"అన్నట్టు కృష్ణశాస్త్రిగారి పైన నీ అభిప్రాయం ఏమిటి బావా!" మధ్యలో అడిగింది మృణాళిని.
ప్రసాదానికి పచ్చివెలక్కాయ గొంతులో యిరుక్కున్నట్టయింది. పతి, కృష్ణశాస్త్రి గురించేమీ చెప్పలేదు. అందుచేతనే తన బుర్ర నుపయోగించి,
"ఆయన తెలుగు సాహిత్యాని కొక మణిపూస" అన్నాడు.
"మరి విశ్వనాధవారో."
"ధృవతార." అనేసి తన సమయస్ఫూర్తికీ, చక్కటి పోలికకీ మురిసిపోయాడు ప్రసాదం.
"అయితే నువ్వు చాలా చదివావూ!"
"హు ..... చదవడం! నేనూ మరో వెంగళప్పయ్యా చదువుతారు. అదికాదు గొప్పతనం. ఆ మహానుభావులేం చెప్పారనేది ఆకళింపు చేసుకోవాలి, అది ముఖ్యం. చూడరాదూ-ఆరుద్ర త్వమేవాహమ్ చిద్వి శ్రీశ్రీ లాటివారు 'నేనిహ పద్యాలు రాయకపోయినా ఫర్వాలేదు' అన్నారంటే"
"అవునుగానీ త్వమేవాహమ్ నీకు నచ్చిన పుస్తకాల్లో ఒకటా బావా?'
"నాకు నచ్చిందే త్వమేవాహమ్. అది మమూలు పుస్తకం కాదు. మహా కావ్యం. ఎంత చక్కటి అభిప్రాయా లున్నాయి దాన్లో. జీవితాన్ని ఆరుద్ర ఎంత బాగా అర్ధం చేసుకున్నా డనుకున్నావ్. ఒకచోట జీవితం గురించి అంటదు.
'జీవితం తిరునాళ్ళలో ఖర్చుపెట్టుకోమని
పెదనాన్నగారు ఇచ్చిన డబ్బులు కాలం
చరాచర జీవకోతిని శ్రీమంతులైన బంధు
వర్గం
మానవుడు మానవుడి కిచ్చిన వారసత్వం కాలం'
అనీ.
ఆరుద్ర తన చమత్కారంతో పాఠకుణ్ణి చప్పున ఆకర్షిస్తాడు. కవిత్వంలో టెక్నిక్ కావాలన్న వాళ్ళలో ఆరుద్ర ఒకడు. ఆయన కవిత్వంలో పాత్రోచిత ఛందస్సువాడారు. ఆయనే అంటారు. గిరీశం చేతో రిషణోద్భాసితస్థ విష్టా న విష్టవచయమము' అని ఎలా అనిపించలేరో అలాగే అగ్నిహోత్రావధాన్లు చేత 'షి లీవ్స్ ది బెడ్ ఏ ఎమ్ ఫర్' అనిపించాలేరూ అని. ఆవిధంగా-" అని ఆపేశాడు, తర్వాత ఏం చెప్పాలో గుర్తుకు రాక.
మృణాళిని అతనీపైన దండయాత్ర సాగించింది. చకచకా చదివినట్టు.
"బ్రెయిన్ లో బ్రెన్ గన్
రెయిన్ లా ఆలోచనల ట్రెయిన్
స్పయిన్ లా కార్డులో స్పెయిన్ ......
...... ........ ........ ......
చదివి ఆగి ఇక్కడ కవి హృదయం ఏమిటో చెప్పు బావా! వినాలని ఉంది" అని అడిగింది.
ప్రసాదం బిక్కమొహం పెట్టేడు.
"నువ్వు చదివావా త్వమేవాహమ్" అని అడిగేడు నెమ్మదిగా.
"చదివాను కాని యిక్కడ కవి హృదయం...."
"పోనిద్దూ కొన్ని కవి హృదయాలు మనకి అర్ధంకావు. వాటి మానాన వాటి నొదిలిపెట్టడం మన ధర్మం."
ఆరుద్రని చదివినట్టు గానీ, ఇలా అడుగు తుందనిగానీ ముందే తెలుస్తే కాస్త జాగ్రత్త పడేవ్డు ప్రసాదం. ఇప్పుడు జరగవలసిణ ప్రమాదం జరగనే జరిగింది.
మృణాళిని పకపకా నవ్వేసి అన్నది.
"నువ్వే అన్నావుగా బావా! మహానుభావులెం చెప్పారో చదివి అర్ధం చేసుకోవాలని. అప్పుడే ఆ మాట కాస్తా మార్చేస్తే ఎలా?"
బావకి దడ పట్టుకుంది. మృణాళిని 'సాహిత్యం'లో ఈమాత్రం ప్రవేశ ముందని తెలుస్తే ఆ జోలికి పోఎవాడే గాడు. ఇప్పుడు కొంపమీదికి తెచ్చుకున్నట్టయింది.
"కాబట్టి మై డియర్ ప్రసాదం! ఆచరిండడం చెప్పినంత సులభం కాదు."
ప్రసాదం ఏమీ మాటాడలేదు.
"ఊఁ ..... పోనీలే ..... ఏదైనా కొత్త విషయం చెపుదూ."
"నీకు నేను చెప్పవలసిన వాడినా" అన్నాడు బాధగా, నిష్ఠూరంగాను.
మృణాళినికి బావపైన జాలి కలిగింది....
"నిన్ను కించపరచాలనినా కెప్పుడూ లేదు బావా. మీదు మిక్కలి నువ్వంటే నాకు విపరీతమైన గౌరవం" అన్నది సూటిగా.
"నిజమా." అడిగాడు.
తలూపింది మృణాళిని.
"నేను చాలా అదృష్టవంతుడ్ని చిట్టీ!" అన్నాడు ఆనందంగా.
"అబ్బ మళ్ళా ఆపేరేనా. పిలుస్తే....."
"ఆల్ రైట్ కరెక్ట్ మృణాళిని! నిన్ను మృ .....ణా ....... ళి ..... ని అనే పిలుస్తాను." అన్నాడు ప్రసాదం.
అప్పటికే బాగా చీకటి పడింది, ఇద్దరూ లేచారు యింటికి వెళ్ళడానికి. అనుకోకుండా చిన్న వర్షపుజల్లు రావడం ప్రారంభమైంది. గబగబా నడిచి ఓ రిక్షాలో ఎక్కారు యిద్దరూ.
రిక్షా కదిలింది. దారి మధ్యలో .....
"ఇలాగే నీ పక్కన కూర్చుని జీవితమంతా గడపాలని ఉంది మృణా!" అన్నాడు ఆమె చేతిని తీసుకుంటూ.
"దూరం దూరం ..... కాస్త ఓపికపట్టు బావా!" అన్నాది మృణాళిని చిలిపిగా.
ఈమాట రిక్షావాడూ విన్నాడు. వెనక్కి తిరిగి ఆ జంటవైపు చూశాడు. అతనలా చూడగానే ఇద్దరూ సిగ్గుపడిపోయారు. రిక్షావాడు మళ్ళా మామూలు స్థితికొచ్చి 'మేరా నామ్ రాజూ ఘరానా ఆనాం.....' పాడుకుంటూ రిక్షా వేగాన్ని పెంచాడు.
* * *
ఆఫీసులో పతి ఒక చిన్న ప్రతిపాదన తీసుకొచ్చాడు.
"రేపు శనివారం గనుక ఆదివారం ఎలాగో కలిసి వస్తుంది. కాబట్టి మనం చిన్న టూర్ వేద్దామని ఉంది. శంకరం భద్రాచలం వెళ్ళేడు. మనం అంత దూరం వెళ్లకపోయినా, మనకి దగ్గర్ల్లో ఉన్న అమరావతికి వెడదామని ఉంది." అన్నాడు.
"ష్యూర్" అన్నాడు ప్రసాదం.
"మరి నీ మాటేమిటి పతి."
"అలాగే."
"అయితే రేపు అమరావతి వెళ్ళడమనేది సెటిల్డ్. రేపు ఈవినింగ్ యిక్కడ లాంచీ ఎక్కితే రాత్రికి అమరావతి చేరుకుంటాం. అక్కడ మనక్కావలసిన తిండీ గట్రా ఏర్పాటులన్నీ ప్రసాదం చూడాలి. ఎంచేతంటే-యిల్లంటూ ఒకటి అతనిక్కూడా ఉన్నది గనుక."
ప్రసాదం వప్పుకున్నాడు. ఆ రాత్రికి అన్నీ సమకూర్చుకున్నారు. శనివారం ఒక పూట మాత్రమే అఫీసుంటుంది. మాధ్యాహ్నం కాఫీలు తాగిన తరువాత రేపు దగ్గరికి వెళ్ళేరు.
అమరావతి వెళ్ళే 3 గంటల లాంచీ మీద ఎక్కారు.
లాంచీ ప్రయాణం సరదాగా ఉంటుందనడంలో సందేహంలేదు. పాదరసంలా పారే నీటిపైన లాంచీ నడక మెత్తగా సాగుతుంది. అసలు కదులుతుందా అనే భ్రమా కలిగిస్తూంది.
లాంచీ నది మధ్యకి వచ్చింది.
డబ్ డబ్ మోతతో నీటిపైన పరుగెడుతోంది లాంచి. పైన నిరలమైన ఆకాశం, చుట్టూ గట్టులూ, పొదలూ, దూరాన అందమైన కొండలూను.
వాసుదేవరావు 'విమెన్ ఆఫ్ రోమ్' చదువుతున్నాడు. తమకి ఎదటి సీట్లో ఇద్దరమ్మాయిలు కూర్చున్నారు. ఇద్దరూ నవనాగరికంగా అందంగా ఉన్నారు.
ప్రసాదం గుడ్లప్పగించి వాళ్ళవంకే చూడటం మొదలుపెట్టాడు. అతని వాలకాన్ని గమనించిన పతి అతన్ని హెచ్చరించేడు మోచేత్తో కుదిపి.
ప్రసాదం తెప్పరిల్లాడు. పతివైపు చూశాడు. పతి కళ్ళద్వారా అన్నాడు :"అలా వెర్రిమొహం వేసి చూస్తే ఏం బావుంది చెప్ప" అని.
ప్రసాదం నాలుక్కరుచుకుని సర్దుకు కూర్చున్నాడు.
వాసుదేవరావు విమెన్ ఆఫ్ రోమ్ లో పూర్తిగా మునిగిపోయేడు. పతి దూరంగా కనిపిస్తున్న కొండలవైపూ, అప్పుడప్పుడూ లాంచీ నడకలో చెల్లాచెదరవుతున్న నీటివైపూ చూస్తున్నాడు.
ప్రసాదానికి పిచ్చెత్తినట్టయింది. అతనికేమి తోచడంలేదు.
తమ ముందు కూర్చున్న ఇద్ద రమ్మాయిల్లో ఒకరు అన్నారు,
"నీకేం తక్కువని యీ బాధ! నన్ను అర్ధం చేసుకో."
"వొద్దు లిల్లీ అది గుర్తుచేసి నా మనసు పాడుచెయ్యకు" అన్నది, చేతితో నీళ్ళని అందుకోడానికి ప్రయత్నిస్తో.
ఆవిడ గొంతు విని వాసు ఉలిక్కిపడ్డాడు. పుస్తకంలోంచి తల బయటకు పెట్టి ఆమెవైపు చూశాడు. ఆమె నీటిని అందుకోడానికి ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
మళ్ళీ పుస్తకంలో తల దూర్చాడు వాసు.
11
లాంచీవేగం పెంచుకుంటోంది. వాలు వైపు వెళ్ళడానికి పాములా మలుపులు తిరుగుతోంది.
వాసుదేవరావులో కలిగిన యీ చలనం ప్రసాదాన్ని ఆకర్షించింది. లేచి, అతని పక్కకి వచ్చి కూర్చున్నాడు. ఇది గమనించలేడు వాసు. గమనించిన పతి మాత్రం మవునంగా ఉండిపోయాడు.
ఆవిడ నీళ్ళతో ఇంకా ఆడుకుంటూనే ఉంది. లిల్లీ ఆమెతో ఏదో చెప్పబోయి ఊరుకుంది.
మధ్యలో ప్రసాదం అన్నాడు :
"మీరిలా నోరు మూసు కూర్చుంటే నే వూరుకోను తెలుసా?"
పతి ప్రసాదంవైపు గుర్రుగా చూచినట్టు చూచాడు.
"అవును గురూ! పిక్ నిక్ అన్న తర్వాత సందడిగా ఉండాలి. ఈయనేమో పుస్తకం చదువుతూ, నువ్వేమో ప్రకృతిని చదువుతూ కూర్చుంటే నే నొక్కడ్ని బోర్ కొట్టే చావాలా? ఇదేమైనా న్యాయమా?" అన్నారు ప్రసాదం కసిగా.
అతని మాటలు లిల్లీ గూడా వింది. 'పాపం' అని మనసులో అనుకునే ఉంటుంది.
"అయితే ఏం చెయ్యమంటావ్. నన్ను డాన్స్ చెయ్యమంటావా?" అడిగేడు పతి.
లిల్లీ నవ్వేసింది మెల్లిగా. వసూ తల తిప్పి ముగ్గురి మిత్రులవైపు చూచింది. వాసుని చూచిన ఆమె మొహంలో తత్తరపాటు కనిపించింది. దాన్ని దాచిపెట్టుకునేందుకు సర్వ విధాలా ప్రయత్నం చేస్తోంది.
అప్పుడే వాసూ ఆమె వైపు చూశాడు. మరుక్షణంలోనే తల దించుకున్నాడు.
"నా కిక్కడేం బాగోలేదు. టావు మీదకి వెడుతున్నా" అని చెప్పి వెంటనే టావు ఎక్కేశాడు వాసు.
అతనలా వెళ్ళిపోవడం పతికి విడ్డూర మనిపించింది. అతనూ వాసుని అనుసరించేడు. ఈ యిద్దరి వరసా చూసి మండిపోయిన ప్రసాదం లేచి టాపు నేక్కుతూ.
"ఇలా జరుగుతుందని తెలుస్తే చస్తే వచ్చే వాడిని కాదు, గొప్ప శాస్తి చేస్తున్నారయ్యా!" అన్నాడు.
టాప్ మీద ఓ మూలగా కూర్చుని చదువుకుంటున్నాడు వాసు. అతని పక్కన కూర్చుని సిగరెట్టు కాలుస్తున్నాడు పతి. వాళ్ళిద్దరి దగ్గరికి వస్తూ.
"ఇక్కడ మీకు హాయిగా ఉందేవిటి?" అన్నాడు ప్రసాదం.
"నువ్వు వచ్చావ్ గా" అన్నాడు పతి.
"మరె ...... నాకు తెలీ కడుగుతాను.....అక్కడ్నుంచి మీరెందు కొచ్చినట్టూ?"
"వాసుని అడగరాదూ"
"ఏం గురూ! నిన్నే .....
వాసు ప్రసాదంవైపు చూసి కూర్చోమన్నట్టు సైగ చేశాడు. ప్రసాదం బుద్దిమంతునిలా కూర్చున్నాడు.
"చూడు ప్రసాదం! ఇక్కడ చక్కటి గాలి రావడంలేదూ!" అన్నాడు వాసు.
"నిజం చెప్పు గురూ! నువ్వు గాలి కోసమే యిక్కడికి వచ్చావా?" అన్నాడు పతి.
"అంత యిష్టంలేని వాడవు ఆ అమ్మాయిల వంక చూడకూ" అన్నాడు ప్రసాదం.
"నువ్వుండు ప్రసాదం- అది సరేగాని నీకు వాళ్ళల్లో ఎవరైనా తెలుసా?" అడిగాడు పతి.
"తెలుసు" అన్నాడు వాసు.
"ఎవరు."
"వసుంధర."
ఆ పేరు విని-తర్వాత ఇంకా ఏమి అడగాలో, ఎలా అడగాలో తెలియక వూరుకున్నారు. ప్రసాదానికి టాపు చివరున్న జామపళ్ళు బుట్ట మీదకి మనసు పోయింది. ఇక్కడ యీ టాపిక్కు సంగతేవిటో తెలుసుకోలేకుండా జామపళ్ళు పని చూస్తే ఏం బావుంటుందని చెప్పి తనని తనే కూకలు వేసుకున్నాడు ప్రసాదం.
"వసుంధర నాకెలా తెలుసో, ఆవిడకీ నాకూ గల సంబంధ మేమిటో మీకు తెలీదు. అడగాలని ఉన్నా అడగలేకపోతున్నారు కదూ."
ఇద్దరూ ఏం మాటాడలేదు.
"ఒక కథ మీతో చెప్పాలని ఉంది. ఇది కథలానే తీసుకోండి. 'నిజమా ..... నువ్వంతపనీ చేశావా' అని ప్రశ్నలు వెయ్యద్దు" అన్నాడు వాసు.
"తోచక ఛస్తూన్న సమయంలో నువ్వేది చెప్పినా వినడానికి సిద్ధమే" అన్నాడు ప్రసాదం.
"చూడు ప్రసాదం, నువ్వు మాటకి ముందు 'చస్తున్నా, చస్తున్నాం' అని తెగ వాగుతున్నావ్. నీటిమీద ప్రయాణం చేస్తున్నప్పుడు అలాటి మాట లనకూడదు. లాంచీవాళ్ళు విన్నారంటే, నిన్నంతపనీ చేసేయగలరు జాగ్రత్త. నువ్వు కథ ప్రారంభించు వాసూ!" అన్నాడు పతి.
ప్రసాదం నోరు నొక్కుకుని వాసు చెప్పేది వినటానికి కాస్త ముందుకి జరిగాడు. వాసు చెప్పడం ప్రారంభించాడు.
"ఇది జరిగి చాలాకాలమైంది. అప్పట్లో నేను ఏలూరులో టెంపరరీ ఉద్యోగం వెలగబెడుతున్నాను. అన్నయ్యకి నా పెళ్ళి గురించి తొందరగా ఉండేది. అప్పుడే కాదు, ఇప్పుడూ నాకు పెళ్ళి చేసుకోవాలని లేదు. ఆజన్మాంతం బ్రహ్మచారిగానే గడుపుదామని ఆశ.
"సరే ...... నా అభిప్రాయాలకేం గాని, అప్పుడు జరిగిన చిత్రమైన కధయిది. ఏలూరు లోనే నాకు తెలియకుండా అన్నయ్య ఒక సంబంధం చూశాడు. పిల్లని చూడటానికి వెళ్ళమనీ, వాళ్ళ పెద్దవళ్ళు నా దగ్గరికి వస్తారనీ, అలా వాళ్ళకీ ఉత్తరం రాశాననీ ఆయన నాకు రాశారు. నాకీ పద్ధతి నచ్చలేదు. ఏమైనా సరే ..... అన్నయ్యకి ఉత్తరం రాద్దామనుకున్నాను. నాకీ జన్మలో పెళ్ళి చేసుకోవాలని లేదూ, ఇకముందు ఆ ప్రయత్నాలు చెయ్యద్దూ అని. కాని .....ఆ సాయంత్రమే పెళ్ళి పెద్దలు మా రూమ్ కి వచ్చేరు. తప్పనిసరిగా పెళ్ళిచూపులకి వెళ్ళక తప్పిందికాదు, దార్లో ఒక నిశ్చయానికి వచ్చినమాట నిజం. ఆ అమ్మాయిని చూడాలి కాబట్టి చూచి, తర్వాత నా నిర్ణయం అన్నయ్యకి రాస్తే ముందు ముందు నిశ్చింతగా ఉండవచ్చని.
"ఆ పెళ్ళి చూపుల్లో వసుంధరని చూశాను. ఆ వసుంధర యీ "వసుంధర" అని యిక్కడ కాస్సేపాగాడు. వాసు.
ప్రసాదం యింకాస్త ముందుకి జరిగి,
"ఊ ...... తర్వాత?" అనడిగాడు.
"వసుంధరని చూశాను. నిజానికి ఆ అమ్మాయి చక్కగా ఉంది. అయినా సరే-పెళ్ళి చేసుకోరాదని భీష్మించాను. నేను వచ్చేస్తూండగా ఆమె తండ్రి నా నిర్ణయ మేమిటో చెప్పమన్నారు. 'మా అన్నయ్య మీకు రాస్తారని' చెప్పి వచ్చేశాను. రూమ్ కొచ్చి అన్నయ్యకి పెద్ద ఉత్తరం రాశాను. పెళ్ళిమీద యిష్టంలేని నాకు ఇలా సంబంధాలు తీసుకొస్తే బాధపడేది పెళ్ళికాని అమ్మాయీ, వాళ్ళ పెద్దలూ అని, ఇకముందైనా నన్ను వత్తిడి చెయ్యద్దూ అని నొక్కినొక్కి రాశాను.
