తన్ను సంధ్య వార్చుకోమన్నారు. విఘ్నేశ్వర పూజ చేయించి, అంగన్యాస కరన్యాసాలు కావించి, పంచపూజ చేయించి, మంత్రోపదేశం చేయించేరు. మూలమంత్రం ముమ్మూరు అనిపించేరు. అప్పుడు అది తన జీవితంలో బీజార్పణం అయ్యింది.
అప్పుడే అన్నారు: "నీ నుదుట వ్రాసిన వ్రాతమీద ఫలితం ఆధారపడి ఉంది. దాన్ని నీకె వదిలివేస్తున్నాను. ఒక్కటిమాత్రం గుర్తుంచుకో. ఎటువంటి విషమ పరిస్థితుల్లో నైనా, ఆవిడనిమాత్రం నీ స్వార్ధంకోసం ఏమీ అడక్కు. ఒక్కసారి అడిగేవా ఇంతకాలం తపస్సూ పామర ఔత్సుకం అవుతుంది.
"ఎప్పుడూ పరస్మై అనే అనుకుని చెయ్యి. ఫలితంతో నీకు సంబంధం లేదు."
హృదయానికి పట్టింది ఆ వాక్కు. అది గురుపీఠం విధించిన నిబంధన. ఆంక్ష దాన్ని పాటించడం తన విధి.
ఒక్కసారి మనస్సు లోగడ ఊగింది; రామం జబ్బులో. అయినా మనస్సును లొంగ తీసుకున్నాడు గురుధ్యానంలో అప్పుడు. తర్వాత ఎప్పుడూ జారిపోలేదు. గట్టి నమ్మకం ఉంది ఆవిడ, అంత మౌనంగానూ అక్కడ కూర్చునే ప్రహరీలా రక్షిస్తూందని.
"బాగానే ఉంది కాని, వెళ్ళడంవల్ల, ఈ కథ ఏ విధంగా అంతం అవుతుందో ఎల్లా తెలుస్తుంది?"
"అంటే, ఆ అబ్బాయి తిరిగి ఓనాడు వస్తాడంటావా?"
"రాక తప్పదు." గట్టిగానే అన్నాడు.
బిక్కుమన్నాడు అందులో ధాటికీ చౌదరయ్య.
"ఈ వయస్సు విపరీతాలలోవున్నా, నువ్వు ఉద్వాహానికి ఒప్పుకొని, వాళ్ళను భార్యాభర్తల క్రింద ఉండనివ్వగలవా? పార్వతమ్మ ఒప్పుకోగలదా? నీ రక్తంలో రక్తం పంచుకుని, పుట్టి పెరిగి, ఆఖురుకు కళ్ళుమూసిన రామం, ఇంకో రూపంలో వచ్చేడని, నమ్మి, ఎదురుగా తిరుగు తుంటే చూచి ఆనందించగలవా?
"ఆ వచ్చినవాడే 'నాన్నా' అంటే నువ్వు పలుకుతావా? ఆ సమాధిమీద ఏం వ్రాయించేవు? అది మరిచిపోగలవా? లేవు. లేవు. చెయ్యలేవు, అవధానీ."
"ఈ ఊహ నీ సంకుచితంలో చూస్తున్నానేమో!"
"అంటే?"
"ఇదంతా లయానికి లాక్కుని వెళ్ళుతుందేమో!"
గట్టిగా నవ్వేడు చౌదరయ్య. "అవధానీ, వెర్రి వేపకాయ వేదాంతం చెప్పకయ్యా" అనేసేడు.
తను కుండలిలో చదివిన గీతలు తనలోనే ఉండిపోవాలి. అవి దైవరహస్యం అన్నట్లే "దాన్ని అడిగి చూస్తాను" అని తప్పుకున్నాడు.
"అల్లా దారికి రా" అన్నాడు చౌదరయ్య.
"సాయం కావలిస్తే మా అమ్మ ను కూడా పంపుతా."
"సరే" అని లేవబోయేడు అవధాని.
"అయితే కాని ఆ మధు ఎందుకు వచ్చేడు?"
"ఆ పిల్లతో వచ్చేడు."
"కాని ఇంత బద్ధవైరం సాగించిన తర్వాత, పరాయిస్త్రీని వెంటవేసుకుని తగుదునమ్మా అంటూ తయారవడంలో ఏదో వుందనే తోస్తోంది."
"ఏం చెయ్యగలడంటావ్? యాగీచేస్తాడు ఈ విషయాన్ని."
"అది కాదయ్యా, బామ్మడా! ఇంకో ఉద్దేశ్యం ఏం లేదంటావా?"
అదిరిపోయేడు చౌదరయ్య సూచించిన భావానికి, అవధాని.
"ఒదినా, ఒక్కసారి కాళ్ళుఅద్దుకోనియ్యమ్మా అంటూనే శాంతకు నమస్కారం పెట్టి వెళ్ళేడుట."
"ఆ! నిజంగా?"
"అవును."
"మా అమ్మ చెప్పలేదే?" దానితో ధైర్యం వచ్చింది. "మంచిగా వుంటే సరేసరి. లేకపోతే ఊళ్ళో ఉన్న పదెకరాల మాగాణీ అమ్ముకుని వెళ్ళాలి. అప్పుడు కాని చౌదరయ్య సంగతి అర్ధంకాదు ఆ చిన్నయ్యకి" అనేసేడు.
"బాబయ్యా? మీకోసం ఎవరో దశరథం గారంట వచ్చేరు" అన్నాడు వెంకన్న లగెత్తుకొచ్చిన అలసట మధ్య.
కొద్దిరోజులే అయ్యింది ఆయన దగ్గర సెలవు పుచ్చుకుని. మళ్ళీ ఆయనే స్వయంగా రావడంలో రాచకార్యం ఏం గుర్తుకు రాలేదు.
"వెళ్ళివస్తా" అంటూనే అంగలేసేడు అవధాని.
పార్వతమ్మ ఆతిథ్యం ఇచ్చింది. త్రాగిన మజ్జిగ గ్లాసు ప్రక్కగా ఉంది.
"నమస్కారం" అన్నాడు మెట్లు ఎక్కుతున్న అవధానిని చూచి.
"శుభమస్తు" అనే కవాచీ బల్లమీద తనూ కూర్చున్నాడు. "అంతా క్షేమమా?" కుశల ప్రశ్నలు. చుట్టూరా కలయచూచుకునే ఓసారి దశరథం గొంతు సవరించుకుని, అంతవరకూ జరిగిన చరిత్ర, వ్యక్తులు, అంశాలుకూడా ఏకరువు పెట్టేడు. తన చెయ్యలేని నిర్ణయాల్ని సంపుటీకరణ చేసేడు. పరిస్థితులు చూపెట్టిన విధానాన్ని ఉగ్గడించేడు. ఒక్కమాటలో చెప్పాలంటే 'ఇదీ నన్నిచ్చటికి రప్పించింది' అన్నట్లే ఢంకా కొట్టేసేడు.
గడప లోపలగా కూర్చున్న పార్వతమ్మ, కొంజాగదిలో చెవి ఆని నించున్న శాంతకూడా అన్నీ విన్నారు. అప్రయత్నంగా శాంతకుమాత్రం కన్నీళ్ళు తిరిగేయి.
అంత పెద్దబల్లకు అవధాని ఒక్కడే అయినట్లు కుంచించుకుపోయాడు. ఇక తను మిగిలేడు -ఆ కావ్యంలో ఏరకమైన, విభిన్న వ్యక్తిత్వ పాత్ర అభినయించాలో తెలియని పరిస్థితిలో. ఆధ్యాత్మిక భౌతికశక్తుల సంఘర్షణ ఇంత విపరీత విప్లవం లేవదీస్తుందా అన్న ఆశ్చర్యమే.
"అతను మళ్ళీ కన్పించలేదన్నమాట?"
"ఏదో అతీతశక్తి నా అన్నవాళ్ళను దూరం చేస్తోంది వాడిని."
"నా కర్తవ్యం?"
"అది మీరు చెపుతారనే పరుగెత్తుకుంటూ వచ్చేను. తల మొద్దుబారి పోయింది. ముందాలోచన తట్టదు. ఇదీ నా స్థితి."
"దారి దొరక్కపోదు. దైవాన్నే నమ్ముకుందాం. లేవండి, స్నానపాణాదులు చేద్దురు కాని" అని లేచేడు అవధాని.
'ఎంత నిండుకుండ అవధాని!' అన్న ఆశ్చర్యం ఉట్టి కట్టింది దశరథంలో.
అనుష్ఠానాలయి, భోజనాలకు కూర్చునేసరికి పొద్దుపోయింది. విస్తరిచుట్టూ వ్యంజనాలు నిండిపోయేయి. దశరథం భోజనప్రియుడు; అది పసికట్టిన పార్వతమ్మ, ఒకటికి నాలుగు రకాలుచేసే వడ్డించింది. పైగా పొందిన ఆతిథ్య గంధం ఇంకా వంటిమీద ఆరలేదు.
"ఒదినగారూ! ఇల్లాచేస్తే, ఈ పప్పు బ్రాహ్మడు ఇక్కడే దిగ్బంధం అయి కూర్చుంటాడు" అన్నాడు నవ్వుతూ దశరథం.
"ఏముంది? రెండు పచ్చళ్ళతో పెడుతున్నా. చాలా సిగ్గుగా వుంది."
"తమ్ముడుగారు అతిశయోక్తిగా అన్నారే!" అవధాని.
అల్లా కవనాలమీద, ఎత్తుపై యెత్తూ హాస్యాల మీద ఆఖరుకే వచ్చేరు. నవ్వులూ పూసేయి. మాటలు దొర్లేయి. పరిహాసాలు పాకంలో పడ్డాయి.
ఉప్పాడ తెల్లటి చీర. జరీ అంచు ప్లేటు. ఎర్రటి కొంగంచు.పసుపుపచ్చని గళ్ళరవిక. కాళ్ళకు నగలు లేవు కాని పసుపు సర్వాభరణాల పసిడినివాళి. దిద్దితీర్చిన కాటిక. తురిమిన విరజాజులు. చక్కటి కొప్పు. మధ్యగా త్రినేత్ర అన్నట్లే తిలకం. చేతిలో దధి.
దశరథం గుడ్లు తేలేసేడు. అవధానులుగారి పూజాపీఠంలోంచి దేవత నడిచివచ్చిందా ఆతిథ్యం ఇవ్వడానికి అన్న సంభ్రమాశ్చర్యాలే. ప్రతిమే అయి చూచేడు.
అవధాని నవ్వుతూనే "మా శాంత" అని అతి క్లుప్తంగానే అన్నాడు.
నిన్న స్థితిలో లేడు దశరథం.
"పెరుగు పోసుకోరూ, బాబయ్యా!" అంది శాంత చిరునవ్వు తొలకరింపులో.
అప్పటికి తెప్పరిల్లీ సిగ్గుపడ్డాడు. తలవంచి చెయ్యి పట్టేడు.
"మరిదిగారికి గడ్డపెరుగు మీగడంటే ఇష్టం, అమ్మాయీ" అంది పార్వతమ్మ.
వద్దు వద్దంటున్నా గిన్నెలో ఉన్న మీగడ అంతా ఆఖరయ్యేవరకూ వదల్లేదు శాంత, నెమ్మదిగా ఉత్తరాపోశనం పట్టేవరకూ వట్టి వేళ్ళ విసనకర్ర పుచ్చుకుని విసురుతూనే ఉంది.
సావిట్లోకి వచ్చేసరికి సమస్య నాదేకాని అవధానిది కాదన్నట్లు కళ్ళు మెరిపించుకున్నాడు దశరథం. వసారా గదిలో ప్రక్కవేయించి "విశ్రమించండి" అనేసి అవధాని నిష్ర్కమించేడు. అర్ధం అయ్యింది.
మరచెంబుతో నీళ్ళు పెడుతూనే "ప్రక్కా అవీ సరిగ్గా అమిరేయో లేదో, బాబయ్యకు" అంది శాంత. ఆ ఆప్యాయతలో చిరకాలపు బంధురికం తప్తం అయ్యింది. ఎరమరికలేని గౌరవం.
"భేషుగ్గా వుంది."
నించునే ఉండిపోయింది శాంత. తను గ్రహించింది ఇప్పుడు ఆయన రాక తనతో మాట్లాడడానికే అని. అది క్రప్పి పుచ్చుతూనే "పడుకో బోయేటప్పుడు పాలున్నాయి" అంది.
"ఎవరి కడుపైనా ఎరుపు తెచ్చుకోవాలమ్మా!" చిన్నగా నవ్వింది.
కటకటాల్లోంచి చూస్తూనే "అమ్మాయీ, శాంతా, నిన్ను చూడాలనే వచ్చేను. అది నీకు తెలుసో తెలియదో" అన్నాడు దశరథం.
"ఊహించుకున్నా."
"ఒక్కటే సందిగ్ధంగా ఉంది. అతను పరాయి వాడు. ఏకోశానా మీకు సంబంధం లేదు. పైగా చిన్నవాడు. వాడిని చూడగానే ఇతనే భర్త అని ఒప్పుకున్నావు? ఇది సంభవమా?"
"ఎందుకు కాకూడదో కారణం మీరు చెప్పగలరా?"
"ఇప్పటి విషయం నీకు, రాజుకు సంబంధించినది. అందులో నా అభిప్రాయం నాకు వుంది. అదే నీదవ్వాలన్న అభిలాష లేదు."
సత్యసంధతకు సంతోషం కలిగింది. "మొదట్లో ఎవరో అనుకున్నా. కులపతనం చెయ్యలేకనే నేనే వెళ్ళేను మజ్జిగసారం పొయ్యడానికి. ఆ క్షణంలో నేను అభ్యాగతి దృష్టిలోనే ఉన్నా.
"లైటు ఎత్తి చూచేను. ముఖం చీకట్లోంచి వెలుతురులోకి వచ్చింది. పరిచయం, జ్ఞాపకం ఔడు కంపించినట్లు ప్రతీహారు లయ్యేయి.
"నిశ్చేష్టత ఆవరించింది. నాలోంచి, నన్ను కదిపి, ఊపి, నవరంధ్రాలూ బిగబట్టి, ఎలుగెత్తినట్లే పిలుపు. ఆయనెవరు? ఎవరు? ఎవరికోసం వేచి ఉన్నావే వారే అన్న పిలుపే. రుంజవాయిద్యమే.
"ఒక్క పోలిక రూపాలు మానవుల్లో వుండక పోవచ్చు. కాని అదే రూపం, అదే ఆకృతి, అదే బాధతో ఉన్నట్లే అతను ఉండిపోయేరు. నేను పొరపడ్డానా అన్న సంశయం రేకెత్తింది. తాత్కాలికంగా మైకం పొందేనా? ఇదే ప్రశ్న.
"కాని నిర్జీవమైన ఝంఝామారుతంలో ఒక్కటే మెరుపు. అది నా ఆత్మ అను. అభిజాత్యం అను. కాల్చి మసిచేసిన నిష్ఠ అను. అదే అంది - 'ఆయన నీ భర్త. ఇంకోరూపంలో వున్నా, ఆత్మ ఒక్కటే' - అని.
"నమ్మకుండా ఉండలేను. అమ్మ పీఠం దగ్గరే తల బాదుకున్నా. గాలివాన దానంతట అదే సద్దుకుంది."
"నీ ఆత్మబలం అల్లా త్రోపించి, నమ్మేట్లు చేసినా, లోకం నమ్మడం ఎల్లా, తల్లీ?"
"బాబయ్యా! నాకు తెలుసు, లోకం నమ్మలేదు. నేను నమ్మించే ప్రయత్నంకూడా నా కక్కర్లేని విషయం. అది ఓ వృధా ప్రయాస.
"ఒక్కటి నిజం. లోకం భౌతికాన్ని ప్రేమిస్తుంది. నేను ద్వేషిస్తున్నా. ఇదే తేడా!"
"మరి రేపు అతనే వచ్చి, నువ్వు నా గత జన్మలో భార్యవు అని అంటే సంసారం సాగించకలవా?"
"సంతోషంగా!"
"ఈ వయస్సు తేడాలతో!................"
చివ్వున లేచింది శాంత. "షట్కర్మల్ని పేర్కొని శాస్త్రం ఘోషిస్తూంది ధర్మపత్ని నిర్వచనం. ఆ మొదటి జీవితంలో చాల భాగం నేను ఆధ్వర్యం వహించకుండానే నా విధి దూరం చేసింది. మిగిలింది, ఏ దుష్ట నక్షత్రంలో పుట్టిందో, ఆ కట్టె. దాన్ని ఆశ్రయించుకున్న ఆత్మ - కాలానికి ఎదురు చూస్తూనూ.
"కనీసం 'భోజ్యేషు మాత' అన్న నానుడి నైనా నిలబెట్టుకుందుకు నోచుకోలేదు. శరీరార్పణ తప్పు అని మీ లోకం అరుస్తే, ఈ తృణప్రాయపు స్థానంలోనైనా, నేను ఆయనకు దగ్గరగా ఉండలేనూ? నా భర్తకి నేను తల్లిని. ఆ పోషణలో ఉన్న ఆనందం పొందడానికైనా నేను పెట్టిపుట్టలేదా?
"ఏం పాపం చేసేను? ఏం తప్పు చేసేను? మీకు కళంకం ఎల్లా ఆపాదించేను? ఇది చెప్పు, బాబయ్యా!"
దశరథం మాట్లాడలేదు. కళ్ళు చెమర్చాయి.
"మా గుర్తింపు మానవ అతీతమైన, ఆధ్యాత్మికం అనవచ్చు. దానికి ఇరువురం కర్తలం కాము. కర్మకు లోబడిన మానవులం అని చెప్పవచ్చు. దీని నిజానిజాలు తెలుసుకునే శక్తి, సాంద్రతకూడా లేవు లోకానికి. అందువల్ల మావి భౌతికపు ఆ వృత్తిలో, పతన తప్త తృణప్రాయ జీవితాలే.
"అయినా విధి బలీయం అనేది ఒప్పుకోవాలి. విధికి ఎదురీదుతున్నామా, లేక దాసోహం అన్నామా అన్నది సమీక్షానర్హం ఇప్పుడు.
"ఎందుకో ఈ మ్రోడు చిగురించింది. అది ఓ పిపాస రేకొట్టుకుంది. అందులోంచి ఎడబాటుమాత్రం చెయ్యకండి. చేసి మీ రుధిరాభిషేకం నామీద నుండి మాత్రం కానివ్వకండి. అది చేస్తావు కదూ?" ప్రాధేయతలో శాంత అడిగింది.
"ఈ కట్టూ, బొట్టూ మార్పు, అత్తయ్యా, మావయ్యా ఒప్పుకోగలిగేరు. అది నామీద ఆపేక్ష అను, మరొకటి అను. నాకు వ్యతిరేకంగా నడవడం అన్న వాగ్ధానం అను. ఏదైనా నన్ను మనిషిగా గుర్తించేరు వాళ్ళు.
