బావతో అసలు విషయం ఎలా కదపాలో కళకు అర్ధం కాలేదు. తోవలో నాలుగైదు సార్లు మాట్లాడబోయింది. కాని చేత కాలేదు. శేఖర్ అవీ, ఇవీ మాట్లాడుతూ పక్కనే నడుస్తున్నాడు. కళ 'అవును" "కాదు" అంటూ జవాబులిస్తూ పరధ్యానంగా నసుస్తున్నది... బావ తన మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో? తను కాదంటే ఎంత బాధ పడతాడో?....
సినిమా హాలు దగ్గర మెట్నీ చూసిన జనం గుంపులు గుంపులుగా ఇవతల కోస్తున్నారు. గేటు కివతల , లోపల వేరు సెనక్కాయలు, బఠానీలు అమ్ముకునే వాళ్ళు చకచకా వ్యాపారం సాగించు కుంటున్నారు. అందమైన కార్లు పరుగు లేడుతూ గేటు లోపలి కొస్తున్నాయి. నైలాన్ చీరలు, ఘుమ ఘుమ లాడే సెంటు వాసనలు, రంగు రంగుల పూలు తళుకు తళుకులాడే నగలు, టెర్లిన్ షర్టులు , గాబర్దిన్ సూట్లు, నెక్ టై లు....కోలాహలంగా కేకలు, అరుపులు, సందడిగా మాటలు.... చక్కని టెక్నికలర్ టాకీలా కనబడింది.
శేఖర్ టిక్కెట్లు తీసుకొచ్చాక ఇద్దరూ లోపలి కెళ్ళి కూర్చున్నారు. ఆట ప్రారంభం కవటానికింకా టైం ఉన్నది. రికార్డులు వినిపిస్తున్నాయి.
క్రమంగా హాలు నిండి పోతున్నది. కొత్తగా పెళ్ళయిన జంట కాబోలు హుషారుగా , చలాకీగా నడుస్తూ కుర్చీ సీట్ల దగ్గర కొచ్చారు. తమ సీట్లను దాటుకుంటూ వెళ్ళి కాస్త దూరంలో కూర్చున్నారు. రెండు జడలు వూగిస్తూ , నవ్వులు చిలకరిస్తూ ఆనందలహరి లో తేలిపోతున్న ఆ యువతిని చూస్తె కళకు అసూయ వేసింది. తన సరసన బావ బదులు సుధాకర్ ఉంటె తను కూడా అలాగే హాయిగా కేరింతలు కొడుతూ ఉండేది కదా?
తన వెర్రి కాకపొతే సుధాకర్ కు తనింకా జ్ఞాపకం ఉంటుందా? మగవాళ్ళ కి ప్రేమంటే ఏం తెలుసు? మరో భామ కంట బడితే చాలు పాత సంగతులన్నీ మర్చిపోతారు. వాళ్ళ మాటలు నమ్మి మమకారం పెంచుకోటం ఆడదాని తప్పు, బలహీనత. తన తప్పుకు బావను మోసం చెయ్యటం దేనికి? సుధాకర్ తో పెళ్ళి జరక్కపోతే తనకీ జన్మ లో పెళ్ళే వద్దు. ఆ సంగతి చెప్పకపోతే బావ తన మీద ఆశలు పెంచుకుని అధోగతిని పాలుగాక తప్పదు. ఫలించని ఆశలు పతనానికి దారి తీస్తాయి.
కళ నీరసంగా నిట్టూర్చింది.
శేఖర్ "ఇంకా తలనొప్పి సర్దుకోలేదా?' అనడిగాడు జాలిగా.
కళ తల అడ్డంగా తిప్పింది. కాస్సేపు తటపటాయించి గొంతుక సవరించుకుని మెల్లిగా మాట్లాడింది.
"బావా! నేనంటే నీ కిష్టమా?...."
ఎదురు చూడని ఈ ప్రశ్నతో శేఖర్ తికమక పడి అర్ధరహితంగా నవ్వాడు.
"ఇదేం ప్రశ్న?.... ఎందు కిష్టం ఉండదూ?" అన్నాడు చివరకి.
కళ కుర్చీని దృడంగా నొక్కి పట్టుకుంటూ "కాని నా కిష్టం లేదు....' అంది.
శేఖర్ తెల్లబోయాడు.
చెప్పవలసిన దానికి నాందీ ప్రస్తావన జరిగింది. ఇప్పుడింక కళకు వెనకటి భయమంతా దూది పింజలా ఎగిరి పోయింది.
"నిజంగా చెప్తున్నాను. నాకీ పెళ్ళి ఇష్టం లేదు .... అత్తనన్నీ ఇంటి కోడలిగా చూస్తున్నది. నువ్వూ అలాగే అనుకుంటున్నావేమో కూడా.... అందరూ నీ ఇష్టం సంగతి ఆలోచిస్తారు కాని నాకు ఇష్టమున్నది లేనిదీ కనుక్కోరు-- ఈ సంగతి చెప్పడానికే నేను నీతో సినిమా కొచ్చాను" అంది ఘాటుగా.
శేఖర్ నిట్టూర్చాడు.
"నా ఇష్టం మాత్రం ఎవరు కనుక్కున్నారు నువ్వు తప్ప!" అన్నాడు.
కళ ప్రశ్నార్ధకంగా శేఖర్ ముఖం లోకి చూసింది.
"నాకూ ఈ పెళ్ళి ఇష్టం లేదు!"అన్నాడు శేఖర్ తేలిగ్గా శ్వాస విడుస్తూ.
అందంగా ఉన్న వాళ్ళకి అతిశయం ఎక్కువ. ఎంతసేపూ ఆ అందానికి మెరుగులు దిద్దుకోవటం లోనే వాళ్ళకి రోజంతా గడిచి పోతుంది. మరొక ధ్యాసే ఉండదు. ఆడవాళ్ళకి ఇష్టమైనవి రెండే రెండు -- డబ్బు, పొగడ్తలు -- ఆ రెండూ తను కళ కోవ్వలేదు. అదీగాక అధికారం చలాయించే ఆడవాళ్ళకు దూరంగానే ఉండాలి...
శేఖర్ జవాబుతో కళ అహంభావం దెబ్బతిన్నది. బావ ఈ విషయాన్ని ఇంత తేలిగ్గా తీసుకో గలడని తను కలలో కూడా అనుకోలేదు. తనలాంటి అందాల రాశి వద్దంటే బావ విలవిలలాడి పోడా అనుకుంది తను--
"నిజంగా?' అనడిగింది కళ అనుమానంగా చూస్తూ .
"ముమ్మాటికి నిజం! నిన్ను పెళ్ళి చేసుకునే వాడు అదృష్టవంతుడైతే కావచ్చు కాని నాకా అదృష్టం అక్కర్లేదు....
కళ తెల్లగా పారిపోయింది..... అహంభావం దెబ్బతిన్నా బావ తనను పెళ్ళి చేసుకోమని బలవంతం చెయ్యనందుకు మనస్సు కృతజ్ఞత తో నిండి పోయింది.....
"ఎవరినన్నా ప్రేమించావా బావా?' అంది మెల్లిగా , మందహాసం చేస్తూ.
"ఆ మాటే నిన్నడిగి తేనో?' అంటూ శేఖర్ నవ్వాడు.
కళ సిగ్గుపడి వూరుకుంది.
లైట్లు ఆరిపోయాయి. అట ప్రారంభమయింది.....
కళ సినిమా ధ్యాసలో పడింది. ముందు వరస లో తన ఎదుటి కుర్చీలో కూర్చున్న మనిషి అప్పుడప్పుడు తనకేసి చూస్తున్నాడు. పోకిరీ వెధవ అని తిట్టుకుంది కళ....
ఇంటర్వెల్ లో లైట్లు వెలిగాయి. హల్లో మళ్ళా సందడి ప్రారంభమయింది. కొంత మంది లేచి బైటి కేళ్తున్నారు. ముందు వరస లో తన సీటు కెదురు కూర్చున్న వ్యక్తీ కూడా హడావుడి గా బైటికి వెళ్తున్నాడు. కళ అతన్ని చూసి ఉలిక్కిపడింది. మోహన్! ఇక్కడికెలా వచ్చాడు?.... అతన్ని కనుక్కుంటే సుధాకర్ సంగతులేమైనా తెలుస్తాయి....
కళ కంగారుగా లేచి బైటి కొచ్చేసరికి మోహన్ కనబడలేదు. అట మొదలయ్యాక మళ్ళా ఎలాను వస్తాడు కాబట్టి అప్పుడే అడగొచ్చు ననుకుని కళ మళ్ళా లోపలికొచ్చి కూర్చుంది.
శేఖర్ బైట కిళ్ళీ షాపు దగ్గర సిగరెట్ కాలుస్తూ నించున్నాడు.... సన్నగా, చలాకీగా కనబడుతున్న ఆ మనిషెవరో తన నెందుకలా చురచురా చూస్తూ పోతున్నాడు? ఎక్కడా చూసిన గుర్తు లేదే? తనకు, అతనికి శత్రుత్వం ఏమిటి? చిత్రంగా ఉన్నదే అనుకున్నాడు శేఖర్.
మళ్ళా అట ప్రారంభం అయింది. కళకు సినిమా మీద లేదు. మోహన్ వస్తాడని చాలాసేపు ఎదురు చూసింది. కాని అరగంట దాటినా ఆ సీటు ఖాళీగానే ఉండిపోయింది. కళ మనస్సు ఉసూరు మంది. హాలంతా చీకటిగా, భయంకరంగా కనబడింది. తెర మీది బొమ్మలు పెను భూతల్లా కనబడ్డాయి. కళ చటాలున కుర్చీలో నుంచి లేచింది. శేఖర్ కళ వెంట వెళ్ళాడు.
సుధాకర్ ఎందుకని ఉత్తరం వ్రాయలేదు? తనకు వ్రాస్తే బాగుండదని ఆలోచించాడా? లేకపోతె తన మీద కోపం వచ్చిందా?... బావ ఉన్నాడని తెలిసిన దగర్నించి అతనికి తన మీద అనుమానంగానే ఉన్నది! తన ఆరాధ్య దైవం బావ కానే కాడని అతనికి మనసు విప్పి చెప్పలేకపోయింది. చివరకు వీడ్కోలిస్తూ 'బావ ధ్యాసలో నన్ను మర్చిపోరు కదా?" అని సుధాకర్ జాలిగా అన్నప్పుడు కూడా తను జవాబెమీ చెప్పలేకపోయింది. ముఖం చాటు చేసుకుని కన్నీరు మాత్రం కార్చింది. ఒకసారి సిగ్గు, మరొకసారి దుఃఖం రెండు సార్లూ తన ప్రేమను వ్యక్తం చేయలేక పోయింది. సుధాకర్ తనను అపార్ధం చేసుకోలేదు కదా?
శేఖర్ ఉన్నట్టుండి అడిగాడు.
"కళా! నువ్వు నా కంటే పొడగనుకుంటాను"
కళ నవ్వింది.
"అవునేమో ! నేను ఫైవ్ ఫోర్! నీ హైటెంత"
"నాకంటే అరంగుళం తక్కువే నన్న మాట." పై నుండి చూసి నా కంటే ఎంతో పోడుగనుకున్నాను! ఆడవాళ్ళు ఎంత దగా చేస్తారు?" అని నవ్వాడు శేఖర్.
కళకు మెరుపులా ఒక ఆలోచన తట్టింది.
"చాలా థాంక్స్! అత్త సాగదీసి అడిగితె నువ్వు నా కంటే పొట్టి అని తప్పించు కుంటాను." అంది హుషారుగా.
ఇంటికి వెళ్ళేసరికి 'అప్పుడే అయిపోయిందా సినిమా?" అంటూ ఆశ్చర్య పోయింది జయమ్మ.
వరండా లో పక్కలు పరిచి ఉన్నాయి. ఒక మూల ఊర్వశి పడుకుని ఉంది.
శేఖర్ వరండా మెట్లు మీది కూర్చుని బూట్లు విప్పుకుంటూ "ఇంగ్లీష్ సినిమాలు చిన్నవే ఉంటాయి లేవే...." అన్నాడు.
కళ లోపలి కేల్తూ "అబద్దాలు అడ్డం లో బావ నేర్పరే" అనుకుని నవ్వుకుంది. కనీసం మూడున్నర గంటలకు తక్కువాడని తెలుసు సినిమా సగం దాకా చూసి వచ్చారు.
శేఖర్ సరాసరి కుక్క దగ్గర కెళ్ళి దాన్ని ముద్దు పెట్టుకున్నాడు. జయమ్మ సినిమా కధేమిటి అడిగితె చూసినంత వరకు చెప్పుకొస్తున్నాడు. ఇంతలో కాలు మీద ఏదో కరిచి నట్టయింది బాధగా ఇటు తిరిగేసరికి వూర్వశి తెరిచి ఉన్న గేటు లో నుంచి పరిగెత్తి పారిపోయింది. రక్తం కారటం లేదు కాని కాలు మీద పంటి ఆనవాళ్ళు కనబడుతున్నాయి. రక్తం కారలేదు కాబట్టి రేపోద్దున్నే ఆస్పత్రి కెళ్ళి చూపించుకుంటే మించి పోయేదేమీ ఉండదని ఆలోచించుకున్నాడు శేఖర్.
జయమ్మ ఖాళీగా ఉన్న స్తంభం కేసి చూస్తూ "కుక్కేదిరా?' అనడిగింది కంగారుగా.
"గొలుసు తెంచుకుని పారిపోయింది..." కాలు పట్టు కూర్చున్న శేఖర్ ను చూసి జయమ్మ గాభరా పడింది.
"అదేమిటిరా? కాలు పట్టుకున్నావ్? కుక్క కాని కరవలేదు కదా?"
నిజం తెలిస్తే రాత్రికి తనను నిద్రపోనివ్వదు . అందుకని గభాలున లేచి "అబ్బే! అదెందుకు కరుస్తుంది?.... దాన్ని వెతికి పట్టుకొస్తాను...." అంటూ బైటి కెళ్ళాడు.
ముద్దుగా, శ్రద్దగా చూసుకుంటున్న ఊర్వశి కరిచేసి పారిపోయింది. కుక్కలు విశ్వాసమైనవంటారు! ఊర్వశి కుక్క జాతికే అప్రతిష్ట తెచ్చింది కదా?
శేఖర్ గబగబా నడవలేక మెల్లిగా సందు ఈ చివర నుంచి ఆ చివరి వరకు వెళ్ళి వచ్చాడు. రోడ్డంతా ఖాళీగా ఉన్నది. ఊర్వశి కాదు కదా మరో కుక్క కూడా కనబడలేదు. ఊర్వశి కి తనకు ఋణం తీరిపోయింది......
శేఖర్ ఇంటి కొచ్చి మాట్లాడకుండా పడుకున్నాడు.
కళకు నిద్రపట్టలేదు.... చిత్ర ఒక సినిమా తార ఫోటో చూసి పెన్సిల్ తో రేఖలు గీస్తూ పోలికలు తేవటానికి ప్రయత్నిస్తున్నది. కళ మనస్సంతా అల్లకల్లోలంగా ఉన్నది. మోహన్ తనను చూసి కావాలనే కనబడకుండా పోయాడా? తనేం అపకారం చేసింది? సుధాకర్ ను గురించి చల్లని కబుర్లేవైనా చెబుతాడేమోనని తాను ఆశ పడింది.తన ఆశ ఫలించలేదు. మనస్సు నిస్సహాయంగా రోదిస్తున్నది.
