్తి కావటం చేత జీతం రెండు వందలు చేశారు. వసుంధర కు వంద రూపాయలు వస్తాయి.
    పందొమ్మిది వందల ఏభై ఏడు మార్చి లో సురేంద్ర పరీక్ష లయినాయి. ముందు గా ఇంటికి వెళ్ళకుండా హైదరాబాదు వస్తున్నానని సురేంద్ర రమేష్ కి ఉత్తరం వ్రాశాడు. రమేష్ కు ప్రాణం లేచివచ్చి నట్లయింది.
    సికిందరా బాద్ స్టేషను కు రమేష్ వెళదామని అనుకుంటూ ఉండగానే సురేంద్ర గుమ్మం లో కనుపించాడు. రమేష్ కు ఆశ్చర్యం కలిగింది.
    "అదేమిట్రా , పాసింజరు కు వస్తానని వ్రాసి జి.టి. కి వచ్చావా ఏం?"
    "అవును రా. ప్యాసింజరు చాలా లేటు. అందుకని జి.టి.కి వచ్చాను. రాత్రంతా జాగరణ చేశాను. కూర్చో టానికి క్కూడా చోటు లేదు. చాలా అవస్థ యింది. అన్నింటికీ అలవాటు పడుతున్నాన్లె" అన్నాడు సురేంద్ర నవ్వి.
    "వెరీ గుడ్. నువ్వు ప్రపంచం లో పడుతున్నా వంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది." అన్నాడు రమేష్.
    అంతలో వసుంధర కూడా వచ్చింది. "ఏమమ్మా వసుంధరా, కులాసా? మావాడు అన్ని విషయాలూ ఉత్తరం లో వ్రాశాడు లే. మీకేం ఇద్దరూ సంపాదన పరులు. అన్నట్లు తమ తమ ఆఫీసులకు టైమయింది కామాలు. అయితే వెళ్లి రండి. నేనొక్కడినే హాయిగా పడుకుంటా. చెల్లమ్మా , నాకు ఆకలి లేదు. కాస్త కాఫీ ఉంటె ఇవ్వు. కాఫీ తాగి కంటి నిండా నిద్ర పోతా. రాత్రికి ముగ్గురం సరదాగా భోం చేద్దాం."
    భార్య భర్త లిద్దరూ నోరు తెరుచుకుని విన్నారు సురేంద్ర మాటలు. వీడసలు సురెంద్రేనా అనుకున్నాడు రమేష్ మనస్సులో.
    "అరె బాప్ రే! పూరా మారిపోయావురా . ఇట్లా మాట్లాదతావని కల్లో నయినా అనుకోలేదు. ఈ అయిదు నెలల్లో చాలా మారిపోయావ్ . నీ బుర్రకి ఎక్కడ లేని తెలివి తేటలూ వచ్చినయ్యే." అన్నాడు రమేష్, సురేంద్ర వీపు మీద ఒక్క చరుపు చరిచి.
    "పోనీలేరా, నాయనా. నేనంత భాగ్య నగరం లో ఉండి ఉద్యోగం చెయ్యకపోయినా కనీసం గుంటూరు లో నైనా ఉంటున్నానుగా? అంతేకాదు . ఆ రోజున నే వెళ్ళేటప్పుడు స్టేషను లో నువ్వు చెప్పిన మాటలు నా హృదయ ఫలకం మీద సువర్ణాక్షరాలతో వ్రాసుకున్నా తెలిసిందా?" అన్నాడు.
    "ఒరేయ్ , నీ కొత్త మాటలు వినాలని అనిపిస్తున్నది. ఇవాళ కు విశ్రాంతి తీసుకో. సాయంత్రం ఆరు గంటల కల్లా ఇద్దరం వచ్చి వాలుతాం. అప్పుడు నీ ప్రతాపం చూపిద్దువు గాని. సరేనా" అన్నాడు రమేష్.
    భోజనాలయినాక రమేష్, వసుంధర ఆఫీసు లకు వెళితే సురేంద్ర ఒక్కడే ఇంట్లో ఉన్నాడు.
    వాళ్ళు వెళ్ళాక సురేంద్ర స్నానం చేసి, కాఫీ తాగి పడుకున్నాడు. చాలాసేపు నిద్రపోయాడు. మధ్యాహ్నానానికి తలుపు తాళం వేసి , హోటలు కు వెళ్లి టిఫిన్ తిని, కాఫీ తాగి మళ్ళీ ఇంటికి వచ్చాడు.
    సాయంత్రం ఆరు గంటల కల్లా వాళ్ళిద్దరూ ఆఫీసు నుంచి వచ్చారు. వసుంధర వంట ప్రయత్నం లో ఉన్నది. మిత్రులిద్దరూ బాగయాం కు వెళ్ళారు. సిమెంటు బెంచి మీద కూర్చున్నారు.
    "ఏమిట్రా, సురేంద్రా , సంగతులు? మీ శ్యామ సుందరి సంగతి తెలుస్తున్నదా? రాయుడు గారూ, మీ నాన్నగారూ కులాసాగా ఉన్నారా?" అన్నాడు.
    "అంతా కులాసానే. ఆరోజున మనమంతా హోటల్లో మాట్లాడుకుని వెళ్లి పోయామా? నేను గుంటూరు వెళ్ళిన పదిహేను రోజులకి  శ్యామ సుందరి ఉత్తరం వ్రాసింది.
    "వెరీ గుడ్, ఏం, వ్రాసిందేం? బావని పెళ్లి చేసుకుంటా నన్నదా?"
    "నీ దగ్గర దాపరిక మెందుకురా? ఇదుగో ఉత్తరం చదువుకో" అని శ్యామసుందరి వ్రాసిన ఉత్తరం రమేష్ కు ఇచ్చాడు సురేంద్ర.
    రమేష్ ఉత్తరం చదువుకున్నాడు.

                                    16    
    ఉత్తరం చదివి సురేంద్ర కు ఇచ్చి , "నేను చదివాను గాని, నీ నోటితో నువ్వు చదువు. నువ్వు చదివితే నాకు వినాలని ఉందిరా" అన్నాడు రమేష్.
    "ఏం? నేను చదివితే ఇంకా విషయాలేమయినా తెలుస్తయ్యా?" అన్నాడు సురేంద్ర.
    "కాదు చదువు . చెపుతాను."
    సురేంద్ర ఉత్తరంచదవసాగాడు.
    "బావా,
    చిన్నతనం లోని ఆటపాటలూ, అల్లర్లూ అట్లా ఉంచు. ఆ రోజులు గడిచిపోయి ఇప్పుడు పెద్దవాళ్ళ మయినాం. ఏ కారణం వల్ల నేనంటే నీకు ఇష్టం లేదో నాకు తెలీదు. నేను బావుండలేదా బావా! లావుగా , పొట్టిగా ఉన్నాననేగా! అదే నిజమయితే భగవంతుడు చేసిందానికి నేనేం చెయ్యను చెప్పు? ఆ సంగతి అట్లా ఉంచు. ఇప్పుడు మన పెద్ద వాళ్ళిద్దరి మధ్యా సఖ్యం చెడిపోయింది. ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా లేవు. ఈ విషయాలు ఇట్లా ఉండగా ఏవో రాజకీయ కారణాల వల్ల ఇప్పుడు ఒకరి నొకరు విమర్శించు కుంటున్నారు. బంధుత్వం కూడా మరిచి పోయారు. ఈ పెద్దవాళ్ళ విపరీత మనస్తత్వాల్లో, అందులో రాజకీయపు సుడి గుండాల్లో పడి వాళ్ళు మునిగి తేలుతూ ఉంటె మన విషయాలు వాళ్ళు పట్టించు కోరు. ఎవళ్ళ జీవితాలు ఏతీరుగా వెళ్లి పోతాయో తెలీదు. ఇంతకన్నా నేను ఏం చెప్పను? ఉత్తరాలు వవ్రాస్తుంటావు కదూ?
    "నేనీ సంవత్సరం స్కూలు ఫైనలు పరీక్ష కు వెడుతున్నాను. స్కూలు ఫైనలు పాసయితే ఈ ఊళ్ళో చదువు అయిపోయినట్లే. ఇంక తరువాత ఎట్లా కాలం గడపాలో తెలీటం లేదు. గుంటూరు లో ఉంచి నన్ను చదివిస్తారనే నమ్మకం లేదు. వెంటనే ఉత్తరం వ్రాస్తావు కదూ?
                శ్యామ సుందరి."
    ఉత్తరం చదివి రమేష్ వైపు చూశాడు సురేంద్ర.
    "ఈ ఉత్తరానికి సమాధానం వ్రాశావా?" అన్నాడు రమేష్.
    "వ్రాయలేదు."
    "ఎందుకని?"
    "ఏమని వ్రాయను చెప్పు?"
    "అసలు నిన్ను బ్రహ్మదేవుడు ఎట్లా తయారు చేశాడో అర్ధం కావటం లేదురా. మనసిచ్చి ప్రేమించిన ఆడదానికి ఉత్తరం వ్రాయటం చేతకాని అసమర్దుడివి. ఇంక నీ జీవితం ఎట్లా రాణిస్తుందో నాకు తెలీటం లేదు. నిన్ను చూస్తె జాలీ, కోపమూ రెండూ కలుగుతున్నాయి. వాళ్ళిద్దరి కీ తగాదా లేమిటి?"
    "మొన్నటి ఎన్నికల్లో మా మావయ్య మా ఊరి ఓటర్ల లో కొంతమంది ని కూడ గట్టుకుని తనకు వ్యతిరేకంగా ఓటు చేయించినట్లుగా మా నాన్న అనుమానం. మావయ్య మీద లేనిపోని అనుమానం పెట్టుకున్నాడు మా నాన్న. కార్మిక , కర్షకుల్లో కూడా చైతన్యం కలిగి వాళ్ళ ఇష్టానుసారం గా ఓటు హక్కు వినియోగించు కుంటున్నారు. అంతేగాని ఇదివరకు లా మూక ఉమ్మడిగా, గుడ్డిగా ఏ ఒక్క పార్టీకీ ఓటు చెయ్యటం లేదు. ప్రజలు కూడా పార్టీల ,మంచి చెడ్డలు బాగా ఆకలింపు చేసుకున్నవారే. కేవలం పార్టీ చిహ్నం చూసి ఆ పెట్టెలో ఓటు వేసి రావటం లేదు. ఏ పార్టీ ని బలపరిస్తే వారికి మేలు కలుగుతుందో వాళ్ళకే తెలుసు. కాని అనవసరంగా మా నాన్న మావయ్య మీద అనుమాన పడ్డారు. అదీ సంగతి" అన్నాడు సురేంద్ర బరువుగా నిట్టుర్పు విడుస్తూ.
    "మీ మావయ్య కు కోపం ఎందుక్కలిగింది?"
    "మా నాన్నని బట్టే మావయ్య కూడా. పెద్ద వాళ్ళ కక్షలు వాళ్ళ పిల్లలకు ఈ విధంగా వర్తిస్తాయి."
    "పోనీ బావమరుదులిద్దరూ ఒకే పార్టీలో ఎందుకు చేరిపోకూడదూ?"
    "అట్లా చెయ్యరు. చిన్నప్పటి నుంచీ, ఏ పార్టీ సిద్దాంతాలకు తమ జీవితాలకు అంకితం చేశారో ఆ పార్టీలనే నమ్ముకున్నారు. ముఠా తత్త్వాలు గాని, ముఠా రాజకీయాలు గాని ఎవ్వరికీ ఇష్టం లేదు. అందుకనే మా మావయ్య తోఆ నియోజక వర్గం లో పోటీ చేసి ఎవ్వరూ గెలవలేరు. ప్రజల వాణి తన వాణి. అందుకనే మావయ్య అంటే అంతా బ్రహ్మరధం పడతారు. అన్యాయాలు ఆయనకు గిట్టవు. అయన వేలెత్తి చూపితే అది అందరికీ అన్యాయంగానే కనబడుతుంది. రెండు సార్లు కారాగారానికి కూడా వెళ్ళాడు. మా నాన్న కూడా తన పార్టీనే నమ్ముకున్నాడు. పార్టీకి అయన ఎంతో సాయం చేశాడు.  పార్టీకి ఆయనంటే ఎంతో గౌరవం ఉంది. కాని ఆయనకు కోపం జాస్తి. అయితే పార్టీ అంటే  ఏమిటో ప్రజలు అర్ధం చేసుకున్నారు. రెండుసార్లు అయన ఎన్నుకో బడలేదు. దానికి కారణం ప్రజలు. అంతేగాని మావయ్య కాదు" అన్నాడు సురేంద్ర ఉద్రేకంతో.
    "మీ మావయ్య మా నియోజక వర్గం ప్రతి నిధి. శాసన సభ్యుడు కూడా. ఆయనకు పేరు ప్రతిష్ట లున్న మాట నిజమే. ఈ రోజుల్లో అంత నిజాయితీ గా ఉండేవాళ్ళు తక్కువ."
    "అయితే ఏం? ప్రజా ప్రతినిధి, నలుగురికీ తల్లో నాలుకగా ఉండేవాడూ , కన్నకూతురు విషయం లో మాత్రం ప్రతిపక్ష నాయకుడు గానే ఉన్నాడు. దీని కంతకూ కారణం మొదటి వాడిని నేను. రెండు మా నాన్న. ఆయనకు కోపం రానేరాదు. వస్తే అంతు తేల్చుకోవాల్సిందే. మూడు మా మావయ్య. అంతా కలిసే ఇంత వరకూ తీసుకొచ్చాం. ఇంక మా అమ్మ ఉన్నదంటే వీళ్ళ మనస్సులు ఏరకంగా అర్ధం చేసుకో వాలో తెలీక ఈ రోజు వరకు సతమతమౌతూనే ఉంది. ఆవిడ రోజులు అతీరుగా వెళ్లి పోవాల్సిందే" అన్నాడు.
    "ఇవాళ నేను చాలా అదృష్ట వంతుడివిరా, సురేంద్రా. నీ మనస్సు లో ఎన్నో సంవత్సరాల నుంచీ పేరుకుని గడ్డ కట్టుకు పోయిన భావాల్ని నువ్వు చెప్పగా వింటున్నాను. నీలో కోరికలూ, భావాలూ, ఆలోచనలూ అన్నీ ఉన్నాయి. కాని వాటిని గాలం వేసి తీసే అదృష్టం నాకు కలిగింది." అన్నాడు రమేష్.
    "నా మనస్సు నీకు విప్పి చెప్పాను. నన్నేం చెయ్యమంటావో సలహా ఇవ్వు."
    "శ్యామ సుందరికి ముందు ఉత్తరం వ్రాసి చూడు. ఆ పిల్ల భావాలు తెల్సినాయి కదా? అనవసరం గా ఆ పిల్ల మనస్సు క్షోభ పెట్టకు."
    కాస్సేపు కూర్చుని కబుర్లు చెప్పుకుని ఇంటికి వెళ్ళారు.
    అర్ధరాత్రి పన్నెండింటి కి రమేష్ కు టెలిగ్రాం వచ్చింది. ముగ్గురూ ఆత్రంగా టెలిగ్రాం చూశారు. తండ్రికి ప్రమాదంగా ఉన్నదనీ,  వెంటనే బయల్దేరి రమ్మనీ కామాక్షి ఇచ్చిన టెలిగ్రాం అది. అంతా కుప్పగా కూలిపోయారు.

                                                  *    *    *    *
    రమేష్ వసున్ధరాలతో బాటుగా సురేంద్ర కూడా ప్రసాదాపురం వెళ్ళాడు. రెండో రోజు సాయంత్రానికి అంతా ప్రసాదాపురం చేరారు. అప్పటికే నాగభూషణాన్ని అరుగు మీద చాప వేసి పడుకో బెట్టారు. అంతకు గంట క్రితమే పెద్ద కొడుకూ, రెండో కొడుకు వచ్చారు. కోడళ్ళూ, పిల్లలూ రాలేదు. అప్పటికే నాగభూషణానికి నోటి మాట పోయింది. కంటి చూపు మాత్రం ఉన్నది. మగతగా చూస్తున్నాడు. రమేష్ వెళ్ళగానే పక్కన కూర్చుని, "నాన్నా, నేను రమేష్ ని. నిన్ను చూట్టానికి వచ్చాను. ఎట్లా ఉంది? నాతొ మాట్లాడవూ?" అన్నాడు చేతులు పట్టుకుని. పక్కనే కామాక్షి గుడ్ల నీరు గుడ్ల గుక్కుకుని కూర్చుంది. నాగభూషణం ఏదో చెప్పబోయాడు. గొంతు పెగిలి మాట రాలేదు. రమేష్ వైపూ, కామాక్షి వైపూ చూశాదు. కళ్ళ వెంట నీరు కణతల మీదుగా కారింది. అంతే. అందర్నీ విడిచి ఈలోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయాడు. క్షణం లో ఇల్లంతా రోదన ధ్వనులతో నిండి పోయింది. చూడవచ్చిన వాళ్ళంతా కంట తడి పెట్టారు. రమేష్, కామాక్షి గుండె లవిసిపోయేటట్లుగా ఏడ్చారు. ఏడ్చి ఏడ్చి సోమ్మ సిల్లిపోయింది కామాక్షి. దిక్కులేని వాళ్ళ మయామని కామాక్షి ఒకటే ఏడుపు.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS